ఈ వారం స్పెషల్

బొమ్మను చేసి..ప్రాణము పోసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంలో మనల్ని మనం చూసుకోవడంలో
ఉన్న ఆనందాన్ని వర్ణించలేం.
దీనికి అందంతో సంబంధం లేదు.
మనల్ని మనం చూసుకోవడంలో ఉన్న మహదానందం అది.
తనను తాను చూసుకోవడం, గుర్తించడం,
ఆనందించడం మానవులకు తప్ప మిగతా జీవజాతికి లేని విలక్షణత.
నీటిలో మన ప్రతిబింబాన్ని చూస్తూ గడిపేయడంలో సమయాన్ని చాలాసార్లు లెక్కచేయం. అదో అందమైన అనుభూతి.
ఓ చిత్రకారుడు గీసిన మన చిత్రాన్ని అపురూపంగా దాచుకుని చూసుకోవడం ఒకప్పటి సౌకర్యం. అధునాత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఫొటోలు, సెల్ఫీలు కుప్పలుతెప్పలుగా వచ్చేస్తున్నా మన రూపును పదేపదే చూసుకోవాలన్న తపన ఓ పట్టాన తీరడం లేదు. తన ప్రతిరూపాన్ని చూసుకోవడంలో ఉన్న అందం, ఆనందానికి కొలమానం ఇంకా రాలేదు.
ఫొటోలు, వర్ణచిత్రాలు, శిల్పాలు, సైకత శిల్పాలు ఇలా ఏ రూపంలోనైనా సరే.. మనకు నచ్చిన లేదా మన రూపం లేదా జనం మెచ్చిన వారి బొమ్మను చూస్తే ప్రాణం లేచివచ్చినట్లుంటుంది. ఆ బొమ్మలో ‘అసలు రూపం’ కొట్టొచ్చినట్లు కన్పిస్తే ఆ శిల్పి ప్రాణం పోశాడంటారు. బొమ్మకు జీవకళను ఇచ్చే శక్తి బ్రహ్మ తర్వాత శిల్పికే ఉంటుంది. అలాంటి ప్రత్యేకత సాధించిన కళాకారిణి మేడమ్ టుస్సాడ్స్. రాయి, కర్ర, ఇసుక ఇలా దేనితోనైనా బొమ్మలుగా తీర్చిదిద్దడం చాలామంది కళాకారులకు అలవాటే. కానీ, మైనంతో బొమ్మలు చేయడం మిగతావాటికన్నా భిన్నం. ఇది పురాతన సంప్రదాయమే అయినా ఆ కళను ఒడిసిపట్టినవారు, దానినే జీవనాధారం చేసుకున్నవారు, దానినే ఓ ప్రపంచ ఆకర్షణగా మార్చినవారు చాలా తక్కువ. అలాంటివారిలో మేడమ్ టుస్సాడ్స్ ఒకరు. పొట్టకూటికోసం మైనంతో బొమ్మలు చేయడం నేర్చుకుని, చివరకు దానిని వృత్తిగా మలచుకుని, ప్రపంచప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు, సంస్థల ప్రతిరూపాలకు వేదికగా మార్చుకుని ప్రత్యేకస్థానం సంపాదించిన కళాకారిణి ఆమె. విలక్షణమైన ఆ కళను కాపాడుతూ, విశ్వవ్యాప్తం చేస్తున్న సంస్థ మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం. ఆ మ్యూజియంలో చోటు దక్కించుకోవడం విశిష్ఠ గౌరవంగా భావిస్తున్న రోజులివి. మనదేశానికి చెందిన ఎందరో ప్రముఖుల నిలువెత్తు మైనపుబొమ్మలు అక్కడ దర్శనమిస్తాయి. తాజాగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆ గౌరవం దక్కింది. ఆయన మైనపుబొమ్మను మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకువచ్చింది. ఇటీవలే భారత్ వచ్చిన ఆ సంస్థ ప్రతినిధి బృందం మోదీ శరీర కొలతలు తీసుకుంది.
మేడమ్ టుస్సాడ్స్ ఎవరు?
