సబ్ ఫీచర్

జీవితానికి దిక్సూచి.. సంస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా సున్నితమైన విషయాలను గురించి ఏదో వ్రాస్తున్నాను. అపార్థం చేసుకోవద్దు. 86 ఏళ్ల వృద్ధాప్యంలో ఈ విషయాలు వ్రాయాలని అనిపించింది. 1963లో జిల్లా మున్సిఫ్‌గా న్యాయశాఖలో ప్రవేశించి, 1990 డిసెంబర్‌లో జిల్లా జడ్జిగా పదవీ విరమణ చేశాను. న్యాయశాఖలో సుదీర్ఘకాలం పనిచేసినందున ఈ విషయాల మీద వ్రాయటానికి కొంత అధికారం, అనుభవం ఉందనుకుంటున్నాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే- దేశాన్నంతా కదిలించిన అంశం అది. ఈనెల 8న దేశవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. బెంగళూరులో జరిగిన మహిళా దినోత్సవంలో మాజీ డిజిపి సాంగ్లియానా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీ మహానగరంలో కొద్ది సంవత్సరాల క్రితం ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం- ‘నిర్భయ కేసు’గా విశేష ప్రాచుర్యం పొందిన సంగతి దేశమంతటికీ తెలుసు. బెంగళూరులో మహిళా దినోత్సవ సమావేశానికి ‘నిర్భయ’ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీనాథ్ సింగ్‌లు హాజరయ్యారు. ఆ సందర్భంగా మాజీ డిజిపి సాంగ్లియానా ఉపన్యాసంలో చేసిన వ్యాఖ్యానాలు ఎవరికైనా విస్మయం కలిగిస్తాయి. ‘ఆమె (నిర్భయ తల్లి ఆశాదేవి) శరీరాకృతి చాలా బాగుంది.. దానిని బట్టి ఆమె కుమార్తె ఇంకెంత అందంగా ఉండేదో ఊహించుకోవచ్చు.. అంతటి అందమైనవారు దుర్మార్గుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తారు..’ అని ఆయన గొప్పగా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు విన్నాక సభంతా దిమ్మరపోయింది. ఈ ఉదంతంతో సాంగ్లియానా ‘సంస్కారం’ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది గదా!
సాంగ్లియానా ఇంకో సలహా ఇచ్చారు కూడా. మహిళలు తమపై బలత్కారం జరిగినపుడు లొంగిపోయి, ఆ తరువాత కేసులు పెట్టాలని ఆ పెద్దమనిషి ఉచిత సలహా ఇచ్చారు. ఇలా చేస్తే ‘మనం క్షేమంగా ఉండగలుగుదుం, ఒక జీవితాన్ని కాపాడగలం, మనల్ని వాళ్లు చంపకుండా తప్పించుకోగలం.. వాడి జీవితాన్ని కూడా కాపాడి, వాడు చంపబడకుండా చూడగలం..’ అని కూడా ఆయన సెలవిచ్చారు. దీని గురించి ఏమందాం..? ఈ వ్యాఖ్యలపై సమాజంలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కొంతమంది సీనియర్ పోలీసు అధికారులు సైతం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయినా ఆ మహానుభావుడు వెనక్కి తగ్గలేదు, పశ్చాత్తాపం చెందలేదు. సాధారణంగా- ‘అందమైన మహిళలకు ముప్పు ఉంటుందని చెప్పటమే తన ఉద్దేశమని, నిర్భయ తల్లి శరీరాకృతిపై నిజమే చెప్పాన’ని ఆయన అన్నాడు. ఈ వివరణపై మనం ఏమనాలి..?
