క్రైమ్ కథ

దయ్యాల మేడ (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రిట్జ్‌రాయ్ తన మిత్రుడితో ఆనందంగా చెప్పాడు.
‘ఈ ఇల్లు మన అవసరాలకి సరిపడేలా ఉంది’
ఆ పాత ఇంట్లోని ప్రతీ గదిని, బేస్‌మెంట్‌ని చూశాక స్టీవెన్ చెప్పాడు.
‘అవును. దీన్ని వెంటనే అద్దెకి తీసుకుందాం. నువ్వూ, మీ ఆవిడ పై అంతస్థులో కాపురం ఉండచ్చు. బేస్‌మెంట్ మన పనికి అనుకూలంగా ఉంటుంది’
ఆ ఇంటి పక్క ఇంటి వాళ్లు వచ్చి అడిగారు.
‘ఈ ఇంటి తాళం చెవి ఎవరిచ్చారు? మీరు లోపలికి ఎలా వచ్చారు? ఈ ఇంటికి అద్దెకి తీసుకోవాలని అనుకుంటున్నారా?’
‘అవును. ఇంటి యజమానే తాళం చెవి ఇచ్చాడు’
‘ఈ ఇల్లు సంవత్సరంగా ఖాళీగా ఉంది. పూర్వం దీంట్లో దిగిన ముగ్గురూ నెల తిరక్కుండానే ఖాళీ చేసేశారు’
‘దేనికి?’
‘ఇందులో దెయ్యం తిరుగుతోందని వాళ్లు చెప్పారు’
మిత్రులు ఇద్దరూ ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు.
‘్థంక్స్. కాని మాకు దెయ్యాల మీద నమ్మకం లేదు’ ఫ్రిట్జ్‌రాయ్ చెప్పాడు.
‘రాయ్! మీ ఆవిడకి దెయ్యం గురించి చెప్పక. భయపడుతుంది’ స్టీవెన్ హెచ్చరించాడు.
‘అలాగే. జూలీకి అది తెలియాల్సిన అవసరం లేదు’ ఫ్రిట్జ్‌రాయ్ కూడా ఒప్పుకున్నాడు.
ఇద్దరూ ఆ ఇంట్లోంచి బయటికి వచ్చారు.
* * *
ఫ్రిట్జ్‌రాయ్ దంపతులు, స్టీవెన్ ఆ పురాతన భవంతిని అద్దెకి తీసుకుని దిగారు. మధ్యాహ్నం స్టీవెన్ ఓ పికప్ వేన్‌లో చిన్న ప్రింటింగ్ యంత్రాన్ని తీసుకువచ్చాడు. వాళ్లు మినీ ప్రింటింగ్ ప్రెస్‌ని బేస్‌మెంట్‌లో అమర్చడానికి దాన్ని శుభ్రం చేస్తూండగా జూలీ వాళ్లకి ఛీజ్ సేండ్‌విచెస్‌ని చేసి తెచ్చిచ్చింది.
‘మీరిద్దరూ దీని కోసం కదా ఈ దెయ్యాల కొంపని అద్దెకి తీసుకుంది?’ ఆ ప్రెస్‌ని చూసి నవ్వుతూ అడిగింది.
‘దెయ్యాల కొంపా? నీకెవరు చెప్పారు?’ ఫ్రిట్జ్‌రాయ్ నివ్వెరపోతూ అడిగాడు.
‘ఎవరూ చెప్పలేదు. నాకు ఎందుకో దీన్ని చూస్తే అలా అనిపించింది.
వంటగదిని శుభ్రం చేయడానికి నాకు రెండు రోజులు పట్టేట్టుంది. మిగిలిన అన్ని గదులని కూడా మీరు శుభ్రం చేయాలి. నా ఒక్కదానివల్లా కాదు’
‘అలాగే డియర్’ ఫ్రిట్జ్‌రాయ్ చెప్పాడు.
జూలీ వెళ్లాక స్టీవెన్ ఓ బ్రీఫ్‌కేస్‌ని తెరచి చూస్తూ చెప్పాడు.