ఈమె అసలు పేరు మేడమ్ అనే్న మేరీ టుస్సాడ్. ఫ్రాన్స్‌లో 1761 డిసెంబర్ 1న జన్మించింది. ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ ఫిలిప్పె కర్టిస్ వద్ద ఆమె తల్లి పనిమనిషిగా ఉండేది. వైద్య పరిశోధనల కోసం శరీర నిర్మాణానికి సంబంధించిన వివిధ భాగాలను డాక్టర్ కర్టిస్ మైనంతో తయారు చేసేవాడు. చిన్నప్పటి నుంచి అతడితో చనువుగా ఉంటూ మైనపుబొమ్మల తయారీలోని మెళకువలను గ్రహించింది. తేనెటీగలు సేకరించిన మైనాన్ని ఇందుకోసం విరివిగా వాడేవారు. ఫ్రాన్స్ చక్రవర్తి లూరుూస్ 16 సోదరికి మైనపుబొమ్మల తయారీని నేర్పించే పని ఆమెకు అప్పగించారు. ఆ తరువాత ఆ రాజ్యంలో నిందితులకు మరణశిక్ష విధించినపుడు వారికి సంబంధించిన ‘డెత్‌మాస్క్’లు రూపొందించే పని అప్పగించారు. ఇలా ఆమె రాజకుటుంబానికి దగ్గరైంది. ఫ్రెంచ్ విప్లవ సమయంలో నెపోలియన్‌తోనూ ఆమెకు పరిచయం ఏర్పడింది. బెంజిమన్ ఫ్రాంక్లిన్ వంటి ప్రముఖులకూ దగ్గరైంది. 1777లో తొలిసారిగా ప్రఖ్యాత రచయిత ‘వోల్టెయిర్’ మైనపుబొమ్మను ఆమె స్వయంగా రూపొందించి సంచలనం సృష్టించింది. 1794లో డాక్టర్ కర్టిస్ మరణించాక ఆయన సృష్టించిన మైనపుబొమ్మలన్నీ ఆమెకు ధారాదత్తమయ్యాయి. ఇక ఆమె స్వయంగా రూపొందించిన బొమ్మలతో వాటిని కలిపి ప్రదర్శనలు పెట్టి డబ్బు సంపాదించేది. రాజకీయ అస్థిరత, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆమె 1802లో లండన్ వెళ్లిపోయింది. భర్తకు ఆస్తిపాస్తులున్నాయన్న కారణంతో ఫ్రాన్స్‌లోనే ఆమె ఉండిపోవలసి వచ్చింది. ఆ తరువాత యుద్ధాలు, ఇతర కారణాలతో టుస్సాడ్స్ లండన్‌లోనే ఉండిపోయారు. 1802 నుంచి దాదాపు 33 సంవత్సరాలపాటు ఆమె యూరోప్ అంతా తిరిగి వాక్స్ బొమ్మల ప్రదర్శనలు నిర్వహించింది. ఒంటిచేత్తోనే ఆమె ఇవన్నీ సాధించేవారు. మొదట్లో లండన్‌లో పేరుమోసిన ఇంద్రజాలికుడు పాల్ ఫిలిడెల్ఫి సహాయంతో వెలుగులోకివచ్చింది. ఆమె తన ఇద్దరు కొడుకులకు ఈ కళను నేర్పింది. మొదట్లో వారిద్దరూ ఆమెతో సఖ్యతగా లేకపోయినా ఆ తరువాత తల్లితో కలసి ఈ కళను విశ్వవ్యాప్తం చేసే పనిలోపడ్డారు. ఆమె ప్రదర్శనలన్నీ అద్దెకు వసతి తీసుకుని నిర్వహించేది. తొలిసారిగా ప్రఖ్యాత బేకర్‌స్ట్రీట్‌లో 1836లో ‘ఎగ్జిబిషన్ హౌస్’ను సొంతంగా సమకూర్చుకుంది. ఆ తరువాత మరోచోటికి మార్చింది. 1938లో ‘జ్ఞాపకాల’ పేరిట ఓ పుస్తకాన్ని రచించింది. 1842లో తన రూపాన్ని సొంతంగా మైనంతో తయారుచేసుకుంది. ఇప్పటికీ లండన్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇది కన్పిస్తుంది. 