సబ్ ఫీచర్

సమాజానికి ధర్మమే దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లోకమాన్య’ తిలక్ గనుక అస్పృశ్యుడిగా జన్మించినట్టయితే- ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని ఉండడు.. ‘అస్పృశ్యత నివారణే నా జన్మహక్కు’ అని ప్రకటించి ఉండేవాడు..
* హిందూత్వమనేది ఎంత సవర్ణ హిందువుల సొత్తో- అంతగా అది ‘అస్పృశ్యులని పిలవబడే’ హిందువుల సొత్తు కూడా. హిందూత్వ భావన ఫలితంగా నిర్మించబడిన దేవాలయాలు అందరికీ అందుబాటులో ఉండాల్సిందే..
* ‘మనుస్మృతి’ దహనం కావలసిందే. సవర్ణ హిందువుల దృష్టిని బలవంతాన ఆకర్షించడానికి అలాంటి తీవ్ర చర్యలు అవసరమవుతాయి. నీవు తలుపు కొట్టనిదే ఎవరూ తలుపులు తెరవరు. మనువు కేవలం మూర్ఖుడని, సాంఘిక శాస్తవ్రేత్త కాడని అనుకోరాదు. ‘మనుస్మృతి’లోని అన్ని భాగాలూ నిందనీయం కావు..
- సామాజిక రుగ్మత అయిన అస్పృశ్యతను అంతం చేసేందుకు జీవితాంతం పోరాడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంతరంగం ఇది...
‘అస్పృశ్యులు’గా ఎంచబడే మెహర్ కులంలో జన్మించి, చిన్ననాటి నుంచి ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్న అంబేద్కర్ స్వయం ప్రతిభతో ఉన్నత చదువులు పూర్తిచేసి- జ్ఞానానికి కులం అవరోధం కాదని నిరూపించారు. అస్పృశ్యత అనేది- అణగారిన వర్గాలను, హిందువులను.. చివరకు జాతినంతటినీ నాశనం చేసిందని ఆవేదన చెందిన ఆయన ‘సమాజం మనుగడకు మతం కాదు ధర్మం అవసరమ’ని చెప్పేవారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ జాతిజనులను సంఘటితం చేయగా, అదే సమయంలో సాంఘక సమానత్వం కోసం అంబేద్కర్ దురాచారాల శృంఖలాలను బద్దలు కొట్టారు.
మహారాష్టల్రోని రత్నగిరి జిల్లా అంబావాడీలో సక్‌పాత్ వంశస్థులైన రామ్‌జీ సక్‌పాత్, భీమాబాయి దంపతులకు పధ్నాల్గవ సంతానంగా భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. పాఠశాలలో చదివే రోజుల్లోనే భీమ్‌రావ్ హృదయంపై కొన్ని సంఘటనలు చెరగని ముద్ర వేశాయి. నడివేసవిలో ఆయన తన సోదరులు, మేనల్లుళ్లతో కలిసి మేనమామ ఇంటికి నాటుబండిలో గోరేగామ్‌కు బయలుదేరి వెళ్లగా కులవివక్షకు గురయ్యారు. మెహర్ కులానికి చెందిన వారని తెలిశాక భీమ్‌రావ్ సహా అందరినీ కిందకు దించేస్తానని బండివాడు తెగేసి చెప్పాడు. ఎంతోసేపు బతమాలగా భీమ్‌రావు అన్న బండిని తోలడానికి, బండివాడు వీరికి దూరంగా నడిచేందుకు అంగీకారం కుదిరింది. ఆ సమయంలో అంటరానివారని భావించి భీమ్‌రావ్ సహా