సబ్ ఫీచర్

వివక్షపై గళమెత్తిన ధీరవనిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రీకృష్ణునకు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, నాగ్నజితి, కాళింది, లక్షణ అనువారు ఎనిమిది మంది (అష్ట) భార్యలుగా కీర్తించబడుతున్నారు. అష్ట్భార్యలు సృష్టిలో అష్టవిధ ప్రకృతులకు ప్రతీకలు. అష్టమహిషులతో శ్రీకృష్ణ కళ్యాణ వైభవాన్ని మహాకవి పోతన తమ భాగవతంలో అత్యంత మనోహరంగా వర్ణించారు. తరువాతి కాలంలో ప్రసిద్ధ కవులు కొందరు వ్రాసారు. వాటిలో రుక్మిణి, భద్ర, నాగ్నజితీ మరియు లక్ష్మణ పరిణయ గాథలే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉన్నవ జ్యోతివాసుగారి పరిశోధనలలో లభ్యమైన సమాచారం వరకు 17-19 శతాబ్దాల మధ్యకాలంలో ఏడుగురు కవులు ‘నాగ్నజితీ పరిణయ’ కావ్యాన్ని రచించారు. వారిలో శ్రీమతి వేమూరి శారదాంబగారు ఒకరు (19వ శతాబ్దం).
శ్రీమతి శారదాంబ, మే 3, 1881న, ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, మచిలీపట్నం దగ్గరి అల్లూరు గ్రామంలో జన్మించారు. తండ్రి, మహాకవి దాసు శ్రీరాములు, తల్లి జానకమ్మ. తల్లిదండ్రులకు ఏకైక పుత్రికగా, తోడబుట్టిన ఆరుగురు అన్నల ముద్దుల చెల్లెలిగా గారాబంగా పెరిగింది. శారదాంబ బాల్యంనుండే సంగీత, సాహిత్య పిపాసి. ఏకసంథాగ్రాహి. ఆరేళ్ళ చిన్నవయస్సులో పాటలను ఒకసారి వినే అత్యంత శ్రావ్యంగా పాడేవారు.
అది స్ర్తిల పట్ల దుర్భరమైన, దుర్మార్గమైన వివక్ష చూపిస్తున్న కాలం. సంగీతం, నాట్యం వంటి కళలు నేర్చుకునే స్ర్తిలు వేశ్యలే అని భా వించే సాంఘిక వాతావరణం. 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఆంధ్ర దేశంలో సంగీత, సాహి త్య, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ రంగాలను ప్రభావితం చేసిన శ్రీరాములుగారు (1846-1908) స్ర్తిలు సంగీత, సాహిత్యములు నేర్చుకొనేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని దృఢంగా నమ్మినవారు. సమాజ అభ్యుదయానికి, వికాసానికి స్ర్తిలు విద్యావంతులై స్వశక్తి సాధించటము అత్యంత అవసరమని ప్రచారం చేసిన సంస్కరణాభిలాషి.. ప్రచారంతో సరిపెట్టుకోకుండా స్వయంగా ఆచరించి చూపెట్టారు. సంగీత, సాహిత్యాలలో శారదాంబ ఆసక్తి గురించి చిన్న వయసులోనే ఆమెకు తెలుగు, సంస్కృతాలు నేర్పారు. సంగీత విద్య నేర్చుకునటాన్ని ప్రోత్సహించారు. లోకనిందను ఎంతమాత్రము లక్ష్యము చేయలేదు. మంచి వైణికురాలుగా తీర్చిదిద్దారు. బెంగులూరు, మైసూరు వంటి నగరాలలో కచేరీలు కూడ చేయించారు.
