Others

‘స్మార్ట్ స్తబ్దత’లో మగ్గిపోతున్న యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత అయిదారేళ్ల నుండి భారత్ సహా అనేక దేశాల్లోని టీనేజర్ల జీవితాలలో అవాంఛనీయ ధోరణి మొదలైంది. అమెరికాలోని యుక్తవయస్కులలో జీవితమంటే ఏ రకమైన ప్రయోజనమూ, సంతోషమూ లేదనుకునేవారి సంఖ్య 2010-2015 మధ్యకాలంలో 33 శాతం పెరిగిందని ఓ అధ్యయనంలో తేలింది. యవ్వన ప్రాయంలో ఆత్మహత్యలకు యత్నించిన వారి సం ఖ్య 23 శాతం పెరిగింది. 13-18 ఏళ్ల వయసు గల వారిలో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య 31 శాతానికి పెరిగింది. అమెరికాలోని అన్ని వర్గాల యువకులలో 2010 తరువాత తీవ్ర మానసిక వత్తిడికి గురైనవారు, ఆత్మహత్యకు ప్రయత్నించినవారు, ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందని వెల్లడైంది.
నేటి యువతలో ఎక్కువ మంది చిన్నపాటి విషయాలకు కూడా క్షణాలలో నిరాశకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిపుణుల అధ్యయనంలో తేలిందేమిటంటే నేటి యువతరంలో ఒక్కసారిగా పెనుమార్పు వచ్చిపడింది. అదే- భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం. 2010-2015 మధ్య కాలంలో పలు దేశాలు స్థిరమైన ఆర్థిక ప్రగతితోపాటు, నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పట్టడాన్ని కూడా చూశాయి. అందువల్ల యువత ఆత్మహత్యలకు ఆర్థిక పరిస్థితులే కారణంగా భావించడం సరికాదు. అనేక దేశాల్లో ఆర్థిక అసమానతలు 2010లోనే వచ్చిపడలేదు. ఇది శతాబ్దాలుగా ఉన్న సమస్యే. విపరీతమైన హోమ్‌వర్క్ కారణంగా పిల్లలపై వత్తిడి పెరుగుతోందా? అంటే అదీ లేదు. 2010-2015 మధ్యకాలంలో చదువుల వత్తిళ్ల కారణంగా టీనేజ్ పిల్లలు హోమ్‌వర్క్ కోసం వెచ్చించే సమయంలో కూడా ఏ మార్పూ లేదు.
‘2012 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 50 శాతాన్ని దాటిపోయింది. అదే సమయంలో నిరాశానిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడే టీనేజర్ల సంఖ్య పెరగడం మొదలైంది. 2015 వచ్చేసరికి 73 శాతం టీనేజర్ల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి పడ్డాయి’ అని వాషింగ్టన్‌కు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వారు ప్రకటించారు. స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడిన వారిలోనే కాదు, రోజుకు ఐదు లేదా అంతకన్నా ఎక్కువ గంటల సమయం ఇంటర్నెట్‌లో గడిపే యువతలో- ఇతరుల కంటే 71 శాతం ఎక్కువగా కుంగుబాటుకు లోనై ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడి చేస్తోంది. డిప్రెషన్‌కి లోనైన యువకులు ఎక్కువగా సోషల్ మీడియాకి అలవాటు పడుతున్నారని కొందరి అభిప్రాయం. అయితే ఇది వాస్తవం కాదనీ, సోషల్ మీడియా వ్యసనానికి బానిసలయ్యాకే యువకులు త్వరగా డిప్రెషన్‌కి లోనవుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఫేస్‌బుక్ అకౌంటే లేనివారికన్నా, ఫేస్‌బుక్ అలవాటైపోయి దానికి ఒకరోజు దూరమైతే అల్లల్లాడిపోయి డిప్రెషన్‌కి లోనయ్యే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని ప్యూ రీసెర్చ్ సెంటర్ వారి అధ్యయనం తెలియజేస్తోంది. డిప్రెషన్ కారణంగానే- 2012 తరువాత సోషల్ మీడియా వ్యసనానికి లోనైన వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిందా? అంటే అసలు వారికి డిప్రెషన్ ఎక్కడి నుండి వచ్చిందన్నది అసలు ప్రశ్న. అంటే డిప్రెషన్‌కి లోనైన టీనేజర్లు దాని నుండి బయట పడటానికి స్మార్ట్ ఫోన్లు కొంటున్నారా? ఇలా ఆలోచించడంలో అర్థమే లేదు!