1850 ఏప్రిల్ 15న 88 ఏళ్ల వయసులో నిద్రలోనే తుదిశ్వాస విడిచింది. మానవశరీర నిర్మాణశాస్త్రం కోసం డాక్టర్ కర్టిస్ నేర్చుకున్న మైనపుబొమ్మల తయారీ కళను తానూ నేర్చుకుని రాజవంశానికి దగ్గరై, దేశద్రోహులు, నేరగాళ్ల ‘డెత్‌మాస్క్’ల తయారీకి ఈ కళను వాడి, ఆ తరువాత ప్రపంచంలో పేరుమోసిన వ్యక్తుల నిలువెత్తు మైనపుబొమ్మల తయారీకి ఈ కళను అంకితం చేసిన మేడమ్ టుస్సాడ్స్ జీవితం అసాధారణమైనది. పేరుమోసిన నేరగాళ్లు, నియంతలు, క్రూరుల బస్ట్‌సైజ్ మైనపుబొమ్మలతో ‘చాంబర్ ఆఫ్ హారర్స్’ అన్న పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆమెకు ఎనలేని ఖ్యాతిని తెచ్చింది. అయితే ఆ తరువాత వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రతిభావంతులు, ప్రజలు మెచ్చిన నేతల మైనపుబొమ్మలకు వేదికగా ఆమె ప్రదర్శనశాల మారింది. కళను నమ్ముకుని సొంత దేశాన్ని వదిలి కడవరకు దానికోసం తపించిన కళాకారిణి ఆమె. ఇప్పుడు అందరూ చెబుతున్న ‘మేడమ్ టుస్సాడ్స్’ వాక్స్ మ్యూజియం సంస్థకు టుస్సాడ్‌కు ఆర్థిక బంధాలేం లేవు. ఇప్పుడు హక్కులన్నీ ఆ సంస్థకే ఉన్నాయి. అందుకే ఈ మ్యూజియం పేరులోని ‘మేడమ్ టుస్సాడ్స్’ అన్న ఆంగ్లవాక్యంలో చివరి ‘ఎస్’ అక్షరానికి ముందు ‘ఎఫాస్ట్ఫ్రీ’ సంకేతం ఉండదు.
వాక్స్ మ్యూజియం
లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మైనపుబొమ్మల మ్యూజియం పేరు మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం. మేరీ టుస్సాడ్స్ రూపొందించిన అనేక మైనపుబొమ్మలు సహా ఆమె తరువాతి తరాలు రూపొందించిన అనేకశిల్పాలు ఇక్కడ ఉన్నాయి. స్వయంగా ఆమె తయారు చేసిన మైనపుబొమ్మలు ఇప్పటికీ అక్కడ కనువిందు చేస్తాయి. ఆమె రూపొందించుకున్న సొంతబొమ్మ మ్యూజియంలోకి అడుగుపెట్టినవెంటనే కన్పిస్తుంది. ఆమె, ఆమె వారసులు తయారుచేసిన బొమ్మలతోపాటు ఆ సంస్థ తయారుచేసిన ఎన్నో ప్రతిమలు కన్పిస్తాయి. 2007లో ‘ది టుస్సాడ్స్ గ్రూపు’ను మెర్లిన్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ కొనుగోలు చేసింది. ప్రస్తుతం పేరు టుస్సాడ్స్ అని ఉన్నా ఆమె వారసులకు దీనిపై హక్కులేమీ లేవు. లండన్‌లో టుస్సాడ్స్ మ్యూజియం ప్రధాన కేంద్రం ప్లానిటోరియంకు అనుబంధంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మ్యూజియం శాఖలను ఏర్పాటు చేశారు. ఆమ్‌స్టర్‌డామ్ (నెదర్లాండ్స్), బెర్లిన్ (జర్మనీ), హాలీవుడ్ (అమెరికా), లాస్‌వెగాస్ (అమెరికా), న్యూయార్క్ షాంఘై, వుహన్ (చైనా), సిడ్నీ (ఆస్ట్రేలియా), బ్యాంకాక్ (్థయ్‌లాండ్), వాషింగ్టన్ డిసి (అమెరికా), టోక్యో (జపాన్) వియన్నా (ఆస్ట్రియా)లలో వీటి శాఖలను ఏర్పాటు చేశారు.
భారత్‌లో...
మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం శాఖను 2017 నాటికి భారత్‌లోకూడా ఏర్పాటు చేయాలని ఆ సంస్థ 2015లో ఒక ప్రకటన చేసింది. భారత్‌కు స్వాతంత్య్రంవచ్చి 70 ఏళ్లు పూర్తయినందుకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ప్రముఖులతోపాటు..
టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో స్వయంగా ఆమె రూపొందించుకున్న సొంత మైనపుబొమ్మ ఉంది. ప్రపంచ ప్రముఖుల బొమ్మలూ, పేరుమోసిన నేరగాళ్ల మైనపుబొమ్మలూ ఉన్నాయి. అయితే- అవన్నీ గతానికి సంబంధించినవి. నియంతలు, నేరగాళ్ల మైనపుబొమ్మలన్నీ బస్ట్‌సైజ్‌లోనే ఉంటాయి. ప్రపంచప్రఖ్యాతిగాంచిన నేతల మైనపుబొమ్మలన్నీ నిలువెత్తు విగ్రహాలుగా ఉండటం ఒక నిబంధన.
బొమ్మ తయారీ...సంరక్షణ
ఈ మ్యూజియంలో పెట్టాలనుకున్న వ్యక్తి లేదా వస్తువు లేదా ఇంకేదైనా మైనపుబొమ్మ తయారీ ఎంతో శ్రమ, చిత్తశుద్ధితో కూడుకుని ఉంటుంది. ఆ వ్యక్తికి సంబంధించిన 250 ఫొటోలు, 500 కొలతలు తీసుకునేందుకు రెండు బృందాలు (15మంది చొప్పున) పనిచేస్తాయి. ఆయా వ్యక్తులతో కనీసం ఒకసారి సిట్టింగ్ ఉంటుంది. అవసరమైతే మరికొన్నిసార్లు కలుస్తారు. మరణించిన వ్యక్తుల బొమ్మల కోసం వారికి చెందిన
ఫొటోలు, దుస్తులు, ఇతర వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడ పెట్టే ప్రతిమైనపు బొమ్మకు జుట్టు, మీసాలు, కనురెప్పల వెంట్రుకలు అన్నీ నిజమైనవే వాడతారు. మ్యూజియం తెరవడానికి ముందు ప్రతిరోజు ఆయా బొమ్మల జుత్తును శుభ్రం చేస్తారు. మేకప్ రీటచ్ చేస్తారు. ఇది క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఈ పనిమీద రెండు బృందాలు పనిచేస్తాయి. అదంతా పూర్తయ్యాకే మ్యూజియం తెరుస్తారు. ఉదయం పదినుంచి సాయంత్రం ఐదువరకు అవి అందుబాటులో ఉంటాయి. సంవత్సరంలో 365 రోజులూ అవి పనిచేస్తాయి. ఒక్కో మైనపు విగ్రహం తయారీకి మూడునుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. కనీసం 45వేల అమెరికన్ డాలర్ల మొత్తం ఖర్చు పెడతారు. అక్కడ విడిదిచేసే ప్రతి మైనపుబొమ్మ జీవకళతో ఉట్టిపడుతుంది. ఎవరిబొమ్మ పెడతారో అదే వ్యక్తి పక్కనే ఉంటే వ్యత్యాసం కనిపెట్టడం దుర్లభం. అంత మంచి నైపుణ్యంతో కళాకారులు వీటిని రూపొందిస్తారు. బంకమట్టి, మైనం, అల్యూమినియం గొట్టాలను బొమ్మల తయారీకి వినియోగిస్తారు. ఆయా వ్యక్తుల మేనిఛాయను బట్టి రంగులు అద్దుతారు. ప్రతిబొమ్మ ఆయా వ్యక్తుల అసలు సైజుకన్నా 2 సెంటీమీటర్ల పెద్దగా ఉంటుంది. మైనానికి కరిగే లక్షణం ఉంది కనుక ముందుజాగ్రత్తగా ఇలా చేస్తారు. ప్రతి బొమ్మ తయారీ రెండు విభాగాలుగా ఉంటుంది. తల ఒక భాగంగా, మిగతా శరీరం అంతా మరో భాగంగా తయారుచేసి అతికిస్తారు. ఇక్కడ ఉన్న బొమ్మల్లో దేశాధినేతలు, పేరుమోసిన రచయితలు, సామాజిక ఉద్యమకారులు, యోధులు, సినీ ప్రముఖులు, జనాదరణ పొందిన టీవీ ధారావాహికలు, కథల్లోని పాత్రలు, క్రీడాకారులు, కళాకారుల మైనపుబొమ్మలు దర్శనమిస్తాయి.
భారత్ నుంచి..