శారదాంబకు 1888 మేలో వేమూరి రామచంద్రరావుతో వివాహం జరిగింది. అప్పటి సాంఘిక పరిస్థితులలో, మెట్టినింట తన ఆశయాలకు, ఆకాంక్షలకు, అభ్యుదయ భావాలకు తగిన ఆదరణ కరువైనా, నిరుత్సాహానికి లోనుకాకుండా సాహితీ కృషి సాగిస్తూ పద్నాల్గవ యేటనే పద్యాలు రాయటం ప్రారంభించారు. విద్యావంతురాలైన శారదాంబ, ఆనాటి స్ర్తిలు అనుభవిస్తున్న వివక్ష, ముఖ్యంగా వారికి చదువు నేర్పించకపోవటం, బయటకు రానియ్యకుండా ఇంటికే పరిమితం చేయటం వంటి దురాచారాలపై విమర్శనాత్మక కవితలు, వ్యాసాలు రచించారు. ఆనాటి ‘జనాన పత్రిక’ మరియు ‘జ్ఞానోదయ పత్రిక’వంటి ప్రముఖ పత్రికలలో ఆ రచనలు ప్రచురింపబడ్డాయి. స్ర్తిలను ఈ దుస్థితి నుంచి విముక్తి కలిగించమని దైవాన్ని వేడుకుంటూ శారదాంబ ‘మాధవ శతకము’లో ‘స్ర్తి జనక్షేమార్థిక భగవత్ప్రార్ధన పద్యములు’ రచించారు. పదహారేళ్ళ వయస్సులో ‘నాగ్నజితీ పరిణయము’అను ప్రబంధ కావ్య రచనతో రచయిత్రిగా, కవయిత్రిగా గుర్తింపువచ్చింది. మహాకవయిత్రి మొల్ల రచనాశైలి ఈ కావ్యంలో కనిపిస్తుందని పండితుల మన్ననలను పొందారు.
కోసల దేశాన్ని పరిపాలిస్తున్న నగ్నజితు కుమార్తె సుదంత. ఆమె నాగ్నజితి, సత్యగా కూడా ప్రసిద్ధి. నగ్నజితుని పశుసంపదలో పొగరుబొతులైన ఏడు వృషభాల మదమణచి, లొంగదీసి బంధించిన వీరునకిచ్చి వివాహం చేస్తానని ప్రకటించిన స్వయంవరంలో శ్రీకృష్ణుడు విజయుడై నాగ్నజితిని పరిణయమాడిన కథ ‘నాగ్నజితీ పరిణయము’. వేమూరి శారదాంబ రచించిన ‘నాగ్నజితీ పరిణయము’ మూడు అశ్వాసాల ప్రబంధము. ఈ కావ్యంలో శారదాంబ కవితాకౌశల్యం, సౌరభం వెల్లడించే కొన్ని పద్య కుసుమాలను ఉటంకించుకొని ఆస్వాదిద్దాం.
శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పినట్లుగా నేను చెప్పబోవు ‘నాగ్నజితీ స్వయంవరానికి’ కథాక్రమం ఇట్లా ఉంటుందని ప్రథమాశ్వాసంలో కోసల నగర పౌరుల విశిష్టతని ఎంత అందంగా ఈ పద్యంలో వర్ణించిందో చూడండి.
ఉ. వీరులు నీతిచారులు గభీరులు ధీరులు నర్ధికోటి మం
దారులు ఖడ్గ్ధారులును ధర్మవిచారులు వజ్రహారులున్
శూరులు ప్రేయ సీహృదయ చోరులు నింకఁగడున్మ నోహరా
కారులు తత్పురంబునను గల్గిన రాజకుమారులెంతయున్.
పై పద్యం చదివాక మొల్ల రామయణంలో యమకాలంకార నియమంలో సాగిన ‘‘రాజు లు కాంతియందు రతిరాజులు...’’ పద్యం కవి సూరులకు స్ఫురించకుండా ఉండదు.!
శ్రీమతి వేమూరి శారదాంబకు ఒక కుమార్తె దుర్గాంబ, కుమారుడు పార్ధసారధి. డిసెంబర్ 26, 1899న, కుమారుడు పార్ధసారధిని ప్రసవించి ప్రసూతి సమయంలో 19 సంవత్సరముల చిన్నవయస్సులో ఏలూరులో పరమపదించారు.

- డా.దాసు అచ్యుతరావు సెల్ : 9490023947