సబ్ ఫీచర్

మాతృసేవ భగవంతుణ్ణీ మెప్పిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన భారతదేశం సకల మతాలకు, ఆచార వ్యవహారాలకు నిలయం. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో విశిష్టత ఉంది. మన దేశ సంస్కృతి-సంప్రదాయాలను మిగతా దేశాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. మనం పూజించే దేవుళ్ళూ వాళ్ళకు సంబంధించిన గుళ్ళూ-గోపురాలను చాలా పవిత్రంగా చూస్తాం. అలాగే హిందూ దేవుళ్ళ వాహనాలకు కూడా గొప్ప విశిష్టత ఉంది. విష్ణుమూర్తికి గరుడుడు, శివుడికి నంది అలాగే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఇంకా ముక్కోటి దేవతలకు కూడా వారి వారి వాహనాలు ఉన్నాయి. ఒక్కొక్కరి వాహనానికి ఒక్కో కథఉంది. విష్ణుమూర్తి వాహనం అయిన గరుడుని విశిష్టత ఏమిటో మనం తెలుసుకుందాం!
కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు వినత, కద్రువ. వినత, కద్రువ తమకు సంతానాన్ని అనుగ్రహించమని కశ్యపుని కోరుకున్నారు. ఆయన మీకు ఎటువంటి సంతానం కావాలి అని వారిని అడుగగా కద్రువ వేయి మంది బలసంపన్నులైన పుత్రులను సంతానంగా కోరుకుంటుంది. వినత మహాబలశాలురే కాక బుద్ధిమంతులుగా ఉండే ఇద్దరు పుత్రులను కోరుకుంటుంది. వారికి అండ రూపంలో సంతానం కలుగగా, వాటిని నేతి కుండలలో నిక్షేపించి కాపాడుతుంటారు. కొంత కాలానికి కద్రువకు తన వరానికి తగినట్టూ నాగ సంతానం కలుగుతుంది. 500 సంవత్సరాలు గడిచినా వినత సంతానం కలుగలేదు. కద్రువ సంతానాన్ని చూసి తనకు కలుగలేదనే బాధతో అవివేకంగా ఒక గుడ్డును తానే బలవంతంగా పగులగొట్టింది వినత. తొడల వరకే శరీరం గల శిశువు గుడ్డునుండి వెలువడి వెంటనే పెద్దవాడు అయ్యాడు కాని శరీరాంగాలు కొరవడే ఉన్నాయ. అతడే ‘అనూరుడు’. అనూరుడు తన అంగవైకల్యానికి కారణమైన తల్లిని, అసూయాద్వేషాలకు లోనయ్యా వని కోపం తెచ్చుకుని నీవు నీ సవతికి దాసివైపోతావని శపించాడు. తరువాత తన తప్పు తెలుసుకొని క్షమించమని వినత కోరుకోగా అనూరుడు శాంతించి తన తల్లికి శాప విమోచనం చెపుతాడు. - మిగిలిన రెండో గుడ్డును త్వరపడి పగులగొట్టవలదని, మహాసత్వ సంపన్నుడైన పక్షిరాజు దానినుండి జన్మిస్తాడు. అతని వల్లనే నీకు దాస్యవిముక్తి కలుగుతుందని చెప్పి వెళ్ళి తపస్సుచేసి సూర్యభగవానుని రథసారథి అవుతాడు. ఒకరోజు కద్రువ వినత వ్యాహ్యాళికి వెళ్తారు. వారికి తెల్లని గుర్రం కనిపిస్తుంది. వారు ఇరువురు ఆ గుర్రం తోక తెల్లగా ఉంది అని, కాదు తోక నల్లగా ఉందని వాదించుకుంటారు. తెల్లగా తోక ఉందని వినత, నల్లగా ఉందని కద్రువ వాదించి చివరకు పందెం వరకు వెళతారు. ఆ పందెం ఏమిటంటే దాని తోక నల్లగా ఉంటే నేను నీకు దాసీతనం చేస్తాను. తెల్లగా ఉంటే నేను నీకు దాసీతనం చేస్తాను అని ఒకరికొకరు పందెం వేసుకుంటారు.
అయితే కద్రువ తన కుమారులయిన కాద్రవేయులను పిలిచి సాయంకాలం సమయంలో మీరు నదీ తీరంలో ఒక తెల్లటి గుర్రం విహరిస్తోంది. తన కుమారులను ఆ గుర్రం తోకకు చుట్టి ఉండమని ఆదేశిస్తుంది. దానికి వారు ఒప్పుకోలేదు. దానితో కద్రువ వారిని జనమేజయుని సర్పయాగంలో చనిపోతారని శపించింది. వారు ఆ శాపానికి భయపడి అమ్మచెప్పినట్టు వినడానికి కొంతమంది ముందుకు వచ్చారు. కద్రువ చెప్పినట్టే గుర్రం తోకకు చుట్టుకుని ఉన్నారు.
