సబ్ ఫీచర్

కేసీఆర్ చేతిలో మూడు పాశుపతాస్త్రాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అయిదవ అవతరణోత్సవం జరుపుకోబోతోంది. గత నాలుగేళ్లలో తెలంగాణ రూపురేఖలను సమూలంగా తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పవచ్చు. 2017-18లో ఆర్థికాభివృద్ధి రేటు 10.4 శాతం నమోదవుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రకటించారు. అదే సమయంలో జాతీయ జిడిపి 6.6 శాతం మాత్రమే. తెలంగాణ వాసులు గర్వించదగిన విధంగానే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేలా ప్రభుత్వం కృషి చేసింది. వరుసగా ఐదు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన కేసీఆర్ సర్కార్ వద్ద ఇప్పుడు మూడు పాశుపతాస్త్రాలు ఉన్నాయి. ఈ మూడు అస్త్రాలతో ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని, పరిపాలనను శత్రుదుర్బేధ్యంగా మలచుకున్నారు. కొత్త పంచాయితీరాజ్ చట్టం, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అనే మూడు అంశాలు కేసీఆర్ పాలనకు గీటురాయి అని పేర్కొనవచ్చు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పైన పేర్కొన్న మూడు అంశాలు తెలంగాణ దిశ, దశను మార్చనున్నాయి.
ఏ రాజకీయ నేత అయినా ఎన్నికల్లో తన పార్టీ గెలిచి అధికారంలోకి రావాలనుకుంటాడు. ఆ ఆకాంక్ష లేనివారు రాజకీయాల్లో మనుగడ సాధించలేరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొత్తదనం కోసం పాకులాడక తప్పదు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ‘ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల పథకాలను ప్రవేశపెడుతున్నారనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఓటర్లను కచ్చితంగా ఆకర్షించాలి. ఈ పని జరగకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది ?’-అని నిక్కచ్చిగా చెప్పారు. ఓటర్లను దూరం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఉండవు. అధికారం చేతిలో ఉన్నంత వరకు పాలక వర్గాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటాయి. జిడిపి, అప్పులు, రెవెన్యూ లోటు, మిగులు రెవెన్యూ లాంటి పదాలు సామాన్యులకు అవసరం లేదు.
తెలంగాణలో దాదాపు 60 శాతం మంది ప్రజలు గ్రామసీమల్లో నివసిస్తున్నారు. నిర్వీర్యమైన పంచాయితీరాజ్ వ్యవస్థలో తెచ్చిన సమూలాత్మకమైన మార్పుల ఫలాలు సామాన్యుడి చేతికి అందాలంటే కొన్నాళ్లు నిరీక్షించిక తప్పదు. గ్రామ పరిపాలనను బలోపేతం చేసేందుకు నూతన పంచాయితీరాజ్ చట్టాన్ని తెచ్చారు. పంచాయితీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. దీని వల్ల గ్రామాల్లో రాజకీయ వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది. గ్రామ పంచాయితీ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ మూడు నుంచి ఆరు నెలల్లో సమస్యలను పరిష్కరించాలి. పంచాయితీలకు జవాబుదారీతనం ఉండదనే విమర్శలను తిప్పిగొట్టే విధంగా అకౌంట్స్ ఆడిట్ విధానాన్ని తప్పనిసరి చేయాలి. గతంలో పంచాయితీ సమావేశాలు ఎప్పుడు జరిగేవో తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి నెల తప్పనిసరిగా సమావేశం కావాలి. నూతన పంచాయితీరాజ్ చట్టంలో చెక్‌పవర్‌ను సర్పంచ్, ఉపసర్పంచ్‌కు ఉమ్మడిగా కల్పించారు. గ్రామసభను ప్రతి రెండునెలలకోసారి నిర్వహించాలి. తెలంగాణలో 12,751 పంచాయితీలు, గిరిజన పంచాయితీలు 2637 ఉంటాయి. పంచాయితీలకు జనాభా ప్రకారం రూ.3 లక్షలు కనీస గ్రాంటుగా అందుతుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధుల పంపిణీని ఖరారు చేస్తారు. పంచాయితీల పాలన అస్తవ్యస్తంగా ఉంటే, ఎన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా, వాటి ఫలాలు ప్రజలకు దక్కవు. పంచాయితీలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలు, నిధులు, విధులను బదలాయించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తెగువను ప్రదర్శించింది. కొత్తచట్టం అమలులోకి వచ్చి పంచాయితీలకు ఎన్నికలు జరిగాక గ్రామసీమల్లో సుపరిపాలనకు అనుగుణంగా పాలనాపరమైన మార్పులు జరిగే అవకాశం ఉంది.
