సబ్ ఫీచర్

అక్షర దివిటీలతో ‘సూర్యుడిని నెత్తికెత్తుకొని’...( సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయత : రావి రంగారావు
వెల : రూ.100
- ప్రతులకు -
రావి రంగారావు సాహిత్య పీఠం
101, అన్నపూర్ణ నగర్, గోరంట్ల,
గుంటూరు - 522 034
సెల్: 9247581825
*
అక్షరంతో సహజీవనం చేసి కాలంతోపాటు ప్రయాణించే కవులు చాలా అరుదుగా ఉంటారు. ఇందులో అనేక ఒడిదొడుకులు, అడుగడుగునా ఆత్మ సంఘర్షణలో లెక్కకుమించి రూపుకడతాయి. వీటి మూలాల లోతుల్లోకి వెళ్ళి, నిజానిజాలను శోధించి కవిత్వీకరించే ప్రయత్నం జరుగుతుంది. అలా అనుభవాలను చిత్రికపట్టే తపనలోంచి వెలుగు చూసినదే ఈ ‘‘సూర్యుడిని నెత్తికెత్తుకొని’’అనే కవితా సంపుటి. దీని కవి రావి రంగారావు. సుదీర్ఘకాలంగా బహుముఖ ప్రక్రియలతో ఆరితేరి, మినీ కవితా ఉద్యమానికి ఊపిరిలూదుతూ తెలుగునాట చెయ్యి తిరిగిన లబ్దప్రతిష్ఠుడిగా ముద్రపడ్డారు. తన రచనలకు పలువురి ప్రశంసలతోపాటు అనేక పురస్కారాలను స్వీకరించారు. ఇంకా పలు రంగాలలో నిష్ణాతుడిగా రాణించి చాలా సేవలను అందించారు. దీనిలో 125 కవితల్ని పుస్తక రూపంలో మన ముందుంచారు. లోచూపుతో, పదునైన ఆలోచనలతో పాఠక హృదయాల్ని తట్టిలేపే చైతన్యవంతమైన పాత్రను పోషించారు. సామాజిక అంశాలతోపాటు, వర్తమాన ప్రాపంచిక పోకడలను రక్తికట్టించి, అద్దం పట్టించడంలో చురుకైన పావులను కదిపారు. వీటి లోతుపాతుల్ని ఒడిసి పట్టుకోవడంలో కవి రావి రంగారావు ప్రదర్శించిన అక్షర చేతివాటాన్ని ఆమూలాగ్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
‘తెల్లని కోకిల పాట’ కవితలో కవి ఆంతర్యం ఇలా బయటపడుతుంది.
‘రాత్రి చెట్టుమీద
చుక్కల పావురాలు వాలాయి
తెల్లని కోకిల చంద్రబింబం
వెనె్నలను పాడటం మొదలుపెట్టింది’ అంటారు ఒకచోట. భావుకత పరకాష్ఠకు చేరుకున్నపుడు అనుభూతి సామాజిక జీవన తత్త్వంలోంచి సందర్భంగా ప్రతిబింబించడం మొదలవుతుంది. చెట్టును రాత్రితోనూ, పావురాలను చుక్కలతోనూ, చంద్రబింబాన్ని తెల్లని కోకిలతోనూ ప్రతీకలుగా పోల్చిచెప్పడం ఒక ఎత్తయితే, వెనె్నలతో పాడించడం మరొక ఎత్తు. చాలా బలమైన వ్యక్తీకరణ ఈ అభివ్యక్తిలో కనిపిస్తుంది. ఒక సాధారణమైన సామాన్య విషయాన్ని భావోద్వేగంతో గాఢానుభూతిగా వ్యక్తపరచడం అంత తేలికైన పనికాదు. చాలా శక్తివంతంగా విస్తృతార్థంలో చెప్పడం భావానికి నిండైన పరిపూర్ణతను చేకూర్చినట్టయింది. ఇది ఒట్టి ఊహాచిత్రమే కాదు. అంతర్లీనంగా నిబిడీకృతమైవున్న, నిగూఢ సందేశాన్ని హెచ్చరిక రూపంలో ధ్వనింపజేస్తుంది. అదే ఈ కవితకు అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది.
‘హృదయం ఉంటేనే కదా’ అనే శీర్షికలో కవితాంశ నిలువెల్లా ఉట్టిపడుతుంది.
‘నేలమీద పడితేనే కదా
శిశువుకైనా చినుకుకైనా
బతకడం మొదలయ్యేది’ అని అనడం వెనుక సృష్ట్ధిర్మాన్ని, బతుకు మర్మాన్ని తార్కిక చింతనతో సువిశాల ధృక్పథంగా మలచడానికి వీలు చిక్కింది. దూరదృష్టితో ఆలోచించడానికి అవకాశాన్ని కలిగించింది. సనాతన సాంప్రదాయక భావజాలంతో ఆధునిక సామాజిక ప్రపంచాన్ని అవగతం చేసుకోవడానికి చేసిన పరిశోధనాత్మక ప్రయాణంలో భాగమే ఈ జీవన దృశ్యచిత్రం ఆవిష్కరణ. పుట్టుక తర్వాత కష్టసుఖాల తాకిడిలోని ఎత్తుకుదుపుల ఆరాట జీవనశైలికి ఇది బతుకు ముఖచిత్రంగా నిలుస్తుంది.
