సబ్ ఫీచర్

అదే వంచన, అవే అసత్యాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్చుగల్‌కు చెందిన వాస్కోడగామా భారత్‌కు దారి కనిపెట్టాడని చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్నాం. ఆయనకు దారి చూపించిన బృందంలో ఒక గుజరాతీ కూడా వున్నాడన్న సంగతి ఈమధ్యనే చదివాను. గుజరాతీలు సముద్రంపై ఖండాంతరాలు దాటి వ్యాపారం చేసి ఎంత సంపాదించారో, ఎలా సంపాదించారో చరిత్రకారులు ఎక్కడైనా రికార్డుచేసి వుంటే తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిందే. ఒకటైతే నిజం- మార్కెట్‌ను వెతికి పట్టుకోవడంలో, విస్తరించడంలో గుజరాతీల పద్ధతే వేరనేది అమిత్ షా, మోడీ ద్వయం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న తీరుచూస్తే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల చట్టబద్ధమైన, న్యాయమైన హక్కులను కాలరాస్తూ నాలుగేళ్లుగా కేంద్రం వంచనకు పాల్పడి అసత్యాలను గోబెల్స్ మాదిరిగా ప్రచారం చేస్తోంది. ప్రత్యేక హోదాను మించి ప్యాకేజీ రూపంలో ఆర్థిక సహాయం ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ‘హోదా’ ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం ఆటంకమని కేంద్ర పాలకులు చెబుతూ వచ్చారు. ఇవన్నీ అసత్యాలని ఈనెల 14న పార్లమెంట్ సాక్షిగానే తేలిపోయింది. రాజ్యసభలో తెదేపా సభ్యుడు సి.ఎం.రమేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ జవాబిస్తూ, ‘ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా కట్టబెట్టవద్దని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల్లో చెప్పలేదని’ అన్నారు. కేంద్రం సాచివేత వైఖరి, వితండ వాదనలతో విసుగు చెందిన తెదేపా ఎన్‌డిఎ నుండి బయటకు వచ్చేసి, మోదీ సర్కారు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టడం ప్రారంభించింది. ప్రత్యేక హోదా కోసం వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు చేపడుతున్న ఆందోళనలకు తెదేపా మద్దతు పలికింది. హక్కుల విషయమై నిలదీస్తున్న ఏపీ ప్రభుత్వంపై బిజెపి ఎదురుదాడులకు దిగడం హేయమైన చర్య. ప్రత్యేక హోదా అనేది అయిదు కోట్ల ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవ సంకేతం.
భాజపా వంచనను, ఎత్తుగడలను ఎండగట్టేందుకు తెదేపా, వైకాపాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. తెదేపా ఆందోళనల ఫలితంగా దేశవ్యాప్తంగా కదలిక వచ్చింది. రాజకీయ పునరేకీకరణకు అవకాశం ఏర్పడింది. అన్నా డిఎంకె, తెరాస సభ్యులు ‘వెల్’లోకి వచ్చి ఆందోళన చేస్తున్నందున అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్న వారి సంఖ్యను లెక్కించలేక పోతున్నాననే సాకుతో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేస్తున్నారు. ఆనాడు రాష్ట్ర విభజన రోజున 111 మంది ఎంపీలు ‘వెల్’లో ఉన్నప్పటికీ, సభ్యులను లెక్కపెట్టి కాంగ్రెస్, భాజపాల మద్దతుతో విభజన బిల్లును గట్టెక్కించిన వైనం ప్రజలు మర్చిపోయారనుకుంటే అది బిజెపి భ్రమ అవుతుంది. విభజన సమయంలో కాంగ్రెస్ కంటే- ఇప్పుడు బిజెపి దారుణంగా మోసం చేసిందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో చెప్పిన అంశాలను అమలు చేయాలని ప్రజలు కోరుతుండగా, ఆ విషయం తప్పించి మిగతా అన్నీ బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు. విభజన చట్టం హామీలు, పార్లమెంట్‌లో ఇచ్చిన ‘హోదా’ హామీని అమలు చేయకుండా అన్యాయం చేసింది చాలక, తెలుగు ప్రజలపై పెత్తనం చేసే ప్రయత్నాలు గర్హనీయం. గతంలో ఇచ్చిన నిధుల వినియోగానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వనందునే కొత్తగా నిధులు కేటాయించలేదని భాజపా నేతలు అనడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేయటం దారుణం.
