సబ్ ఫీచర్

మావోయిజం ఇంకెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావో ఆలోచనా విధానానికి, ఆయనతో కలిసి పనిచేసిన డెంగ్ జియావో పింగ్ భావాలకు ఎక్కడా పొంతన కుదరదు. తూర్పు-పడమరలంత తేడా కనిపిస్తుంది. చైనా ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్ భావజాలం ఆధునిక పరిస్థితులకనుగుణంగా ఉన్నా, మావో కమ్యూనిస్టు మూల సూత్రాలకు దగ్గరగా కనిపించదు. అంటే చైనాలో మావోయిజం మంచులా కరిగిపోయిందన్నమాట. 1980 ప్రాంతంలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంలో డెంగ్ జియావో పింగ్ కీలక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆధునికతను ఆహ్వానించారు. పాశ్చాత్య దేశాల పోకడలకు, ఆర్థిక విధానాలను స్వాగతించి, సంపద సృష్టికి ప్రాధాన్యమిచ్చారు. ఈ విధానం మావో మూలభావనకు ఏ మాత్రం పొసగదు. కాల మాన పరిస్థితులకనుగుణంగా ముందుకు కదలాలన్న దృష్టికోణంతో కమ్యూనిస్టు మూల సూత్రాలకు భిన్నమైన విధానాలను ఆశ్రయించారు. దానికి కొనసాగింపుగా, మరిన్ని సంస్కరణలతో సంపద సృష్టి అత్యంత కీలకమన్నట్టు జిన్ పింగ్ ఆలోచనలున్నాయి. ఈ ముగ్గురి భావజాలాన్ని పొందుపరిచి ఆ దేశపు రాజ్యాంగాన్ని మార్చారు. అంటే చైనాలో మావోయిజం క్రమంగా అదృశ్యమైందని తేటతెల్లమైంది. ప్రపంచంతో కలిసి నడిచేందుకు వాణిజ్య- వ్యాపార రంగాల్లో పాల్గొంటూ చైనా సంపదను పోగేస్తోంది. విదేశీ పెట్టుబడులను సాదరంగా ఆహ్వానిస్తోంది.
మార్క్సిజం - లెనినిజాన్ని మరింత మెరుగుపరిచి చైనా పరిస్థితులకనుగుణంగా ఆ సిద్ధాంతాన్ని మలిచామని చెప్పుకునే ఈ మార్గం మావో ఆలోచనా విధానానికి పూర్తిగా వ్యతిరేకం. వర్గ పోరాటం (క్లాస్ స్ట్రగుల్) నిరంతరం కొనసాగుతుందని అందుకు అనుగుణమైన సాంస్కృతిక విప్లవం (కల్చరల్ రెవల్యూషన్) తీసుకొచ్చిన మావో ఆలోచనా విధానం ఆయన మరణంతో (1976లో) అంతమైంది. మావో తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీపై పట్టు సాధించిన డెంగ్ జియావో పింగ్ సంస్కరణలకు కిటికీలు, తలుపులు తెరిచారు. దాంతో అమెరికా- యూరప్ అంతా చైనాలో కనిపించసాగింది. పని సంస్కృతేగాక జీవన సంస్కృతి సైతం చొరబడింది. అనంతరం వచ్చిన పాలకులు ఆ సంస్కరణలకు గేట్లు తెరిచారు. జిన్ పింగ్ ఆ గేట్లను మరింత బార్లా తెరుస్తున్నారు. దాంతో మావో మూలభావాలిప్పుడు గత స్మృతులుగానే మిగిలాయి.
