సబ్ ఫీచర్

ఇది నగదు ఎమర్జెన్సీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగదు కొరతతో సామాన్యుడి సణుగుడు.. ప్రభుత్వానికి సైతం కొరుకుడుపడని సమస్య.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా నగదు లేదన్న నిరసన ధ్వనులు జనం నుంచి ప్రతిధ్వనిస్తున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్నివర్గాల వారూ తమ సంపాదనలో అంతో ఇంతో బ్యాంకుల్లో దాచుకోవడం పరిపాటి. మరి.. బ్యాంకుల్లోనే డబ్బులేకపోవడం, తమ డబ్బు ను తాము తీసుకునే అవకాశం మృగ్యం కావడంతో ప్రజానీకం తీరని కష్టనష్టాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా దిగువస్థాయి మదుపరులు, మధ్యతరగతి వారు నిరుత్తరులవుతున్నారు.
మన దేశంలో కీలకమైన బ్యాంకింగ్ వ్యవస్థ కునారిల్లుతోంది. ఒకప్పుడు సకల జనం తమ డబ్బుకు బ్యాంకుల్లోనే తగిన భద్రత అని భావించేవారు. పెద్దనోట్ల రద్దు తర్వాత గత ఏడాదిన్నర కాలంగా నగదు కొరత అన్ని వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి బ్యాంకు లావాదేవీల నిర్వహణలో తీసుకొచ్చిన సంస్కరణలకు జనం కూడా మొగ్గుచూపారు. నగదు నిల్వలు బయటకు తీసి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతామన్న ప్రభుత్వం మాటలను ప్రజలు నమ్మారు. ఏటీఎంలను అలవాటు చేసుకొని, నగదు రహిత లావాదేవీల వైపుదృష్టి సారించారు. ప్రభుత్వం ఏదో మేలు చేస్తుందని, అంతా మంచే జరుగుతుందని భావించారు. ప్రతి ఒక్కరికి, ప్రతిచోటా బ్యాంకు అకౌంట్లు తెరిచేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. తమ దైనందిన కార్యకలాపాల్లో బ్యాంకింగ్‌ను ఒక నిత్యావసర వస్తువుగా భావించి జనం అనుసరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలు, తమకు వ్యక్తిగతంగా నగదు అవసరాలకు అనివార్యమని ‘ఈ- బ్యాంకింగ్’ బాటపట్టారు. వంటగ్యాస్ సబ్సిడీ నుంచి సంక్షేమ పథకాల లబ్ధికీ, రేషన్ అవసరాలకు బ్యాంకింగ్‌ను ముడిపెట్టారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు ప్రజలకు అనుభవంలోకి వస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ విధింపు ద్వారా వేలు, లక్షల కోట్లు వచ్చి పడతాయని అందరికీ నూరిపోశారు. జనమూ నమ్మారు. తీరా జరిగిందేమిటి? చేతిలో చిల్లిగవ్వ అందుబాటులో లేక జనం అల్లాడుతున్నారు. ఇంతలో.. కుంభకోణాల వంతు. అంతూపొంతూ లేకుండా సాగుతున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి బడా బాబుల నిర్వాకం బయట పడటంతో ప్రభుత్వానికి దిమ్మతిరిగింది. నోట్ల రద్దుతో జనానికి మేలుజరిగి దగ్గరయ్యామని అనుకుంటున్న తరుణంలో ఈ బ్యాంకింగ్ కుంభకోణాలు మాడుపగులగొట్టాయి. పాలకులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టాయి.
