సుమధుర రామాయణం

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

486. ఆ మహాకాయు చెంత నిద్రించుచున్న
పసిడికాంతుల సౌందర్యవతిని పట్ట
మహిషి మండోదరిని జూచి మైథిలి యని
హనుమ యుప్పొంగె నతిసంతసమ్ముతోడ

487. క్రిందికిన్దూకి గంతులు వేసి తోక
గిరగిరన్ ద్రిప్పి నేలకు గొట్టి వాన
ర స్వభావము బ్రకటించి మరు నిమేష
మందు సిగ్గున తన తప్పిదమ్ము దెలిసి

488. రాఘవుని ధర్మపత్ని సురేంద్రునైన
కన్నులం జూడదన్న నీ యసురవిభుని
శయనమున నెట్లు జేరు నీ సుదతి వీని
పత్నులందున నొక్కతై యుండ నోపు

489. అని దలంచుచు పవమాననందనుండు
ఆట పాటల నలసి మేనులను మరచి
నర్ధనగ్నంబుగా గాఢ నిద్రనున్న
వనితలం జూచి మనసు చివుక్కుమనగ

490. ఇట్ల ధర్మముగను పరస్ర్తిల జూచి
నాడ నిది యెంత దోషవౌనంచు దలచి
యేవికారము లేక నే నవనసుతను
వెదకుచును జూచితి నచలచిత్తమునను

491. అనుచు ధీరుడు పవనజుండచట నున్న
చిత్ర మండపములు లతాగృహములన్ని
జూచి యెందును జానకి జాడ దెలియ
కమ్మహాత్ముడు నిర్వేదనము జెంది

492. సీత లేదను వార్త విన్నంత రామ
చంద్ర ప్రాణముల్ నిలువవు నయోధ్యలోన
నంద రిహలోకమును విడిచెదరు నపుడు

493. ప్రాణమిత్రుడు రాముడు మేను వదల
మిత్ర సుతుడును మరణించు నతని తోడ
రుమయు తారయు నంగదు డాది సకల
కపులు మరణింత్రు గిరులపైనుండి దూకి

494. గాన కిష్కింధకు న్బోవజాల నేను
రామ రవిజులు నా కొర కాశతోడ
యెంత కాలమైన యెదురు జూచు వారు
హనుమ సీతను జూచి యేతెంచు ననుచు

495. ఇచ్చటనె నేను వానప్రస్థాశ్రమమున
జీవితమ్మును గడపెద లేక యగ్ని
కాహుతయ్యద నని యింత తడవు వగడచి
అన్నిటికనర్ధమీ దుఃఖ మనుచు దలచి

496. హృదయ దౌర్బల్య మపకీర్తి హేతువండ్రు
నా పరాక్రమమున డైత్యనాధు బట్టి
బంధితుం జేసి గొంపోయి భూమిజపతి
పాదముల బడ వైతు నక్కితపు ననుచు

497. ముందుకు న్జని ఇంతకుముందు జూడ
నట్టి ప్రమదావనంబును జూచి హనుమ
మేను పులకింప ధారుణితనయ యిందు
నిశ్చయంబుగ గనుపించునని దలంచె

498. రామలక్ష్మణులకు జయమనుచు మ్రొక్కి
జనక రాజనందనకు నంజలి ఘటించి
రుద్ర మ, వరు, ణాదిత్య, ఇంద్ర, చంద్రు
లకును పితృదేవుడౌ ననిలునకు మ్రొక్కి

499. నారి సారించి విడిచిన శరము రీతి
వనమునం బ్రవేశించి వృక్షంబుశాఖ
లందు లంఘింప నా యలజడికిపక్షు
లెల్ల మేల్కాంచి కిలకిలారవము జేసె

500. వాని పక్షంబులను దాకి వూగినట్టి
పూల కొమ్మలు హనుమపై పుష్పవృష్టి
గురిసె పుష్పదేహముతో వసంతు బోలి
గానుపించెను కరువలి కొమరు డపుడు
*

టంగుటూరి మహాలక్ష్మి