సబ్ ఫీచర్

ప్రాతః స్మరణీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది శంకరాచార్యులు నెలకొల్పిన శ్రీ కంచి కామకోటి పీఠ పరంపరలో 69వ ఆచార్య పురుషులుగా జగత్ప్రసిద్ధి గాంచారు శ్రీ జయేంద్ర సరస్వతీస్వామివారు. సర్వమానవ సౌభ్రాతృత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని ప్రబోధించారు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు. మనం ఎక్కడ జీవించినా, ఏ భాష మాట్లాడినా, ఏ దేశంలో వున్నా పరమాత్ముని సంతానమే. ఈ సృష్టికంతకూ కారణభూతుడైన ఈశ్వరుడొక్కడే.. అన్న వెలుగును ప్రసరింపచేసిన సద్గురువులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి.
వీరి పూర్వాశ్రమ నామధేయం సుబ్రహ్మణ్య మహదేవ అయ్యర్. 1935 జూలై 18వ తారీకు గురువారం రాత్రి ఏడు గంటలకు ధనిష్ఠా నక్షత్ర చతుర్థ చరణంలో, శ్రీ యువనామ సంవత్సర ఆషాఢ బహుళ విదియ తత్కాల తదియ నాడు, తంజూవూరు జిల్లా ఇరుల్ వక్కిలో జన్మించారు. విద్యాభ్యాసానంతరం వారి 19వ యేట, 22 మార్చి 1954న సన్యాసాశ్రమాన్ని శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి నుండి స్వీకరించారు. వీరు పూజా విధానాన్ని, శాస్త్రాన్ని, ఆశ్రమ ధర్మాల్ని అన్నింటినీ పరమాచార్యుల వద్దనే అభ్యసించి, ఎల్లప్పుడూ వారితోనే ఉంటూ ప్రయాణించేవారు.
‘కోటి’ అంటే తరువాత అని అర్థం. ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగు పురుషార్థములు. అర్థ, కామాల్ని ధర్మబద్ధంగా అనుభవిస్తే, మోక్షం లభిస్తుందని శాస్త్ర వచనం. ‘కామకోటి’ అంటే ధర్మబద్ధం చేసిన కామము తరువాతది- మోక్షము, కనుక మోక్షపీఠం- కామకోటి పీఠమంటే కాంచీపురంలో స్థాపించబడింది- శ్రీ శంకర భగవత్పాదులచే. అంతటి మహోన్నతమైన శ్రీ కంచి కామకోటి పీఠానికి శ్రీ జయేంద్ర సరస్వతీ జనవరి 3, 1994 నుండి పీఠాధిపత్యం వహించారు.
వారెన్నో పాఠశాలలు, వైద్యశాలలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి విద్యా వైద్య సౌకర్యములను అందించాలని దళితవాడలలో పాఠశాలలు, వైద్యశాలలు కట్టించారు. యజుర్వేదంలో పేర్కొన్నట్లుగా మనమంతా సూర్యుని ఆత్మ స్వరూపులమని, అందరిలో ఉన్నది ఒకే చైతన్యమని, అందరూ సమానులేనన్న విషయాన్ని బోధించేవారు. ఇదే భారతీయ సమైక్యతకు దోహదపడేదనేవారు.
వారి అభిప్రాయాలకు, విదేశాలలోని భారతీయులు, ప్రముఖులు అందరూ ప్రభావితులయ్యారు. వారి వంతు కర్తవ్యాన్ని అందించారు. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్న సూక్తిననుసరించి, శంకర నేత్రాలయాన్ని చెన్నైలోను, గౌహతిలోను, విజయవాడ సమీపంలోనూ ఏర్పాటు చేశారు. హిందూ మిషన్ హాస్పిటల్స్‌ని, తమిళనాడు హాస్పిటల్స్‌ని ఏర్పాటు చేశారు.
ఇంతేకాదు, దేశం నలుమూలలా పర్యటించి, సనాతన ధర్మ ప్రచారం గావించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్ఠతను గురించి వివరిస్తూ బోధలు చేశారు. మనిషిగా పుట్టటమే ఒక వరమని దానిని సార్థకం చేసికొని ముక్తిని పొందేలా అనుగ్రహ భాషణలు చేశారు.
