సబ్ ఫీచర్

4 కోట్ల ప్రజలకు 30 పార్టీలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికారమే పరమావధిగా అన్ని రాజకీయ పక్షాలు భారీగా కసరత్తు చేస్తున్నాయి. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజాచైతన్యం వెల్లివిరియాలని కోరుకునేవారు సైతం రాజకీయ రంగు పులుముకుంటున్నారు, కొత్త పార్టీలు పెడుతున్నారు. తమ బాధ్యతల్ని, చిరకాలంగా చెబుతున్న మాటల్ని మింగేసి అధికార పగ్గాలు చేపట్టాలన్న తాపత్రయంతో బరిలోకి దిగుతున్నారు. తమ శక్తిసామర్థ్యాలు, విశ్వసనీయత ఏమిటి? తమ ట్రాక్ రికార్డు ఏమిటి? అన్న అంశాలన్నీ గాలిలో కలిపేసి సుడిగాలి పర్యటనలతో ప్రజలను ఆకర్షించే యత్నంలో మునిగి తేలుతున్నారు. ‘ఇంత భారం ప్రజలపై మోపడం సమంజసమేనా?’ అని ఏ ఒక్క పార్టీ కూడా తలపోసిన పాపానపోవడం లేదు. తామర తంపరగా పుట్టుకొస్తున్న పార్టీలు, ఫ్రంట్‌లు, పక్షాలన్నీ ప్రజల కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రజల ఆర్థిక వనరులను ఎంతోకొంత కొల్లగొట్టడానికే సిద్ధమయ్యాయి. నాలుగు కోట్ల మంది ప్రజలకు దాదాపు 30 పార్టీల రాజకీయం అవసరమా?- అన్న ప్రశ్న వేసుకోవలసిన సమయమిది.
సంప్రదాయ పద్ధతికి భిన్నంగా ఇప్పుడు ప్రపంచం ‘డిజిటల్ మోడ్’లోకి మళ్ళింది. ఆధునిక ఆలోచనలు అంతటా విస్తరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పల్లెలకూ పాకుతోంది. ఇంకా ముతక ధోరణిలో, పాత మూసలోనే కొనసాగించేందుకు పార్టీలు తాపత్రయపడుతున్న వైనం కనిపిస్తోంది! ప్రజల కోసమే త్యాగాలు చేస్తున్నామని
చెప్పుకునే వామపక్ష తీవ్రవాద పార్టీలు, వామపక్షాలు, పార్లమెంటరీ రాజకీయాలు నడిపే పార్టీలు అన్నీ చందాల రూపంలో, సభ్యత్వం, ఆతిథ్యం, ఆహ్వానం... ఇట్లా అనేక రూపాల్లో ప్రజల జేబులకు చిల్లువేస్తున్నాయి. ప్రాథమిక విషయమేమిటంటే.. ప్రజలు సృష్టించిన సంపదే తప్ప మరో ఆర్థికం అంటూ వేరే ఉండదు. ప్రజల సంపదను వారి ప్రయోజనాలకై ఖర్చుచేయడానికి ఇంత ‘పోటీ’ అవసరమా? రాజకీయ పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు, న్యాయం చెప్పే న్యాయమూర్తులు, ప్రజల చైతన్యమే అత్యంత కీలకమని గొంతు చించుకునే సామాజికవేత్తలు, ప్రజల కన్నీళ్ళను కవిత్వంగా, పాటలుగా మలిచి పొద్దుగడిపే కవులు, కళాకారులు తాముచేస్తున్నదేమిటి?- అని ఒక్క ఘడియ ఆలోచన చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఎంతసేపూ ఎవరి భుజాలపై ఎక్కి ఊరేగుదామా? అన్న యావ తప్ప తమ ప్రయత్నం వల్ల వర్తమాన సమాజంలో పేద ప్రజల జ్ఞాన చక్షువులు విప్పారుతాయా?
పిండికొద్దీ రొట్టె.. ఇది తరతరాలుగా వినిపిస్తున్న మాట. రాష్ట్రంలో సంపద సృష్టి ఏ మేరకు జరుగుతుందో ఆమేరకే అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. కొంత అప్పుచేసి అవసరాలకు ఖర్చుపెట్టవచ్చు. ఇంతకుమించి రాత్రికిరాత్రి లక్షల కోట్లు కుమ్మరించి కర్షకుల, కార్మికుల, వృత్తిపనివారి జీవితాలను మార్చవచ్చని ఎవరైనా భావిస్తే అది భావ దారిద్య్రమే అవుతుంది.