‘ఎంత అందంగా ఉన్నాయి ఈ ప్లేట్స్? కదా? వీటిని ప్రింటింగ్ యంత్రంలో అమర్చగానే ఇరవై డాలర్ల నోట్లని ప్రింట్ చేస్తాయి. నిపుణులు కూడా తేడాని కనుక్కోలేని విధంగా వీటిని తయారుచేశాను’
‘అచ్చయ్యాక ఆ నోట్లని మనం ఏం చేయాలి?’ రాయ్ అడిగాడు.
‘శామ్ ఆ సంగతి చూసుకుంటాడు. మనకి ఇరవై శాతం చెల్లిస్తాడు’
‘ఇరవై శాతమేనా?’
‘అవును. రెండున్నర లక్షల డాలర్ల నోట్లకి మనకి ఏభై వేల డాలర్ల మంచి నోట్లు ఇస్తాడు. వాటిని మనం పంచుకుంటే తలో పాతికవేల డాలర్లు వస్తాయి’
‘ఇది చాలా తక్కువ’ ఫ్రిట్జ్‌రాయ్ అసంతృప్తిగా చెప్పాడు.
‘చాలా అన్యాయం అని కూడా తెలుసు. కాని ఆలోచించు. మనం చేసే ఖర్చుకన్నా వందల రెట్లు మనకి లాభం వస్తోంది. ఏ ఫేక్టరీకి ప్రపంచంలో ఇంత లాభం రాదు. పైగా దీనివల్ల మనం జైలుకి దూరంగా ఉండచ్చు. వాటిని మారుస్తూ పట్టుబడ్డవారు అవి శామ్ నించి తమకి వచ్చాయి అని చెప్తారు తప్ప మన పేర్లు బయటికి రావు. అతను ఆ నోట్లని ఏభై శాతం లాభానికి అమ్ముతాడు. అంటే అతని లాభం ముప్పై శాతం. మనకన్నా పది శాతం అధికంగా తీసుకోడానికి ఆ రిస్కే కారణం. ఈ వ్యాపారంలో అమెరికాలో పద్ధతి ఇది’
ఫ్రిట్జ్‌రాయ్ అతను చెప్పింది సబబని అనుకున్నాడు.
* * *
‘మీరేం ప్రింట్ చేస్తారు?’ జూలీ మధ్యాహ్నం లంచ్ సమయంలో వాళ్లని అడిగింది.
‘అవీ ఇవీ’ ఫ్రిట్జ్‌రాయ్ దాటేశాడు.
‘ప్రింటింగ్ మెషీన్ బిగించారా?’
‘అప్పుడేనా? రెండు మూడు రోజులు పడుతుంది’
వాళ్లు మళ్లీ పనిలోకి దిగాక జూలీ వంటగది శుభ్రం చేయసాగింది.
‘జూలీ!’ ఓ కంఠం వినిపించింది.
జూలీ చుట్టూ చూసింది. ఎవరూ లేరు. మళ్లీ ఆ పిలుపు వినపడటంతో జూలీ బయటికి వచ్చి చూస్తే ఎవరూ కనపడలేదు.
‘రాయ్! పిలిచావా?’ పైనించి అరిచింది.
‘లేదు’ బేస్‌మెంట్ నించి రాయ్ జవాబు వినిపించింది.
‘సరే. పిలిచినట్లు వినిపిస్తే...’
మళ్లీ వంట గదిలోకి వచ్చాక ఇంకోసారి వినిపించింది.
‘జూలీ!’
ఆ కంఠం రాయ్‌ది కాదని గ్రహించింది.
‘ఎవరు?’ చుట్టూ చూసి ఆశ్చర్యంగా అడిగింది.
‘దెయ్యాన్ని’
‘దెయ్యమా?’
‘అవును’
‘కనపడవే?’
‘దెయ్యాలు వినపడతాయి కాని కనపడవు’
‘ఎవరు నువ్వు?’
‘నా పేరు నోవా. నువ్వు నాకో సహాయం చేయాలి జూలీ’
‘ఏమిటది?’ జూలీ దెయ్యంతో మాట్లాడుతున్నాననే ఉత్సాహంతో అడిగింది.
