సబ్ ఫీచర్

కేంద్రంపై పోరులో.. దక్షిణాది ‘టాగ్’ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక, మతపరమైన అంశాలపై రాజకీయ పార్టీలు కత్తులు దూ స్తున్నాయి. దీంతో పలు సున్నితమైన విషయాలపై ప్రజల్లో వేడి రాజుకుని ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ‘ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీస్ యాక్ట్-1989’పై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా దళితులు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భాజపా పాలిత రాష్ట్రాలు కూడా సుప్రీం తీర్పుపై అసంతృప్తిని నిర్మొహమాటంగా వ్యక్తం చేయడంతో- కేంద్రం ఈ చట్టాన్ని యథాతథంగా అమలు చేసేందుకు ఓ ఆర్డినెన్సును తెచ్చే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. నష్ట నివారణ కోసం సుప్రీం తీర్పుపై ఆగమేఘాలపై స్పందించిన కేంద్రం- ఇదే వైఖరిని ఇతర కీలక అంశాలపై చూపకపోవడం విడ్డూరం.
నిధుల కేటాయంపు విషయంలో దక్షిణాది, ఉత్తరాది అనే భావనలు రాకుండా నివారించడానికి కేంద్రం ప్రయత్నించక పోవడం సరికాదు. కేంద్ర నిధుల కేటాయింపులో 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటామని 15వ ఆర్థిక సంఘం ప్రకటించింది. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కేరళలో సిపిఎం ప్రభుత్వం నిర్వహించిన సదస్సు ఆందోళన వ్యక్తమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. కుటుంబ సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రాల్లో జనాభా తగ్గింది.
సమాఖ్య తరహా రాజ్యాంగ వ్యవస్థ మన దేశంలో అమలులో ఉంది. కేంద్రం, రాష్ట్రాలు పరస్పర సహకారంతోనే ప్రగతి దిశగా పయనిస్తాయి. గతంలో లేని విధంగా ఇప్పుడు రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షతో వ్యవహరిస్తోందంటూ కర్నాటక, ఏపీ సీఎంలు సిద్ధరామయ్య, చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేరళలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సుకు తెలంగాణ, తమిళనాడుల నుంచి ప్రతినిధులు హాజరుకాకపోవడం గమనార్హం. తెలంగాణ సీఎం కేసీఆర్ కేరళ సమావేశానికి తమ ప్రభుత్వం తరఫున ఎవరూ హాజరు కారని కరాఖండిగా ప్రకటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరం కావడంతో ఇక్కడ అన్ని వర్గాలు, మతాలకు చెందిన ప్రజలు స్థిరపడి పన్నులు చెల్లిస్తున్నారు. పైగా దేశ రాజకీయాల్లో ఇక క్రియాశీల పాత్ర పోషించాలన్న లక్ష్యంతో ఉన్న కేసీఆర్ ఈ సమావేశంపై నిక్కచ్చిగా తమ అభిప్రాయం తెలిపారు. కేరళ సమావేశానికి హాజరైన పక్షంలో- ‘తృతీయ ఫ్రంట్’ ఏర్పాటుకు కృషి చేస్తున్న కేసీఆర్ వైఖరిని ఇతర రాష్ట్రాల నేతలు ప్రశ్నించే అవకాశం ఉంది. దేశ సమగ్రత, జాతీయ సమైక్యత తమ లక్ష్యమని తెలంగాణ సీఎం గతంలోనే స్పష్టం చేశారు.
ఉత్తరాది ఆధిపత్యాన్ని అడుగడుగునా ఎండగట్టిన తమిళనాడు ప్రభుత్వం కేరళ సమావేశానికి దూరంగా ఉండిపోయింది. కర్నాటక సీఎం సిద్ధరామమ్య 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు, 15వ ఆర్థిక సంఘం నిర్ణయాలపై నిరసన తెలియచేసేందుకు కేరళ సదస్సును ఏపీ సర్కారు ఉపయోగించుకుంది. ఎన్డీఏ నుంచి తెదేపా వైదొలగి ఉండకపోతే కేరళ సమావేశానికి ఏపీ ప్రతినిధులు హాజరై ఉండేవారు కారన్నది నిజం. ఆర్థిక సంఘాన్ని 280వ అధికరణకు లోబడి కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రతి ఐదేళ్లకోసారి ఈ సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. కేంద్రం, రాష్ట్రాలకు మధ్య పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక సంఘం పంపిణీ చేస్తుంది. దీంతో పాటు గ్రాంట్లను కూడా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఈ సంఘాన్ని గత ఏడాది నవంబర్‌లో కేంద్రం నోటిఫై చేసింది. తమిళనాడు తలసరి ఆదాయం బిహార్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ వ్యత్యాసం ఉండకూడదని, పేద రాష్ట్రాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అద్భుతంగా ఉంటుంది. దీనికి ప్రజల సహకారం కూడా ఎక్కువే.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ప్రభుత్వాసుపత్రులు, పాఠశాలల రంగం నిర్వీర్యమయ్యాయి. దీంతో ప్రభుత్వాసుపత్రులు, పాఠశాలలపై ప్రభుత్వం కేసీఆర్ యంత్రాంగం శ్రద్ధపెట్టింది. కర్నాటకలో ఈ రెండు వ్యవస్థల పనితీరు అంతంత మాత్రమే. ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లో బాగా వెనకబడి ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల యువకులు ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్లి సాంకేతిక విద్యను నేర్చుకుని స్థిరపడతారు. ఉత్తరాది యువకులు ఆర్మీలోచేరి దేశ భద్రతకు అంకితమవుతారు. దేశాభివృద్ధికి రక్షణ ఎంత అవసరమో, సాంకేతిక, తయారీ రంగం అంతే ముఖ్యం. భారతదేశాన్ని ఒక ఉమ్మడి కుటుంబంతో పోల్చవచ్చు. తారతమ్యాలు, వ్యత్యాసాలు ఉంటే కూర్చుని పరిష్కరించుకోవాలి. అంతేకాని కుటుంబ విచ్ఛిన్నానికి దారితీసే చర్యలకు ఉపక్రమించడం దేశ శ్రేయస్సు రీత్యా మంచిది కాదు.