ఈ సందర్భంగా- కొంత స్వీయానుభవాన్ని నేను వివరించడంలో తప్పు లేదనుకుంటాను. నాకు వ్యక్తిగతంగా సంస్కారం తెలిసి రావడం నా అదృష్టం. మా నాన్నగారు 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో జైలు జీవితం అనుభవించారు. ఆయన భారత స్వాతంత్య్ర రజతోత్సవం సందర్భంగా తామ్రపత్రం అందుకున్నారు. వారికి నేనొక్కడినే సంతానం. అందుకని వారు నాకిచ్చింది స్వల్ప ఆస్తి, అనల్పమైన సంస్కారం. మా తండ్రిగారికి- ‘జాతిపిత’ గాంధీజీ ఖిలాఫత్ ఉద్యమాన్ని తలకెత్తుకోవడం నచ్చలేదు. ఎక్కడో విదేశంలో ఏదో జరిగితే, ముస్లింలంతా పట్టించుకోకపోతే ఆ విదేశీ ముస్లింల సమస్యలను మనం తలకెత్తుకుంటే మన ముస్లింలంతా మన ప్రక్కనున్నారంటే నమ్మబుద్ధి కాలేదు. అయినా మా తండ్రిగారు కాంగ్రెస్‌ను వదలలేదు. ఆ తరువాత చాలాకాలానికి ఆంధ్రలో ఆర్‌ఎస్‌ఎస్ మొదలయితే- నన్ను దాంట్లోకి పంపారు. రోజూ సాయంకాలం ఒక గంట సేపు ఆటపాటలతోపాటు మంచి సంస్కారానికి పునాది పడి నాలో సంస్కారం ఎదిగింది. ఆ సంస్కారమే నా ఉద్యోగ నిర్వహణలో నాకు చాలా సాయపడింది. 1975లో నేను అనుకోకుండా హైదరాబాద్‌కు బదిలీ అయ్యాను సబ్‌జడ్జిగా. నాకు కన్నాభిరాన్ న్యాయవాదిగా పరిచయమయ్యారు. ఆయన ఏదో కంపెనీ తరఫున ఎక్కువగా కోర్టుకు వస్తుండేవారు. 1977లో జిల్లా జడ్జిగా ప్రమోషనొచ్చి శ్రీకాకుళంలో కొద్దిమాసాలు పనిచేసి, తిరిగి హైదరాబాద్‌కు- అడిషనల్ చీఫ్ జడ్జి కమ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్సు జడ్జిగా వచ్చాను. ఆ హోదాలో ‘సికిందరాబాద్ కుట్ర కేసు’గా ప్రసిద్ధి చెందిన నక్సలైట్ల కేసు విచారణకు జడ్జిగా బాధ్యతలు చేపట్టాను. ఆ కేసులో నేను 1977-82 దాకా న్యాయమూర్తిగా ఉన్నాను. అందులో నాటి నక్సలైట్ ప్రముఖులు కొండపల్లి సీతారామయ్య, వరవరరావు, కె.వి.రమణారెడ్డి, సత్యమూర్తి వగైరాలు ముద్దాయిలు. (రమణారెడ్డి, సత్యమూర్తులు ఉన్నారో లేదో నాకు తెలియదు. దాదాపుగా మూడు దశాబ్దాల నాటి పైమాట ఇది) నేను ఆ కేసుకు న్యాయమూర్తిగా నియమింపబడ్డానని తెలియటంతోనే, నక్సలైట్ల న్యాయవాది కన్నాభిరాన్- అంతకుముందు పరిచయముండటంతో, నా తత్వమూ తెలుసు కాబట్టి, ‘నమస్తే సదా వత్సలే మాతృభూమే’ అని ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థన మొదటి చరణం పాడుతూ, నా చాంబర్‌లోకి కాలుపెట్టారు. ఇద్దరం నవ్వుకున్నాం. అప్పుడు స్పష్టంగా చెప్పాను. ‘నేను ఆర్‌ఎస్‌ఎస్ కాబట్టి నక్సలైట్లకు అన్యాయం చేస్తానని మీకు అనుమానముంటే- నేను తప్పుకుంటానండీ’ అన్నాను. ఆయన నవ్వి- ‘అలాంటిదేమీ లేదు’ అన్నారు.
