సబ్ ఫీచర్

అందం... ముందర కాళ్ళకు బంధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో నటించాలంటే నటన ఒక్కటి వస్తేనే చాలదు. నటనతోపాటు అందం, అభినయం ఇవి రెండూ ఉండాలి. ఇవి ఉన్నాకూడా ఒక్కోసారి అవకాశాలు వచ్చినా వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంటాయి. హీరోలయినా, హీరోయిన్లయినా, ఎలాంటి పాత్రలు పోషించేవారయినా సరే భౌతికంగా అందంగా కనిపించాల్సిందే. అలాంటి అందంకోసం, నాజూగ్గా తయారవడంకోసం వ్యాయామాలకు, డైట్‌మెయింటైన్ చేయడంకోసమని ఏండ్లకు ఏండ్లు ఒకే రకంగా శరీరాన్ని, శరీర సౌష్టవాలను కాపాడుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తుంటారు నటీనటులు. ఆ అందం, శరీర సౌష్టవం సడలిపోయిందంటే అవకాశాలు కూడా రావడం చాలా కష్టం. అందుకోసం సంపదనకన్నా ఖర్చు కూడా ఎక్కువ చెయ్యాల్సిందే. ముఖంలో ఏ అవయవం కాస్త అటూ, ఇటూ ఉన్నా సర్జరీలు చేయించుకోవాల్సిందే. హీరోలకన్నా హీరోయినే్ల అందానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. హీరోయిన్లు ఎంతందంగా ఉంటే ప్రేక్షకులు అంతగా సినిమాను ఆస్వాదిస్తారు. ఆ అందంకోసం హీరోయిన్లు పడరాని పాట్లు పడతారు పాపం. అటువంటి పాట్లు వర్ణనాతీతం. అలా ఇష్టాలను చంపుకొని, జంక్‌ఫుడ్స్ లాంటివి వదిలేస్తేనే కాసిన్ని అవకాశాలు వచ్చి కాసులవర్షం కురిసేది. లేకుంటే అంతే సంగతులు. అందాన్ని ఎప్పటికీ ఒకే విధంగా నిలుపుకోవడం అంత సులువుకాదు.
ముఖానికి వేసుకునే, రాసుకునే ఫేషియల్స్‌నుంచి హెయిర్ డ్రెస్సింగ్ వరకు అన్నీ చాలా ఖరీదయినవి వాడాల్సిందే. ఏవో పేరులేని కంపెనీ క్రీములు లాంటివి వాడినట్లయితే ఉన్న అందంకూడా పోయి చర్మవ్యాధులు కూడా వస్తాయి. ఇలా ప్రతీరోజూ షూటింగ్ ఉన్నా లేకున్నా కూడా ఆ అందాన్ని కాపాడుకోవడంకోసం బ్యూటీపార్లర్ల చుట్టూ, హెయిర్ డ్రెస్సింగ్ పార్లర్లచుట్టూ తిరగడం తప్పనిసరి. అవకాశాలు వచ్చినప్పుడే అందంగా తయారవుదామంటే కుదరదు. అదేమయినా అన్నమా? ఆకలి అయినప్పుడు తినడానికి. అందం! ఒక్కసారి భౌతికంగా మార్పులు మొదలయ్యాయంటే మళ్ళీ పూర్వపు స్థితికి రావు. ఒంపులు, సొంపులు సడలిపోయినట్లయితే ప్రేక్షకుల ఆకర్షణకు దూరమవుతారు. ఒక్కసారి ప్రేక్షకుల మనసుల్లో ఆకర్షణ, అభిమానం తగ్గినట్లయితే అలాంటి హీరోయిన్లు కోలుకోవటం ఇక జరగని పని. ఇక మొన్న ఈమధ్యనే చనిపోయిన నటి శ్రీదేవి అయితే తన అందాన్ని కాపాడుకోవటంకోసం 21సార్లు సర్జరీలు చేయించుకుందంటే చూడండి హీరోయిన్లు అందానికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో? చనిపోయేంతవరకు కూడా శ్రీదేవి యుక్తవయస్కురాలి లాగా కనిపించింది. ఎంత కష్టపడితే అది సాధ్యమయ్యింది? ఏదేమయినా శ్రీదేవి చాలా అందగత్తె. భూలోకంలో రాలిన దేవకన్య.
