సబ్ ఫీచర్

ప్రగతికి బాటలు గురువు మాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేనూ-నాదీ’’ అనే అహంకారాన్ని సమూలంగా ప్రక్కన పెట్టగల్గిన వాడికే ‘‘గురుతత్వం’’ సమగ్రంగా అవగతమయ్యేది.
గురువు అనగానే... అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును ప్రసాదించెడి వాడని అర్థం. అట్టి గురువు త్రిమూర్తులకంటే అధికుడు. అత్యంత మహిమాన్వితుడు. సత్యదర్శి అయిన గురువు... కులమత ప్రాంత భేదములకతీతుడు సర్వే సర్వత్రా వినమ్రతాశీలుడు. లక్షమందిలో దాగున్నా నీలోని.. నిజమైన ఆర్తిని, గురుభక్తిని గుర్తెరిగి దగ్గరికి పిలిచి అక్కున చేర్చుకునేవాడే నిజమైన సద్గురువు... గురువనే పదానికి పరిపూర్ణ అర్హుడు. వేదాన్ని వాచా పఠించడం వేరు.. తత్ వేదసారాన్ని ఆత్మ అనుభవంగా గ్రహించడం వేరు. ఈ రెండింటికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంటుంది ఈ జగాన. దీనికి కారణం పఠించడం పాండిత్యం, గ్రహించడం గురుతత్వం. మహోన్నతమైన ఈ గురుశిష్య సంబంధంలో ధృతి లేనివాడు శిష్యుడు కాదు.. తగు సహనాన్ని వహించలేని వాడు గురువూ కాదు.
అట్టి గురువుల నుంచి సర్వే సర్వత్రా మనము గ్రహించవలసిన అయిదు ప్రధాన గుణాలు. సమదర్శనం, సర్వవ్యాపకం, శాస్త్ర భూషణం, నిరహంకారం, త్యాగం.
సమదర్శనం.. ఉన్నవాడి యందు ఒకలాగా లేనివాడి యందు మరొకలాగా ప్రవర్తించక సమస్త జీవకోటి యందు ఒకే విధమైన ప్రేమాభిమానాలను కనబరుస్తూ, విషయ వాసనలకు లోనుగాక ‘‘శీతోష్ణములను, కలిమిలేములను, దూషణ భూషణాదులను’’ కేవలం సాక్షి భూతుడై దర్శిస్తూనే మరే వికారాలకు వశుడుగాక సర్వే సర్వత్రా ధ్యాననిమగ్నుడై అంతర్ముఖుడై బ్రహ్మము నందే రమిస్తూ తుదకు తానొక బ్రహ్మమై భాసిల్లటం... గురుతత్వం.
సర్వవ్యాపకత్వం... ఇక్కడైతే నా కనుకూలంగా ఉంటుంది, అక్కడైతేనే నా కనుకూలంగా ఉంటుందని, ఒక స్థలానికో ఒక భోగానికో ఒక వర్గానికో పరిమితుడు కాక, ‘‘ఈ జగతి మిథ్యయని బ్రహ్మమే సత్యమని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా గుర్తెరిగి’’ ఈ సృష్టిలోని చరాచర జీవరాశియందు వెలుగొందేది ఆ పరమాత్ముని చైతన్య శక్తియేనని గ్రహించి, ఆ పరంధాముని అన్ని కోణాల నుండి దర్శించగల్గిన, పూజించగల్గిన స్థితప్రజ్ఞత్వం...
శాస్త్ర భాషణం... తన నోటికొచ్చినది మనసుకు తోచినదీ కాక, వేదము దేనినైతే ప్రతిపాదిస్తుందో, ఏ కార్యం శాస్త్ర సమ్మతమో కేవలమటువంటి మార్గానే్న తాననుభవిస్తూ.. శిష్య ప్రపర్తులకు కేవలం నోటిమాటగాకాక స్వానుభవపూర్వకంగా బోధిస్తూ, మితభాషణం ప్రియభాషణం సత్యభాషణమనెడి దివ్యగుణాలతో ‘‘సర్వే సర్వత్రా శాస్త్రానుసారియే పరంపరానుగతుడై’’ వర్థిల్లటం.. గురుతత్వం.
నిరహంకారం.. నేను కనిపెట్టాను.. నేనే ఉద్బోధించాను అనే గర్వంనకు లోనుకాక, భోగలోలుడై విషయవాంఛల కధీనుడై విర్రవీగక సర్వకాల సర్వావస్థలయందు, తనను తాను తగ్గించుకొని, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండెడి నమ్రతా హృదయుడై ‘‘ఎదుటివారిలోని నిజమైన ఆర్తిని అర్హతను గ్రహించి’’ తుదకు తనకంటే చిన్నవారిని సైతం పెద్ద మనసుతో సమాదరించగల్గిన ప్రేమతత్వం.. గురుతత్వం.
త్యాగం... దీన్ని కూడా నేనే దాచేసుకోవాలి, దాన్ని కూడా నేనే వాడేసుకోవాలనే కుంచిత మనస్కుడివలె కాక ‘‘తనలోని స్వార్ధ చింతనలను, ఆశామోహాలను పరిపూర్తిగా విడనాడి’’ ఆ పరమేశ్వరుని విభూతిగా తనకు లభించిన జ్ఞానమును ధనమును ఐశ్వర్యమును మరే కొద్దిపాటి ఉపయుక్తమైన దానికైనా తనకు తాను దాచుకోక దాచి వుంచలేక ప్రతిఫలాపేక్ష రహితుడై ‘‘ఇతరుల కొరకై లోక కళ్యాణార్థమై మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా’’ పంచి ఇవ్వగలిగిన మాతృహృదయం.. గురుతత్వం.
సర్వేసర్వత్రా ఈ అయిదు గుణములతో విరాజిల్లెడి వారే నిజమైన గురువులు. ‘‘గురువు’’ అనే పదానికి పరిపూర్ణమైన అర్హులు. మహోన్నతమైనట్టి గురుపరంపరకు వేదధర్మమునకు మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా ప్రణమిల్లుదాము.
మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ అన్న నానుడిని అక్షరాల పాటించే పుణ్యభూమి మనది. అమ్మ నాన్నల తర్వాత అంతటి సముచిత స్థానం ఇచ్చిన కర్మభూమి మనది. గురువులేని విద్య.. ఉప్పులేని కూర ఎందుకూ పనికిరావన్నది జగమెరిగిన సత్యం. రాజైనా పేదైనా గురువు దగ్గర అందరూ సమానమే. అలాంటి గురువులకు శిరసా ప్రణామములు అందజేద్దాము. సదా గురువులను పూజిద్దాము. మనప్రగతికి బంగారు బాటలు వేసుకొందాము. నవ సమాజ (ప్రగతికి) నిర్మాణానికై నాంది పలుకుదాము.

- కురువ శ్రీనివాసులు 9393195669