సబ్ ఫీచర్

కుడి యెడమైన ఆత్రేయ గీతాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మే 7న ఆత్రేయ జయంతి
=================
ఒకరు రాసిన పాట యింకొకరి పేరుతో రావడం, ఒక సినిమాకు రాసిన పాటను మరో సినిమాలో వుపయోగించుకోవడం, ఒకే పాటను యిద్దరు ముగ్గురు కవుల చేత రాయించడం- ఇలాంటి విచిత్రాలు చిత్రసీమలో అసాధారణాలు కావు! ఆచార్య ఆత్రేయ వంటి సుప్రసిద్ధ కవికి కూడా యిలాంటి చేదు అనుభవాలు తప్పలేదు!
రాయక నిర్మాతలను యేడిపిస్తాడని పేరుపడిన ఆత్రేయతో వేగలేక, ఆయనను వదులుకోలేక అవస్థలు పడిన నిర్మాతలలో పి.పుల్లయ్య ఒకరు. ఆయన ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం’(1960) చిత్రానికి మొదటి సంస్కృత గీతం, పద్యాలు తప్ప తక్కిన పాటలన్నిటినీ ఆత్రేయ రాయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. తీరా యస్.వరలక్ష్మి పాడవలసిన మొదటి పాట రికార్డింగ్ ముహూర్తం నిర్ణయించిన తర్వాత ఆ పాట రాయవలసిన ఆత్రేయ అదృశ్యమయ్యారు. నిర్మాత ఆత్రేయను అనరాని మాటలంటూ చిందులు తొక్కుతుంటే సమయానికి ఆరుద్ర ఆపద్బాంధవుడిలా ఆదుకొని ‘శ్రీదేవిని, నీదు దేవేరిని’ అనే పాటను ఆ సందర్భానికి రాసి ఆత్రేయను ఆ గండంనుంచి గట్టెంక్కించారు. మరోసారి ఆత్రేయ మాటలు, పాటలు రాయడానికొప్పుకొని రికార్డింగ్ ముహూర్తానికి హాజరుకాలేకపోయిన అట్లూరి పూర్ణచంద్రరావు (దర్శకత్వం: జి.రామమోహన్‌రావు) చిత్రానికి కూడా మొదటి పాటను వేటూరి రాసి ఆత్రేయ మర్యాదను కాపాడారు. ఇలా ఆత్రేయ అలసత్వం కారణంగా తను రాయాల్సిన పాటలు వదులుకొన్న సందర్భాలెన్నో!
ఆత్రేయతో పోట్లాడి మరీ అద్భుతమైన పాటలు రాయించుకొన్న అభిరుచిగల నిర్మాత కె.మురారి. ఆయన రెండో చిత్రం ‘గోరింటాకు’లో వేటూరి రాసిన- ‘కొమ్మ కొమ్మకో సన్నాయి, కోటి రాగాలు వున్నాయి’అనే పల్లవిలో కృష్ణశాస్ర్తీ గేయంలోని ఛాయలున్నాయని పాలగుమ్మి పద్మరాజు చేసిన విమర్శకు కినిసిన వేటూరి ఆ పాటకు దూరమయ్యారు. అప్పుడు యువచిత్ర వారి ఆహ్వానం మేరకు ఆత్రేయ అదే పల్లవితో పాటంతా పూర్తిచేశారు. కాని క్రెడిట్స్‌లో ఆ పాట వేటూరి పేరుతోనే వచ్చింది. అయితే ఆ రుణం మరోలా తీరింది. యువచిత్ర వారి చివరి చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’లో-
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా?
వలపుల వానల జల్లులలో స్వామి
తలమునకలుగా తడిసితివా..
అనే పల్లవి రెండు పంక్తులు రాసిన తర్వాత ఆత్రేయ ఆకస్మికంగా చనిపోగా ఆ పాటను వేటూరి పూర్తిచేశారు. పల్లవికి ముందు ‘ద్వాపరమంతా సవతుల సంత..’అంటూ నాలుగు పంక్తుల్ని సిరివెనె్నల సీతారామశాస్ర్తీ రాశారు. అయితే ముగ్గురి వుమ్మడి వ్యవసాయమైనా క్రెడిట్స్‌లో ఆ గీతకర్తగా ఆత్రేయనే గౌరవించారు!
