విజయ మార్గం

హ్యాపీ టెక్నిక్‌తో ఆనందం

  • - హిప్నో కమలాకర్ కౌన్సెలింగ్ సైకాలజిస్టు మాస్టర్ మోటివేటర్ సెల్: 9390044031
  • 03/02/2012

చాలామంది అంటూ వుంటారు ‘‘వ్యక్తిగా బతకడం సులువే. వ్యవస్థగా బతకడం కష్టం’’ అని. ఈ వాక్యంలో మనకు రెండు పదాలు ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. ‘‘వ్యక్తి - వ్యవస్థ’’. మీరు ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టారనుకుందాం. అది చాలా చిన్న వ్యాపారం కావచ్చు. కోట్లాది రూపాయలతో కూడిన ప్రాజెక్టు కావచ్చు. ఏదైనప్పటికీ, ఈ వ్యాపారంలో విజయం పొందటానికి, లాభాలను సమృద్ధిగా సాధించడానికి మీరు ఒక వ్యవస్థను ఏర్పరచుకుంటారు. ఈవ్యవస్థలో మీరు కాక ఇతర కొంతమంది నిపుణులైన వ్యక్తులను నియమిస్తారు. వారంతా నియమిత బాధ్యతను చేపట్టి, ఒక క్రమానుగత శ్రేణిలో తమ ప్రజ్ఞాపాటవాలను కనబరుస్తూ మీ అందరి ఉమ్మడి లక్ష్యాల సాధనకై పరితపిస్తాడు. దీనినంతటినీ మీరు పైనుండి పర్యవేక్షిస్తారు. పాలిస్తారు. నియమబద్ధం చేస్తారు. దీనినే ఆర్గనైజ్ చేయడం అని అంటారు. మీ ప్రతిభాపాటవాలను గరిష్ట స్థాయిలో పెట్టుబడి పెట్టే మీ బృందాన్ని ఆర్గనైజేషన్ అని అంటారు. సమర్థవంతంగా మీరు దానిని నడపగలిగే స్థితిని చేరుకోవడాన్ని ఆర్గనైజ్డ్ అని అంటారు. ‘వ్యవస్థ’ అనేసరికి, ఈ వ్యవస్థీకృత విధానం అదంతట అదే ఏర్పడిపోతుంది. కాగా ఈ దృష్టిలో ఒక వ్యక్తికూడా వ్యవస్థతో సమానమే. మనిషిలో శరీరం, మనసు అని రెండు ప్రధాన భాగాలు వుంటాయి. వీటి మధ్య సమన్వయం లోపించినపుడు ఈ రెండు వ్యవస్థలూ దెబ్బతింటాయి. ఒకరు చేసిన పనికి మరొకరు కష్టాల పాలైనట్లు, శరీరం అపవ్యవస్థకు లోనయితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మనసు బాగోకపోతే శరీరం పనిచేయదు. ఇవి రెండూ కీలక వ్యవస్థలు కాగా, వీటిలో ఉపవ్యవస్థలు అనేకం. శరీరంలో జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ వంటి ఎన్నో వ్యవస్థలు ఏ బ్రాంచికి ఆ బ్రాంచి వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తుంది. అట్లాగే మనసులో కూడా ఎన్నో వ్యవస్థలు, ఆలోచనా వ్యవస్థ, అంతరంగం, చేతనం, ఉపచేతనం, దమనభావాలు వగైరా వగైరా వ్యవస్థలు అన్నీ కలగలిపి ఉంటాయి. వీటన్నిటిపైనా అజమాయిషీ కలిగి వుండడం ముఖ్యం.
ఒక ప్రభుత్వం ముందుకు పోవాలంటే, పాలనా వ్యవస్థలో సమన్వయం ఎంత అవసరమో, వ్యక్తి ముందుకు పోవాలన్నా, వ్యవస్థీకృతంగా వ్యవహరించాలి. తనలోని ప్రతీ విభాగం, గరిష్ట స్థాయిలో పనిచేసేలా అన్నిశాఖల మధ్య చక్కని సమన్వయం ఏర్పడే విధంగా వ్యవస్థీకరించాలి. మిమ్మల్ని మీరు వ్యవస్థీకరించుకోవడం కాబట్టే ఈ ప్రక్రియ సెల్ఫ్ - ఆర్గనైజేషన్ థియరీ అని అంటారు. ఒక వ్యవస్థగా (ఒక ఆర్గనైజేషన్‌ని బట్టి) బతకటానికి ఏదో ఒక శాఖలో నిపుణత వుంటే చాలు. పని జరిగిపోతూ వుంటుంది. కానీ ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా తనలోని ఒక వ్యవస్థను, వ్యవస్థీకృతంగా ఆర్గనైజ్ చేసుకోగలగడం చాలా సంక్లిష్టమైన చర్య. ఈ కోణంలో ఆలోచిస్తే వ్యవస్థకన్నా, వ్యక్తిగా బతకడమే కష్టం. కాగా ప్రతీ వ్యక్తిలోనూ, తనను తాను వ్యవస్థీకరించుకోవడం లేదా, ఆర్గనైజ్డ్‌గా వుండడం అంటే కొన్ని అపోహలు వుంటాయి. ఈ అపోహల కారణంగా వ్యవస్థీకరణ సక్రమమైన స్థాయిలో ఏర్పడకపోవడం తటస్థిస్తుంది. విజయం సాధించడం, అందరిలోకన్నా నెంబర్‌వన్‌గా వుండడం కైవశం చేసుకోవాలంటే ఈ దురభిప్రాయాలను ప్రతి ఒక్కరూ అధిగమించాలి. వీటిల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను ముచ్చటించుకుందాం. ఆర్గనైజ్డ్‌గా వుండడం అంటే..?