‘ముందుగా నా కథ చెప్తాను. చాలా ఏళ్ల క్రితం ఈ ఇంటిని నేను కట్టించాను. నేను, నా భార్య ఇందులో ఉండేవాళ్లం. నా మిత్రుడు వచ్చి నాతో ఈ ఇంట్లో ఉండసాగాడు. అవి మిత్రులు ఎన్ని వారాలు ఉన్నా వెళ్లమని చెప్పే రోజులుకావు. నా మిత్రుడికి, నా భార్యకి అక్రమ సంబంధం ఉందని ఓ రోజు నాకు తెలిసింది జూలీ...’
‘అయ్యో! తర్వాత?’
‘నాకు కోపం రావడం సహజం. వాళ్లిద్దర్నీ నిలదీశాను. నిజమేనని ఒప్పుకున్నారు. నా భార్యకి విడాకులు ఇస్తానని చెప్పాను. కాని ఆ రాత్రే వాళ్లిద్దరూ కలిసి నన్ను చంపారు’
‘దేనికి?’
‘విడాకులు ఇస్తే ఈ ఇల్లు కాని, నా ఆస్థిలో కాని సంపాదనలో కాని నా భార్యకి సగం భాగం మాత్రమే వెళ్తుంది. అదే నేను మరణిస్తే ఆ మొత్తాన్ని ఆమె అనుభవించచ్చు’
‘ఓ! వారు ఇద్దరూ దుర్మార్గులన్నమాట’
‘అవును. చంపి నా శవాన్ని ఈ ఇంట్లో బేస్‌మెంట్‌లో ఓ చోట ఉంచారు. అది బయటపడకుండా ఇటుకలతో ఓ గోడని కట్టారు. అక్కడ ఓ గది ఉందని కొత్తవాళ్లకి అసలు తెలీనే తెలీదు. ఇప్పటికీ నా శవం అక్కడే ఉంది’
జూలీ నోవా చెప్పేది శ్రద్ధగా వింటోంది.
‘నువ్వు ఆ శవాన్ని అక్కడ నించి తొలగించి బయట సమాధి చేసి, ప్రార్థన జరిపితే నేను ఈ ఇంట్లోంచి వెళ్లిపోగలను. లేదా ఇక్కడే ఎంతకాలం గడిచినా బంధింపబడతాను’
‘ఈ ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్లలేవా?’
‘ఉహు. నా శవం ఉన్నంతకాలం వెళ్లలేను’
‘అలాగే. ఆ ఇద్దరు దుర్మార్గులు చివరికి ఏమయ్యారు?’
‘ఈ ఇంటిని అమ్మేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏమయ్యారో నాకు తెలీదు. వారు నా శవానికి సరైన కర్మకాండ జరిపించక పోవడంతో నేను దెయ్యం అయ్యాను. ఈ ఇంట్లో బసచేసే ఎవరితో మాట్లాడినా వాళ్లు భయంతో ఇంట్లోంచి వెళ్లిపోయారు తప్ప నీలా నేను చెప్పేది ఇలా నిర్భయంగా వినలేదు. నీకు మాట ఇస్తున్నాను జూలీ. నేను నీకు ఎలాంటి హానీ చేయను. పైగా ఓ మేలు చేస్తాను’
‘మేలు కోసం కాదు. రేపు ఉదయం నువ్వు చెప్పింది చేస్తాను నోవా’ జూలీ మాట ఇచ్చింది.
‘నేను నీకు చేసే మేలు గురించి తెలుసుకోవాలని లేదా?’
‘చెప్పు. వింటాను’ జూలీ అడిగింది.
‘ఈ ఇంట్లోకి ఇప్పుడు ఇద్దరు దుర్మార్గులు చేరారు’
‘ఇద్దరు దుర్మార్గులా? ఎవరు వారు?’ జూలీ ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
‘జూలీ! స్టీవెన్‌కి కాఫీ కావాలిట. చేసి బేస్‌మెంట్‌లోకి తెస్తావా?’ రాయ్ లోపలికి వచ్చాడు.
కాఫీ చేస్తూ జూలీ భర్తని అడిగింది.
‘రాయ్! దెయ్యాలు కనపడవు కదా?’
‘ఏం? కనపడవు’
‘కనపడవు కాబట్టి చూపించలేను. కాని ఈ ఇంట్లో ఓ దెయ్యం ఉంది’
‘నానె్సన్స్! దెయ్యాలనేవే లేవు. అది మూఢనమ్మకం. ఉండి ఉంటే ఎందుకు కనపడవు?’
