సబ్ ఫీచర్

శ్రామిక వర్గానికి జ్ఞానమే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవ్యాప్తంగా కార్మికులంతా ‘మేడే’ను పండుగలా శతాబ్ద కాలానికి పైగా జరుపుకుంటున్నారు. మొదటి పారిశ్రామిక విప్లవం తొలి నాళ్లలో కార్మికులు ‘బానిసలు’గా పనిచేయాల్సిన దీనస్థితిలో- పనిగంటలు తగ్గించాలని అమెరికాలోని చికాగో నగరంలో 1886 మే మాసం ప్రారంభం నుంచి ప్రదర్శనలు, ఊరేగింపులు, సమావేశాలు, ఆవేశపూరిత ప్రసంగాలు కొనసాగాయి. ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల్లో కొందరు కార్మికులు, పోలీసులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యూరప్ అంతటా కార్మికశక్తి ఉవ్వెత్తున ఎగిసిపడటంతో పనిగంటల కుదింపునకు పారిశ్రామికవేత్తలు అంగీకరించారు. కార్మిక వర్గం తొలి విజయం అది. దానే్న ‘మేడే’గా స్థిరపరచుకున్నారు. 1891 నుంచి ఇది ఆచరణలోకి వచ్చింది.
వంద ముప్ఫై ఏళ్ళ అనంతరం పరిస్థితులు మునపటిలా లేవు. అప్పుడు బానిసలుగా కార్మికులు పనిచేస్తే ఇప్పుడు భాగస్వాములుగా మారారు. ఈ గుణాత్మక మార్పును అందరూ గమనించినప్పుడే కార్మిక వర్గానికి మరింత న్యాయం జరుగుతుంది. వర్తమానంలో కార్మికవర్గ స్వభావం, స్వరూపం సంపూర్ణంగా మారింది, మారుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా వంద సంవత్సరాల క్రితపు వాతావరణానే్న ఆవాహన చేసుకుని ఆలోచిస్తే అది ఆదర్శవంతమవదు. కార్మిక వర్గానికి న్యాయం చేసినట్టు కాదు. మేడే ఉద్యమంలోనే అరుణ పతాక ఆవిర్భవించింది కాబట్టి నాష్టాల్జియాతో, ఉద్వేగంతో, సమరోత్సాహంతో దేశ కాలాలు విస్మరించి ‘శ్రమజీవుల కోసం ఉరికొయ్యలు ముద్దాడుతాం’ అని ఆవేశపడటం అంతగా ఆహ్వానించే అంశమవదు. కార్మికులు బానిసలుగా పనిచేసే సమయానికి, భాగస్వాములుగా పరిణతి చెందిన కాలానికి గల మార్పును గుర్తిస్తేనే కార్మిక లోకానికి మేలు జరుగుతుంది.
