సబ్ ఫీచర్

పద్మవ్యూహంలో చంద్రబాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక కేంద్రంతో రెండోసారి ‘్ఢ అంటే ఢీ’ అంటోంది. టిడిపి జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇది గడ్డుకాలమే. ఏపీలో అధికార పక్షమైన తెదేపా ఇప్పుడు అనూహ్య పరిణామాలను ఎదుర్కొంటోంది. 1982లో అవతరించినప్పటి నుంచి ఇంత పెద్ద ప్రతికూల పరిస్థితులను ఆ పార్టీ ఎదుర్కొనలేదు. 1984లో టిడిపి వ్యవస్థాపకుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం అస్థిరపరిచింది. ఎన్టీఆర్‌ను పడగొట్టి నాదెండ్ల భాస్కరరావు సీఎం అయ్యాక ప్రజల్లో తిరుగుబాటు వచ్చినంతపనైంది. చివరకు కేంద్రం దిగొచ్చింది. మళ్లీ పగ్గాలు చేపట్టిన ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి నెగ్గారు.
ఎన్టీఆర్ ప్రజాదరణ ఉన్న నాయకుడు కావడం, కాంగ్రెస్ అంటే ప్రజల్లో తీవ్రమైన ఏహ్యత ఉండడంతో ప్రజలు తిరగబడ్డారు. అప్పట్లో టిడిపికి వామపక్ష పార్టీలు, బిజెపి, ఇతర ప్రజా సంఘాలు సహకరించాయి. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే శక్తుల్లోని పెద్దనాయకులు రంగంలోకి దిగి టిడిపిని కాపాడారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో ప్రజలు ఎన్టీఆర్‌కు అండగా నిలబడ్డారు. 1995లో ఎన్టీఆర్‌పై చంద్రబాబు తిరుగుబాటు బావుటా ఎగురవేసి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుని ముఖ్యమంత్రి పదవిని చేపట్టి 2004 వరకు కొనసాగారు. 1995 ఆగస్టు పరిణామాలు టిడిపిని కుదుపేసినా నిలదొక్కుకుంది. ఇది టిడిపికి తొలి అంతర్గత సంక్షోభం.
ఆ తర్వాత టిడిపి పెద్దగా కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంబించలేదు. పివి నరసింహారావు 1991లో ప్రధాని కావడానికి, అంతకు ముందు నేషనల్ ఫ్రంట్ తరఫున వీపీ సింగ్ ప్రధాని కావడానికి టిడిపి సహకరించింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి అప్పటి సీఎం చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. 1999లో వాజపేయి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చంద్రబాబు మనస్ఫూర్తిగా సహకరించారు. అనంతరం 2004 ఎన్నికల్లో టిడిపి పరాజయం పాలైంది. ఆ తర్వాత 10 ఏళ్లపాటు టిడిపి అధికారానికి దూరమైనా చెక్కుచెదరలేదు. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం, బలమైన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, నిరంతరం పోరాటాలతో టిడిపి తన ఉనికిని కాపాడుకుంది. ఈ పదేళ్లలో టిడిపి రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి విభజనకు సమ్మతి తెలిపింది. దీనిపై తలెత్తిన రాజకీయాల సంగతి పక్కనపెడితే, చంద్రబాబు 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. 1999, 2014 ఎన్నికల్లో బిజెపితో జతకట్టి టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ రెండు సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బిజెపి పొత్తుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2004 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత బిజెపి వల్లనే ఓటమి చెందానని బహిరంగంగా ప్రకటించారు. తాజాగా చంద్రబాబు పద్మవ్యూహంలో చిక్కుకున్నారని చెప్పవచ్చు. ఆయన నాయకత్వానికి 2019 ఎన్నికలు సవాలు లాంటివి.