సినిమాల్లో నటించిన హీరోయిన్లకు కోట్లల్లో కాకున్నా లక్షల్లోనయినా రెమ్యునరేషన్స్ వస్తుంటాయి. కానీ ఇష్టమయిన విధంగా ఆహారం తీసుకోవచ్చుకదా అంటే పైసలున్నాయని జంక్‌ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, బిర్యానీలు, ఐస్‌క్రీములు, పండ్లరసాలు వగైరా తీసుకున్నట్లయితే శరీరం లావెక్కి ఎందుకూ పనికిరాకుండాపోతారు. అంటే పైసలున్నప్పటికీ తినే తిండిని, తినేవాళ్ళను చూస్తూ నీళ్ళు నమలాల్సిన పరిస్థితి. ఎంత బాధాకరమయిన పరిస్థితి? కడుపుమాడ్చుకుని అందానికి ఖర్చుపెడుతున్నారు. సంపాదించిన సొమ్ము. ఒకపూట తిండి, నిద్ర లేని జీవితం. ఇవే హీరోయిన్ల పాట్లు. ఇక వారు వాడుతున్నటు వంటి ఫేషియల్స్ చేసే క్రీముల్లో, పౌడర్లలో ఎన్నోరకాల రసాయనాలుంటాయి. అన్నిరకాల క్రీములు ముఖానికి రాసుకోవడంవల్ల ఎన్నోరకాల చర్మవాధులు, రోగాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అన్నిరకాల పౌడర్లలో, క్రీముల్లో నకిలీవి ఎన్నో. వాటివల్ల జరిగే ఎన్నో అనర్ధాలు జరుగుతుంటాయి. వాటిని వాడటంవల్ల ముందుముందు ఎన్నోరకాల రోగాలు వచ్చేటటువంటి అవకాశాలుంటాయి. ఇవీన్న తెలిసికూడా ఇంత ధైర్యంగా వాటిని వాడటం ఎంత గొప్ప విషయం? టీనేజ్‌లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా చేస్తూనే మధ్యవయస్సు వచ్చాక కూడా అంటే నాల్గుపదుల వయస్సులోకూడా హీరోయిన్‌గా చేస్తున్నారు చాలామంది హీరోయిన్లు. అంత అందాన్ని మెయింటైన్ చేస్తేనే మరి అది సాధ్యం!
ఇదంతా ఏమిటంటే ఒక సెల్ఫ్ సాటిస్‌ఫ్యాక్షన్ కోసమనే ఒక విధంగా చెప్పాలి. కళను బ్రతికించుకోవడంలో ఈ ఓపిక కూడా ఒక ముఖ్యమైన భాగం. కార్లు, బంగ్లాలు, బ్యాంక్‌లో నగదు, బంగారు, వజ్రాభరణాలు, ఖరీదయిన బట్టలు, బయటికి వెళ్తే సెక్యూరిటీ, ప్రేక్షకుల మధ్యకు వెళ్తే ఆటోగ్రాఫ్‌లకోసం చుట్టూ ఎగబడే జనాలు ఇదంతా ఒక రకమైన పాపులారిటీకోసం, గొప్ప నటిగా గుర్తింపుకోసం. అవన్నీ వచ్చినా కూడా ప్రేక్షకుల అభిమానానికి బానిసలుగా మారాల్సిన పరిస్థితి. ఎందుకంటే తన అభిమానులకు ఇంకా మంచి సినిమాల ద్వారా దగ్గరవ్వడానికి. ఒక్కసారి స్టార్‌డమ్ వచ్చిన తర్వాత దానిని కాపాడుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అదెలా అంటే చిత్ర పరిశ్రమలో మొదట్లో అవకాశంకోసం ఎంత పరితపిస్తారో, ఎదురుదెబ్బలు తింటారో అంతకంటే కూడా చాలా రెట్లు ఎక్కువ కష్టపడతారు. ఏదేమయినా హీరోయిన్ల జీవితాలు సుఖాలు, సంతోషాలు అనుభవించేటటువంటివి కావు. ఎదురీత తప్పదు. కొన్ని ఇష్టాలు, కొన్ని నష్టాలు భరించక తప్పదు. మొత్తంమీద హీరోయిన్లకు అందం, అభినయం, ఓపిక అన్నీ అవసరమే.

-సుమశ్రీ