సబ్ ఫీచర్

కృత్రిమ మేధతో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఐటీ సదస్సులో ‘సాంకేతిక పరిజ్ఞాన విశ్వరూపం’ ఆనవాలు స్పష్టంగా కనిపించింది. రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఊహాగానం చేయడం కాదు. దృశ్యమానంగా కనిపించడం అద్భుతం, అమోఘం. సామాన్యుడు సాధికారత వైపు నడిచేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఊతం ఇస్తోంది. ఆధునిక సాంకేతికత ప్రధాన లక్ష్యం సామాన్య ప్రజల ప్రయోజనమే కావడం గొప్ప విప్లవాత్మక పరిణామం. విద్యాసంస్థలు, కార్యాలయాలు, గృహాలు, వ్యాపారాలు, వాణిజ్యాలు.. ఇలా అంతటా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లుతోంది. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానమిది కావడం అపూర్వం గాక ఏమవుతుంది? ఈ డిజిటల్ విప్లవం సమాజంలో చాలాకాలం కొనసాగనున్నదని హానీవెల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డేవిడ్ కోటె లాంటి ప్రముఖులు పేర్కొన్నారు.
నూతన పరిజ్ఞానం పరిపాలనా రంగాన్ని కొత్త స్థాయి (లెవల్)కి తీసుకెళ్లనుందని, మానవ జీవితాన్ని మలుపు తిప్పనుందని, అవినీతిని గణనీయంగా అరికట్టి, విశ్వసనీయతను పెంచేందుకు ఉపయోగపడుతుందని, ఎన్నికల ఖర్చును సైతం బాగా తగ్గించగలదని అంటున్నారు. భవిష్యత్‌లో కృత్రిమ మేధ (ఎఐ) తిరుగులేని శక్తిగా, గొప్ప వనరుగా ఉపయోగపడనున్నది. దానికి పరాకాష్ఠగా హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’ ఐటీ సదస్సులో ప్రసంగించడాన్ని చెప్పుకోవాలి. సౌదీ అరేబియా పౌరసత్వం గల రోబో సోఫియా రెండవసారి భారతదేశానికొచ్చింది. గత డిసెంబర్ ఆఖరులో ముంబాయికొచ్చినపుడు, ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సోఫియా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతో ఉదాత్తంగా ఉన్నాయి. హాంకాంగ్‌లో డేవిడ్ హాన్సన్ సృష్టించిన ఈ రోబో మాటలిప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘మనుషుల్లో దయాగుణం ఉండాలి, అందరినీ ప్రేమించాలి’ అని సుతిమెత్తని గొంతుతో ఈ రోబో సూచన చేసింది. మానవుల స్థానాన్ని ఏ రోబో కూడా భర్తీ చేయజాలద్న సత్యాన్ని సోఫియా తెలిపింది. రోబో అయినప్పటికీ తనకూ విశ్రాంతి అవసరముంటుందని చెప్పింది. తనకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఖాతా ఉందని, తనకు ప్రత్యేక హోదా, అధికారాలు అక్కర్లేదని, సౌదీ పౌరసత్వ హోదాను ఉపయోగించుకుని మహిళల హక్కులపై మాట్లాడుతానని భరోసా ఇచ్చింది. ఆమె ప్రసంగం వినేందుకు ఐటీ నిపుణులు, పలువురు ప్రముఖులు ఆసక్తి చూపడం విశేషం. సోఫియా సృష్టికర్త డేవిడ్ హాన్సన్ మరిన్ని హ్యూమనాయిడ్లను సృష్టిస్తానని తెలిపారు. సోఫియా మరింత మెరుగైన రీతిలో ప్రసంగించే అవకాశాలున్నాయని, ఆ దిశగా కృషి జరుగుతోందని వివరించారు. దీన్నిబట్టి కృత్రిమ మేధ ఎంత ఎత్తుకు ఎదిగిందో మనకు అర్థమవుతుంది. హైదరాబాద్‌లోనూ కృత్రిమ మేధపై పరిశోధనలు జరగబోతున్నాయి. ఇందుకు గాను ‘అడోబ్’ సంస్థ చైర్మన్ శాంతను నారాయణ్ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ‘నాస్కామ్’ చొరవ చూపుతోంది. ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. సమాజంలోని అంతరాలను తొలగించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడటం, ప్రపంచాన్ని ఏకసూత్రంతో బంధించే శక్తి సామర్ధ్యాలు దీనికుండటం అపురూపం.