ప్రస్తుతం విధిస్తున్న నియంత్రణలు, ఆంక్షల వల్ల బ్యాంకులు అంటేనే జనం మొహం చాటేస్తున్నారు. కొత్తకొత్తగా విధిస్తున్న రుసుముల పెంపూ కుంగదీస్తున్నాయి. బ్యాంకులపై ఒకప్పుడున్న నమ్మకం ప్రస్తుతం మసక బారిందనే వ్యాఖ్యలు విస్తరించాయి. క్షేత్రస్థాయిలో వివిధ బ్యాంకుల వద్ద పరిస్థితిని గమనిస్తే ఖాతాదారుల కడగండ్లు కట్టలు తెగాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. పట్టణాల్లోనూ దీనికి భిన్నంగా ఏమీలేదు. ఓ గ్రామీణ ప్రాంత బ్యాంకు వద్ద ఖాతాదారులను కదిలిస్తే బోలెడన్ని సమస్యల్ని ఏకరువుపెట్టారు. అసలెందుకు బ్యాంకుల్లో డబ్బులు వేసుకోవాలి? ఏమిటిది? ఈ కుంభకోణాలు ఏమిటి? ఈ కథేంటి? మా డబ్బుపై మాకు భద్రత లేదా? మాకు రుణాలివ్వాలంటే సవాలక్ష పత్రాలు, నిబంధనలు అంటారు. బడాబాబులు ఏ పత్రాలు ఇస్తే అంత దోపిడీ జరిగింది? మా నగదు మాకు దక్కుతుందా? లేదా? అంటూ భయాందోళనలు వ్యక్తంచేశారు. నగలు దాచుకోవడానికి లాకర్లకూ అలవాటుపడ్డాం. అకౌంట్లూ కావాలన్నారు, ‘పాన్’ ఉండాలన్నారు. దానికీ సిద్ధపడ్డాం. బ్యాంకులు కోరే పత్రాలన్నింటినీ సంపాదించి ఇస్తున్నాం. మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వరా? ఎప్పుడిస్తారు? మా డబ్బు మాకివ్వడానికేమిటి? ఇలా మమ్మల్ని ఏడిపించడం తగునా? ఇలా శాపనార్థాలు పెడుతున్నారు. ఓ బ్యాంకు దగ్గర చూస్తే ఒకరు వైద్యం నిమిత్తం, వేరొకరు శుభకార్యం కోసం, ఇంకొకరు వ్యక్తిగత అవసరాలకు వేచి చూస్తుండటం, వారి సమస్య తీరక ఆవేదన చెందటం కనిపిస్తుంది. మేం కూడా పన్నులు కడుతున్నాం కదా! జీఎస్టీ అన్నారు. సర్వీసుటాక్స్ అన్నారు. అన్నిటికి మేం అర్హులమేకానీ మా డబ్బు మేంతీసుకోకూడదా? నగదు అవసరాలు తీర్చరా? అంటూ నిలదీస్తున్నారు. డబ్బువేస్తే పన్ను, తీస్తే పన్నులా ఉందంటూ వారి మనస్సుల్లోని మాటను వెళ్లగక్కారు. మరోపక్క బ్యాంకు సిబ్బంది చేసేది ఏమిలేక చేతులెత్తేశారు. మాకు పైనుంచి నగదు రావడం లేదు, ఉన్నతాధికారులు చెప్పినట్లే చేస్తున్నామంటూ సమాధానమిస్తున్నారు. బ్యాంకుకొచ్చిన వారందరికీ సమాధానపర్చలేక సిబ్బంది నానాతిప్పలు పడుతున్నారు. అరుపులు, కేకలు, అసంతృప్తులతో బ్యాంకులు దద్దరిల్లుతున్నాయి.
