సబ్ ఫీచర్

మధురిమల ధార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుభూతులు అనే పుటలతో నిండిన పుస్తకమే జీవితం. పుటలు తిరగేస్తుంటే ఒక్కొక్క పుట ఒక్కొక్క అనుభూతిని గుర్తుకు తెస్తుంది. మార్దవంగా మనస్సును తడుతుంది. అపుడు పొందిన అనుభూతినే ఇపుడు కూడా కలిగిస్తుంది. అమ్మా నాన్నల లాలన, అక్కా చెలెళ్ళ ఆప్యాయత, అన్నదమ్ముల అనురాగం, బంధు మిత్రుల ఆదరణ మరచిపోలేని మధురానుభూతులై జీవితాంతం మనస్సులో పదిలంగా నిలిచిపోతాయి. మనుష్యులకు అనుభూతి అనేది ఒక వరం. భగవంతుడు మనిషికి స్పందించే గుణాన్ని ప్రసాదించాడు. స్పందన పొందని, అనుభూతి పొందని మానవుడుండడు. అనుభూతికి అర్హంకాని అంశాలే లేవు. పేదా గొప్పా, చిన్నా పెద్దా అందరికీ అనుభూతి ఒక్కటే. బాల్యం ఎవ్వరికైనా ఒక మధురానుభూతి. అన్నయ్యలతో, అక్కయ్యలతో ఆటలాడడం, చెల్లెళ్లతో, తమ్ముళ్ళతో పోటీపడడం, అమ్మ మెప్పుకోసం ఆరాటపడడం, నాన్న వస్తుంటే పరుగెత్తి ఎదురువెళ్ళడం, చుట్టపు చూపుగా వచ్చిన బంధుమిత్రులు ఇచ్చిన పదో పరకో భద్రంగా దాచుకోవడం, ఇరుగుపొరుగువారి బంధు మిత్రులు కూడా మనతో ఆత్మీయంగా మెలగడం, మేనత్త, మేనమామలు రాసే ఉత్తరాలకోసం ఎదురుచూడడం, వారికి ఉత్తరాలు రాయడం- ఇవన్నీ బంధాలను పటిష్టం చేసే అనుభూతులు. ఏ ఇంట కార్యక్రమాలు జరిగినా ఇంటిల్లిపాదీ హాజరుకావడం, కానుకలు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఇంట్లో ఏ పూవు పూసినా, ఏ కాయ కాసినా అందరికీ ఇవ్వడం, నోములు, పేరంటాలు మొదలైనవి జరపడం లాంటి అనుభూతులు స్నేహాభిమానాలను, సంప్రదాయాన్ని, పరిరక్షించే అనుభూతులు. చెట్ల పెంపకం, సూర్యోదయం, చంద్రోదయం, పండు వెనె్నల, వాన, చలి, మొదలైనవి ప్రకృతితో ముడిపడిన అనుభూతులు. ఫొటోలు దిగడం, టీవీ చూడడం, రచనలు చేయడం, కళలు పెంపొంచుకోవడం, చదువులు పూర్తికావడం, విజయాలు సాధించడం, బహుమతులు గెలుచుకోవడం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం- ఇవన్నీ వ్యక్తిత్వంపై ప్రభావం చూపే అనుభూతులు. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం, క్రొత్త ప్రదేశాలు చూడడం వంటివి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతులు. ఇలా ఒక్కొక్కటీ చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభూతులు జీవితంలో చెరగని ముద్రను వేసుకుంటాయి. ఇక జీవితంలో స్థిరపడడం, పెళ్లి, సంతానం, మనుమళ్ళను, మనుమరాళ్ళను ఎత్తడం జీవితానికి పరిపూర్ణతను సంతరించిపెట్టే అనుభూతులు. ఆడుకునే వయసులోనే స్నేహం ఒక రకమైన అనుభూతి నిస్తే నడత నేర్చే సమయంలో ప్రభావితం చేసిన స్నేహం మరొకరకమైన అనుభూతిని కలిగిస్తుంది. కష్టసుఖాలు కలబోసుకునే వయస్సులో చేసే స్నేహం మరొక రకమైన అనుభూతినిస్తుంది. ఇలా జీవితంలో ఒక్కొక్క ఘట్టంలో ఒక్కో రీతిగా అనుభూతులు కలుగుతూ వుంటాయి. అనుభూతి సున్నితత్వానికి సంబంధించినది. మనకు నచ్చిన వారు ఇచ్చిన వస్తువులు అవి వాడుకలో వున్నా లేకపోయినా పదిలంగా దాచుకోవడానికి కారణం అనుభూతే. ప్రతి ఇంట్లో ఇది పుట్టింటివారి సామాను అనో, అది అత్తింటివారి సామాను అనో ఎన్నో వస్తువులు ఇలా ఉంచుకుంటూ వుంటారు. ఆ విధంగా అనుభూతులను గుర్తుచేసుకుంటూ వుంటారు. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. కొడుకును దగ్గర తీసుకోవడంవల్ల కలిగే ఆనందం చాలా గొప్పదని శకుంతల దుష్యంతునితో ‘‘విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్యంగ సుఖము చేకొనుము’’ అని చెబుతూ మంచి ముత్యముల దండలు, దట్టమైన కర్పూరము, చందనము, చంద్రుని వెనె్నల ఇవి ఏవీ కూడా కొడుకును దగ్గరకు తీసుకోవడంవల్ల కలిగే ఆనందానికి సాటిరావు అంటుంది. అంటే కుమారుడు తండ్రికి అంతటి మధురానుభూతిని కలిగిస్తాడు. ప్రేమతో నిండిన మనస్సు మాత్రమే అనుభూతిని పొందగలదు. అనుభూతిని ఆస్వాదించగలిగిన మనస్సు మాత్రమే ప్రేమను పంచగలదు. యాంత్రికంగా జీవితాన్ని గడపడానికి అలవాటుపడుతున్న మనుష్యులు సున్నితమైన అనుభూతులకు దూరం కాకుండా వుండాలి. హనికరమైన తిండ్లు, ఖరీదైన తిండ్లు తినడమే ఎంజాయ్‌మెంట్‌గా భావిస్తున్నవారికి నిజమైన ఎంజాయ్‌మెంట్ అంటే ఏమిటో తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. అమ్మమ్మ చేత్తోనో, నానమ్మ చేత్తోనో కలిపి తినిపించిన ఆవకాయ ముద్దలు అందించే అనుభూతిని వారికి అందించాలి. అది అందించినవారికీ, అందుకున్నవారికీ కూడా మరపురాని అనుభూతి అవుతుంది.

-కె.లక్ష్మీ అన్నపూర్ణ