ఎన్టీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన టిడిపి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా కనపడుతోంది. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ తదితర హామీల విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం కటువుగా వ్యవహరించిన తీరు చంద్రబాబునే కాకుండా ఆంధ్రప్రజలను బాధించింది. బిజెపి రాష్ట్ర నాయకులు కూడా తాము రాష్ట్రానికి ఏమి చేశామో చెప్పడంలో విఫలమయ్యారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునే దిశగా చంద్రబాబు ప్రయాణిస్తున్నారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ కేంద్రంపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవు. కాంగ్రెస్‌పై మాత్రమే చంద్రబాబు తీవ్రమైన పదజాలంతో ఎదురుదాడి చేసేవారు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సంయమనంతో, చతురతతో వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైనవి రాబట్టుకునేవారు. చంద్రబాబు 1995 నుంచి 2018 వరకు కేంద్రంతో ఎప్పుడూ యుద్ధానికి దిగలేదు. ఒక్క మాట కూడా పొరపాటున నోరు జారిన సందర్భం లేదు. చంద్రబాబు జాతీయ స్థాయినాయకుడైనా, తన శక్తి తెలిసి జాగ్రత్తగా వ్యవహరించేవారు. అసెంబ్లీలోపల, వెలుపల చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తుంటే, బిజెపి నుంచి తనకు, టిడిపికి ముప్పు పొంచి ఉన్నదనే సంకేతాలతో అప్రమత్తమై బిజెపికి విడాకులు ఇచ్చేశారు. బిజెపిని ఎదుర్కొని చంద్రబాబు రాజకీయంగా నిలదొక్కుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే, నిరంతరం కేంద్రంతో పోరాటాలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదు. ఇక, నిన్నటి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు గౌరవించారు. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న నేత పవన్ అని పసిగట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ ఎదురుదాడిని ప్రారంభించడంతో చంద్రబాబు ఒక్కసారి కంగుతిన్నారు. వారం రోజుల వ్యవధిలో ఆయనకు ఇది రెండవ షాక్.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. వామపక్ష పార్టీల కార్యాలయాలకు కూడా వెళ్లి వచ్చారు. ఆ పార్టీలతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతారా? లేదా? ఇప్పుడే అంచనా వేయలేం. మరో వైపు బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూనే చకాచకా పావులు కదుపుతున్నారు. బలపడుతున్న వైకాపా నుంచి, దూరమైన బిజెపి నుంచి, తక్కువగా అంచనా వేసిన జనసేన నుంచి టిడిపి గట్టి సవాళ్లనే వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనబోతోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు బలమెంతో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఎవరూ సాహసించరు. పవన్ కల్యాణ్ చివరి వరకు వామపక్షపార్టీలతో కలిసి ఉంటారనే నమ్మకం ఇంకా కలిగించలేదు. ఒక వేళ బిజెపి ప్రత్యేక ప్యాకేజీతో పాటు మరి కొన్ని వరాలను ప్రకటించి సొంతంగా బలపడే ఎత్తుగడలో బిజెపి ఉందా? ఇది నిజమైతే, బిజెపికి ఫేస్ సేవింగ్ ఫార్ములా దొరికినట్లవుతుంది. బిజెపితో పొత్తుకు టిడిపి, వామపక్షయేతర పార్టీలు ప్రయత్నిస్తాయి. కాని పుణ్యకాలం గడిచిపోయినా తర్వాత ఉత్తుత్తి వాగ్దానాలు చేసి జనం దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగితే బిజెపిని ప్రజలు అక్కున్న చేర్చుకునే పరిస్థితి ఉండదు. ఏపి రాజకీయాల్లో పూర్తి స్పష్టత వచ్చేందుకు మరి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. సిద్ధాంత నిబద్ధత లేని రాజకీయ పార్టీల వల్ల గందరగోళం కొనసాగుతుంది.
ప్రస్తుతం దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు ఆయన ముందరికాళ్లకు బంధం వేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాదిరి చంద్రబాబుకు ఢిల్లీలో చక్రం తిప్పే సమయం లేదు. చంద్రబాబు పట్ల బిజెపి అగ్రనాయకత్వం మెతకవైఖరిని అవలంబించదు. ములాయం, లాలూప్రసాద్, మమత, జయలలిత లాగా మొండిగా పోరాడే తత్వం చంద్రబాబుకు లేదు. విభజన తర్వాత అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వౌలిక సదుపాయాల లేమితో ఏపీ కొట్టుమిట్టాడుతోంది. చెప్పుకోదగిన పరిశ్రమలు రాష్ట్రానికి తరలి రాలేదు. వ్యవసాయపరంగా బలమైన రాష్ట్రం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ కొంత పచ్చగా కనపడుతోంది. టిడిపి వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోటీని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగడం ఖాయం. 2014 మాదిరి అధికారాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు వద్ద ఉన్న తాయిలాలు, మహేంద్రజాల విద్యలు ఏ మాత్రం పనికొస్తాయో చూడాలి. వచ్చే ఎన్నికలు టిడిపికి నల్లేరు మీద నడకమాత్రం కాదు.

-కె.విజయశైలేంద్ర 98499 98097