నామ సంకీర్తన చిత్త మాలిన్యాన్ని పోగొట్టి, వేరొక దానిపై ఆశ కలుగనీయక, సదా ఆనందంగా ఉండేటట్లు చేస్తుందని ఉద్బోధించారు. మనం పరులకు మనస్ఫూర్తిగా స్వార్థ రహితంగా సాయ పడదలచినప్పుడు, సాయం అందజేసినప్పుడు, మన మనస్సు, బుద్ధి పరిశుద్ధమవుతాయని, మనం చేసిన సాయానికి అదే ప్రతిఫలం అని, అది మన జీవితాలకు వెలుగునిస్తుందని, కనుక మానవతా విలువలను తెలిసికొని, సాటి వారికి చేయూత నివ్వాలని బోధించి, మన జీవితాలకొక మంచి మార్గాన్ని చూపించిన జగద్గురువులు శ్రీజయేంద్ర సరస్వతీ స్వామి.
మానవ జీవితానికి ఒక యోగివర్యుని అనుభవం ఎక్కువ ఫలితం యిస్తుంది. పీఠాధిపత్యం వహించగానే శుభ తేజస్సు గోచరించింది, శ్రుతి ధ్వని వ్యాపించింది. బ్రహ్మజ్ఞానానికి లోకజ్ఞానం తోడైతే ఎలా శోభిస్తుందో శ్రీజయేంద్ర సరస్వతీ స్వామివారి యందే చూడగలం.
ఒక్క మాటలో చెప్పాలంటే.. శ్రీ కంచి పరమాచార్యుల వారి అనంతరం- అద్వితీయమైన కంచి పీఠాన్ని తీర్చి దిద్దటంలో కృతకృత్యులైనారు జగద్గురు శ్రీజయేంద్ర సరస్వతీ స్వామి.
పశు, జంతు బలిని ఆయన వ్యతిరేకించారు. బలి యివ్వాల్సింది మనిషిలోని పశు, రాక్షసతత్వాల్ని అని గట్టిగా చెప్పి, ప్రచారం చేసిన మహనీయులు శ్రీజయేంద్ర సరస్వతి.
అన్ని మతముల సారం ఒక్కటేనని చెప్తూ, బలవంతపు మత మార్పిడులను ప్రోత్సహించవద్దన్నారు.
చెన్నైలోని పూనమలైలో, సద్గురువుల పేరుమీదుగా ‘జయేంద్ర సరస్వతి ఆయుర్వేద కాలేజీ మరియు హాస్పిటల్’ను స్థాపించి దేశీయవైద్య విధానాలతో ఎంతో మందికి వైద్య సేవలు అందించటం ఆదర్శప్రాయమైంది. బడుగు బలహీన వర్గాల వారికి, దీర్ఘ వ్యాధులతో బాధపడే వారికి స్వస్థత చేకూరుతోంది.
కైలాస మానస సరోవరాన్ని సందర్శించి ఆది శంకరుల విగ్రహప్రతిష్ఠ గావించారు. 1988లో నేపాల్ మరియు చైనా ప్రభుత్వాలు ఆయన్ని గౌరవించాయి. 2002లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లి అక్కడి ఢాకేశ్వరీదేవి ఆలయాన్ని సందర్శించారు. రాజగోపుర ముఖద్వారానికి జగద్గురువుల పేరు పెట్టారు. జగద్గురువులలో శ్రీజయేంద్ర సరస్వతీ వారే ఈ ఆలయాన్ని సందర్శించిన మహనీయులు.
2002లో మధురై సమీపంలో దళితుల క్షేమం, వారి అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ దళితవాడలోని వీరకాళి అమ్మన్‌కు పూజలు గావించారు. బలహీన వర్గముల వారి యోగక్షేమాల కోసం పాఠశాల, వైద్యశాల, సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. అదే వాడలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సమ్మానం చేశారు. ఇది హరిజనుల పట్ల, కళలు, కళాకారులపట్ల వారికున్న అభిమానాన్ని తెలియపరుస్తుంది. వారి జీవితంలో హరిజనోద్ధరణకు, బడుగుల సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చారు.
వారి జాతక చక్రాన్ని పరిశీలిస్తే, వారిది మకర లగ్నం, కుంభరాశి, వ్యయ రాహువు, సప్తమ రవి, సప్తమాధిపతి చంద్రుడు, శనితో కలిసి ఉన్నాడు. దీనిని బట్టి ఆధ్యాత్మిక రంగంలో అనగా పీఠానికి అధిపతి అవుతారు. బ్రహ్మచారి యోగమే. నడిచేది శుక్ర మహర్దశ, చంద్రాంతర్దశ. చంద్రుడు సప్తమాధిపతి, శుక్రుడు అష్టమంలో (ఆయుష్షు స్థానం, ఆరోగ్య స్థానం) ఉండటం, సిద్ధి పొందే యోగాన్ని తెలియచేస్తాయి. దశమ కేంద్రంలో ఉన్న గురుడు విద్యాజ్ఞాన కారకుడై, జగద్గురువులుగా అందరికీ ధర్మాన్ని తెలియజెప్తూ, తరింప చేసే మార్గాల్ని చూపే మార్గదర్శకులవుతారు.