ఐటీ రంగం అభివృద్ధి చెంది ‘రోబో’లు కార్మికుల స్థానాన్ని భర్తీచేస్తున్న విషయాన్ని పట్టించుకోకుండా, అనేక సంస్థల్లో లాభాల్లో భాగస్వామ్యం (బోనస్) పొందుతున్న సందర్భంలో, నాణ్యమైన పని వాతావరణం ఉన్నచోట, తగ్గిన పనిగంటలు, పెరిగిన సౌకర్యాలు, సదుపాయాలు, భవిష్యనిధి లాంటి భరోసా ఇంకా ఎన్నోరకాల మేలు సమకూరుతున్న సందర్భంలో ఏకపక్ష ఆలోచనకు, శతాబ్దం క్రితం నాటి భావజాలానికి, ఆవేశానికి మాన్యత కనిపిస్తుందా? మనిషి ఆలోచనలు కాలానుగుణంగా ఉండాలన్నది ప్రాథమిక అంశం. దీన్ని విస్మరించి వంద ముప్ఫై సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగర వాతావరణం ఇక్కడి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందనుకోవడం అంత సబబైనది కాదు. యూరప్‌లో 19వ శతాబ్దంలోనే కార్మిక శక్తి అవతరిస్తే భారత్‌లో 20వ శతాబ్దంలోగాని ఆ శక్తి ఆవిర్భవించలేదు. సంఘటిత శక్తిగా మేల్కొన్నది కూడా ఆలస్యంగానే. యూరప్‌కు, భారతదేశ పరిస్థితులకు, భావోద్వేగాలకు, కుటుంబ నేపథ్యానికి పొంతన లేదు. కాని పోరాట పటిమ, తిరుగుబాటు తత్వం, ఎదురుతిరిగే నైపుణ్యం అంతే స్థాయిలో ఉంటుందని, ఉండాలని ఊహించడం సరైనది కాదు. దీన్ని కార్మిక సంఘాలు సంపూర్ణంగా విస్మరించి ఇప్పటికీ వ్యవహరించడం విచిత్రం. కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిన కారల్ మార్క్స్ 1883లో మరణించారు. దాంతో ఆయన అభిమానులు, ఆరాధకులు తమకు తోచిన విధంగా కార్మికులను నడిపించేందుకు సిద్ధమయ్యారు. అదే వైఖరి ఇప్పటికీ కొనసాగడం ఆశ్చర్యం.
అమెరికాలో మేడే పోరాటం జరిగినా, అనంతరం ప్రపంచమంతటా మేడేను ఓ పండుగ రోజులా కార్మిక సంఘాలు జరుపుకుంటున్నా, అమెరికాలో మాత్రం మేడేరోజు సెలవుదినం కాదు. ఏటా సెప్టెంబర్ తొలి సోమవారం కార్మిక దినోత్సవంగా అక్కడ జరుపుకుంటారు. కెనడా తదితర దేశాల్లోనూ సెప్టెంబర్‌లోనే ‘లేబర్ డే’ జరుపుకుంటారు. అధికారికంగా ఆరోజు సెలవును ప్రకటించారు. వాస్తవానికి యూరప్ అంతటా ముఖ్యంగా ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న దేశాలు మేడే ఆవిర్భావానికి ముందే ఆరోజును సాంప్రదాయసిద్ధంగా మే నెల మొదటి రోజున నూతన సంవత్సరంగా పరిగణిస్తూ వేడుకలు జరుపుకుంటారు, ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాదిని జరుపుకున్నట్టుగా యూరప్‌లో ఆరోజున జరుపుకుంటారు. ఆ సంప్రదాయ వేడుకల్లో భాగంగా మేడే చేరిపోయింది.
19వ శతాబ్దంలో ప్రజాస్వామిక పరిస్థితి అంతగా లేదు. కాని 21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం తప్ప మరొకటి ఎరుగం. శ్రామిక వర్గం వారి సంతానం అన్ని రంగాలలో రాణిస్తున్న తరుణంలో ఇంకా ఏకపక్ష ఆలోచనలతో, పక్షపాత ధోరణితో ఆలోచనలు చేయడం ఎవరికి శ్రేయస్కరమవుతుంది? ఈ కాలంలో పాలకులు, పాలితులు ఒకరే. ఈ ఎరుకను విస్మరించి రాచరిక కాలపు మనఃస్థితిని ఆపాదించుకుని ఆవేశం తెచ్చుకుని పిడికిలి బిగించడం వల్ల నష్టం కార్మిక వర్గానికేనన్న సంగతిని కొందరు కార్మికనేతలు పట్టుకోలేకపోతున్నారు. శ్రమైక జీవన సౌందర్యం, సంపద సృష్టి, సౌకర్యాల వెల్లువ, సాంకేతిక పరిజ్ఞాన ఉత్థానం అంతా ప్రజల కోసమే, కార్మిక- కర్షకులైన శ్రమజీవుల కోసమే అన్న భావన విస్మరిస్తే అగాధాల్లోకి జారుకోవడమే తప్ప- శిఖరాలను చేరుకోలేం.