మిగతా పిల్లలకూ ఎవరూ మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఇంకోసారి భీమ్‌రావ్ వీధిలోని పంపువద్ద నీళ్లు తాగుతుంటే- అతని కులం గురించి తెలుసుకుని స్థానికులు తీవ్రంగా కొట్టారు. ఈ రెండు చేదు సంఘటనలతో అంబేద్కర్‌కు కులం అంటే ఏమిటో, తన కులం ఏమిటో తెలిసింది. విద్యాభ్యాసం కోసం రామ్‌జీ కుటుంబం బొంబాయి చేరుకున్నాక, అక్కడి ఎల్ఫిస్టన్ హైస్కూల్‌లో సంస్కృత తరగతిలో భీమ్‌రావ్‌కు ప్రవేశాన్ని నిరాకరించారు. దీంతో ఆయన ఇష్టం లేకున్నా పర్షియన్ తరగతిలో చేరారు. 16వ ఏట వివాహం జరిగాక ఎల్ఫిన్‌స్టన్ కళాశాలలో చేరి, ఆ తర్వాత ఆర్థిక సమస్యల వెంటాడగా బరోడా మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్ నెలకు పాతిక రూపాయల స్కాలర్‌షిప్ ఇవ్వడంతో 1912లో బీఏ పాసయ్యారు. తండ్రి మరణానంతరం మహారాజా ఆర్థిక సాయంతో విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆయన 1913లో న్యూయార్క్ చేరారు. అక్కడి కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి, రోజుకు 18 గంటలు శ్రమించి 1915లో ఎంఏ, 1916లో పిహెచ్‌డి పూర్తి చేశారు. 1916లో లండన్ చేరి ‘లా’లోను, ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్’లో పరిశోధక విద్యార్థిగా శ్రమించారు.
1917లో ‘డాక్టర్ అంబేద్కర్’గా బొంబాయి చేరుకున్నారు. ఆ రోజుల్లో మెహర్ కులానికి చెందిన విద్యార్థి 26 ఏళ్ల వయసులో విదేశీ డిగ్రీ సాధించడం అపూర్వ సంఘటన. బరోడా మహారాజా వద్ద మిలటరీ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరినా కులవివక్ష తప్పక పోవడంతో 1917 చివర్లో తిరిగి బొంబాయి చేరుకుని, 1918లో ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా చేరారు. ఆ తర్వాత కొల్హాపూర్ మహారాజా సాహూ మహరాజ్‌తో పరిచయం ఏర్పడింది. అస్పృశ్యత నివారణకు కృషిచేస్తున్న మహరాజ్‌తో సాన్నిహిత్యం పెంచుకుని, అతని నుంచి అయిదువేల రూపాయలు రుణం తీసుకుని 1920లో అంబేద్కర్ లండన్ వెళ్లారు. 1921లో ఎంఎస్‌సి పూర్తి చేసి, పలు పరిశోధనా వ్యాసాలను లండన్ వర్సిటీకి సమర్పించారు. 32 ఏళ్ల వయసులో ఆయన బార్-ఎట్-లా, పిహెచ్‌డి, డిఎస్‌సి వంటి పట్టాలు పొందినా సొంత గడ్డపై వివక్షను ఎదుర్కొన్నారు. అంబేద్కర్ గృహజీవితమూ అన్నీ కష్టాలే. భార్య రమాబాయి మహాభక్తురాలు. ఇద్దరు కుమారులు మరణించడం, మూడవ కుమారుడికి అనారోగ్యం.. ఇలా ఎన్నో సమస్యలు ఎదురైనా సమాజం కోసం ఆయన ఆలోచించేవారు.