విద్యుత్ రంగాన్ని పటిష్టం చేయడమే కాకుండా వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్ అందించేలా కేసీఆర్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇది ఇతర రాష్ట్రాలను సైతం ఆకర్షించింది. పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు, గ్రామీణ రంగ నిపుణులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు 24 గంటల విద్యుత్ పథకాన్ని ఆసక్తిగా పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయరంగ సంక్షోభానికి మూలకారణాలపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి. అనేక కమిటీలు సిఫార్సులు చేశాయి. కాని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాలుగేళ్ల లోపే- వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ స్కీంను నిరాటంకంగా అమలు చేస్తోంది. ఈ పథకం ప్రారంభించి వంద రోజులు గడిచినా ఇంతవరకూ ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు. తెలంగాణ విద్యుత్ పరంగా మిగులు రాష్టమ్రేమీ కాదు. 2014లో విద్యుత్ లోటుతో పురుడుపోసుకున్న తెలంగాణ నాలుగేళ్లలో రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అద్భుతమైన ప్రయోగం చేసి విజయం సాధించిందని చెప్పవచ్చు. తొలిదశలో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి. ఇవన్నీ సహజమే. సగటున రోజుకు 10 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నా, ఎలాంటి కోత లేకుండా సరఫరా అవుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 31 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులో ఉండేది. ఇపపుడు 3283 మెగావాట్ల సౌర విద్యుత్ లభిస్తోంది. 2014లో 7,778 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ ఉండగా, ఇప్పుడు 15వేల మెగావాట్లకు చేరుకుంది. వచ్చే ఏడాదిలోగా 28,275 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ పెంచే విధంగా థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఈ నెలాఖరుకు కెటిపిఎస్ 7వ యూనిట్ 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రాబోతోంది. విద్యుత్ సబ్సిడీకి రూ. 5650 కోట్ల నిధులను కేటాయించారు. రాష్ట్రంలో ఈ ఏడాది టిఎస్‌ఇఆర్‌సి 58000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు పచ్చ జెండా ఊపింది. ఇందులో పదివేల మెగా యూనిట్లకు పైగా విద్యుత్ వ్యవసాయానికి సరఫరా అవుతోంది. 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. పారిశ్రామిక, గృహ రంగానికి విద్యుత్ కోతలు లేకుండా, ఖరీఫ్, రబీ సీజన్ అనే తేడాలేకుండా ఈ స్కీంను రెండు పంటలకూ అమలు చేస్తున్నారు.
తెలంగాణలో అక్కడక్కడ పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదనే ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ విషయమై సీఎం కేసీఆర్ దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆరుగాలం కష్టపడే రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోతే అశాంతికి లోనవుతారు. ఈ దిశగానూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ‘ఆకుపచ్చ తెలంగాణ’ సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన బృహత్తర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమైంది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.25వేల కోట్లను సాగునీటి రంగానికి కేటాయించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇంత భారీగా నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశానికే ఒక ఆదర్శంగా నిలువనుంది. గత ఏడాది ప్రాజెక్టులకు రూ.22వేల కోట్లను ఖర్చుపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు 26 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కోటి ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు 36 పెద్ద, మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు ఫ్లడ్ బ్యాంకుల ఆధునీకరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 5మేజర్, 4 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరో 57 ఎత్తిపోతల స్కీంల నిర్మాణం పూర్తయ్యాయి. కేవలం సంక్షేమ పథకాలతో ప్రజలు మెప్పించడం ఏ రాజకీయ పార్టీ వల్ల సాధ్యం కాదు. సంక్షేమ రాజ్యమైనందు వల్ల దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ప్రజల స్థితిగతులను మార్చేందుకు సంక్షేమ పథకాలు ఉపయోగపడుతాయి. ఒక రాష్ట్రం లేదా ఒక దేశం బాగుపడాలంటే లభ్యతలో ఉన్న నీరు సద్వినియోగం జరగాలి. రైతులు ఎదుర్కొంటున్న కష్టాల తీవ్రతను కనీస స్థాయికి తగ్గించాలి. దార్శనికతతో భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయాన్ని సుసంపన్నం చేయాలి. కేసీఆర్ సర్కారు గత ప్రభుత్వాలకు భిన్నంగా విద్యుత్, భారీ ప్రాజెక్టుల విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తోంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097