‘నేను చెప్పేది నిజం. దాని మాటలు విన్నాను’
‘చిత్తభ్రమ’ కొట్టిపారేశాడు.
‘అది మగ దెయ్యం. పేరు నోవా. ఈ ఇంట్లోనే నోవా హత్య చేయబడ్డాడు. అతని శవం బేస్‌మెంట్‌లో ఉంది. దాన్ని వెలికితీసి సరైన క్రతువుతో సమాధి చేసి ప్రార్థన చేయమని నన్ను కోరింది’
‘నేను నమ్మను. అంతేకాదు. నిన్ను బేస్‌మెంట్‌లోకే ఇక అనుమతించను’ రాయ్ గట్టిగా చెప్పాడు.
తన భార్యని ప్రింటింగ్ ప్రెస్‌కి దూరంగా ఉంచడానికి రాయ్‌కి ఓ కారణం దొరికింది. అక్కడ ఏం
ప్రింట్ చేస్తున్నారో ఆమెకి తెలీకూడదు అని అనుకున్నాడు. అతను కాఫీ కప్పుల ట్రే తీసుకుని కిందికి వెళ్లిపోయాడు.
జూలీకి మళ్లీ అదృశ్య కంఠం వినిపించింది.
‘జూలీ!’
‘నోవా?’
‘అవును. నువ్వు చాలా అందమైనదానివి’
‘్థంక్స్ నోవా’
‘నువ్వు వెంటనే ఈ ఇంట్లోంచి వెళ్లిపొమ్మని చెప్పడమే నేను నీకు చేసే మేలు’
‘అదేమిటి? నువ్వు నాకు హాని చేయనన్నావు?’
‘అది నిజమే. కాని ఆ ఇద్దరు దుర్మార్గుల వల్ల నీకు హాని జరుగుతుంది’
‘ఎవరా దుర్మార్గులు?’
‘నీ భర్త, అతని మిత్రుడు’
‘అబద్ధం. ఐనా నీకెలా తెలుసు?’
‘నిజం. వాళ్లు మాట్లాడుకుంటూంటే విన్నాను’
‘ఏమని?’
‘బేస్‌మెంట్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఇరవై డాలర్ల నకిలీ నోట్లని అచ్చు వేద్దామనుకుంటున్నారు. ఇది బయటపడి త్వరలో వాళ్లు పట్టుబడకమానరు. ఈ ఇంట్లోని నీకు అది తెలీకపోయినా, సహ నేరస్థురాలివిగా వాళ్లతోపాటు నువ్వూ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు బయటికి వెళ్లిపోవడం మంచిది’
‘కాని నేను నా భర్తని వదిలి ఎలా వెళ్లగలను?’
‘ఆ ఇద్దరిలోకీ స్టీవెన్ ప్రమాదకారి. నీ భర్త గురించి తెలీదు కాని అతను హింసాత్మక మనిషి’
దాంతో వారి మధ్య సంభాషణ ముగిసింది. జూలీ నోవా చెప్పింది ఆలోచించసాగింది.
* * *
మధ్యాహ్నం భోజనాలయ్యాక రాయ్‌తో జూలీ చెప్పింది.
‘రాయ్. నీతో మాట్లాడాలి’
‘అలాగే. ఏమిటి?’
‘ఒంటరిగా’
‘స్టీవెన్‌కి తెలీని రహస్యాలు ఏముంటాయి? ఫర్వాలేదు. చెప్పు’
‘ఇది నీతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన విషయం’
‘సరే. భార్యాభర్తల మధ్య ఇలాంటివి ఉంటాయని విన్నాను. బ్రహ్మచారిని కాబట్టి నాకు తెలీదు. నేను వెళ్లడమే మర్యాద’ చెప్పి స్టీవెన్ లేచి బేస్‌మెంట్‌లకో వెళ్లిపోయాడు.
‘ఏమిటి?’ రాయ్ ప్రశ్నించాడు.
‘మీరు దొంగ ఇరవై డాలర్ల నోట్లని అచ్చు వేస్తున్నారు కదా?’ జూలీ అడిగింది.
వెంటనే రాయ్ మొహంలోని ప్రసన్నత మాయం అయింది.