1. నీట్‌గా వుండడం
అఫ్‌కోర్స్ నీట్‌నెస్ ఆర్గనైజేషన్‌కు కావాల్సిందే. అన్నీ అందంగా అమర్చుకోవడం నీట్‌నెస్‌ని ప్రతిఫలిస్తుంది. అయితే మీకు అవసరమైనవి వెంటనే మీకు అందుబాటులో లేకపోతే నీట్‌నెస్ ప్రయోజనం దెబ్బతింటుంది. అంచేత ఆర్గనైజ్డ్‌గా వుండేందుకు నీట్‌గా వుంటే మాత్రమే సరిపోతుందని భావించకండి. నీట్‌గా వుండడం ఫలితంగా మీరు అసంతృప్తికి, చికాకుకు లోనవ్వకూడదు.
2. శుభ్రంగా వుండడం
వ్యవస్థీకరణలో దీనికి కూడా ప్రాధాన్యత వుంది. అయితే శుభ్రంగా వుంటూ కూడా మీరు అవ్యవస్థీకృతం కావచ్చు. ఉత్పాదకతను సాధించలేని మనోశక్తులు ఎంత పరిశుభ్రమైనవి అయినప్పటికీ వాటివల్ల ప్రయోజనం శూన్యం.
3. ప్రణాళికాబద్ధంగా వుండాలి
ఆర్గనైజ్డ్‌గా వుండడం అంటే మనిషి తన జీవితంలో ప్రతి నిమిషం ప్రతిక్షణం, ప్రతిరోజూ నిర్మాణాత్మకంగానూ, ప్రణాళికాబద్ధంగాను వుండాలనేది ఒక అభిప్రాయం. నిజమే, ప్రణాళిక లేనిదే మనం ఎప్పుడూ ఏం చేయాలో నిజంగా బోధపడదు.
అయితే ఈ ప్రణాళికను రూపొందించుకోవడం ఒక కళాత్మక చర్య వంటిదని గుర్తించాలి. మీ దైనందిన కార్యక్రమాల్లో మీరు ఎక్కువ పనులను పూర్తిచేయడం ఒక పరిమితిగా పెట్టుకోరాదు. ఎక్కువ ఉపయుక్తమైన కార్యక్రమాలను పూర్తిచేయడం పట్ల దృష్టి పెట్టాలి. మీ దైనందిన జీవితాన్ని లెక్కకు మించిన కార్యక్రమాలతో కుక్కేయకండి. ఎపుడూ మీ మానసిక వ్యవస్థపై అతిభారం మోపకూడదు. మీ ప్రణాళికా సామర్థ్యం ప్రదర్శించేటపుడు మీ వ్యక్తిగత తులనాత్మకత చాలా ముఖ్యమని భావించండి. సమయస్ఫూర్తితో మీరు మీ మనస్సుని వ్యవస్థీకరించుకోవాలంటే, మీ ప్రణాళికలు ఒక తీవ్రమైన అవరోధంగా అడ్డురాదు.
4. ఎవరో కొంతమంది వ్యక్తులకే ఇది సాధ్యం
ఈ అభిప్రాయం కూడా అపోహగానే భావించాలి. ఆర్గనైజ్డ్‌గా వుండడం పుట్టుకతోనే వచ్చే ఆస్తి కాదు. ఎవ్వరూ నిపుణులుగా పుట్టరు. ఎదిగే క్రమంలో నిపుణత్వాన్ని సాధిస్తారు. ఈ ప్రపంచంలో తమను తాము ఆర్గనైజ్డ్ చేసుకోలేని వ్యక్తులు చాలా అరుదుగా వుంటారు. మానసికంగా బాగా ఆరోగ్యం దెబ్బతిన్నవాళ్ళు సైకోసిస్ వంటి భయంకరమైన వ్యాధులకు లోనయినవాళ్ళు, శారీరకంగా దీర్ఘకాలం పాటు జబ్బుపడినవాళ్ళు తదితర సమస్యలతో నిరంతరం స్థానులైన వారు మాత్రమే తమను తాము ఆర్గనైజ్ చేసుకోలేని దుస్థితిలో వుంటారు.
వీరి విషయం పక్కన పెడితే, మిగిలిన వాళ్ళంతా తమను తాము వ్యవస్థీకరించుకోవడంలో, అసమాన ప్రతిభా సామర్థ్యాలను కనబరచగలరు. ‘‘ఎవరో ఫలానా టైపు వ్యక్తులే ఆర్గనైజ్డ్‌గా వుండగలరు. పైగా అవ్యవస్థీకృతంగా వుండడం ఒక జబ్బు కాదు.
ఒక నిర్ణయం, మీరు తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయం మీరు చేతనాపరంగా స్పృహ కలిగివున్న స్థితిలో తీసుకున్న నిర్ణయం కావచ్చు లేదా మీకు తెలియకుండా, మీ అంతరంగం ప్రేరణ మూలంగా ఏర్పడినదైనా కావచ్చు. ఏదైనప్పటికీ ఇది మీరు స్వయంగా చేసుకున్నదే తప్ప మీలో అసమర్థత కారణంగానో, లోపం కారణంగానో ఏర్పడేది కాదు.
==================

