సబ్ ఫీచర్

గెలుపు తీరాలకు ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదృచ్ఛికంగా మొన్నీమధ్యనే ఒక సినిమా చూశాను. ఆ సినిమా కథలో హీరో ఎందుకు పనికిరాకుండా తిరుగుతుంటాడు. హీరోయిన్ మాత్రం బాగా చదువుకుంటుంది. ఆమె ఇతగాడికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురించి చెప్పి, అటువంటి క్లాసులో చేరమని ప్రోత్సహిస్తుంది. అతను చేరతాడు, చదువుతాడు. అయినా ఆశించిన ఫలితాలేవీ రావు. చివరికి వీటివల్ల ప్రయోజనం ఏమి ఉండదని నిర్ణయానికి వచ్చి, తండ్రి ఇంటిలోంచి గెంటేస్తే అతను బయటకు వెళ్లిపోయి, వేరే ఊళ్ళో టాక్సీ డ్రైవర్‌గా స్థిరపడిపోతాడు. ‘‘మనకు ఏది నచ్చితే అది చేసేయాలి. ఆనందంగా బతికేయాలి’’, టూకిగా అది మనకొచ్చే సందేశం. ఆనందంగా బతికెయ్యడానికి మనం విజయం సాధించాలి. డబ్బు గడించాలి. గౌరవం సంపాదించాలి వంటి విషయాలు ఈ కథ పరిధిలో లేవు. పైన చెప్పిన సందేశం సరైనదేనా ? చెప్పండి... ఈమధ్యకాలంలో వ్యక్తిత్వ వికాసం పేరిట కుప్పలు తెప్పలుగా పుస్తకాలు వెలువడ్డాయి. చాలామంది సెమినార్లు నిర్వహించారు, కార్పొరేట్ సంస్థలు, కళాశాలలు వాళ్ళ ఉద్యోగులు, విద్యార్థుల గురించి చాలా డబ్బు ఖర్చు చేసాయి. అయితే చెప్పుకోదగ్గ పురోగతి కనిపిస్తోందా? మేం ఫలానా విధంగా లాభపడ్డాము అని ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పిన దాఖలాలున్నాయా? ఆలోచించండి. ఇంతకీ వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటో చూద్దాం. పదండి. అది చదివితే, వింటే మనకొచ్చే లాభం ఏమిటి? ఒక వ్యక్తిగా మన వైఖరిలోను, మన స్వభావంలోను మార్పు వచ్చి, తద్వారా మన ప్రవర్తన మారి అది మన పురోగతికి తోడ్పడితే అటువంటి వివరాలనిచ్చే చదువునే వ్యక్తిత్వ వికాసం అనవచ్చు. ఇప్పట్లో ఈ విద్య మీద చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని బోధించేవాళ్ళు ఎటువంటి విషయాల గురించి చెబుతారు? జీవితంలో సకారాత్మకంగా ఉండడం ఎట్లా, ఉన్నత ఆశయాలు ఏర్పరచుకోవడం ఎలా, వాటిని సాధించుకోవడానికి చేయవలసిన కృషి తదితర విషయాలు కూలంకషంగా చర్చిస్తారు. అంతవరకూ బాగానే వుంది. అయితే ఎందుకు అందరూ సత్ఫలితాల్ని పొందలేక పోతున్నారన్నది ఇపుడు అందరినీ వేధించే ప్రశ్న అవుతోంది.
జీవితంలో ఎక్కువగా విజయం సాధించనివాళ్ళని ఎవరినైనా అడిగి చూడండి, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని. వాళ్ళు కనీసం పది కారణాలు చెబుతారు. తల్లిదండ్రుల పెంపకం, వారి బీదరికం, అసహాయత, కుటుంబ పరిస్థితులు, సరైన టీచర్లు లేకపోవడం, అసమర్థ ప్రభుత్వం, దేశ ఆర్థిక పరిస్థితులు, పనిచేసే కంపెనీ పాలసీలు, బాస్ వ్యవహార శైలి- వగైరా ఇంకా ఎన్నో కారణాలు ఈ జాబితాలో చేర్చవచ్చు.
విచిత్రం ఏమిటంటే ఈ జాబితాలో తన పేరు మాత్రం కనపడదు. నిజానికి పైన చెప్పిన లిస్టులో ఏ విషయాన్నీ మనం మార్చలేము. ఒక నిర్దిష్ట లక్ష్య సాధన కోసం, తనని తాను మెరుగుపరచుకోవడం మీద కృషి చేసేవాడు, అవరోధాల్ని అధిగమించి విజయం వైపు అడుగులు వేస్తాడు. తను మారితేనే తన జీవితం మారుతుంది అని గుర్తిస్తాడు. ఎలాగోలా బతికేద్దాం అనుకున్నవాడు చతికిలపడిపోతాడు.
కాకపోతే టాక్సీ డ్రైవరుగా మిగిలిపోతాడు. వ్యక్తి వికాసం బోధించేవాళ్ళు దీనికి సంబంధించిన సూత్రాలు చెబుతారు, ఆచరించవలసిన పద్ధతులు చెబుతారు. ఇంతకుముందు విజయం సాధించిన వాళ్ళ ఉదాహరణలు ఇస్తారు. మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది ఒక నైపుణ్యం. అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మన నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. ఆచరించవలసిన బాధ్యత ఎవరిది? విద్యార్థిది. ఒక విద్యార్థి తనకున్న పరిసరాల్లో, వాతావరణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని, నిర్విరామంగా తను నేర్చుకున్న సూత్రాల్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే కొంత కాలానికి అతను సహజంగా, ఆశించిన విధంగా ప్రవర్తించగలుగుతాడు. అది అంత సులువైన విషయమా? కాదు, ఉదాహరణకి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తలు పాటించాలి. చెడు అలవాట్లు మానుకోవాలి. వ్యాయామం చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా! ఎంతమంది నిజంగా చేస్తున్నారు? అందరూ మొదట్లో ఉత్సాహంతోనే మొదలుపెడతారు. తరువాత నెమ్మది నెమ్మదిగా సడలించేస్తారు. మనం దృఢ నిశ్చయంతో, క్రమశిక్షణతో ఉంటేగాని ఏమీ సాధించలేం- ఆరోగ్యం విషయమైనా, వ్యక్తిత్వ వికాసమైనా. ఈ వ్యక్తిత్వ వికాసం మనకు అబ్బింది అనడానికి తార్కాణం ఏమిటి?
మనం చేసే ప్రతి పనిలో, నిన్నటికన్నా ఈ రోజు కనిపించే మెరుగుదల, సామర్థ్యం, ఉత్పాదకత పెంపు- వీటి ప్రభావం మెరుగైన మన జీవనశైలిలో చూడవచ్చు.

--డి.ఎస్.ఎస్.రామం