ఇంకో అనుభవం- మరుసటి రోజు మొదటిసారిగా న్యాయస్థానంలో ప్రవేశించాను. కొన్ని చిన్న చిన్న కేసులను వాయిదా వేశాక, అరగంట తరువాత నక్సలైట్ల కేసులోని ముద్దాయిలను ప్రవేశపెట్టారు. తరువాత నేను మొదటి సాక్షిని ప్రవేశపెట్టమనడంతో కోర్టు హాలులో పాట మొదలైంది. ముద్దాయిలంతా- కనీసం 10-15 మందో, ఇంకా ఎక్కువో ఇప్పుడు గుర్తులేదు. ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు..’ అంటూ పాట పెద్దగా మొదలైంది. పోలీసులు వారిని నివారించాలనుకున్నా- వారు పాట పాడడం మానలేదు. ప్రక్క కోర్టుల్లో పని కూడా ఆగిపోయేటంత పెద్దగా అందరూ పాడుతున్నారు.
పోలీసులు నావైపు చూడటం మొదలుపెట్టారు. నేనేం చేయాలి? అంతకుముందు న్యాయమూర్తి గారు, నేను అసలు ఆ కేసు గురించి మాట్లాడుకోలా. వాళ్లని ‘పాట ఆపమ’ని ఆదేశిస్తే- పోలీసులు లాఠీలతో సిద్ధంగా కోర్టు హాలులోకి వచ్చి వాళ్లను బాదవచ్చు కూడా. అప్పుడు పెద్ద రగడవుతుంది. నేను మొదటిసారి ఛార్జి పుచ్చుకున్నా కాబట్టి, పత్రికా విలేకరులు కూడా ఉన్నారని నాకు తరువాత తెలిసింది. అంటే నేను ఏ మాత్రం నా హుందాకు తగ్గినా, పోలీసులు బాదటం, మరుసటి రోజు పత్రికలలో- ‘న్యాయస్థానంలో ముద్దాయిలపై లాఠీచార్జి చేయించిన న్యాయమూర్తి’ అని ఫొటోలు, వార్తలు రావటం తథ్యం.
అప్పుడే- నా సంస్కారం, నాన్నగారి శిక్షణ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం అని అనవచ్చు.. అవన్నీ నాకు మార్గదర్శనం చేశాయి. నేను పోలీసులను దూరంగానే ఉండమని సైగ చేసి, నవ్వుతూ కూర్చున్నాను. వాళ్లయినా ఎంతసేపు పాడతారు? రెండు మూడు చరణాలు పాడి విరమించారు. తరువాత అంతా ప్రశాంతంగా సాగిపోయింది. ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత నాకు బదిలీ అయింది. ఆ కేసులో నేను తీర్పు చెప్పవలసిన అవసరం రాలేదు.
నాటి ముద్దాలలో ఒకే ఒక్క యువతి ఉండేది. మంచి బలంతో, ఆరోగ్యవంతంగా కనపడేది. ఆ కేసులో సాక్షులు అనేక జిల్లాలలో ఉండటంతో, పోలీసులు వారికి సమన్లు జారీ చేసి ఆ గ్రామాల్లో పరిస్థితులు, సాక్షులను ఎవరూ భయపెట్టటానికి అవకాశం లేకుండా చూసుకోవాలి. ఆ తరువాత వారిని కోర్టుకు తీసుకురావాలి. అందుకని మిగతా క్రిమినల్ కేసుల వలే కాకుండా వాయిదాకు, వాయిదాకు మధ్య పోలీసులకు కనీసం 20 రోజుల సమయం ఇవ్వవలసి వచ్చేది. ఇక్కడ ఉదహరించిన యువతి విశేషంతో- ఈ వ్యాసాన్ని ముగిస్తున్నా. ఆ కేసులో కొంతమంది ముద్దాయిలకు బెయిలు ఇచ్చాను. స్ర్తి కాబట్టి ఆమెకూ బెయిల్ ఇచ్చాను. తరువాత 2, 3 వాయిదాలకు ఆమె హాజరైంది. ఆ తర్వాత చూస్తే మనిషిలో చాలా మార్పు కనపడింది. చాలా చిక్కిపోయి ఈసురోమంటూ ఉండేది. పోలీసులను విచారించాను. వారు చెప్పింది... ఆ మహిళకు పాలు తాగే చంటిబిడ్డ ఉంది. అందుకని ఆమెకు ప్రతిరోజూ పాలు తెచ్చి ఇచ్చేవారు. (లీటర్లో లేక- ఆ రోజులలో శేర్లు లెక్క ఉండేదో) దానితో ఆ యువతి చాలా ఆరోగ్యంగా ఉండేది. పైగా పెద్దగా శారీరక శ్రమ లేదు. కాని బెయిల్ మీద బైటికి వెళ్లటంతో ఆమె పరిస్థితి మారింది. కూలీగా ఆమె పొలం పనులు చేయవలసి వచ్చింది. కొద్ది కూలే దొరికేది. మరి రోజుకు తానెన్ని పాలు త్రాగగలిగేదో తెలియదు.
