సబ్ ఫీచర్

విజయాదిత్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కఠోర శ్రమ, నిరాడంబరత, వినయం, నిర్దిష్ట పథకాల రూపకల్పన, ఆయన పలికే ప్రతిమాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ భారతీయ తాత్విక దృష్టి, ముఖ్యంగా గీతానుసారం కర్మ సిద్ధాంత ప్రభావం- వెరసి తెలుగు సినిమా నిర్మాత, బాబా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి సుపరిచితులు.
బి.నాగిరెడ్డి 1919వ సంవత్సరం డిసెంబర్ 2న కడప జిల్లా పొట్టింపాడు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఆ పల్లెటూరు పాఠశాలలో పురాణసంహిత పాఠ్యాంశాలేగాక, ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలో బోధించేవారు. ప్రాచీన గ్రంథాలలోని సూక్తులు, సుభాషితాలు పిల్లలకు కంఠస్తం చేయించేవారు. బి.నాగిరెడ్డి పనె్నండేళ్ల ప్రాయంలోనే ఆకళింపు చేసుకోగలిగారు. ఆయన ఆలోచనా విధానంలో నూతనత్వం చోటుచేసుకుంది. మద్రాసుకు వెళ్లి హైస్కూలు చదవుతూండగానే ఆయన కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాపార బాధ్యతల్ని చేపట్టవలసి వచ్చింది. వ్యాపార నిమిత్తం బర్మాకు వెళ్లవలసి వచ్చినపుడు, అక్కడ రెండో ప్రపంచయుద్ధం సంభవించినందువల్ల వ్యాపారం ఆర్థికంగా దెబ్బతీసింది. మళ్లీ ఆయన కొత్త వ్యాపారంమీద దృష్టి మరల్చి ప్రింటింగ్ ప్రెస్‌ను పెట్టారు. క్రమేణా అది ప్రచురణ రంగానికి దోహదం చేసింది. తత్ఫలితంగా ఏర్పడిందే ‘ఆంధ్రజ్యోతి’ అను సామాజిక రాజకీయ పత్రిక. ఆయన స్వాతంత్రోద్యమంపట్ల ఆకర్షితులయ్యారు. ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నారు. పత్రిక నెలకొల్పిన అనంతరం చక్రపాణి పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి పిల్లలకోసం ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకురావాలని నిశ్చయించుకుని ‘చందమామ’ మాస పత్రికను తెచ్చారు. దేశం స్వాతంత్య్రం పొందడానికి ఒక నెల ముందుగానే పత్రిక ఆవిర్భావం జరిగింది. ‘చందమామ’ దిన దిన ప్రవర్థమానం కాసాగింది. ఆ తర్వాత నాగిరెడ్డి సినిమా రంగంవైపు దృష్టి మరల్చారు.