ఒకప్పుడు రాజకీయాలు సమాజాన్ని మారుస్తాయని నమ్మేవారు. కాని అవి అవినీతి, అక్రమాలు, స్వార్ధంతో కుళ్లిపోవడంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆ స్థానంలో ముందుకొచ్చి, ప్రక్షాళన చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దేశంలో తొలిసారి జరిగిన ప్రపంచ ఐటీ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాని మోదీ- డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం గుండెకాయ లాంటిదన్నారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా అటల్ ఇన్నోవేషన్ మిషన్ చేస్తున్న పనులను ప్రస్తావించారు. ఆటోమేషన్ వల్ల పది ఉద్యోగాలు ఊడిపోతే వంద ఉద్యోగాలు కొత్తవి వస్తాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టెక్నాలజీ ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని, దేశ ప్రజలు టెక్నాలజీని అక్కువ చేర్చుకున్నారని, ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుతోందని, దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని అన్నారు. సదస్సులో తెలంగాణ ఐటీ మంత్రి కెటిఆర్ ప్రసంగం సైతం అందరినీ ఆకర్షించింది. దేశంలో ఇపుడు 121 కోట్ల సెల్‌ఫోన్లు వాడుకలో ఉన్నాయి. 50 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. అనేక యాప్‌ల ద్వారా ప్రజలకు వేగంగా సేవలందుతున్నాయి. ఏ విప్లవం తీసుకురాలేని మార్పులను సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చింది. రక్తపాత విప్లవాలకు కాలం చెల్లిందన్న విషయం ఈ డిజిటల్ విప్లవం, కృత్రిమ మేధ రుజువు చేశాయి.
అది ముగిసిన అధ్యాయం..
శారీరక శ్రమకు అధిక ప్రాధాన్యతగల సందర్భంలో మార్క్సిజం పురుడుపోసుకుంది. తొలి పారిశ్రామిక విప్లవం సందర్భంగా యంత్రాలతో ఉత్పత్తిని పెంచి పెట్టుబడిదారులకు కార్మికులు లాభాల పంట పండించి పెడుతున్నారన్న సందర్భంలో మార్క్స్ తనదైన శైలిలో స్పందించి కొన్ని సూత్రీకరణలు సమాజం ముందుకు తెచ్చారు. గత రెండు వందల ఏళ్లలో సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రెండవ, మూడవ, నాల్గవ పారిశ్రామిక విప్లవాల వెలుగులో మార్క్సిస్టు సూత్రాలు మసకబారాయి. శారీరక శ్రమకు బదులు మేధోపరమైన శ్రమకు మాన్యత పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అనూహ్యంగా కొత్తపుంతలు తొక్కడంతో ‘శ్రమశక్తి’కి ప్రత్యామ్నాయం ఉబికి వచ్చింది. కృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి రావడంతో, రోబోలు అన్నిచోట్ల సమర్ధవంతంగా పనులు చేస్తుండటంతో మార్క్సిజంలో పేర్కొన్న అనేక అంశాలకు కాలం చెల్లింది. ‘శ్రమదోపిడీ’ అనే మాట ప్రాసంగికతను కోల్పోయింది. మార్క్సిజం పునాదిగా నిలిచిన ఆ ఒక్కమాట ఇప్పుడు కనిపించకుండా పోవడంతో ఆ ‘ఇజం’ కుప్పకూలింది. ఆర్థిక అంతరాలకిప్పుడు జ్ఞానం, నైపుణ్య స్థాయి కారణమవుతున్నాయి. మార్క్స్ ప్రకారమైతే శ్రమదోపిడీయే ఆర్థిక అంతరాలకు ప్రధాన కారణం. ఆ దృశ్యం ఇప్పుడు కనిపించడం లేదు. అభ్యాసంతో, కృషితో సామర్ధ్యాలు, నైపుణ్యం పెంపొందించుకుని ఎదిగే నూతన వాతావరణం ప్రపంచమంతటా ఏర్పడింది. దీన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. దాంతో ప్రజలు తమ శక్తి మేరకు ఎదుగుతున్నారు, సరిహద్దులను చెరిపేస్తున్నారు.
