సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

986. లేక యుద్ధమునకు రాదలంచుకొన్న
నాప్తులందరి కడసారి జూచి యంత్య
కర్మలను పూర్తిజేసుక రమ్ము లంక
రాజ్యము విభీషణుండు పాలించునింక’’

987. అంత నంగదుండు రావణుకొలువులో
నడుగుబెట్టి రామచంద్రుమాట
నొక్క యక్షరమ్ము పొల్లబోనివ్వక
జెప్పె రావణునకు దర్పమొప్ప

988. ‘‘రావణా! నిన్ను తోకకుజుట్టి నూపి
రాడకుండ జేసిన వాలిసుతుడ నన్ను
అంగదుండండ్రు ఖరదూషణాది రాక్ష
సులను దునిమిన శ్రీరామ సేవకుడను

989. కపట సన్యాసి వేషముబూని యాశ్ర
మంబునందొంటిగా నున్న రాముపత్ని
నపహరించి దెచ్చితి విది పోటుతనమె
వచ్చె రఘుపతి నిన్ను శిక్షింప నిపుడు

990. వింటివికద రావణ! రామవాక్యములను
ధరణిజాతను యర్పించి దాశరధికి
నఘము బాపుక శరణని ప్రాణరక్ష
జేసుకొను‘‘మని జెప్పలంకేశ్వరుండు-

991. క్రోధతామ్రాక్షుడౌచు రుూ కపినిబట్టి
సంహరించుడి యనుచు గర్జింప నల్వు
రసుర వీరులు నంగదు బట్టుకొనిరి
హరిమృగేంద్రుడు బట్టుబడ్డట్టులుండి

992. నల్వురన్ బాహువుల నిరికించి గగన
వీధికెగసి యచ్చటనుండి విడిచెవారి
అందరాశ్చర్యమున జూచుచుండ భవన
శిఖరమును నొక్కతాపున గూల్చివేసి

993. రావణాసురునట్లు పరాభవించి
సింహనాదముజేసి శ్రీరామభద్రు
ముందునిల్చె రావణుని దుర్ణయమువిన్న
కమలనయనుని కనులు పింగళములయ్యె

994. దారుణ ప్రతాపుడు ధర్మరక్షకుండు
రాఘవుడు లంకముట్టడి కాజ్ఞనిచ్చె
కదలె వానర బృందము లంక నాశ
నమ్మునకు సింహనాదముల్మిన్ను ముట్ట

995. వానరుల ముఖములు ప్రసన్నతను నొప్పె
ముక్తకంఠంబులను రామలక్ష్మణులకు
జయము వానరేశ్వరుడు కిష్కింధపతికి
జయము జయమంచు జయ నినాదముల జనిరి

996. వారి కోలాలంబున కదరె దిశలు
లంకలో కాలమేఘాల వంటి రజని
చరులు యుద్ధ్భేరులు శంఖనాదములను
యుద్ధకళ్యాణమునకు సంసిద్ధులైరి

997. వారణంబుల ఘీంకృతులవ్వహేష
రావములు భూరిరధనేమి ఘోష లంబ
రంబునంటగ గదలిరి రాక్షసాళి
పురకవాటముల్ దెరచు కపులుల వోలె

998. తలపడిరి రాక్షసులు కపీంద్రులతో ననికి
సూర్యజు నెదిరించె ప్రహస్తుండు నంత
తాళవృక్షంబు పెకిలించి విసిరి వివశు
జేసె వానరేశ్వరుడు ప్రహస్తునంత

999. లక్ష్మణుడు విరూపాక్షు పరాస్తు జేసె
వజ్రముష్టిని మైదుడు వజ్ర సదృశ
ముష్టిఘాతముతో యమపురికి నంపె
నీలుడు నికుంభు రధసారధిని వధించె

1000. సంకుల సమర మిరుపక్షములకు జరుగ
కడలి ఘోషను మించు గర్జనలతోడ
వజ్రదంష్ట్ర మహాపార్శ్వయజ్ఞ శత్రు
లును మహోదరులొక్కటై రామచంద్రు
దాక త్రుటిలో వారల నుక్కడంచె విభుడు

1001. అనుచర సహితుడై యంగదుండసురుల
హతమొనర్చును తీవ్ర క్రోధమున ఇంద్ర
జిత్తు రధమును నుగ్గుగావించ నెగసె
నంబరంబుకు నసుర వల్లభుని సుతుడు

1002. అచటనుండి యదృశ్య రూపమున వాడు
బాణవర్షము గురియింప వర్షకాల
మందు జలధారలు గిరుల ముంచునట్లు
గుప్పివైచెను వానర బలమునంత

1003. రామలక్ష్మణులను శక్తివంతమైన
నాగపాశమును ప్రయోగించి వారి
వివశుల నొనరించి నిశిత బాణములను
దేహములు రక్త్ధారలుగార నేసి

1004. పది శరమ్ముల నీలుని జాంబవంతు
నొక్క వాడిబాణమ్మున నగములవలె
నున్న మైందద్వివిదుల రెండేసి బాణ
ములను వేధించి యంగదునలయ ఏసి

1005. సింహనాదముజేయ రాక్షసులు హర్ష
మున జయజయ శబ్దమ్ముల మేఘనాధు
నెంతో కొనియాడిరి విజయగర్వమునను
నరుల గూల్చితినని తండ్రితోడ జెప్పె

--టంగుటూరి మహాలక్ష్మి