మొదట్నుంచీ పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి వుంది. ఆయన అన్నగారైన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి స్థాపించిన వాహినీ స్టూడియోకు భాగస్వామి అయ్యారు. వ్యాపారంలో నష్టం రావడంతో నాగిరెడ్డి తన స్వంత గ్రామమైన పొట్టింపాడుకు చేరారు. వాహిని స్టూడియో ద్వారా ‘్భక్తపోతన’ సినిమాకు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి నాగిరెడ్డిని మద్రాసుకు పిలిపించి చిత్రం తాలూకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పారు. అదే సమయంలో బాలనాగమ్మ విడుదలైంది. జెమినివారు ప్రచారానికి పెద్దపీట వేస్తారు. దీనికి ధీటుగా నాగిరెడ్డి మద్రాసులో భారీ హనుమంతుడి కటౌట్లు పెట్టించడంతో ఆ చిత్రం విజయానికి దోహదపడింది. 1950లో బి.నాగిరెడ్డి నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి విజయా ప్రొడక్షన్స్‌ని స్థాపించారు. విజయుడనేది అర్జునుడి బహువిధ పేర్ల లో ఒకటి. విజయా న్ని సూచించే ఆ పేరు నే తన సంస్థకు ఎన్నుకున్నారు నాగిరెడ్డి. ఆ పేరే విజయాధినేతగా మార్చింది. జెండాపై కపిరాజు అన్న రీతిన హనుమంతుడి బొ మ్మ రెపరెపలాడుతూ ఉంది. విజయా ప్రొడక్షన్స్‌లోమొదటి చిత్రం ‘షావుకారు’. ఈ చిత్రం ద్వారా జానకికి షావుకారు ఇంటిపేరుగా మారిపోయింది. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1950లో నిర్మించబడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి అభ్యుదయ భావాలుగల చిత్రంగా, పునాదిరాయిగా వాసికెక్కింది. అయితే ఈ సినిమాలోని కొత్త భావాలను ఆదరించలేకపోయారు. ప్రేక్షకులనుంచి స్పందన రాకపోవడంతో ఓటమిపాలైంది. తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘పాతాళభైరవి’ తీశారు. జనం విరగబడి చూశారు. మళ్లీ మళ్లీ చూశారు. ఇది కనీవినీ ఎరుగని ఘనవిజయం సాధించింది. సినిమాలోని పాత్రలు తోటరాముడు, భేతాళ మాంత్రికుడు, అంజిగాడు, సదాజప, రాణిగారి తమ్ముడు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాయి. కె.వి.రెడ్డికి ఎస్‌విఆర్ దొరికాడా? ఎస్‌విఆర్ కె.వి.రెడ్డి ద్వారా భేతాళ మాంత్రికుడి పాత్రకు జీవం పోశాడా అన్నట్టుంది. ఆ తర్వాత ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లో నిర్మించబడింది. విజయవావారి మూడవ చిత్రం ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రిలతోబాటు బాలనటుడిగా నటించిన మోహన్ కందాకు మంచి పేరు వచ్చిన సినిమా ‘పెళ్లిచేసి చూడు’. ఈ చిత్రం బాగా లాభాలను ఆర్జించింది. వీటి తర్వాత విజయా సంస్థలో దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేస్తున్న కమలాకర కామేశ్వరరావుతో ‘చంద్రహారం’ తీశారు. ఇది 1954లో విమర్శకుల మన్ననలను అందుకుంది కానీ ప్రేక్షకులు సినిమాను తిప్పికొట్టారు. నాటినుంచి నేటివరకు తీసిన చిత్రాల్లో మిస్సమ్మ, మాయాబజార్ నిస్సందేహంగా ప్రపంచ స్థాయి చిత్రాలు. తర్వాత వచ్చిన అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ సాంఘిక వినోదాత్మక చిత్రాలే. కీర్తిని ఆపాదించాయి. ఆ తర్వాత వచ్చిన విజయా వారి చిత్రాలు ఆ స్థాయిని నిలుపలేకపోయాయి. విజయా సంస్థ నుండి వచ్చిన తదుపరి చిత్రాలు సిఐడి, జగదేకవీరునికథ, సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీ శంకరుల కథ చిత్రాలకు ఎన్‌టిఆర్ కథానాయకుడైతే, గంగ-మంగకు శోభన్‌బాబు, కృష్ణలు కాగా, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రానికి కృష్ణ హీరోగా నటించారు.
చక్రపాణి మరణించిన తరువాత బి.నాగిరెడ్డి చాలాకాలం వరకు సినిమాలు నిర్మించలేదు. విజయా బ్యానర్‌మీద 1990లో రజనీకాంత్‌ను హీరోగా పెట్టి ‘విజయ’ అనే చిత్రం తీశారు.