‘ఎలా తెలిసింది? నువ్వు మా సంభాషణని దొంగతనంగా వినడం ఎప్పుడు నేర్చుకున్నావు?’ కోపంగా అడిగాడు.
‘వినలేదు. నోవా నాకు చెప్పాడు’
‘చిత్తభ్రమ. నువ్వు నిజంగా దొంగతనంగా విన్నావు’ కోపంగా జూలీ చెంప మీద కొట్టాడు.
‘ఆగు రాయ్’ ఓ కంఠం వినిపించింది.
‘నీకు తెలీదు స్టీవెన్...’
‘స్టీవెన్‌ని కాదు. నోవాని’
రాయ్ గట్టిగా అరిచాడు.
‘స్టీవెన్! పిలిచావా?’
‘లేదు’ బేస్‌మెంట్‌లోంచి స్టీవెన్ కంఠం వినిపించింది.
‘విను రాయ్. నా గురించి జూలీ చెప్పిందంతా నిజం. స్టీవెన్ చివరికి నీకు ద్రోహం చేస్తాడు. మీ ఇద్దరూ వెళ్లిపోవడం మంచిదని నా సలహా’
రాయ్ బదులు చెప్పకుండా జూలీ పిలుస్తున్నా వినిపించుకోకుండా, కోపంగా బయటికి నడిచాడు.
‘ఏమిటి?’ స్టీవెన్ రాయ్ మొహాన్ని చూసి ఏదో అయిందని గ్రహించి అడిగాడు.
‘జూలీకి మన రహస్యం తెలిసిపోయింది’
‘చెప్పద్దన్నాగా? ఎందుకు చెప్పావు? భార్యలకి అన్నీ చెప్పకూడదు’ స్టీవెన్ కోపంతో మండిపడ్డాడు.
‘నేను చెప్పలేదు. చాటు నించి విన్నదనుకుంటా. పైగా దెయ్యం చెప్పిందని అబద్ధాలు చెప్పింది’
‘అసలు ఈ ఇంట్లో దెయ్యం ఉందని ఎందుకు చెప్పావు? నువ్వు భార్య నించి ఏదీ దాచలేని చవటవి’
‘నీ తోడు. నేను చెప్పలేదు. దెయ్యమే చెప్పిందిట’
‘అది నువ్వు నమ్మితే నీ అంత మూర్ఖుడివి ఈ ప్రపంచంలో నువ్వే’
‘నేనెందుకు నమ్ముతాను? ఈ బేస్‌మెంట్‌లో ఆ దెయ్యం శవం ఉందని, అడ్డంగా కట్టిన గోడని పగలకొడితే అది కనిపిస్తుందని కూడా చెప్పిందట’
‘సరే. మీ ఆవిడని బయటికి వెళ్లనివ్వక. ఇంకెవరికైనా చెప్తే మన సంగతి బయటంతా పాకి పొక్కుతుంది’
‘అలాగే’
సాయంత్రం రాయ్ మేడ మీదికి వెళ్తూంటే మెట్ల మీద ఓ కొత్త కంఠం వినిపించింది.
‘రాయ్! నేను నోవాని. నీ మిత్రుడు నమ్మకద్రోహి. నువ్వు, నీ భార్య ఇందులోంచి విరమించుకుంటే మంచిది’
ముందు స్టీవెన్ మాట్లాడాడని అనుకున్నాడు. కాని ఆ కంఠం నూతిలోంచి వస్తున్నట్లుగా వినపడటంతో స్టీవెన్ కాదని నమ్మాడు. వెంటనే వెనక్కి తిరిగి స్టీవెన్ దగ్గరికి వెళ్లి ఆదుర్దాగా చెప్పాడు.
‘దెయ్యం నాతో మాట్లాడింది’
‘రాయ్! నీకు నీ భార్య ఇచ్చిన సలహాని పాటిస్తున్నావు కదూ?’ స్టీవెన్ తీవ్రంగా చూస్తూ అడిగాడు.
‘్ఛ! అలాంటిదేం లేదు. నిజంగా నాతో ఎవరో అదృశ్యంగా మాట్లాడారు’
ఇద్దరూ ఆ పాత ఇల్లు మొత్తాన్ని వెదికారు. కాని వారికి ఇంకో మనిషి కనపడలేదు. చివరగా బేస్‌మెంట్‌లోకి వెళ్లి జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ గోడ మిగతా గోడలకన్నా తర్వాత కట్టిందిగా గుర్తించారు.