పోలవరం ప్రాజెక్టులో నిధుల వినియోగంపై విచారణకు కేంద్రం నియమించిన మసూద్ కమిటీ ఎక్కడా నిధుల దుర్వినియోగం లేదని నివేదిక ఇవ్వడం భాజపా, వైకాపాలకు చెంపపెట్టు. ఒక పక్క లోక్‌సభలో అవిశ్వాసం, మరోవైపు మోదీపై విశ్వాసంతో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న వైకాపా నాయకత్వం ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారో చెప్పాలి. పోలవరానికి ఇప్పటివరకు ఇచ్చిన నిధులు రూ.5,364 కోట్లు. నిర్వాసితుల పునరావాసానికి రూ.33వేల కోట్లు చెల్లించాల్సి వుండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యత తనదే అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కేటాయించింది రూ.3,500 కోట్లు మాత్రమే. విడుదల చేసింది రూ.1000 కోట్లు మాత్రమే. కేంద్ర విద్యాసంస్థలకు రూ.11,762 కోట్లు రావాల్సి వుండగా నాలుగేళ్ళలో రూ.576 కోట్లు కేటాయించగా విడుదల చేసింది రూ.119.34 కోట్లు మాత్రమే. తమ హక్కుల కోసం ఏపీ ప్రజలంతా ఉద్యమిస్తుంటే కేంద్రం అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నది. అసంబద్ధ వాదనలతో, అవాస్తవాలతో భాజపా అధ్యక్షుడు అమిత్ షా మార్చి 23న ఏపీ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ ఇందుకు నిద్శనం. ప్రస్తుతం కేంద్రం వ్యవహార శైలితో రాజ్యాంగం ప్రమాదంలో పడింది. చట్టసభల్లో ప్రత్యేక హోదా అంశంపై ప్రతిష్టంభన ఏర్పడింది. పార్లమెంట్ ఔన్నత్యం బిజెపి ద్వారా విస్మరణకు గురవుతుంది. ఇది చాలా ఆందోళన కలిగించే స్థితి. లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ వున్నప్పటికీ అవిశ్వాసంపై చర్చకు కేంద్రం ఎందుకు వెనకాడుతుందో బిజెపి పెద్దలే చెప్పాలి. ప్రధాని మోదీ ఇంకా వౌనం దాల్చడం సరైనది కాదు.
కేంద్ర ప్రభుత్వం ఇంతగా దగా చేస్తున్న ఏపీ సీఎం ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటిస్తూనే నిరసన గళం వినిపిస్తున్నారు. 1.41 కోట్ల తెల్లరేషన్ కార్డులు 19 లక్షల మంది డ్వాక్రా మహిళలు, 59 లక్షల మంది రుణ మాఫీ పొందిన రైతులు, 48 లక్షల మంది ఎన్‌టిఆర్ భరోసా పెన్షన్లు అందిస్తూ తెలుగుదేశం సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం గడచిన 43 నెలల్లో ఏ వర్గానికి చేసిన వాగ్దానం నెరవేర్చే ప్రయత్నాలు చేయలేదు. దేశంలో ఉత్పాదక రంగం పూర్తిగా దెబ్బతినిపోయింది. 2017లో దేశ సంపదలో 56 శాతం అత్యంత సంపన్నులైన ఒక్క శాతం మంది దగ్గర పోగుపడిపోయింది. 2018లో సంపదలో 73 శాతం సంపన్నుల దగ్గరకు చేరింది. బ్యాంకులను బడా పెట్టుబడిదారులు ఏ విధంగా లూటీ చేశారో చూసి దేశం నిర్ఘాంతపోయింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ వున్న సమయంలో 25 వేల కోట్ల రూపయల పనుల్లో అక్రమాలు జరిగాయని 2014 జులైలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టి సిబిఐ విచారణ జరపాలని ఆదేశించింది. దీనిపై అతీగతీ లేదు గానీ, ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం చంద్రబాబు నిలదీయగానే బెదిరింపు రాజకీయాలకు బిజెపి పాల్పడటం ఆ పార్టీ దివాలాకోరు రాజకీయానికి నిదర్శనం. ఏపీ ప్రజలంతా రాజకీయ విభేదాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించుకోవాలి. బిజెపి నాయకులు కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తారో, చరిత్ర హీనులవుతారో తేల్చుకోవాల్సిన తరుణం ఇది.

- పోతుల సునీత, ఎమ్మెల్సీ సెల్: 94409 62379