నేటి పిల్లల్లో స్మార్ట్ఫోన్ యాక్టివ్‌నెస్ పెరుగుతోంది. అదే సమయంలో వారిలో మానసిక స్తబ్దత కూడా పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయాన్ని వెచ్చించడం యువకుల మానసిక ఆరోగ్యంపై వెంటనే ప్రభావాన్ని చూపకపోవచ్చు. కానీ ఇతర విషయాలకై వారు సమయాన్ని వెచ్చించడం మాత్రం తగ్గిపోతోంది. ఉదాహరణకు నేటి టీనేజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం కన్నా ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపటానికే మొగ్గు చూపిస్తున్నారు. పరస్పరం కలుసుకుని, ముఖాముఖి సంభాషించుకోవడం వల్లనే ఎవరైనా ఎక్కువ ఆనందం పొందుతారు. దానివల్ల పరస్పరం భావోద్వేగాల ప్రసారం జరుగుతుంది. మానసిక వత్తిడులు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగతంగా ఒకరినొకరు కలుసుకోనప్పుడు మనలోని భావోద్వేగాలను ఎవరి వద్ద వ్యక్తం చేస్తాం? మనలోనే గూడు కట్టుకుపోయిన భావోద్వేగాలే డిప్రెషన్‌గా పరిణమిస్తాయి. సామాజికంగా ఒంటరి వారమవుతున్నామన్న ఆలోచన కూడా టీనేజర్లని ఆత్మహత్యలవైపు నడిపిస్తోంది. 2012 తరువాత ఆన్‌లైన్‌కు అలవాటు పడిపోయి- మానసిక ఉల్లాసాన్నీ, ఆరోగ్యాన్నీ కలిగించే ఏ ఇతర కార్యకలాపాల పట్ల దృష్టి పెట్టని టీనేజర్ల సంఖ్య పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో, ఫోన్ చాటింగ్‌లలో గడిపే టీనేజర్లు నిద్రించే సమయం కూడా బాగా తగ్గిపోతోంది. నిద్రలేమి కూడా డిప్రెషన్‌కి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.
స్మార్ట్ ఫోన్ల వ్యసనం వల్ల డిప్రెషన్‌కి లోనవడం, ఫలితంగా ఆత్మహత్యలు చేసుకునే టీనేజర్ల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. జన్యుపరమైన కారణాల వల్ల, కుటుంబ వాతావరణం వల్ల, భయాందోళనలకు గురి కావడం వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల కూడా ఎవరైనా డిప్రెషన్‌కి లోనయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారి సంఖ్య తక్కువే. ‘జెనరేషన్ మి’ పుస్తక రచయిత అయిన జీన్ ఎం.త్వెంజ్ మనస్తత్వవేత్త కూడా. ఆయన 1995 ఆ తరువాత పుట్టినవారిని ‘‘ఐ-జెన్’’ పిల్లలుగా పేర్కొంటున్నారు. వీళ్లలో పిల్లలు, యువకులు, యువ వృద్ధులు కూడా ఉన్నారు. వీళ్లలో ముందు తరాలవారి కంటే వైవిధ్యం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల, అధ్యాపకుల, ఉద్యోగాలిచ్చేవారు లేదా పనిచేసే ఆఫీసుల్లో యజమానుల వ్యవహారం, ఆలోచనా ధోరణితో ఈ ‘ఐ-జెన్’ పిల్లల ధోరణిలో చాలా వ్యత్యాసం ఉంది. అందువల్ల ఈ కొత్తతరం పిల్లలని, వారి ప్రవర్తన, ఆలోచనా ధోరణులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉంది.
తమ యుక్త వయస్సునంతా స్మార్ట్ ఫోన్ల మధ్య గడిపే మొదటి తరం పిలలు ‘ఐ-జెన్’ పిల్లలు. స్మార్ట్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోయిన యువత తమ స్నేహితులతో, బంధువులతో, సన్నిహితులతో కాలం గడిపే సమయమే తగ్గిపోతోంది. ఫలితంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తీవ్రమైన వ్యాకులత, నిస్పృహ, ఒంటరితనానికి లోనౌతోంది యువత. టెక్నిలజీ అందించిన స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో లీనమైపోవడంలోనే కాదు, ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక, సెక్స్ పరమైన విషయాల పట్ల స్పందించటంలో కూడా ‘ఐ-జెన్’ తరంలో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది.
ఇప్పటి వరకు గల సామాజిక విధానాలను కాదని ఈ ‘ఐ-జెన్’ పిల్లలు కొత్త దారులలో అడుగులు వేస్తున్నారు. వాళ్ల జీవితమూ, ఉద్యోగాల విషయంలో కొత్త అవసరాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ముందు తరాలతో పోలిస్తే వీరికి జీవితాలలోను, ఉద్యోగాలలో కూడా భద్రత తక్కువ, చికాకులు ఎక్కువ. చిన్నపాటి సమస్యల పట్ల కూడా సంయమనం పాటించే గుణం ఈ తరం పిల్లల్లో లోపిస్తోంది. ‘ఐ-జెన్’ పిల్లల్లో ఎదుగుదల కూడా ముందు తరాల వారికంటే నెమ్మదిగానే ఉంటోంది. చూడటానికి పద్దెనిమిదేళ్ళ వయస్సు వారిలా కనిపిస్తున్నా చేష్టలలో, ఆలోచనా తీరులో పదిహేనేళ్ల పిల్లల్లాగే కనిపిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్లలో విహరిస్తున్న టీనేజర్లపై ఆంక్షలు విధించడమేమిటని వాదించే వారూ ఉన్నారు. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ‘ఐ-జెన్’ పిల్లలు రేపు పెద్దలౌతారు. వారి చేతుల్లోకే భావి ప్రపంచం వెళ్లబోతోంది. కాబట్టి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ పెద్దలు, స్నేహితులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, బోధకులు, ఉద్యోగాలిచ్చేవారు ఈ పిల్లలని వారి పద్ధతుల్లో అర్థం చేసుకుంటూనే తగిన విధంగా వారికి మార్గదర్శనం చేయాలి. ‘ఐ-జెన్’ పిల్లలు కూడా స్వీయ అవగాహన పెంచుకుంటూ వివిధ విషయాలపై తమ ఆలోచనా తీరును పెద్దకు వివరించగలగాలి. ఎందుకంటే వీరిని బట్టే భావి ప్రపంచం తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయి గనుక.

- డా.దుగ్గిరాల రాజకిశోర్ సెల్: 80082 64690