అస్పృశ్యులు కూడా బహిరంగ స్థలాల్లోని మంచినీటి బావులను, ధర్మశాలలను, పాఠశాలలను, ఆస్పత్రులను వాడుకోవచ్చని సంఘ సంస్కర్త ఎస్‌కే బోలే బొంబాయి శాసనమండలిలో తీర్మానం ప్రవేశ పెట్టాక, కులవివక్ష నిర్మూలనకు అంబేద్కర్ వివిధ మార్గాల్లో ఉద్యమం చేపట్టారు. బోలే తీర్మానం ప్రకారం మహద్ పురపాలక సంఘం చౌదరీ చెరువును హరిజనులు ఉపయోగించుకునేందుకు అంగీకరించింది. అయితే, అది తీర్మానంగానే మిగిలిపోగా 1927లో మహద్‌లో భారీగా ఆందోళన జరపాలని దళిత వర్గాలు నిర్ణయించారు. అంబేద్కర్ నాయకత్వంలో నాలుగు వరసల్లో జనం చెరువు వైపు బయలుదేరారు. దేశ చరిత్రలోనే ఇది అపూర్వ దృశ్యం. అంబేద్కర్ చేపట్టిన ఆందోళన ఫలితంగా అణగారిన వర్గాల వారు ఆ చెరువు నీటిని వాడుకునేందుకు అవకాశం కలిగింది. ముస్లింలు, క్రైస్తవులు తాకితే అంటుపడని చెరువు హిందువులైన దళితులు ముట్టుకుంటే మైలపడుతుందా? అన్న ఆలోచన చాలామందిలో మొదలైంది. ఈ నేపథ్యంలో తన మనోభావాలను ప్రజలకు తెలిపేందుకు ‘బహిష్కృత భారతి’ అనే మరాఠీ పక్ష పత్రికను అంబేద్కర్ ప్రారంభించారు. మహద్ పురపాలక సంఘం 1927 ఆగస్టులో తన పూర్వ తీర్మానాన్ని ఉపసంహరించుకున్నపుడు అంబేద్కర్ స్పందిస్తూ- ‘మీ అంతిమాశయం ధర్మమైనపుడు నేను జరిపే సమరం కూడా ధర్మబద్ధమే.. త్వరలోనే సత్యాగ్రహం ప్రారంభిస్తా..’ అని ప్రకటించారు. ఇతరుల మనసులకు బాధ కలిగించడం హంస అయితే, గాంధీజీ సత్యాగ్రహం కూడా హింసావాదమేనని అన్నారు. అస్పృశ్యత యావత్ జాతినే నాశనం చేస్తోందన్నారు. మహద్ సత్యాగ్రహంతో పాటు అమరావతిలోని అంబాదేవి ఆలయ ప్రవేశానికి ఆయన ఉద్యమం నడిపారు. అణగారిన వర్గాల వారు ఆలయ ప్రవేశం చేస్తారని ధర్మకర్తలకు ఆయన నోటీసు పంపారు. ‘ఆచారాలను ధిక్కరించడం సరికాదు’ అని ధర్మకర్తలు పేర్కొన్నప్పటికీ, అమరావతికి వెళ్లి అంబేద్కర్ భారీ సభను జరిపారు. మహద్‌కు సమీపంలోని దాసగామ్‌లో 1927 డిసెంబర్ 25న రాత్రి 9 గంటల సమయంలో జరిగిన సభలో ‘మనుస్మృతి’ని దగ్ధం చేశారు. ఆ మరుసటి రోజున- జిల్లా మెజిస్ట్రేట్ చేసిన సూచనల మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెరువు వద్ద ఆయన ఆందోళన నిర్వహించారు. మహద్‌లో సాంఘిక స్వాతంత్య్ర శంఖరావాన్ని అంబేద్కర్ పూరించగా, అదే వారంలో మద్రాసులో కాంగ్రెస్ పార్టీ సమావేశమై దేశానికి స్వాతంత్య్రం కోరుతూ తీర్మానించింది.
1929లో జలగావ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏ మతమైనా మానవులుగా భావించి సమానావకాశాలు కల్పిస్తే అందులో చేరండని అణగారిన వర్గాలకు సలహా ఇచ్చారు. దీంతో నాసిక్ వద్ద కొన్ని కుటుంబాలు ఇస్లాంలోకి వెళతామంటే- కొన్నాళ్లు ఆగి చూడండని సూచన చేశారు. 1930 మార్చిలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించడానికి ముందే కాలారాం దేవాలయంలో ప్రవేశానికి అనుమతి కల్పించాలని అంబేద్కర్ నేతృత్వంలో సుమారు 15వేల మంది సత్యాగ్రహులు ఆందోళన చేపట్టారు. దీంతో ధర్మకర్తలు ఆలయం తలుపులు మూసివేశారు. శ్రీరామనవమి నాడు రథాన్ని లాగే సందర్భంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అంబేద్కర్‌కు గాయాలు తగిలాయి. తమ పంతం నెగ్గించుకునేందుకు సవర్ణ హిందువులు ఏడాదిపాటు ఆలయాన్ని మూసివేశారు.