పొనే్నరికి సమీపాన తండలం అనే చిన్నగ్రామంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం. ఆ గ్రామంలో బ్రహ్మశ్రీ ముక్కామల కృష్ణమూర్తి శాస్ర్తీ అనే వేద పండితుని నాల్గవ పుత్రరత్నం పేరు శంకరం. తండ్రిగారి వద్దనే వేదవిద్యాభ్యాసం. నవరాత్రి పూజ జరుగుతూ ఉండగా పండితులు చదివే వేద మంత్రాలలో ఒక ప్రమాదం వాటిల్లింది. అంతటి మహాసభలో పండితులెవ్వరూ గమనించని ఆ దోషాన్ని శంకరం ఒక్కడే కనిపెట్టి దానిని సభ వారి దృష్టికి తెచ్చాడు. ఆ బాలుని ధీశక్తిని శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారెంతో ప్రశంసించారు. తన అనంతరం కామకోటి పీఠాధిపతిగా ప్రతిభావంతుడైన ఆ బాలుని నియమించుకోవాలని సంకల్పంగా శ్రీజయేంద్ర సరస్వతీ స్వామివారికి శ్రీ కామాక్షి అమ్మవారు స్ఫురింపజేసి ఉండవచ్చు. అటు తరువాత శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి ఈ విషయాన్ని పరమాచార్యులు శ్రీచంద్రశేఖరేంద సరస్వతీ మహాస్వామి వారితో సంప్రదించి, వారి ఆశీస్సులతో శంకరానికి 1988 మే నెలలో సన్యాసాశ్రమ దీక్షను ప్రసాదించారు. వారే శ్రీ విజయేంద్ర సరస్వతి, ప్రస్తుత కామకోటి పీఠాధిపతులు.
శ్రీజయేంద్ర సరస్వతీ స్వామివారు అనేకచోట్ల దేవాలయ పునఃప్రతిష్ఠలు, కుంభాభిషేకాలు, విగ్రహ ప్రతిష్ఠలు గావించారు. రెండు తెలుగు రాష్టమ్రులలో ఆగమ శాస్త్రానుసారంగా దేవాలయాల నిర్మాణానికి ఆశీస్సులందించారు. విజయవాడ లబ్బీపేటలో గల శ్రీవేంకటేశ్వరాలయంలో, వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠాపన గావించారు. కుజ దోషములున్నవారు, రాహుకేతు దోషములు నివారణకు మంగళవారములలో అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. రాజోలులో శివలింగ ప్రతిష్ఠ చేశారు.
ముఖ్యంగా విజయవాడ సమీపంలో ‘చిన్నకంచి’ అని ఒక ఊరుకి పేరుపెట్టి కంచి పరమాచార్యుల వారు విగ్రహ ప్రతిష్ఠ చేసి, శివాలయం కట్టించారు. వేద పాఠశాల, గోశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్యం ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమములు జరుగుతున్నాయి. 2012వ సంవత్సరంలో వారు వచ్చి శంకుస్థాపన చేసిన ‘‘చినకంచి’’ 2015లో వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగటం మరువలేనిది. అలాగే, నున్న గ్రామంలో కాశీ విశే్వశ్వర స్వామి వారి పునఃప్రతిష్ఠ గావించారు. ఇలా ఎన్నో ఎనె్నన్నో కార్యక్రమములు వారి చేతి మీదుగా జరిగినాయి. ప్రజలలో ధార్మిక ఆధ్యాత్మికతను ప్రబోధించారు.
వీటికి తోడు పరమాచార్యుల వారి పేరు మీదుగా, ‘చంద్రశేఖర సరస్వతీ విశ్వ మహా విద్యాలయాల్ని’ స్థాపించి ఎందరికో విద్యాదానం చేశారు.
54 సంవత్సరములు సన్యాస దీక్షలో ఉండి అందరికీ ఉపకరించే జీవిత పరమార్థ విషయాలను బోధించి, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమములతో జనావళిలో భక్తి భావాల్ని ఉద్దీపింపచేసి, బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమానికి విద్యాలయాలు, వైద్యశాలలు ఏర్పాటు చేసిన జగద్గురువు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి ఫిబ్రవరి 28, 2018 ఉదయం 9 గంటలకు సిద్ధి పొందారు. అనవరత స్మరణీయులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి.

- పసుమర్తి కామేశ్వరశర్మ సెల్: 94407 37464