ఇటీవల చాలా బ్యాంకుల వద్ద ఎఫ్‌ఆర్‌డిఏ బిల్లు అంటూ ఏమీలేదని బోర్డులు పెట్టారు. పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు కొరత సమస్య నుంచి క్రమంగా బయటపడుతున్న సమయంలో గతేడాది ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌డిఏ (ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్) బిల్లుతెచ్చే ప్రయత్నం చేయడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ బిల్లు గురించి పెద్దగా తెలియకపోయినా ఇదో పెద్ద భూతంలా పట్టుకొంది. ఏదో ప్రళయం వచ్చి పడుతుందన్నట్లుగా జనం ఫీలయ్యారు. డిపాజిట్లు చేసినవారికి ఇంతే సంగతులు అన్నట్లు దావానలంలా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ప్రజలు బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో నగదు తీసేసుకుంటున్నారు. గతంలో వలే నగదు జమచేయడానికి వెనుకంజ వేస్తున్నారు. డిపాజిట్లు తగ్గడమే నగదు కొరతకు కారణమని బ్యాంకింగ్ రంగ నిపుణులంటున్నారు. నగదు కొరతపై ప్రభుత్వ వాదన, వివరణ మరో విధంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లోనే ఈ సమస్య అధికంగా ఉందని, కారణాలు అనేకం ఉన్నాయని పేర్కొంటోంది. భారీగా డిపాజిట్ల ఉపసంహరణ, భయాందోళనలు, త్వరలో జరగబోయే ఎన్నికలు ఇత్యాది కారణాలని వివరిస్తోంది. నగదు కొరత తీవ్రంగా ఉన్న బిహార్‌లో ఇప్పుడేమీ ఎన్నికలు లేవనేది ఎదురు ప్రశ్నగా మిగులుతోంది. ప్రభుత్వం ఏ సమయంలో ఏ కొత్త ఆంక్ష విధిస్తుందోనన్న భయమే ఖాతాదారులను వెంటాడుతోంది. ఏతావతా నగదు తీసుకోవడంపై విధిస్తున్న ఆంక్షలు, డిపాజిట్లపై వేస్తున్న యక్షప్రశ్నలు, నగదు లావాదేవీలపై విధిస్తున్న రుసుములు తోడై ప్రజలను బ్యాంకులకు దూరంగా ఉంచుతున్నాయి.
నగదు ఎమర్జెన్సీని ప్రధాన కారణాలను సూక్ష్మంగా పరిశీలిద్దాం. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, ప్రభుత్వ జోక్యాలు, రాజకీయ ప్రమేయాలు, బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, కుంభకోణాలు ఈ రగడకు హేతువులయ్యాయి. రాజకీయ పలుకుబడి కలిగిన కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు భారీస్థాయిలో రుణం తీసుకోవడం, సకాలంలో చెల్లించకపోడం దరిమిలా అవన్నీ నిరర్థక ఆస్తులుగా మిగిలి బ్యాంకులకు గుదిబండలుగా మారడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. వీటికితోడు వ్యవస్థలోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకోవడం, సిబ్బందికి ముడుపులు ఎర చూపించడం కూడా నగదు ఎమర్జెన్సీకి ఆజ్యం పోశాయి. విజయ్ మాల్యా లాంటి బడాబాబులు చూపించిన హామీల కంటే పొందిన రుణాలు వేల కోట్లు దాటాయంటే ప్రజనీకానికి బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం ఎలా కుదురుతుందనుకోవాలి? బ్యాంకుల మోసాలను మనం వెతికిచూస్తే తప్పుడు నిర్ణయాలు గోచరిస్తాయి. వారికున్న విచక్షణను ఆసరాగా బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. ఇక్కడే అక్రమాలకు బీజం పడుతోంది.
సందట్లో సడేమియా అన్నట్లు దళారులు రంగప్రవేశం చేసి సిబ్బందిని ప్రలోభపెడుతుంటారు. ఈ ప్రలోభాలు నగదు మాత్రమే కానక్కర్లేదు. ఇళ్లు, ఫ్లాట్లు, నగలు వగైరారూపాల్లో ఉంటాయి. ఇక రాజకీయ ఒత్తిళ్లు , బంధుమిత్రుల ప్రమేయం, మొహమాటాలు కూడా వీటికితోడవుతుంటాయి. బ్యాంకుల మొండి బకాయిల్లో వ్యాపారంలో నష్టాలొచ్చి రుణం చెల్లించకపోయిన వారికంటే ఉద్దేశ పూర్వకంగా రుణాన్ని ఎగ్గొట్టిన వారే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆర్‌బీఐ తక్షణం రంగంలోకి దిగి నగదు కొరతను తీర్చాల్సివుంది. కీలక ప్రాంతాల్లోని ఏటీఎంల్లో పూర్తిస్థాయి నగదు లభ్యత ఉండేలా ఎప్పటికప్పుడు సమీక్షచేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే బ్యాంకు లావాదేవీలపై పరిమితులు, ఆంక్షలు బాగా తగ్గించి సామాన్యుడికి నగదు కష్టాలు తొలగేలా, వారి మనస్సులు గెలుచుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

-చెన్నుపాటి రామారావు 99590 21483