లోకమాన్య తిలక్ కుమారుడు శ్రీ్ధరపంత్ తిలక్, విప్లవ వీరుడు సావర్కర్ వంటి ప్రముఖులు సైతం పలు సందర్భాల్లో అంబేద్కర్ ఆలోచనలకు మద్దతునిచ్చారు. 1935 మే 27న భార్య మరణం ఆయనను తీవ్ర వేదనకు గురిచేసింది. ఆ తర్వాత ప్రభుత్వ లా కళాశాలలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎంతమంది సంస్కర్తలు ప్రయత్నించినా సమాజంలో ఎందుకు మార్పు రావడం లేదన్న అంతర్మధనం ఆయనలో మొదలైంది. అదే సమయంలో యొలాలో జరిగిన సభలో సుదీర్ఘంగా ప్రసంగిస్తూ, ‘హిందూమతాన్ని వదిలేసి, ఇంకో మతాన్ని స్వీకరించడం అవసరమెమో తీవ్రంగా ఆలోచించాలి’ అని అన్నారు. చాలా బాధతో గంభీరంగా చివరికి ఒక ప్రకటన చేశారు. ‘నేను మీకు మనః పూర్తిగా హామీ ఇస్తున్నా.. నేను హిందువుగా మరణించను..’ అన్నారు. ఆయన ఇలా మాట్లాడాక ముస్లింలు, క్రైస్తవులతో పాటు కాశీలోని మహాబోధి సొసైటీ వారు తమ మతంలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. సవర్ణ హిందువులు ‘అస్పృశ్యులను కూడా హిందువుల’ని ఎంతవరకూ పిలుస్తారో అంతవరకూ అందరి హక్కులూ సమానమన్నారు. ఆయన ఆందోళనల ఫలితంగా మైసూరు ప్రభుత్వం దసరా ఉత్సవాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించింది. తిరువాన్కూర్ ప్రభుత్వం అణగారిన వర్గాల కోసం 1,600 ఆలయాలను తెరిచింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ సభ సభ్యునిగా రాజ్యాంగ రచనకు విశేష కృషి చేసిన అంబేద్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఒంటరితనాన్ని భరించలేక తన 56వ ఏట బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శారదాకబీర్‌ను వివాహం చేసుకున్నారు. 1951 అక్టోబర్ 11న ఆ పదవికి రాజీనామా చేశారు. బౌద్ధమతం స్వీకరిస్తానని 1956 మేలో ప్రకటించాక పలు పుస్తకాలు రాశారు. బౌద్ధమతం స్వీకరించిన సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, తనది మహాయానం, హీనాయానం కాదని నవయానం అన్నారు. మతం మారదల్చుకున్నపుడు దేశానికి తక్కువ ప్రమాదకారి అయిన దానినే ఎంచుకున్నానని అన్నారు. బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, తన మత మార్పిడి వల్ల ఈ దేశం చరిత్ర, సంస్కృతులు దెబ్బతినకుండా జాగ్రత్తవహించానన్నారు. ‘హిందూమతాన్ని వదిలేస్తున్నాన’ని అన్నపుడు 65 ఏళ్ల వయసులో ఆయన కంఠం గాద్గదికమైంది. ‘బౌద్ధ అంబేద్కర్ హిందూ అంబేద్కరే’ అని సావర్కర్ అన్నారు. హిందూ, బౌద్ధ మతాలు ఒకే వృక్షంలోని శాఖలని ప్రముఖ పండితులు అభివర్ణించారు. పరిపూర్ణమైన ఆత్మతృప్తితో 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. ఆ మహాముని ప్రాణవాయువులు బుద్ధ భగవానునిలో లీనమయ్యాయి. హిందువుగా జన్మించిన ఆయన హిందువుగా మరణించలేదు. ఆయన స్మరణ మనకు ఆదర్శప్రాయం.

- చాణుక్య