మావో పేర్కొన్న న్యూ డెమొక్రసీ, కల్చరల్ రెవల్యూషన్, మాస్ లైన్, లా ఆఫ్ కాంట్రడిక్షన్ (వైరుధ్యం) అంశాలేవీ చైనాలో ఇపుడు కనిపించవు. విడ్డూరమేమిటంటే భారత్‌లో మాత్రం వాటి పునరుత్థానం కోసం మావోయిస్టులు కంకణం కట్టుకున్నారు. అందుకు ప్రాణాలు తీయడానికైనా, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని పిడికిలి బిగిస్తున్నారు. డెబ్భై ఏళ్ళ క్రితం మావో చైనాలో ఆచరణలో పెట్టిన దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా (ప్రొట్రాక్టెడ్ పీపుల్స్‌వార్)ను వర్తమానంలో భారత్‌లో అమలుపరుస్తామని, అదే తమకు ‘దీపదారి’ అని ఇక్కడి మావోయిస్టులు పదే పదే పేర్కొంటున్నారు. మావోయిజం చైనాలో కరిగిపోయిందని ప్రపంచం కోడై కూస్తుంటే దాన్ని భారత్‌లో ప్రకాశించేలా చూస్తామని మందుపాతరలు, మర తుపాకులకు పని చెబితే అది ఆహ్వానించదగ్గ అంశమవుతుందా?
ప్రపంచాన్ని మూడు తరగతులుగా విభజించిన సందర్భంలో మూడవ ప్రపంచ దేశంగా ఉన్న చైనాలో, జపాన్ దురాక్రమణదారులను ఎదుర్కొనేందుకు, వార్‌లార్డ్స్‌ని అరికట్టేందుకు, దుష్టశక్తులనుంచి దేశాన్ని రక్షించుకుని బంగారు భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ‘లాంగ్‌మార్చ్’ చేసింది. ఆ సందర్భంలో ఆ అవసరం అక్కడ కనిపించడంతో ప్రజలు స్వాగతించారు. మావో వ్యూహం- ఎత్తుగడలు ఫలించి ‘విముక్తి’ని సాధించారు. చైనాను ‘జన చైనా’గా మార్చారు. ఈ ప్రక్రియను డెబ్భై ఏళ్ళ అనంతరం, దేశ కాలాలు మారిన నేపథ్యంలో భారతదేశంలో ‘రిప్లికేట్’ చేస్తామని గెరిల్లా దండు ఏర్పాటు చేసి ‘లాంగ్‌మార్చ్’కు సమాయత్తం కావడం పూర్తిగా అవివేకం. అప్పటి చైనాలో మాదిరి భారత్‌పై విదేశీయుల పెత్తనం లేదు, ఆక్రమణ లేదు, వార్ లార్డ్స్ కనిపించదు, అరాచకం అగుపించదు. పేదరికం రాశిభూతంగా లేదు. బడాభూస్వాములిప్పుడు అసలే లేరు. ఇవి లేనప్పుడు దేశాన్ని ‘విముక్తి’ చేయాలన్న భావనే ఉత్పన్నం కాదు. యువతరం పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తోంది. చట్టం ప్రజాజీవితాన్ని క్రమబద్ధీకరిస్తోంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రపంచంతో కలిసి నడిచేందుకు అన్ని అవకాశాలున్నాయి. ఆధునిక టెక్నాలజీ పల్లెల్లో, పట్టణాల్లోనూ దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ‘లాంగ్ మార్చ్’ అవసరం భారత్‌లో కనిపిస్తోందా? లేదు! దీర్ఘకాల ప్రజా యుద్ధ పంథాకు సైతం ప్రాసంగికత కనిపించదు. అయినా మొండిగా మావోయిస్టులు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా వ్యవహరించం మూర్ఖత్వంగాక ఏమవుతుంది?
2018-19 కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే గ్రామీణ ప్రజలకు, పేదలకు పెద్దపీట వేసిందని విశే్లషకుల మాట. దేశ ఆదాయ వనరులను ఎలా ఖర్చుపెట్టనున్నది పద్దుల రూపంలో ప్రకటించారు. ఇది పారదర్శకంగా కొనసాగనున్నది. దశాబ్దాలుగా ఈ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోంది. దేశ ఆదాయమంతా కొంతమంది బొక్కసాలలోకి చేరుతోందని తప్పుడు ప్రచారంతో ఆకట్టుకోవడం ఈ రోజుల్లో సాధ్యం కాదు. పిండికొద్ది రొట్టె అన్న విషయం విస్మరిస్తే అనేకానేక అనుమానాలు, అపోహలు తలెత్తుతాయి. ప్రపంచ వ్యాప్తంగా గల మెరుగైన పద్ధతులను ఆచరణలో పెడుతూ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం అందరూ గమనించవచ్చు.