2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకుని నిధులను కేటాయిస్తే కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించినందుకు తమకు తక్కువ నిధులు వస్తాయని, జనాభాను తగ్గించినందుకు తమకు దక్కిన ప్రతిఫలం ఇంతేనా, తమకు ఇంత కంటే మించిన కఠిన శిక్ష ఏముంటుందని దక్షిణాది పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని కొంత మంది కొత్త వాదనను అందుకుంటున్నారు. వాస్తవానికి ఆర్థిక సంఘం నిర్దేశించిన నిబంధనల్లో లోటుపాట్లు ఉంటే సరైన వేదికల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిందే. కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరపడం వల్ల తమకు నిధుల్లో కోత విధించవద్దని కేంద్రంపై వత్తిడి తెచ్చే హక్కు రాష్ట్రప్రభుత్వాలకు ఉంటుంది. కాని దీనికి దక్షిణాది ‘టాగ్’ను తగిలించడం వాంఛనీయ పరిణామం కాదు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న నేతలు కూడా ఇష్టం వచ్చినట్లు ఈ అంశాలపై నోరుపారేసుకోవడం వల్ల మధ్యశ్రేణి, దిగువ శ్రేణి రాజకీయ పార్టీల నేతలకు తప్పుడు సందేశం ఇచ్చినట్లవుతుంది. ఉత్తరాదిన హర్యానా, పంజాబ్, ఢిల్లీకి కూడా ఆర్థిక సంఘం ఫార్ములా వల్ల నిధులు, గ్రాంట్లు తగ్గుతాయంటున్నారు. కాని ఆ రాష్ట్రాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించలేదు. జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది.
ప్రముఖ సినీనటులు కమల్ హసన్, పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశారు. వీరు ఈ మధ్య కాలంలో తరచుగా దక్షిణాది పట్ల ఉత్తరాది వివక్ష అంటూ రకరకాల ప్రకటనలు చేశారు. సున్నితమైన అంశాలపై అనుమానాలు రేకెత్తించే విధంగా రాజకీయ నేతలు మాట్లాడితే రాత్రికి రాత్రి మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పేరు వచ్చేస్తుంది. పాపులారిటీ కోసం చేసే ప్రకటనలు, సందేశాల వల్ల దేశ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. మనకు ఆర్థిక రంగ నిపుణులకు కొదవలేదు. వారితో మాట్లాడి సదస్సులను నిర్వహించి, నిధుల కేటాయింపులో వివక్షకు లోటులేకుండా కేంద్రంపై వత్తిడి తేవచ్చు. ఇక్కడ దక్షిణాది, ఉత్తరాది అనే ప్రస్తావన అవసరం లేదు.
దేశంలో ఆంతరంగిక భద్రతకు సవాలుగా మారిన నక్సల్బరీ ఉద్యమం పశ్చిమబెంగాల్‌లో పురుడు పోసుకున్నా, ఉమ్మడి ఆంధ్రలో బలమైన పునాదులు ఏర్పాటు చేసుకుంది. కాలదోషం పట్టిన వామపక్ష తీవ్ర వాద సిద్ధాంతం వల్ల పెద్ద సంఖ్యలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన నక్సలైట్లు, సాధారణ పౌరులు, పోలీసు అధికారులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలు బలయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ నుంచి నక్సలైట్ల ఉద్యమాన్ని గ్రేహౌండ్స్ పోలీసులు తరిమేశారు. కాని దండకారణ్యం కేంద్రంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు విస్తరించింది. దీనిని నిర్మూలించేందుకు కేంద్రం పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు, నక్సలైట్లు, పౌరులు మారణకాండలో అమరులవుతున్నారు. ఉత్తరాదిలో నక్సలైట్ల ఉద్యమం లేదే. కాని ప్రస్తుతం ఉత్తర భారతం, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు నక్సల్స్ కోసం గాలింపుచర్యల్లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల సహకారం లేకుండానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు నక్సలైట్ల ఉద్యమాన్ని బలహీనపరిచాయా? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లేని ‘సౌత్’, ‘నార్త్’ ప్రస్తావన తాజాగా తెరపైకి తీసుకురావడానికి కారణమేంటి ? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కర్నాటక సీఎం సిద్ధరామయ్య నోరెత్తేవారా? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా నాలుగు ఓట్లు రాల్చుకునేందుకు ప్రతి అంశాన్నీ రాజకీయం చేసి లాభపడాలనుకునే ధోరణికి రాజకీయ పార్టీలు స్వస్తి చెప్పాలి. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని ఎదిరించడం వల్ల సర్కారియా కమిషన్ ఏర్పాటైంది. కేంద్రంపై ధ్వజమెత్తినప్పటికీ ఆయన ఏనాడూ ‘దక్షిణాది, ఉత్తరాది’ అనే ప్రస్తావన తీసుకురాలేదు. కాగా, ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌పై బురదజల్లే విధంగా ప్రకటనలు చేయడం తగదని, జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా నిధులు ఇవ్వాలని కేంద్రం సూచించిందని మోదీ స్పష్టం చేయడం ముదావహం.

-కె.విజయ శైలేంద్ర 98499 98097