‘స్టీవెన్! నేను నోవాని’ దెయ్యం మాటలు వినిపించాయి.
‘రాయ్! ఏమిటి?’ స్టీవెన్ వెంటనే అడిగాడు.
‘రాయ్ కాదు. మీకు అదృశ్యం ఉండే నోవాని. నేను మీ సంభాషణని వింటూంటాను. కాబట్టి ఇక్కడికి మీరు వచ్చాక జరిగింది, మీ పథకం నాకు తెలుసు. దయచేసి నా మాట విని దొంగ నోట్లు అచ్చువేసే పని ఆపండి. లేదా మీరు పోలీసులకి పట్టుబడతారు’
‘ఎలా?’ స్టీవెన్ అడిగాడు.
‘జూలీ వాళ్లకి ఫిర్యాదు చేస్తుంది అనే నేను నమ్ముతున్నాను. లేదా ఆమె కూడా మీతో జైలుకి వెళ్లాలనే భయాన్ని ఆమెలో కలిగించాను. అది నిజం కూడా’
వెంటనే మిత్రులు ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.
‘ఇప్పుడేం చేద్దాం?’ రాయ్ భయంగా అడిగాడు.
‘ఒక్కటే దారి. బేస్‌మెంట్‌లో ఒక్కటే శవం ఉంది. బదులుగా దాని పక్కనే ఇంకో శవం చేరుతుంది’
‘అంటే?’
‘తప్పదు. వెళ్లి జూలీని నిలదియ్. నోవా చెప్పింది నిజమని తెలిస్తే ఏదో చెప్పి ఆమెని ఇక్కడికి తీసుకురా. మనం కోటీశ్వరులం అవడానికి ఉన్న అడ్డుని తొలగిస్తావో, లేదా ఇది ఫెడరల్ అఫెన్స్ కాబట్టి పాతికేళ్లు జైల్లో కూర్చుంటావో, లేక నా సలహాని పాటిస్తావో నీ ఇష్టం. ఓ భార్య పోతే ఇంకో భార్య వస్తుంది. ఈ అవకాశం చేజారిపోతే ఇంకోటి మళ్లీ రాదు’
రాయ్ జూలీ దగ్గరికి వచ్చి చెప్పాడు.
‘నువ్వు చెప్పింది నిజమే. మనింట్లో నోవా అనే దెయ్యం ఉంది’
‘మీతోనూ మాట్లాడిందా?’
‘అవును. నువ్వు మా గురించి పోలీసులకి ఫిర్యాదు చేస్తావని చెప్పాడు’
‘నేను ఆ విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి మనిద్దరం వెళ్లిపోదాం’
‘లేదా నువ్వు పోలీసులకి ఫిర్యాదు చేస్తావా?’
‘అదింకా నిర్ణయించుకోలేదు’
‘సరే. మాకు టీ కావాలి. కలిపి తే’
‘అలాగే. మీరూ ఆలోచించండి.
రాయ్ తన కోపం బహిర్గతం కాకుండా బేస్‌మెంట్‌కి చేరుకుని చెప్పాడు.
‘నోవా చెప్పింది నిజమే. టీ కప్పులతో జూలీ కాసేపట్లో ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత...’ అర్ధోక్తిగా ఆగిపోయాడు.
‘జూలీ!’ వంట గదిలోని జూలీకి నోవా మాటలు వినిపించాయి.
‘నోవా?’