తిరిగి వినత-కద్రువలు నదీ తీరానికి వచ్చి ఆ తెల్లటి గుర్రం తోకను చూడగా అది నల్లగా ఉంటుంది. దానితో వినత పందెం ప్రకారం ఓడినవాళ్ళు దాసీతనం చేయాలని నియమం ప్రకారం కద్రువకు వినత దాసి అయి ఊడిగం చేస్తుంది. అలా ఆమెకు ఆమె కుమారులకు దాసిగా వేయి సంవత్సరాలు ఊడిగం చేస్తుంది. అప్పుడు రెండవ గుడ్డు నుంచి పక్షిరాజైన గరుడుడు వెలుపలికి వచ్చాడు. గరుడుడు కూడా తన తల్లిలాగానే తన అన్నలైన కాద్రవేయులకు ఊడిగంచేస్తూ తల్లికి తోడుగా ఉంటాడు.
గరుడుడు ఆకాశానికి ఎగురుటకు ప్రారంభించినపుడు ఆయన రెక్కల వేగం నుండి జనించిన గాలికి అటు పర్వతాలు, ఇటు సముద్రాలుకూడా తీవ్రంగా సంక్షోభాన్ని పొంది కంపించాయి. మహాబలిష్టుడైన గరుడుడు గొప్ప తేజస్సుతో ప్రకాశింపసాగాడు. సూర్యతేజస్సును కూడా జయించెడి తేజము ఆయనది. ఆయన ఎగిరివస్తుంటే శ్రేష్టమైన కులపర్వతం ఎగిరి వస్తున్నట్లుగా భాసించింది.
కద్రువ సంతానం అయిన నాగములను తన వీపుపై ఎక్కించుకుని ఆకాశం మీదివరకు విహరించిచేసేవాడు. గరుడుడు ఏనాడు నాగులను తన వీపుపైన కూర్చోబెట్టుకోవడం హేయమైన పని అని భావించలేదు, కాని అది దాసితనం అని అనుకోలేదు. వారు తనకంటే పెద్దవారు అని భావించాడు. అలా ఒకరోజు నాగులను వీపుమీద కూర్చోబెట్టుకుని సూర్యమండలం దగ్గరగా వెళ్ళాడు. దానితో తనవీపుపై ఉన్న నాగులు వాటి శరీరం వేడికి తట్టుకోలేక కింద పడి విలవిలలాడాడు. అందుకు కద్రువ గరుడుడిని చాలా కోపగించుకుంది. అమ్మద్వారా తమ దాస్యం గురించి తెలుసుకొని నాగులను తమకు దాస్యం నుంచి విముక్తి కలుగాలంటే ఏంచేయాలో చెప్పమని అడుగుతాడు. తమకు అమృతం తెచ్చి ఇవ్వమని అమృతం తీసుకొని మీకు దాసీతనంనుండి విముక్తిని కలుగచేస్తామని చెప్పారు.
అప్పుడు గరుడుడు స్వర్గానికి వెళ్ళి అక్కడ అందరిని జయించి అమృతం తీసుకువస్తుండగా విష్ణుమూర్తి గ్రహించి గరుడునితో నాయనా నీవు చాలా పరాక్రమవంతుడివి ఇంద్రున్ని కూడా జయించి అమృతం తీసుకుపోతున్నావు. ఎందుకు అని అడిగితే తన తల్లి ద్యాసం పోగొట్టడానికి అని చెబుతాడు. కాని విష్ణుమూర్తి ఇది నాగులకు ఇచ్చినచో లోకం తలక్రిందులైతుంది. పాముకు పాలు పోసినా ఏమి జరుగునో తెలుసుకదా!నీవు చెప్పినట్లు చేయ అని చెప్పాడు. ఆ అమృతాన్ని పవిత్రమైన స్థలంలో పెట్టి వారిని సముద్రస్నానం చేసి శుచులై వచ్చి తీసుకోమని చెప్పు అని ఉపాయం చెప్పాడు. గరుడుడు నాగులకు అమృతాన్ని ఇచ్చి శుచులై తీసుకోమని చెప్పాడు. వాళ్లు ఎంతో సంతోషపడి గరుడుడిని, వినతను దాస్యం నుంచి విముక్తి చేశారు.
ఆ తరువాత వారు అమృతాన్ని సేవించడానికి స్నానం చేయడానికి వెళ్లగా ఇంద్రుడు వచ్చి అమృతాన్ని వారికి అందకుండా తీసుకొని వెళ్లాడు.
గరుడుడి నీతిన్యాయాలు మాతృప్రేమ చూసి విష్ణుమూర్తి మెచ్చుకుని ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. అపుడు గరుడుడు నిత్యం మీ సేవ చేసే భాగ్యాన్ని కలుగచేయమని కోరుకున్నాడు. అందుకే విష్ణుమూర్తి తన వాహనంగా గరుడుని ఎంచుకున్నాడు. మాతృసేవ భగవంతుని కూడా మెప్పిస్తుంది.
*

- తాల్క ఉషశ్రీ