లేని సంకెళ్లు ఊహించుకుని, కృత్రిమ అంతరాల దగ్గరే నిలిచిపోయి, రెండువందల సంవత్సరాల క్రితపు భావజాలం దగ్గరే ఆగిపోవడం హాస్యాస్పదం. మార్క్సిజం ఇప్పటికీ అన్వయమయ్యే సిద్ధాంతంగా భావించేవారు ముఖ్యంగా మావోయిస్టులు మార్క్సిజం ముగిసిన అధ్యాయమని అంగీకరించడానికి ఇష్టపడక పోవడం వారి జడత్వానికి నిదర్శనం. మార్క్సిజం శాస్ర్తియం, సైన్స్ అంతటి నికార్సయినదని ఇంకా దబాయిస్తూ కాలం గడపడం వారికే చెల్లుతుంది. వారు చెప్పే గతి తార్కిక భౌతికవాదం శుద్ధతప్పు అని కాలమే చెప్పినప్పటికీ, కాలమాన పరిస్థితుల కనుగుణంగా శ్రమ మారుతుందని చరిత్ర చెబుతున్నప్పటికీ, ‘వర్గాలు లేవు.. ఉన్నది ప్రజలేన’ని ఆధునిక సమాజం, ప్రజాస్వామ్య విధానం పరిపరి విధాలుగా ప్రకటిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా పాడిందే పాడితే, అందులోనే పారవశ్యం ఉందనుకుని ఊగిపోతే నష్టపోయేది వారిని నమ్ముకున్నవారేనని ఎప్పటికి బోధపడుతుంది?
బడుగు-బలహీన వర్గాల అభ్యున్నతే అంతిమం అని భావించేవారు చేయాల్సింది ఏమిటి? చేస్తున్నదేమిటి? గొర్రె తోక బెత్తెడు మాదిరి ఆ భావజాలం వారు మిగిలిపోవడంతోనైనా కళ్లు తెరవాలి కదా? భేషజాలకు పోయి కాలం చెల్లిన సిదాధంతాలకే అంకితమవడం ఆహ్వానించదగ్గది కాదు. వర్తమానంలో బతకడం ముఖ్యం. అందుకు అవసరమైన వనరులు ఏమిటి? అని ప్రశ్నించుకుని సమాధానం చెప్పుకుని అటువైపు ప్రజల్ని నడిపించిన వాడే నిజమైన మొనగాడు. ఇప్పుడు కావలసింది అలాంటి మొనగాళ్లే తప్ప మావోయిస్టులు కాదు. ఆ భావజాలం వల్ల ఇప్పటికే పదికోట్ల మంది బలయ్యారు. ఇంకా ఎంతమంది బలికావాలి? ప్రజల్ని బలిగోరడం శాడిస్టు విధానం తప్ప ప్రజానుకూల సంక్షేమ విధానం కాదు. మెరుగైన సమాజ నిర్మాణం ఇప్పుడు రక్త్ధారలతో గాక టెక్నాలజీతో సాధ్యం. తెలివితో ప్రవర్తించి ఆ టెక్నాలజీని మరింతగాప్రజాపరం చేసినవారే నిజమైన విప్లవకారులు!

-వుప్పల నరసింహం 99857 81799