ఆత్రేయ పాటల్లో కొన్నిటిని తాము రాశామని ఆరోపించే పరిచయస్థులు, సహాయకులు, శిష్యులమనేవాళ్లు కూడా వుండడం ఆశ్చర్యం, అన్యాయం! ముఖ్యంగా కొనే్నళ్ల క్రితం డి.రామ్‌చంద్ అనే యువకుడు ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చాన’ తను రాసిన పాట అని, దానిని సొంతం చేసుకొని ఆత్రేయ తనకు రావలసిన కీర్తిని కాజేశారనీ ప్రచారం చేసుకోవడం మరీ ఘోరం! నిజానికి ‘తోడికోడళ్లు’ చిత్రంలో వుపయోగించిన ఆ పాట సినిమాకోసం రాయలేదనీ, నాటకాలు రాసే కాలంలో నెల్లూరు నెఱజాణల్ని చూసి రాసి పెట్టుకొన్నదని ఆయన అర్ధాంగి కె.వి.పద్మావతి చెప్పారనీ- నేను గతంలో రాశాను. కొందరు ఆత్రేయ సన్నిహితులు ఆయనకు పాట పలకని చివరి దశలో యెంతోకొంత సహకరించామని ప్రచారం చేసుకోవడం విడ్డూరం! ఆత్రేయకు చివరి శ్వాసవరకు యంకిపోని వూటబావి! ఆయన శైలి, శిల్పం మరెవరికీ అందవు! అయితే అరుదుగా కొన్ని అపవాదాలుండొచ్చు! ‘నీరాజనం’ చిత్రంలో ఆత్రేయ రచించిన- ‘మనసొక మధు కలశం’, ‘పగిలేవరకే అది నిత్య సుందరం’అనే పల్లవికి చరణాలను ఆపద్ధర్మంగా ఆయన అనుమతితో బొంబాయ వెళ్లి వెనె్నలకంటి రాశారట! వెనె్నలకంటి ఆత్రేయ పాటల్ని ఆపోశనం పట్టిన వీరాభిమాని గనుక ఆ పూరణం, అనుసంధానం సాధ్యమయ్యాయి!
‘మాయదారి మల్లిగాడు’ చిత్రంలో వితంతువైన విలన్ చెల్లెలు పాత్రధారిణి ప్రసన్నరాణి (సుడిగుండాలు ఫేం) మీద చిత్రీకరించడానికి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు ఆత్రేయ చేత మోడువారిన స్ర్తి జీవితానికి సంబంధించిన ఓ సానుభూతి గీతాన్ని రాయించారు. తీరా షూటింగ్ కూడా పూర్తయిన తర్వాత అంతగా ప్రాధాన్యంలేని ఆ పాత్ర మీద ఆ పాట పండదని అనుమానించి దర్శకుడు దానిని తొలగించారు. ఆ తర్వాత అదే హీరో (కృష్ణ) నటించిన అనిల్ ఆర్ట్స్‌వారి ‘గాలిపటాలు’ చిత్రంలో అలాంటి సన్నివేశమే తటస్థించినపుడు ఆ పాటను వుపయోగించారు. ‘గాలిపటాలు’లో కథానాయిక రాధ (విజయనిర్మల) తన యిష్టానికి విరుద్ధంగా ఓ శ్రీమంతుణ్ని పెళ్లాడి వితంతువైన దయనీయమైన సందర్భానికి నేపథ్య గీతంగా ‘మాయదారి మల్లిగాడు’లోని పాటను ట్యూన్‌తోసహా యథాతథంగా వినియోగించారు. ‘గాలిపటాలు’ చిత్రానికి టి.చలపతిరావు సంగీత దర్శకుడైనా, ముందుగా కె.వి.మహదేవన్ స్వరకల్పన చేసిన ఈ పాటను మాత్రం అలాగే వుంచారు. ప్రకృతిలో చిగురించడం జీవ లక్షణమైనప్పుడు, ఒక్క స్ర్తికి మాత్రమే ఆ వసంతాన్ని దూరంచెయ్యడం యెంతవరకు న్యాయమని ఆత్రేయ సమాజాన్ని నిలదీసిన ఆ పాట-
‘మాను మరల చిగురిస్తుంది, చేను మళ్లీ మొలకేస్తుంది
మనిషికి మాత్రం వసంతమన్నది లేదని తొలి రాసిందెవరు?’ అనేది! ఇది ‘గాలిపటాలు’లో కనిపించే, ఆ చిత్రం కోసం ఆత్రేయ రాయని పాట!
ఇంకా- అజ్ఞాతాలు, అసంపూర్ణాలు, అన్యధా వినియోగాలు... అయిన ఆత్రేయ గీతాలు మరికొన్ని వుండొచ్చు. భావి పరిశోధకులు వాటిని వెతికి వెలికి తీసి నిజానిజాల నిగ్గుతేల్చగలిగితే- ఆత్రేయ సాహితికి సమగ్రత సిద్ధిస్తుంది. ఆత్రేయ అభిమానుల నుండి అటువంటి కృషిని ఆశిస్తూ-ఇప్పటికి ఆత్రేయుడికీ నూలుపోగు! (నిర్మాత మురారి, సంభాషణల రచయిత సత్యానంద్‌గార్ల సమాచారానికి కృతజ్ఞతలతో..)

- డా.పైడిపాల