ఇంకోచోట కవి మాటల్లో రక్తికట్టే భావం ‘గాజుబొమ్మలు’ కవితలో నిరూపితమవుతుంది.
‘జీవితం
పరాయి దేశంలో
కుండీలోని మొక్కలాంటిది
మాతృదేశంలో
పొలంలోని పంట లాంటిది’ అంటూ వర్తమాన ఆధునిక బతుకుశైలికి సూత్రప్రాయమైన నిర్వచనాన్ని అందివ్వబోతారు కవి రావి రంగారావు. స్వదేశానికి విదేశానికి మధ్య తొంగిచూసిన వ్యత్యాస పూరితమైన బేధాభావాన్ని, సునిశిత పరిశీలనతో అంచనావేసి చెబుతారు. కుండీ మొక్కకి- పొలం పంటకి ఉన్న సహజసిద్ధమైన సారూప్య దృష్టికోణాన్ని విడమర్చి విశే్లషిస్తారు. స్వేచ్చలేని జీవితం ఎలా కుదించుకుపోయి కుశించుకుపోతున్నదో ఏకరువుపెట్టే కవిత ఇది. ఇందులో అనుభవం వాస్తవిక పరిస్థితులతో ఎలా రాజీలేని పోరాటం చేస్తుందో, వివరించి చెప్పే లోతైన సందర్భ సంభాషణలోనివి ఈ పలుకులు. అర్థ్భావ గాంభీర్యత తొణికిసలాడుతుంది. కాబట్టే తాత్త్విక భౌతిక సత్యాన్ని ఒక బీజప్రాయమైన పునాది పడింది. ఇంకా ప్రపంచీకరణ ప్రభావంతో బ్యాంకుల ప్రైవేటీకరణ మొదలుకొని, చెట్లు, కవిత్వం, ఎ.టి.ఎం.కార్డ్, శబ్దం, దాంపత్యం, ఓటు, ఆత్మవిశ్వాసం, పుష్కర స్నానాలు, రైతు, వర్షం, ఉగాది వంటి కవితలు విలక్షణతకు, వస్తువైవిధ్యానికి దర్పణం పడుతున్నాయి. కొన్నిచోట్ల పాత కొత్తల మేలు కలయికతో వచన సరళత్వం అక్షరాల నిండా అల్లుకుని సహజత్వానికి ఊపిరిపోశాయి.
కవిత్వం విషయానికొస్తే అక్కడక్కడా కొన్ని వాక్యాలు తళుక్కుమంటాయి. ‘నా చుట్టూ/ చీకటి తడిసిపోయింది/ నీ ముద్దుతో ఆరిపోతుంది’, ‘మనిషా/ వాడెక్కడ/ ఎప్పుడో యంత్రమైపోయాడు’, ‘జీవితానికి/్భర్త దేహం/ భార్య ప్రాణం’, ‘కాలం/కొండ గుండెలోని జల/ మనిషి/ గడ్డపలుగు దిగని రాతిశిల’, ‘మళ్ళీ కొత్త విత్తనాలై/ పొలాల్లో మొలవబోతున్న రైతులు/ అవయవాలకు పదునుపెట్టుకుంటూ/ ముందుకొస్తున్న శ్రామికులు’, ‘ఓ మనిషీ/ చెట్లను పెంచి చూడు/ భూమిమీదే కాదు/నీ గుండెల్లో కూడా’ ‘గోదావరి నీరుకాదు/ పుడమి తల్లి నెత్తురు/ విశ్వానికి వెలుతురు’, ‘వాడి కాలుతున్న పొట్ట/ ఇరవై నాలుగ్గంటలు/ ప్రపంచమంతా తిరుగుతున్న ఆకలి పిట్ట’ మున్నగు వాక్య నిర్మాణాలు ఈ కవికి కవిత్వంపై ఉన్న పట్టును తెలుపుతాయి. స్థూలంగా చూసినపుడు విభిన్న భావాల సమాహారం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.
ఇంకా వీటితోపాటు మారుతున్న వర్తమాన కవితా నిర్మాణ రీతుల్ని ఒంటపట్టించుకుంటే భవిష్యత్తులో గొప్ప రచనలను చేయగలుగుతారు రంగారావు. అవిశ్రాంతమైన ఈ నిరంతర కృషీవలుడికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, మరో కొత్త కవితా సంపుటికోసం అంతా ఎదురుచూద్దాం.

- మానాపురం రాజాచంద్రశేఖర్ 9440593910