సంపద తమ చేతుల మీదుగా ఖర్చుకావాలన్న పంతమే రాజకీయ పార్టీల్లో కనిపిస్తోంది తప్ప మరో గొప్ప ఆదర్శం, ఆలోచన కనిపించదు. ‘ఇప్పుడు అధికారంలో ఉన్నవారు వేల కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు, అధికార దర్పం వెలగబెడుతున్నారు. రాచరిక పద్ధతులు అనుసరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు..’ అని ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు కొందరు ఆరాటపడటం కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారు వేల కోట్లు వెనకేసుకుంటే దాన్ని బయటపెట్టే మార్గాలు సవాలక్ష ఉన్నాయి. సమాచార హక్కు చట్టం వచ్చాక ఆ మార్గం మరింత సులువైంది. లక్ష కోట్ల బడ్జెట్‌లో వేల కోట్లను వెనకేసుకోవడం ఏ రకంగానూ సాధ్యం కాదు. అనేక చెక్స్ అండ్ బ్యాలెన్స్‌లుంటాయి. ఆడిటింగ్ ఉంటుంది. అనేక పరిమితులుంటాయి. కంప్యూటర్ వ్యవస్థవచ్చాక పారదర్శకత పెరిగింది. అంకెల గారడీకి గతంలో మాదిరి అవకాశాలు తక్కువే. అయినా ఎంతోకొంత అవినీతి జరిగితే దాన్ని సైతం వెలికితీసి బోనులో నిల్చోబెట్టే అవకాశాలను పట్టించుకోకుండా ఏకంగా పాలనాపగ్గాలు వదిలేయాలని ఒత్తిడి పెంచడం, అందులో భాగంగా అప్రజాస్వామిక విధానాలను అవలంబించడం సరైనదికాదు.
పాలనలో పట్టు-విడుపుల గూర్చి అవగాహన లేకుండానే అధికార పగ్గాలు చేపట్టాలన్న కాంక్షతో కొత్త పార్టీలు పెట్టడం వల్ల ప్రజలకే నష్టం జరుగుతోందన్న ‘కోణం’ ఎవరి దృష్టికి రాకపోవడం విడ్డూరం. ప్రజలు సృష్టిస్తున్న సంపద సజావుగా వారి కోసమే ఖర్చవుతున్నదా? పక్కదారి పడుతున్నదా? అన్న విషయంపై దృష్టి నిలపడాన్ని మించిన గొప్ప ప్రజాసేవ మరొకటి ఉండదు. అలా ‘వాచ్‌డాగ్’ పనిచేసేందుకు ఇన్ని పార్టీలు, ఫ్రంట్‌లు, కూటములు కొలువుదీరడం అవసరమా? ప్రజలకేదో మేలుచేసే ఉద్దేశంతో బయలుదేరినా అంతిమంగా అదివారికి భారమవడాన్ని గుర్తించకపోతే ఎలా?
పరిపాలన, సంపద సృష్టి, పంపిణీలోని కీలక అంశాలపై దృష్టిసారించి గరిష్ట స్థాయిలో ప్రజలకు ఎలా మేలుజరగాలో అనే అంశంపై దృష్టినిలిపితే నిజమైన చైతన్యం తొణికిసలాడుతుంది. పుట్టగొడుగుల్లా పార్టీలను, వేదికలను, ఫ్రంట్‌లను ప్రకటిస్తే ఒరిగేదేమీ ఉండదు.
‘ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదు. తమ డిమాండ్లను గుర్తించడం లేదు. తెలంగాణ తెచ్చింది ఎవరో అనుభవించడానికి కాదు’ అన్న మాటలు అపరిపక్వ మానసిక స్థితిని తెలియజేస్తాయి తప్ప మరొకటి కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు ప్రాసంగికత అసలే కనిపించదు. అప్రజాస్వామిక పద్ధతిలో గద్దెనెక్కి తెలంగాణ ఫలాలను పిడికెడు మంది మాత్రమే అనుభవించినప్పుడు అలాంటి మాటలకు మాన్యత ఉంటుందేమో! అసెంబ్లీలో ఆమోదించిన బడ్జెట్‌ను ‘పబ్లిక్ డొమేన్’లో అందరి కోసం పెట్టినప్పుడు- అసహనంతో నినాదాలుచేస్తూ రచ్చచేయడం నాగరికం కాదు. రేపు వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే ప్రక్రియను అనుసరించాల్సిందేకదా? కొన్ని ప్రాధాన్యతలు మారుతాయి తప్ప అద్భుతమేదీ జరగదు! కాబట్టి ప్రజల నైపుణ్యాలు పెంచే ఆలోచనలు అందరూ చేయాలి.

-వుప్పల నరసింహం 99857 81799