విజయా సంస్థతో అనుబంధమున్న తారాతోరణం విశాల దృక్పథం కలది. విజయా సంస్థ ఏర్పడిన నాటినుంచీ ఉమాచండీ గౌరీ శంకరుల కథ వరకు ప్రతి చిత్రంలో హీరో రామారావే. ఎస్‌విఆర్, సూర్యకాంతం, రేలంగి, రమణారెడ్డిలు విజయా సంస్థ ఆస్థాన నటులు. ఇతర చిత్రాల్లో హీరో వేషం వేయడంకంటే విజయా ప్రొడక్షన్‌లో ఎక్స్‌ట్రా పాత్ర దక్కడం మహాభాగ్యం అనుకునేవారు. అక్కినేనికి విజయా వారి మిస్సమ్మ చిత్రంలో పూర్తిస్థాయి హాస్య పాత్ర లభించింది. మాయాబజార్ తరువాత ఆయన గుండమ్మ కథలో సహ నాయకుడి పాత్ర లభించింది.
విజయా సంస్థ తమిళంలో పాతాళభైరవి, కల్యాణం పన్నిపార్ (పెళ్లిచేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయాబజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్ళై (సురేష్ ప్రొడక్షన్స్) తొలి సినిమా రాముడు -్భముడు, హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రామ్ ఔర్ శ్యామ్ (రాముడు -్భముడు), జూలీ, కన్నడ, సింహళీ భాషల్లో కూడా కొన్ని సినిమాలు తీశారు. కె.వి.రెడ్డి పిలుపు అందుకొని మద్రాసుకు తిరిగొచ్చిన ‘్భక్తపోతన’కు పనిచేస్తున్న కాలంలోనే తన తమ్ముడైన బి.ఎన్.కొండారెడ్డి పేరుమీద బి.యన్.కె ప్రెస్ ప్రారంభించారు నాగిరెడ్డి. ఆ ప్రెస్ నుంచే ఆంధ్రజ్యోతి అనే సాంఘిక, రాజకీయ పత్రికను ప్రచురించారు. అందున ప్రచురించిన ‘చందమామ’ పత్రిక అగ్రగణ్యమైనది. తొమ్మిదేళ్ళ పిల్లలకోసం జూ.చందమామ అను ఆంగ్ల మాస పత్రిక, జూ.క్వెస్ట్ పిల్లలకోసం ఇంగ్లీషులో - స్పూత్నిక్, ది హెరిటేజ్ మనోజ్‌దాస్ సంపాదకత్వంలో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని గురించి తెలియజేసే ఆంగ్ల మాసపత్రిక. ఈ పత్రికలు కొంతకాలం బాగా నడిచి ఆగిపోయాయి.
బి.ఎన్.రెడ్డి మద్రాసులోని వడపళనిలో విజయా హాస్పిటల్, విజయా హార్ట్ ఫౌండేషన్, విజయా హెల్త్ సెంటర్ ప్రారంభించారు. బెంగుళూరులో ప్రసిద్ధ కంటి ఆసుపత్రి శంకర నేత్రాలయ కూడా విజయ హాస్పిటల్ ఆవరణలోనే ప్రారంభమైంది.
ప్రచురణ రంగం నుంచి వైద్య రంగం నుంచి - సినిమా రంగం నుంచి- కుటుంబ వ్యాపార రంగం నుంచి వివిధ కోణాల విశేష కీర్తి గడించిన బి.ఎన్.రెడ్డి 2004 ఫిబ్రవరి 25న జీవిత రంగం నుంచి నిష్క్రమించారు.

గుర్తింపు-గౌరవాలు

* 1987లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
* టి.ఎం.ఎ.పాయ్ అవార్డు
* రఘుపతి వెంకయ్య అవార్డు, * 1972లో తమిళనాడు ప్రభుత్వంచే ‘కలైమామణి’ అవార్డు
* శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు
* ఫిలిం డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా రెండుసార్లు
* సౌత్ ఇండియా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా నాలుగుసార్లు
* 1980-83 మధ్యకాలంలో టిటిడి ట్రస్టు బోర్డు అధ్యక్షుడిగా..
* నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపకుడిగా కూడా చేశారు.

-సయ్యద్ జహీర్ అహ్మద్