సబ్ ఫీచర్

మోదీని ఢీకొట్టలేక.. హిందువులపై దాడులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పేరు మమతా బెనర్జీ.. మనసంతా హిందువులపై ద్వేషమే.. కమ్యూనిస్టుల పాలనలోనూ బెంగాల్‌లో ఇంతటి హింస జరగలేదేమో! ప్రధాని మోదీపై వ్యతిరేకతను మమత హిందువులపై చూపిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు మోదీ చేసిన సూచనలు మీడియాలో ప్రసారం కానీయకుండా ఆమె అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే- తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాత్రికేయులను చితకబాదుతున్నారు. బెంగాల్‌లో హిందువులపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నట్టు ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా అసన్‌సోల్‌లో పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. హిందువుల ఊరేగింపుపై జరిగిన దాడిలో ముగ్గురు చనిపోయారు. బిజెపి ఎంపీ బాబుల్ సుప్రియో పరిస్థితిని చూడడానికి వెళితే ఆయనను నిర్బంధించింది పోలీసు యంత్రాంగం. అసన్‌సోల్ లోక్‌సభ స్థానంలో భాజపా గెలిచినప్పటి నుంచీ మత కల్లోలాలు సృష్టిస్తున్న విద్రోహశక్తులను అణచివేయడానికి బదులు మమత ప్రభుత్వం హిందువులపై దాడులను పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. హిందువుల పక్షాన భాజపా పోరాడుతున్నా ఫలితం కనిపించడం లేదు. రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ మాటల్ని సైతం మమత పెడచెవిన పెడ్తోంది. పైగా ఆయనే తనను బెదిరిస్తున్నారంటోంది. కేసరినాథ్ త్రిపాఠి గతంలో యుపిలో బిజెపి సదస్యుడు కావడమే అందుక్కారణం.
బదురియాలో ఒకప్పుడు అంతా కలిసి జీవించేవారని, ఇప్పుడు జరుగుతున్న హింస రాజకీయ ప్రేరితమని సామాన్య ప్రజలంటున్నారు. పోలీసుల నిష్క్రియతను కూడా ప్రజలు దూషిస్తున్నారు. ఉత్తర పరగణాలోని ప్రాంతాలకు కేంద్రం అదనపుపారా మిలిటరీ దళాలను తరలించినా స్థానిక పోలీసులు యంత్రాంగం వారిని రానీయడం లేదు. సొంత ఇళ్లను వీడి హిందువులు శరణార్థ శిబిరాలను చేరుకుంటున్నారు. రాణీగంజ్, పురూలియా జిల్లాల్లో హింస ప్రజ్వరిల్లింది. హిందువులైన వ్యాపారస్థుల దుకాణాలను దుండగులు తగులబెట్టారు. రామనవమి ఊరేగింపులను మమతా బెనర్జీ నిషేధించడమే ఇందుకు కారణం. పోటీగా తృణమూల్ కాంగ్రెస్ కూడా రామనవమి ఊరేగింపులు జరిపింది. మొదటిసారిగా అనేక చోట్ల లక్షలమంది హిందువులు ఊరేగింపులో పాల్గొనడం మమతకు ఇబ్బందికరమైంది. ఒక పోలీసు అధికారి ఈ సందర్భంగా జరిగిన హింసలో చేతిని కోల్పోయారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను కేంద్రం అడిగింది. మరోవైపు ‘ఫేస్‌బుక్’లో పొంతనలేని ఫొటోలు అగ్నికి ఆజ్యం పోశాయి. కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు వాస్తవాలను ప్రజల మందుంచేందుకు ప్రయత్నించాయి. తృణమూల్ కాంగ్రెకు చెందిన ముస్లిం వర్గాల ప్రోద్బలమే అల్లర్లకు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. తూర్పు రైల్వేలకు చెందిన కొన్ని రైళ్ళ రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఇంత జరుగుతున్నా మమతకు చీమకుట్టినట్టు లేదు. ఢిల్లీలో కొందరు నేతలతో థర్డ్‌ఫ్రండ్ గురించి, తాను ప్రధాని పదవిని కైవసం చేసుకునే అంశంపై ఆమె తరచూ చర్చలు జరుపుతున్నారు. ఈ దేశంలో మైనారిటీల రక్షణ కోసం మైనారిటీ కమిషన్ ఏర్పాటైంది. కానీ మెజారిటీలైన హిందువుల రక్షణ కోసం ఎలాంటి కమిషన్ లేదు. హక్కుల సంఘాల వాళ్లెవరూ బెంగాల్ హింస గురించి మాట్లాడరేం? యుపిలో మూడేళ్ళ క్రితం గోమాంసం భక్షించారన్న నేరంపై ఒక మైనారిటీ మతస్థుడు హత్యకు గురైతే విపక్ష నాయకులంతా గోలగోల చేశారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు గగ్గోలు పెట్టారు. ఇపుడు బెంగాల్ హింసపై వారెవరూ మాట్లాడరేం?