లండన్‌లోని టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో భారత్‌కు చెందిన ఎందరో ప్రముఖుల మైనపు బొమ్మలు కొలువుదీరాయి. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ సహా పలువురు ప్రముఖుల బొమ్మలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక భారతీయ సినిమా ప్రముఖులకూ ఇక్కడ చోటు దక్కింది. మాధురీదీక్షిత్, ఐశ్వర్యారాయ్, కరీనాకపూర్, అమితాబ్‌బచ్చన్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌సహా ఎందరో ప్రముఖులకు టుస్సాడ్స్ గౌరవం దక్కింది. ప్రపంచక్రికెట్ ముద్దుబిడ్డ సచిన్ టెండూల్కర్ మైనపుబొమ్మ ప్రత్యేక ఆకర్షణ. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ మైనపుబొమ్మ అక్కడ వచ్చే ఏప్రిల్‌నాటికి చోటుచేసుకోనుంది.
ఎన్నో విశేషాలు..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను ఇప్పటివరకు సందర్శించిన పర్యాటకుల సంఖ్య ఎంతో తెలుసా? కనీసం 50 కోట్లమంది అక్కడ అడుగుపెట్టారు. ఇది ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా ఉమ్మడి జనాభాతో సమానం. ఇక్కడ ప్రతిష్ఠించే సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు (కొలతలు, ప్రత్యేకతలు) గోప్యంగా ఉంచుతారు. సందర్శకులు మరీ ఒత్తిడి చేస్తే ఒకటీఅరా చెబుతారంతే. మైనపుబొమ్మలో కంటిభాగంలో సిరల కోసం ‘రెడ్‌సిల్క్’ దారాన్ని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. శరీరంలో సిరల్లా కన్పించడానికి ‘నాటెడ్‌రోప్’ను వినియోగిస్తారు. ఇక్కడ పెట్టే బొమ్మలకు సంబంధించిన వ్యక్తుల కొలతలు, వారు వాడే వస్తువులు, దుస్తులను గంటల తరబడి పరిశీలిస్తారు. లేని వ్యక్తులకు సంబంధించిన వస్తువులు, ఫొటోలు, వీడియోలను టుస్సాడ్స్ స్టూడియోకు చెందిన నిపుణులు గంటల తరబడి పరిశీలించి బొమ్మకు ప్రాణం పోస్తారు. ఇక్కడ పెట్టే బొమ్మలకు సంబంధించిన వ్యక్తులు తాము వాడే వస్తువులు, దుస్తులు, నెయిల్‌పాలిష్, ఇతర పరికరాలను విరాళంగా ఇవ్వడం పరిపాటి. న్యూయార్స్‌లోని శాఖకు ఇదో ప్రత్యేకత. ప్రతిబొమ్మ తలపై ఉండే జుత్తు ఒకేసారి పెట్టరు. ఒక్కో వెంట్రుకను అమర్చుతూ వెళతారు. తలపై పూర్తిస్థాయిలో జుత్తు పెట్టడానికి నాలుగువారాల సమయం తీసుకుంటారు. కనురెప్పలు, కనుపాపలు, కనుగుడ్లు, ఐరిస్ రంగుకోసం ప్రత్యేక పరిశీలనలు చేస్తారు. దంతాల వరుస, సైజుకోసం ఒక ప్రింట్ తీసుకుని కొలతలూ తీసుకుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కనుకే టుస్సాడ్స్ మైనపుబొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతుంది. ఇక టుస్సాడ్స్ లండన్ మ్యూజియంలో ఇప్పటివరకు మూడు పెద్ద ప్రమాదాలు సంభవించాయి. 1925లో జరిగిన అగ్నిప్రమాదంలో వందల ఏళ్లనాటి అపురూపమైన మైనపుబొమ్మలు దెబ్బతిన్నాయి. 1931లో భూకంపం ధాటికి ఈ మ్యూజియంలో కొన్ని బొమ్మలు చెదిరిపోయాయి. 1940లో రెండవ ప్రపంచయుద్ధ సమయంలో బాంబుల ధాటికి మ్యూజియం పాక్షికంగా దెబ్బతింది. ఈ మ్యూజియంలో ఇప్పడు 400 మైనపుబొమ్మలున్నాయి. వాటికోసం కనీసం 1800 కేజీల పైగా మైనాన్ని వాడారు. బెర్లిన్ మ్యూజియంలో నియంత హిట్లర్ మైనపుబొమ్మపై చాలాసార్లు దాడి జరిగింది. దానిని తొలగించాలన్న వినతులూ తక్కువేం కాదు. చివరకు 2016లో దానిని తొలగిస్తూ టుస్సాడ్స్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇలా ఓ మైనపుబొమ్మను తొలగించడం ఆ మ్యూజియం చరిత్రలో అదే తొలిసారి. *

అదిపెద్దది హల్క్.. చిన్నది టింకర్ బెల్

టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో కొలువుదీరిన మైనపు ప్రతిమల్లో అన్నింటికన్నా పెద్దది ప్రఖ్యాత సినీ క్యారెక్టర్ ‘హల్క్’. లండన్, హాంకాంగ్ శాఖలు సహా పలుచోట్ల ఈ మైనపుబొమ్మ ఉంచారు. 33 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో దీనిని రూపొందించారు. బంకమన్ను, మైనం, అల్యూమినియం గొట్టాలు, రెడ్‌త్రెడ్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగులు దీని రూపకల్పనలో వాడారు. 15మంది నిష్ణాతులతో కూడిన నాలుగు బృందాలు నాలుగు నెలలపాటు పనిచేశారు. మొదట తల, శరీర విడిభాగాలు బంకమట్టితో రూపొందించడం, వాటిని అతికించడానికి అల్యూమినియం గొట్టాలు వాడటం, వేడి ఆవిరిలో మగ్గనిచ్చాక మైనం పట్టించడం, అదయ్యాక చల్లబరిచేందుకు కాటన్ దుస్తుల్లో చుట్టిపెట్టడం ఇలా ఎన్నో వ్యయప్రయాసలతో ఈ బొమ్మలను తయారు చేశారు. బొమ్మంతా మైనంతో తయారయ్యాక ఆ వ్యక్తి లేదా పాత్ర శరీరఛాయనుబట్టి రంగుల ఎంపిక ఉంటుంది. ఒకటికి పదిసార్లు సరిపోల్చాకే రంగులద్దకం పూర్తవుతుంది. టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరే వ్యక్తుల బొమ్మల తయారీలో ఒక్క చేతులు తప్ప మిగతావన్నీ వౌల్డింగ్‌తో చేస్తారు. చేతులు మాత్రం నేతపనితో పూర్తిచేస్తారు. ఇక ఈ మ్యూజియంలలో ఇంతవరకూ ఉన్న బొమ్మల్లో అతిచిన్నది ‘టింకర్‌బెల్’. పాశ్చాత్య సాహిత్యం, జానపద కథల్లో ఇది ఒక పాత్ర. సామాన్య జనానికి అత్యంత ఇష్టమైన ఈ పాత్ర ఓ చిన్నారిది. ఆకర్షణీయమైన రూపు, రంగులతో ఇది ఆకట్టుకుంటుంది. దీని పొడవు కేవలం 8 అంగుళాలు.
------------------------
స్వదేశీ వాక్స్ మ్యూజియంలు

ప్రపంచంలో పేరుమోసిన మైనపుబొమ్మల మ్యూజియంగా ‘మేడమ్ టుస్సాడ్స్’ పేరుపొంది ఉంటే ఉండొచ్చుగాక. కానీ మనదేశంలోనూ వాక్స్ మ్యూజియంలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అవి వృద్ధిలోకి వస్తున్నాయి. వీటిలో మూడింటిని ఒకే కళాకారుడు నిర్వహిస్తున్నారు. 2005లో తొలిసారిగా బేవాచ్ వాక్స్ మ్యూజియంను కన్యాకుమారి తీరంలో ఏర్పాటు చేశారు. ఇక పాతముంబైలో సెలబ్రిటి వాక్స్ మ్యూజియం, కోచిలో సెలబ్రిటి వాక్స్ మ్యూజియంలను సునీల్‌కుమార్ కండలూరు ప్రారంభించారు. దేశానికి చెందిన పలువురు ప్రముఖుల మైనపుబొమ్మలను ఆయనే స్వయంగా తయారుచేసి ప్రదర్శనకు ఉంచారు. ఇక గతేడాది కోల్‌కతాలో మదర్స్ వాక్స్ మ్యూజియాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. బెంగళూరులోని ‘లూరుూస్ టుస్సాడ్స్’ మ్యూజియంకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రఖ్యాత మైనపుబొమ్మల సృష్టికర్త మేడమ్ మేరీ టుస్సాడ్ ముని మనవడు లూరుూస్ దీనిని ప్రారంభించాడు. ప్రధాన టుస్సాడ్స్ మ్యూజియంకు దీనితోగాని, లూరుూస్‌తోగానీ ఎటువంటి సంబంధాలు లేవు.

-వాధూలస