వాస్తవానికి నేడు ఐటీ రంగంలో పనిచేసే వారికి అందుతున్న వేతనాలు, సౌకర్యాలు, పని వాతావరణం, భద్రత, భవిష్యత్ నిర్మాణానికి అందుతున్న ఆసరా చూస్తుంటే.. వారే చిన్నపాటి పెట్టుబడిదారుల జీవితాన్ని అనుభవిస్తుతన్నారనిపిస్తోంది. ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న కార్మిక వర్గ వారసుల జీవితం, సౌకర్యాలు, సంపద అనూహ్యం. ఇదంతా మన కళ్ళముందు కనిపిస్తున్న సత్యం. వీరంతా దారుణంగా దోపిడీకి గురవుతున్నట్టుగా పరిగణించలేం. అంటే జ్ఞానం, విజ్ఞాన ఆనుపానులు, సాంకేతిక పరిజ్ఞానం అబ్బినవారు, తెలిసినవారు ఎవరైనా మెరుగైన జీవితం గడిపే అవకాశం వర్తమానంలో దండిగా ఉంది. ఈ దిశగా కదిలేలా కొత్త తరాలను ప్రోత్సహించాల్సిన కార్మిక సంఘాలు ఇప్పటికీ 19వ శతాబ్దపు మానసిక స్థితి ‘రాట’ కట్టేసే ప్రయత్నం చేయడం దారుణం. పాలు,పెరుగు,వెన్న, నెయ్యి.. ఈ ప్రక్రియను విస్మరించి పెట్టుబడిదారులు నేతి భోజనం చేస్తున్నారు, కార్మిక వర్గం మజ్జిగ నీళ్లు తాగుతున్నారని చెప్పడానికి, వినడానికి బాగానే ఆకర్షణీయంగా కనిపించినా ఆమధ్యలోని ప్రక్రియను తొక్కిపెట్టి చూడడం దారుణం. 21వ శతాబ్దంలో ఆ దాపరికం ‘నేరం’. ఈ మెలకువను పట్టుకోవడానికి కార్మిక సంఘాలు ససేమిరా అంటున్నాయి. ఆ సంఘాల్లో చైతన్యవంతులు, నాయకులు మాత్రం మజ్జిగనీళ్లుగాక నేతి భోజనం చేస్తున్నారని, వారి సంతానానికి అదే భోజనాన్ని ఏర్పాటుచేస్తున్నారని కార్మిక వర్గం ఎప్పుడో గుర్తించింది. అందుకే గతంలో మాదిరి మేడేలు వైభవంగా కొనసాగడం లేదు. అంతటి దీక్ష కనిపించడం లేదు. ఇది బహిరంగ రహస్యమే తప్ప ఆడిపోసుకోవడం కాదు. ఈ స్వల్ప మార్పును పసిగట్టగలిగినా తత్వం బోధపడినట్టే.
శ్రామిక వర్గం వారసులు శ్రామికులే అవుతారని, పెట్టుబడిదారుల వారసులు పెట్టుబడిదారులవుతారని భావించడం అమాయకత్వం. ఓ రకంగా అది అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని విడనాడి పరిశీలన చేస్తే కార్మిక వర్గానికి మరింత మేలైన సేవలందించే అవకాశముంది. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వీలుంది. స్పార్టకస్ కాలం నుంచి తిరుగుబాటునే ఎజెండాగా కొనసాగిస్తున్నాం. ఇప్పుడూ దానే్న ఆశ్రయిస్తామనుకోవడం అంతగా నప్పని వ్యవహారం. ప్రజాస్వామ్యంలో అది పనికిరాని సమీకరణ. జ్ఞాన సంపద ఒక్కటే పనికొచ్చే ఆయుధం. ఈ మేడే సందర్భంగా శ్రామిక వర్గం ఆ ఆయుధాన్ని ధరించేందుకు ప్రతిన పూనాల్సి ఉంది.
(మేడే సందర్భంగా)

-వుప్పల నరసింహం సెల్: 99857 81799