పెళ్లికి పెద్దలను ఎలా ఒప్పించాలి?
మీ ప్రశ్నలకు హిప్నో కమలాకర్ సమాధానాలు
ప్రశ్న: అతను నాకు ఇంటర్‌లో పరిచయమయ్యాడు. నేను నాకు తెలియకుండానే అతని పట్ల ఆకర్షితురాలినయ్యాను. తర్వాత మేం ఇద్దరమూ గాఢంగా ప్రేమించుకున్నాం. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అతనిది విచిత్రమైన మనస్తత్వం. ఏ పనిని తనంతట తానుగా పూనుకుని చేయడు. ఇప్పుడు మా పెళ్లికి కూడా ఇరుపక్షాల వారిని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత నాదే. నేనేం చేయాలి?
-కావ్య, తుని
జవాబు: ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారో రాయలేదు. మీరు ఇంకా చదువు కొనసాగిస్తున్న దశలోనే ఉంటే ఈ ప్రేమ వ్యవహారానికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. మంచి మార్కులతో పాసు కావడం, మంచి ఉద్యోగాన్ని సంపాదించడం ఎలాగో ఆలోచించండి. చదువుకుంటున్న దశలో మీరు దృష్టి పెట్టాల్సింది చదువు, కెరీర్ మాత్రమే. ఒకవేళ మీ చదువు ఈ పాటికే పూర్తయి, పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నవారయితే మీరు ప్రేమిస్తున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవడంపై పునరాలోచన చేయండి. ప్రేమ వేరు, పెళ్లి వేరు. ప్రేమలో చాలా అద్భుతంగా ఉన్నట్టుగా అన్పించినా విషయాలు, పెళ్లయ్యాక అసలు సిసలు కష్టాలు మొదలయ్యాక, అవి అంత అద్భుతాలను పంచివ్వలేకపోవచ్చు. అంతేకాక మీరు ప్రేమిస్తున్న వ్యక్తి డిపెండెంట్ మనస్తత్వం కలవాడు. దానివల్ల మీకు మున్ముందు చిక్కులు ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీ పెళ్లి విషయంలో మీ తల్లిదండ్రులకు కూడా సముచితమైన స్థానాన్ని ఇచ్చి మంచి నిర్ణయం తీసుకోండి.

మీరూ రాయండి
విద్యార్థినీ విద్యార్థులు నిరంతరం ఎదుర్కొనే మానసిక సమస్యలు, సామర్థ్య లోపాలు, నేర్చుకోవటంలోను- నేర్చుకున్న వాటిని ప్రదర్శించటంలోను... ఎదురయ్యే ఇబ్బందులు, కెరీర్‌ని నిర్మించుకోవటంలో ఏర్పడే ఆటంకాలు గురించి మాకు రాయండి. ప్రఖ్యాత కౌనె్సలింగ్ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు హిప్నో కమలాకర్ మీకు పరిష్కారాలను సూచిస్తారు.
sadhana@deccanmail.com
ఎడిటర్, సాధన, ఆంధ్రభూమి,
36, సరోజినీదేవిరోడ్, సికిందరాబాద్-3.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading