సబ్ ఫీచర్

జీవనపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణ, భారత, భాగవతాలు జాతి సంపదలు. యావత్ జాతికి దిశానిర్దేశం చేసే మార్గదర్శకాలు. మనిషి ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా జీవించకూడదో, జీవితాన్ని ఏ రకంగా మలచుకోవాలో, జీవితంలో ఎలా మసలుకోవాలో, జీవితాలను ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలో అనే విషయాల్ని విపులంగా సోదాహరణంగా వివరిస్తాయి. జాతిని జాగృతపరుస్తాయి.
ప్రతి ఘటనలోను, సంఘటనలోను పాత్రలోను సన్నివేశంలోను ఉత్కృష్టమైన విలువల్ని మనకు వెలువరిస్తాయి. విశదీకరిస్తాయి. మార్గదర్శనం చేస్తాయి.
మనకి తెలిసిందే నిజం, మనం చూస్తున్నది, మనం అనుభవిస్తున్నదే సత్యం అనే అభిప్రాయంతో మనం ఉంటాం. ఆ భ్రాంతిలోనే అందరూ ఉండాలని ఇతరులతో వాదనకి దిగుతాం, వాదులాడుతాం.
కొత్తగా పెళ్ళైన ఓ జంట హనీమూన్‌కని రైల్వే స్టేషన్‌కి వచ్చేరు. ప్లాట్‌ఫాం వచ్చీపోయే వాళ్ళతో కిటకిటలాడుతోంది. ఆ రద్దీలోను అనువైన ఓ ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ కూర్చున్నారు ఆ జంట. అచ్చట్లు ముచ్చట్లతో.. ఆటలతో, పాటలతో ఆనందంతో తేలిపోతున్నారు. వాళ్లిద్దరికీ పదడుగుల దూరంలో ఓ సిమెంట్ బెంచీమీద ఓ పెద్దాయన కూచుని ఉన్నాడు. ఏ విషయం పట్టకుండా, పట్టించుకోకుండా, ఏదో పుస్తకాన్ని చదువుకుంటున్నాడు. ఆ పెద్దాయనని జంటలోని కుర్రాడు చూచేడు. చాలా సమయం ఆయన్ని అలా గమనించేడు, గమనిస్తున్నాడు. ఆ కుర్రాడికి ఆయనమీద చిరాకేసింది. చిర్రెత్తింది. ఆ పెద్దాయన దగ్గరికి వెళ్లి ‘‘ఏవండీ! ఇందాకట్నుంచి చూస్తున్నాను, ప్రక్కన ఏమి అవుతుందోననే ధ్యాస లేకుండా ఆ పుస్తకం చదవడంలోనే మునిగిపోయేరు. మీ చుట్టూ వున్న లోకం వేగంగా పరుగులు తీస్తున్నా మీకేం పట్టడంలేదు. ఆ త్రేతాయుగంలో ఎప్పుడో, అసలు జరిగిందో లేదో ఎవరికీ తెలుసండీ? ఆ పుక్కిటి పురాణం రామాయణం చదువుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. మీకిది భావ్యమేనా?’’ అని పెద్దాయనని కుర్రాడు అడిగేడు.
పుస్తకం చదువుకుంటున్న పెద్దాయన ఒక్కసారి తలెత్తి కుర్రాడ్ని చూసి చిరునవ్వు నవ్వి మళ్లీ పుస్తకంలోకి జారిపోయేడు. మరో అరగంట గడిచింది. ఆ కుర్రాడు పెద్దాయన దగ్గరకు వెళ్లి ‘‘అయ్యా! నేను ఇందాక అలా చెప్పిన తర్వాత కూడా మీరు ఏమీ పట్టనట్టు మీ చాదస్తంలోనే మీరున్నారు. ఆ పుస్తకం చదవటంలోనే మీరు మునిగిపోయేరు’’ వ్యంగ్య ధోరణిలో పెద్దాయనను ఎత్తిపొడిచాడు. పెద్దాయన పుస్తకంమీంచి తన దృష్టిని ఒక్కసారి మరల్చి తలెత్తి ఆ కుర్రాడిని ఒక్క చూపు చూసేరు. చిరునవ్వు నవ్వి పుస్తకం చదువుకోవడం కొనసాగించేరు.