‘నేనే. నువ్వు టీ కలపడం ఆపి తక్షణం పారిపో. వాళ్లు ఇద్దరూ నిన్ను చంపి నా శవం పక్కన నీది కప్పెట్టదలచుకున్నారు’
‘కాని మా వారు అంతటి దుర్మార్గులు కారు. ఆయనకి నేనంటే ఎంతో ప్రేమ’
‘కొందరికి అన్నిటికన్నా డబ్బంటేనే ఇష్టం. స్టీవెన్ రాయ్‌తో కలిసి నిన్ను బేస్‌మెంట్‌లో చంపదలచుకున్నాడు. ఆలస్యం చేయక పారిపో’
‘నేను నమ్మను’
‘సరే. టీ కలిపి తీసుకెళ్లు. బేస్‌మెంట్‌లోకి రానని మొరాయించు. అప్పుడు వాళ్లు నిన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే నీకే విషయం అర్థమవుతుంది. కనీసం ఈ సలహాని పాటించు. వాళ్ల మధ్య సంభాషణ వినడానికి వెళ్తున్నాను’
జూలీ నోవా మాటలు ఎంత దాకా నమ్మాలో నిశ్చయించుకోలేక పోయింది. ఓ దెయ్యం మాటలు నమ్మి చూస్తూ చూస్తూ తన కాపురాన్ని కూలదోయ దలచుకోలేదు.
‘రాయ్. ముందు ఈ గోడని పగలగొట్టి నోవా శవం ఎంతవరకూ నిజమో చూద్దాం’ స్టీవెన్ సూచించాడు.
ఇద్దరూ పడగొడితే చిన్న గది బయటపడింది. ఆ ఆరడుగుల గదిలోని సిమెంట్ చేయని మట్టిని ఐదడుగులు తవ్వితే ఓ అస్థిపంజరం వారికి కనిపించింది.
‘ఐతే నిజమే. ఈ సమాధి గురించి జూలీకి ఎలా తెలుస్తుంది? పద’ స్టీవెన్ రాయ్‌తో ఆదుర్దాగా చెప్పాడు.
‘జూలీ. త్వరగా పారిపో. వాళ్లిద్దరూ నిన్ను బేస్‌మెంట్‌లోకి లాక్కెళ్లడానికి వస్తున్నారు. ఓసారి నువ్వు అక్కడికి వెళ్తే ఇక బయటికి ప్రాణాలతో రాలేవు’ నోవా కంఠం ఆదుర్దాగా వినిపించింది.
‘నా భర్త నేరస్థుడవచ్చు. కాని హంతకుడు కాడు’
‘స్టీవెన్ ప్రభావం రాయ్ మీద గాఢంగా ఉంది. నీ భర్త రాబోయే కోట్ల డాలర్ల మత్తులో ఉన్నాడు. అదిగో. వచ్చేస్తున్నారు. కనీసం ఈ సలహానైనా పాటించు. వెంటనే రిసీవర్ అందుకుని నైన్ లెవెన్ నెంబర్ని తిప్పు. రిసీవర్ని పక్కనపెట్ట’
‘దేనికి?’
‘చెప్పింది చేసి నీ ప్రాణాలు రక్షించుకో’
వంట గది తలుపు తెరుస్తున్న అలికిడి విని జూలీ నోవా చెప్పింది పాటించింది.
‘జూలీ! నువ్వు మాతో బేస్‌మెంట్‌కి రావాలి’ రాయ్ కఠినంగా చూస్తూ చెప్పాడు.
‘రాను’ ఆమె దృఢంగా చెప్పింది.
‘ఉ’ స్టీవెన్ సైగనందుకుని రాయ్ ఆమె నడుం చుట్టూ చేతిని వేసి నోటిని నొక్కాడు. స్టీవెన్ రాయ్‌కి సహాయం చేస్తే ఇద్దరూ మెట్ల మీంచి ఆమెని ముందు కిందకి, తర్వాత మళ్లీ మెట్లు దిగి బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లాక వదిలారు.
‘హలో! దిసీజ్ నైన్‌లెవెన్?’ మరోసారి రిసీవర్లోంచి వినిపించాక నోవా కంఠం ఆ గదిలో వినిపించింది.
‘అర్జెంట్. ఛెస్ట్‌నెట్ అవెన్యూలోని హౌస్ నెంబర్ 32 ఇంట్లోని బేస్‌మెంట్‌లో ఒకామెని ఇద్దరు కలిసి హత్య చేయబోతున్నారు. వెంటనే ఎవర్నయినా పంపండి’
‘మీరెవరు?’
‘నా పేరు నోవా. అంతకు మించి వివరాలు మీకు ప్రస్తుతం అనవసరం’
‘సరే. పంపుతున్నాను. ఈలోగా మీకు అవకాశం ఉంటే మీరు ఆమెని రక్షించండి’
‘సారీ. నాకు అవకాశం లేదు’ నోవా కంఠం వినిపించింది.