దీన్ని కాదని రాజ్యాధికారం తమకే దక్కాలని సాయుధ పోరాటం ద్వారా దాన్ని సాధిస్తామని, గ్రామాలను విముక్తి చేసి, పట్టణాలను చుట్టుముట్టి అనంతరం దేశ రాజధానిలోని ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తామన్న ఆలోచన ఇపుడు పూర్తిగా అనాగరికమైనది. చైనాలో డెబ్భై ఏళ్ళ క్రితం ఈ వ్యూహం విజయవంతమైతే అది ఇప్పుడు భారత్‌లోనూ విజయంసాధిస్తుందనుకోవడం పూర్తిగా అజ్ఞానం, అమాయకత్వం. బీజింగ్‌లో అసంతృప్తివాదులు, ప్రజాస్వామికవాదులు తియాన్మన్ స్క్వేర్ నుంచీ భారత్‌లో మహాత్మాగాంధీ స్వాతంత్య్రానికి ముందు బ్రిటీషు పాలకుల శాసనోల్లంఘన సందర్భంగా జరిపిన ‘దండి మార్చ్’ను చేస్తామనడం ఎలా వుంటుందో మావో చైనా స్వాతంత్య్రానికి పూర్వం నిర్వహించి ‘లాంగ్ మార్చ్’ను భారతదేశంలోని దండకారణ్యం నుంచి జరుపుతామని చెప్పడం అచ్చం అలాగే వుంటుంది. అయినా పర్వాలేదు, ప్రపంచం ఏమనకుంటే మాకేంటి? కాలమాన పరిస్థితులు ఎంతగా మారినా మాకేంటి? నాల్గవ పారిశ్రామిక విప్లవ ఫలితాలు వేగంగా ప్రజలకు అందితే మాకేంటి? ప్రజలు పూర్తి స్వేచ్ఛగా, తమ శక్తి సామర్థ్యాల మేరకు, నైపుణ్యాల ఆసరాతో జీవిస్తున్నా మాకేంటి? తామొకసారి కమిట్ అయితే ఎవరి మాట వినబోమన్న రీతిలో ముందుకు కదలడం మూర్ఖత్వం గాక ఏమవుతుంది?
ప్రపంచం ఓ కుగ్రామంగా భావిస్తున్న తరుణంలో, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ సాయంతో ఏ దేశంలో ఏం జరుగుతున్నదో రియల్ టైంలో తెలుసుకునే సౌలభ్యం ఉన్న సందర్భంలో మావోయిజం పూర్తిగా కరిగిపోయి యాంగ్జీ నదిలో నిమజ్జనమైన సంగతి స్పష్టాతిస్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆ దృశ్యాన్ని చూడ నిరాకరిస్తూ తృతీయ ప్రపంచ దేశంలా భారత్‌లో పరిస్థితులున్నాయి కాబట్టి తమ విశే్లషణకు చెదలు పట్టలేదని విశ్వసించి విముక్తి ప్రాంతాల ఏర్పాటు పేర అమాయక ఆదివాసీల బతుకులను ఆహుతి చేస్తే ఎలా?
ప్రస్తుతం చైనా పూర్తి పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తూ ప్రజలకు మేలైన జీవితాన్ని అందించేందుకు యత్నిస్తోంది. ఈ రకమైన విధానాలనే భారత్ సహా ఇతర దేశాలు అవలంబిస్తున్నాయి. స్పర్థతో ఆయా దేశాలు సంపద సృష్టిలో తలమునకలవుతున్నాయి. మావోయిజం ఎన్నడూ దర్శించలేని ఆధునిక టెక్నాలజీ అంతటా కమ్ముకుంది. కృత్రిమ మేధ ఆధారంగానే సమాజాలు ముందుకు కదులుతున్నాయి. సంపదను సృష్టిస్తున్నాయి. మార్క్సిజం - లెనినిజాన్ని ఉన్నతీకరించినట్టు భావించే మావోయిజం కృత్రిమ మేధ వెలుగులు, పట్టణీకరణ నేపథ్యంలో ఆనవాలు లేకుండా కరిగిపోయింది. అలాంటి ‘ఇజం’ ఇంకా జపం చేయడమంటే ప్రజల్ని మోసగించడమే!

-వుప్పల నరసింహం 99857 81799