పైగా ఆ యువతి కూలి పనిచేస్తూంటే, ఏ రెండు మూడు రోజుల తరువాతో ఎవరో ఒకరు ఆమెను చూసేవారు. ఓ రైతు మరో రైతు చెవిలో-‘ఆవిడ నక్సలైటు, బెయిలుమీద వచ్చింది, జాగ్రత్త’ అనేవారు. దానితో కూలి పనికి పిలిచిన ఆ రైతు రెండు, మూడు రోజుల తరువాత- ‘అమ్మా! ఏమీ అనుకోవద్దు. నీవు పనికి రావద్దు’ అని దణ్ణం పెట్టి కూలి డబ్బుకు ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి పంపేశాడు! అలా ఆ యువతికి జీవనాధారం పోయింది. అందుకే ఆమె అలా నీరసపడిందని తెలుసుకున్నాను. ఇది విని, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ తడవ ఆమె వాయిదాకు వస్తే- ‘అమ్మా.. నీకీ బాధెందుకు? సరెండర్ అయిపో.. జైలులో హాయిగా ఉండు.. పిల్లపెద్దదయిన తర్వాత వెళ్లు..’ అని చెబుదామనుకున్నా. ఇంతలోనే నాకు బదిలీ అయింది. తరువాత ఆ కేసు, ఆ యువతి సంగతి నాకేమీ తెలియరాలేదు.
అలా అయిదు సంవత్సరాల అనుభవంతో చాలా ప్రపంచ జ్ఞానం నాలో ఏర్పడింది. నా సంస్కారమూ నాకు సాయం చేసింది. నక్సలిజం మీద చదువుదామనే కుతూహలం ఏర్పడింది. ఫలితంగానే కొండపల్లి సీతారామయ్య భార్య వ్రాసిన ‘నిర్జన వారధి’ 2012లో ప్రచురితమైతే- వెంటనే కొని చదివాను. అప్పటి వారిలో ఒక్క వరవరరావు పేరే గుర్తుంది. నా సంస్కారమే, నా ఉద్యోగ జీవితంలో నాకు అండగా సర్వవేళలా నిలబడి నన్ను రక్షించిందనుకుంటాను. చివరగా ఒక్కటే మనవి. మనం పిల్లలకు విద్యాబుద్ధులు, ఉద్యోగాలు, ఆర్థిక విషయాలలో ప్రావీణ్యాలే కాదు, ముఖ్యంగా వారికి సంస్కారాలు నేర్పాలి. అవి ఉంటే జీవితం నడుపుకునే చతురత వారికి ఏర్పడుతుంది. వారు ఇతరులకు కంటకులుగా కనపడరు. సన్నిహితులవుతారు.

-తారానాథ్ (విశ్రాంత జిల్లా న్యాయమూర్తి) సెల్: 94925 28970