ఆ కుర్రాడు అలా వ్యంగ్యంగా చాలాసార్లు అడగటం, పెద్దాయన పుస్తకం అదేరకంగా చదువుకుంటూ ఉండటం.. అలా జరుగుతూనే వుంది. రావలసిన రైలు వచ్చింది. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు తోపులాటలు, పెనుగులాటలు, కుదుపులతో ఎక్కగలిగినవాళ్లు ఆ రైలు ఎక్కేరు. కొందరు ఆ తోపులాటలో ఫ్లాట్‌ఫాంమీదే ఉండిపోయేరు.
ట్రైన్ కదలడం, వేగం పుంజుకోవడం క్షణాల్లో జరిగిపోయింది. కంపార్ట్‌మెంట్ కిటకిటలాడిపోతోంది. అంతలో.. ఏవండీ! నా వైఫ్ రద్దీలో రైలు ఎక్కలేకపోయిందండి. ఫ్లాట్‌ఫాంమీదే ఉండిపోయినట్టుంది. ట్రైన్‌లో లేదు. అసలే ఆమెకు ఈ ఊరు కొత్తండి’’ లబోదిబోమని ఏడుస్తున్నాడు హనీమూన్‌కి బయలుదేరిన జంటలోని కుర్రాడు పక్కనున్న ఆసామితో. ఆ ఆసామీ ఎవరో కాదు, ఫ్లాట్‌ఫాంమీద రామాయణం పుస్తకం చదువుకుంటూ ఈ కుర్రాడి చేత హేళన చేయబడ్డ పెద్దాయనే ఆ ఆసామి.
కుర్రాడి గోలంతా పెద్దాయన విన్నారు. మొదటిసారిగా పెదవి విప్పేరు. ‘‘చూడు నాయనా! నువ్వు కూడా నాలా రామాయణం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, నువ్వు ఈరోజు ఇలా ఏడవవలసిన దుస్థితి నీకు వచ్చి ఉండేది కాదు కదా’’ అన్నారు పెద్దాయన.
ఏమీ అర్థంకాక తెల్లమొఖం వేసుకుని వింటున్నాడు కుర్రాడు.
‘‘అవును నాయనా! రామాయణంలో సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు అయోధ్య వదలి అరణ్యానికి వెళ్తున్నపుడు, మధ్యలో నదిని దాటవలసి వస్తుంది. గుహుడు పడవలో నదిని దాటిస్తాడు. ఆ సన్నివేశంలో- పడవ సీతమ్మ ఎక్కిన తర్వాత శ్రీరాముడు ఎక్కుతాడయ్యా.
రామాయణం నువ్వు చదివి ఉంటే ఆ సత్యం, ఆ సందేశం నీకు అర్థం అయి ఉండేది. జీవితపాఠం, జీవన విధానం నీకు అర్థమయ్యేది. జీవితంలో ఈ రకంగా చేయాలని తెలిసేది. ఫలితంగా.. ఈ రోజు నువ్వు మీ ఆవిడ రైలు ఎక్కిన తర్వాతనే నువ్వు ఎక్కాలని తెలిసి, మీ ఆవిడ రైలెక్కిన తర్వాతే నువ్వు రైలు ఎక్కేవాడివి. నీకీ దుస్థితి తప్పేది’’ చెప్పటం పూర్తిచేశాడు పెద్దాయన. ఆ కుర్రాడికి జీవనపాఠం తెలిసింది. రామాయణ, భారత, భాగవతాల విశిష్ఠత అనుభవానికొచ్చింది, అర్థం అయ్యింది.

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669