* * *
పడగొట్టిన గోడని, గోతిలోంచి తీసిన అస్థిపంజరాన్ని చూసి జూలీ ఆనందంగా చెప్పింది.
‘నేను చెప్పలా? అది నోవా శవమే. ఇప్పుడైనా నమ్ముతారా?’
‘నమ్ముతాం’ స్టీవెన్ పొడిగా చెప్పాడు.
‘దీన్ని బయటికి తీసుకెళ్లి పాతి ప్రార్థన చేద్దాం. అప్పుడు ఆ దెయ్యానికి ఈ ఇంట్లోంచి విముక్తి కలుగుతుంది’ జూలీ కోరింది.
‘జూలీ. నువ్వు ఆ గోతిలోకి దిగు’ స్టీవెన్ చెప్పాడు.
‘దేనికి?’
‘నీ శవాన్ని మోసే పని తప్పుతుందని. నిన్ను మేం ఇద్దరం చంపాలని నిర్ణయించుకున్నాం’
అతని చేతిలో రివాల్వర్ ప్రత్యక్షం అయింది.
‘నిజమా?’ జూలీ ఆశ్చర్యంగా అడిగింది.
‘అవును. స్టీవెన్ చెప్పినట్లు చెయ్యి’ రాయ్ అరిచాడు.
వెంటనే వారికి నోవా కంఠం వినిపించింది.
‘స్టీవెన్! రాయ్! నా మాట వినండి. మీరు ముగ్గురూ ఇక్కడ నించి వెంటనే పారిపోండి. లేదా పోలీసులకి మీరు చిక్కడం తథ్యం. హత్యకి శిక్షేమిటో తెలుసా? ఎలక్ట్రిక్ ఛెయిర్లో కూర్చోవడం, తర్వాత ఘోర నరకానికి మీరు వెళ్తారు. స్టీవెన్! నీ చేతిలోని రివాల్వర్‌ని జూలీకి ఇవ్వు’
బదులు స్టీవెన్ ఆమెకి రివాల్వర్‌ని గురిపెట్టాడు.
‘నోవా! కాపాడు’ జూలీ భయంగా అరిచింది.
‘సారీ జూలీ! నాకు శరీరం లేదు. నేను కాపాడలేను. ఆగు స్టీవెన్! నేను చెప్పేది విను. జూలీ కూడా ఈ ఇంట్లో హత్య చేయబడి నా శవంతో పాటు ఎటువంటి క్రతువూ లేకుండా పాతిపెట్టబడితే నాలా దయ్యం అవుతుంది. ఇక ఈ ఇంట్లోంచి నాలా బయటకి పోలేదు. కరుణించి కాల్చక’
‘కాల్చు స్టీవెన్’ రాయ్ చెప్పాడు.
సరిగ్గా ఆ సమయంలో బయటి నించి వాళ్లకి పోలీస్ సైరన్ వినిపించింది.
‘వాళ్లు వచ్చేస్తున్నారు. జూలీని చంపితే మరణశిక్షని పొందడం తప్ప మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి కాల్చక’ నోవా కంఠం వినిపించింది.
‘వాళ్లకెలా తెలుసు?’
‘జూలీనే వాళ్లకి నా సలహా మీద ఫోన్ చేసింది’
వెంటనే ఆ ఇంటి తలుపు కొట్టిన చప్పుడు వినిపించటంతో స్టీవెన్ నిస్పృహగా రాయ్ వంక చూసి చెప్పాడు.
‘మన పథకం అంతా పాడు చేసావు కదా. నువ్వు నీ భార్య చేతిలో దద్దమ్మవి’
పోలీసులు కిటికీలోంచి ప్రవేశించారు.
‘గుడ్‌బై జూలీ! నువ్వూ చస్తే నాకు తోడు ఉంటావని క్షణకాలం స్వార్థంగా ఆలోచించాను. కాని దాన్ని అంతటితో అణచేశాను. ఇంక నీకేం భయం లేదు’ నోవా కంఠం వినిపించింది.
ఆ తర్వాత ఆ ముగ్గురికీ మరెన్నడూ నోవా కంఠం వినిపించలేదు.

*
(్ఫల్డెన్ హేరింగ్‌టన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి