సబ్ ఫీచర్

ఊరించే బడ్జెట్‌తో ఒరిగేది ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రభుత్వమైనా జమాఖర్చులు, లాభనష్టాలు, పెట్టుబడులు, ఉపసంహరణలు వంటివన్నీ బేరీజు వేసుకుంటూ ఏదో ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఏడాది కాలానికి ఒక నివేదిక సమర్పించడం ఆనవాయితీ. వీటన్నిటితోపాటు మరో కొత్త పద్ధతి అనుసరించడం నేటి రాజకీయం అలవాటు చేసుకుంది. ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారాన్ని నిలుపుకునే దిశగా బేరీజు వేసుకోవడం, అందుకు తగిన పథకాలు, ప్రణాళికలు రూపుదిద్దుకోవడం జరుగుతోంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అంతా కల్లబొల్లి లెక్కలతో, అమలు కాని హామీలతో నింపి పాలకులు ఏదో ‘మమ’ అనిపించారు. సంక్షేమ పథకాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తామంటూ కాకి లెక్కలు చూపిస్తూ ప్రజల్ని వంచన చేయడం, పట్టపగలే ఆకాశంలో చుక్కలను చూపించడం రాజకీయ చతురతకు తార్కాణం. పెద్దనోట్ల రద్దుతో, జీఎస్టీ అమలుతో ప్రజానీకాన్ని ముప్పుతిప్పలు పెట్టి, దేశ ప్రగతికి తాము కంకణం కట్టుకున్నామని, ఆర్థిక వృద్ధి ఊహించిన స్థాయికి మించిపోయిందని పాలకులు భుజాలు ఎగరేసుకుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసినప్పుడు అది రాజకీయ లబ్ధి కోసమా? పురోభివృద్ధి కోసమా? ఎటువైపు మొగ్గాలో తెలియని మీమాంస. విభజన ఫలితంగా ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చుతామని, ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామని పాలకులు ప్రజలందర్నీ మభ్యపెట్టి ఓదార్పు మాటలు చెప్పారు. గత నాలుగేళ్లుగా అదిగో, ఇదిగో అని తూతూ మంత్రంలా, ఎటూ చాలనంత ఆర్థిక సహాయం చేస్తూ, కేంద్రం మోచేతి కింద అంతా అదిమిపెట్టి ఆంధ్రప్రదేశ్‌ను మట్టి కరిపించారు. లక్షలాది చిరువ్యాపారుల జీవనోపాధికి ముద్రా రుణాలు ఇస్తున్నామని చివరికి మొండిచేయి చూపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను అప్‌గ్రేడ్ చేస్తామని ఊరించారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే డబుల్ లైను, సింగిల్ లైను అని రైల్వే మంత్రులొచ్చి ఘనంగా కూత కూశారు. అక్కడితో అది సరి. మచిలీపట్నంకు నిధులు మంజూరయ్యాయన్నారు. విశాఖ రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామన్నారు. రైల్వే జోన్ ఖాయం అని విశాఖ ఎంపీ బల్లగుద్ది మరీ చెప్పినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. వాగ్దానాలన్నీ తుంగలోకి తొక్కేసి, పదవులు ఎలా కాపాడుకోవాలా? ఆస్తులెలా కూడబెట్టుకోవాలా? అని నేతలు తపన పడుతున్నట్టుంది.
విశాఖలో మెట్రోరైలును పరిగెట్టిస్తామని ఊరించి, పక్కకు తప్పుకున్నారు. దువ్వాడ రైల్వే స్టేషన్‌ను ఆధనీకరిస్తామని ప్రగల్భాలు పలికారు. ప్రగతిపథంలోకి ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుపోతామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కితకితలు పెట్టారు. 30 వేల కోట్ల టర్నోవర్‌తో వైద్య పరికరాలు, 25 వేల మందికి ఉపాధి కల్పిస్తామని కేంద్ర నాయకులు ఊకదంపు ఉపన్యాసాలిచ్చి, సన్మానాలు చేయించుకుని చివరికి తోక ముడిచిపరారైపోయారు. ఏపీకి ‘సాగరమాల’ నిధులు మంజూరు చేస్తామని, కారిడార్ నిర్మిస్తామని భాజాభజంత్రీలు కొట్టారు. ఆ బడ్జెట్ హుష్‌కాకి అయిపోయింది. రూ. 50 కోట్లతో దివ్యాంగులకు క్రీడా సముదాయం ఏర్పాటు చేస్తున్నామని సంక్షేమ పథకంలో ఇదొక భాగమని చెప్పి ఊరించారు. చప్పట్లు కొట్టించుకున్నారు. నగదు రహిత లావాదేవీలంటూ బ్యాంకుల్లో డబ్బు విత్ డ్రా చేయడానికి వీలు లేకుండా ఏటిఎంలో ‘నో క్యాష్’ బోర్డులు తగిలించి ప్రజల్ని నానా హింస పెట్టారు, పెడుతున్నారు.
నల్లధనంపై తాను ధర్మయుద్ధం చేస్తున్నానని ప్రధాని మోదీ ప్రకటించారు.కార్పొరేట్ రంగాలకే లాభాలు చూపిస్తూ భారీగా అప్పులిస్తూ వారిని పోషించడమే కనిపిస్తోంది. విశాఖలో కాలుష్యం భరతం పడతామని, కోట్లు ఖర్చుపెడతామని కోతలు కోసి, ఉపన్యాసాలు దంచి మరచి పోయారు. ‘అంత్యోదయ’ స్ఫూర్తితో అందరికీ అభివృద్ధి అని అమలుకాని వాగ్దానాలు కిందటేడాది లెక్కలేనన్ని చేసారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఆ హామీలనే గుప్పించడం చూస్తుంటే- బడ్జెట్ బూటకం, గొప్ప నాటకం అని అమాయక ప్రజలు గ్రహించక మానరు. వంచన చేసే నాయకులను ఎప్పుడు, ఎలా దారికి తెచ్చుకోవాలో ఆలోచించుకోవడమే ప్రజల ప్రస్తుత కర్తవ్యం!

- అడపా రామకృష్ణ సెల్: 95052 69091