నిజానికి మోదీ ప్రధాని అయిన తరువాత ‘మైనారిటీల జాతీయ కమిషన్’ నివేదిక ప్రకారం మైనారిటీల ఫిర్యాదులు తగ్గాయి. 2017-18లో అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే అతి తక్కువగా 1498 ఫిర్యాదులు కమిషన్‌కు అందాయి. ఇందులో 1128 ముస్లింల నుంచి, క్రైస్తవుల నుంచి 100, సిక్కుల నుంచి 83, జైనుల నుంచి 48, బౌద్ధుల నుంచి 22 ఫిర్యాదులున్నాయి. సుప్రీం కోర్టు యిచ్చిన అనేక తీర్పులననుసరించి ముస్లింలు, క్రైస్తవులు, పారసీలు, యూదులు కాని వారంతా హిందువులే. మైనారిటీ జాతీయ కమిషన్ అధ్యక్షుడు సయ్యద్ ఘారుల్ హసన్ ఆమధ్య మాట్లాడుతూ, ఫిర్యాదులు తగ్గడానికి మోదీ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపులో ఉండడమే కారణమని కితాబిచ్చాడు. కానీ, బెంగాల్‌లో హిందువులపై దాడులకు సంబంధించి ఫిర్యాదులు వినే నాథుడే లేడు. ఈ దాడులు చేస్తున్న మూకలు బంగ్లాదేశ్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తాయి. బాంబులు తయారుచేస్తారు. నకిలీ ఓట్లను ముద్రిస్తారు. ఈ సమాచారమంతా పోలీసులకు తెలుసు. కాని మమత వారి చేతులు కట్టిపడేసింది. ఈ తీవ్రవాద మూకలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది.
1905 జూలై 19న ఆంగ్లేయులు బెంగాల్‌ను విభజించారు. తేలికగా భారత్‌ను పరిపాలించవచ్చనుకున్నారు. కాని వందేమాతర ఉద్యమం దేశం దశ దిశలా వ్యాపించింది. ఆంగ్లేయ ప్రభుత్వ లార్డ్ హార్టింజ్ దిగి వచ్చాడు. బెంగాల్ విభజన 1911లో రద్దయింది. 1946 ఆగస్టు 16, జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్ దేశాన్ని విభజించాలన్న కోరికను ముందుంచి ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చింది. కలకత్తాలో హింస ప్రజ్వరిల్లింది. కొన్ని గంటల్లోనే అనేక వందల మంది హిందువుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 71 ఏళ్ళ తరువాత మళ్ళీ మతం ఆధారంగా మమత రాజకీయం చేస్తోంది. ఆశ్చర్యకరంగా బెంగాల్‌లో హిందువుల సంఖ్య తగ్గిపోతోంది. మదరసాలను ప్రోత్సహిస్తున్న మమత జాతీయవాద పాఠశాలలను, విద్యాసంస్థలను ఇబ్బందులకు గురిచేస్తోంది. హిందువుల ఉత్సవాలపై నిషేధం విధిస్తూ ముస్లిం మతస్థుల పండుగలకు ప్రోత్సాహమిస్తోంది. 1951లో 78.54% వున్న హిందువుల జనాభా 2011లో 70.5; అయింది. 1951లో 18.63% వున్న ముస్లిం జనాభా 2011లో 27% అయింది.
గతంలో మాల్దా, కాలియాబన్‌లలో జరిగిన హింసకు కారణం- జీహాదీలకు మమత ప్రోద్బలమివ్వడమేనని తేలింది. కొన్ని రోజుల క్రితం మమతాబెనర్జీ ప్రభుత్వం కలకత్తాకు 50 కి.మీ. దూరంలో సరస్వతీ వందనాన్ని నిషేధించింది. విజయదశమి రోజు సాయంత్రం 4 గం. తరువాత దుర్గాదేవి ప్రతిమల నిమజ్జనాన్ని నిషేధించింది. తరువాతి రోజు ‘మొహరం’ కావడమే యిందుక్కారణం. కలకత్తా హైకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ‘విద్యాభారతి’ సంస్థ బెంగాల్‌లో 350 పాఠశాలలు నడుపుతోంది. మమత వీటిపై ఆక్రోశం వెళ్ళకక్కింది. ఈ స్కూళ్లలో సిబిఎస్‌ఇ మాధ్యమంగా సిలబస్ వుంటుంది. వీటిలో 125 స్కూళ్ళకు మమత ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఈ స్కూళ్ళల్లో ‘అసహిష్ణుత’ను బోధిస్తారని మమత ఆరోపణ. ప్రభుత్వం యిచ్చిన నోటీసులకుఈ స్కూళ్ళ యాజమాన్యాలు ప్రత్యుత్తరమిచ్చినా అవి సరిగా లేవని ఆ పాఠశాలలను మూసివేయమని మమతా బెనర్జీ ఆదేశాలు జారీచేసింది. వీటిలో అనేక మంది ముస్లిం విద్యార్థులు కూడా చదువుతున్నారు. వారిని కొందరు విలేకరులు ప్రశ్నిస్తే- తమకు పాఠశాల చాలా బావుందన్నారు. మమత తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కూడా నిరసించారు. మదర్సాలకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈ సంతుష్టీకరణ రాజకీయం హిందువుల ఆక్రోశానికి కారణభూతమవుతున్నది. మెజారిటీ ప్రజల భావనలకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రభుత్వాలకు పట్టినగతే మమతకు కూడా పడ్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపికి లభించిన విజయంతో మోదీకి పెరిగిన ప్రతిష్ఠతో మమత తీవ్ర నిరాశకు గురైంది, నిశే్చష్ఠురాలయ్యింది. ఆమెను బిజెపి భయం ఆవహించింది. ఆమెలో తర్కాతర్క విచక్షణ నశిస్తున్నది. కలకత్తాలో తమకోటను రక్షించుకునేందుకు ప్రయత్నించడానికి బదులు ఆమె ఢిల్లీలోని ఎర్రకోటపై ఆశలు పెట్టుకుంది. అందుకు విభజన రాజకీయం ఎందుకుంది. బెంగాల్ ప్రజల రక్తం దేశభక్తుల చరిత్రలతో ఓతప్రోతమయినది. గతం నాస్తి కాదు. అది అనుభవాల ఆస్తి.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 96761 90888