ఈ వారం స్పెషల్

పిబరే కల్పరసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొబ్బరి నీళ్ళే అమృతాన్ని తలపిస్తాయ... తక్షణం సేద తీర్చి కొత్త ఉత్సాహాన్నిస్తాయ. అలాంటి కొబ్బరిచెట్టునుంచే మరో అద్భుతమైన ఔషధం అందుబాటులోకి వచ్చింది. పోషక విలువలు పుష్కలంగా కలిగిన ఈ అమృతమయ ద్రావకమే కల్పరసం. ఇందులోని ఔషధ గుణాలు శరీరానికి కొత్త శక్తిని ఇవ్వడంతో పాటు ఉల్లాసాన్ని ఉత్సాహాన్నీ అందిస్తాయ. కొబ్బరినీళ్లకే అలవాటుపడ్డ ప్రజలకు ఈ కల్పరసం మరో అనిర్వచనీయ అనుభూతి. రసాయనాలతో పనిలేని పోషక విలువల సమ్మిళిత ఆరోగ్య దివ్యరసమిది.

కోనసీమ బతుకు చిత్రానికి ఇంతకాలం కల్పవృక్షమైన కొబ్బరి ఇపుడు రసమయం కానుంది. కోనసీమ ఆదాయ సామాజిక దర్పాన్ని పెంచి పోషించిన కొబ్బరి మరింత విస్తృత ఫలాలను ఆవిష్కరిస్తోంది. కొబ్బరి వ్యవసాయంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోనసీమ ముఖ చిత్రమే మారనుంది.. కొబ్బరి కల్పరస తయారీతో సరికొత్త కోనసీమ జీవన చిత్రాన్ని ఆవిష్కరించనుంది.
కోనసీమ.. అదొక అందమైన ప్రాంతం.. ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన ద్వీపకల్పం.. దట్టమైన చిట్టడవిలాంటి కొబ్బరి తోపులతో నిండుపచ్చదనంతో చిక్కనైన ప్రాంతంగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలో మూడొంతుల కొబ్బరి వ్యవసాయం కోనసీమకే సొంతం. అటువంటి కోనసీమకు ఇపుడు కొబ్బరి నుంచి కల్పరసాన్ని తీసి దాని ద్వారా ఉప ఉత్పత్తులను సృష్టించి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే అవకాశం లభించింది.
కొబ్బరి మొవ్వు నుంచి సేకరించే ఈ రసం పులియడంతో మత్తును కలిగించే ఆల్కహాల్‌గా ఇంతకాలం భావించి రాష్ట్ర ప్రభుత్వం ఆబ్కారీ చట్టంలో పెట్టింది. పరిశోధనల అనంతరం ఇది ముమ్మాటికీ మనిషి దేహానికి కల్పరసంగా శాస్తబ్రద్ధంగా గుర్తించి ఆబ్కారీ చట్టం నుంచి తొలగించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయడమే మిగిలింది. కల్పరసం సేకరించే ప్రక్రియలో రైతులు కేరళ రాష్ట్రంలో సిపిసిఐఆర్ ద్వారా అవసరమైన శిక్షణ పొంది సిద్ధంగా వున్నారు. ఇప్పటికే కొంత మంది రైతులు కోనసీమలో రైతుల సంఘం తరపున కల్పరసను తీస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కనీస స్థాయిలో వౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు తామంతా కొబ్బరి ఆధారిత పరిశ్రమలతో కల్పరస సేకరణతో బతుకు చిత్రాన్ని మార్చుకునేందుకు ఎదురు చూస్తున్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ ‘ఆత్మ’ పథకం ద్వారా కోనసీమకు చెందిన 23 మంది అభ్యుదయ రైతులు రాష్ట్రం తరపున కేరళ రాష్ట్రంలో కల్పరస సేకరణలో అవసరమైన శిక్షణ పొందారు. ఈ శిక్షణ పొందిన ఈ రైతుల బృందంలో ఇద్దరు దింపు కార్మికులు, ఒక గీత కార్మికుడు కూడా వున్నారు. కేరళలో సిపిసిఆర్‌ఐ సంస్థ అధిపతి డాక్టర్ చౌడప్ప ఆధ్వర్యంలో వీరికి శిక్షణ ఇచ్చారు. ఎనిమిది రోజుల శిక్షణ పొందిన ఈ బృందం కొబ్బరి రైతులంతా స్వయంగా కల్పరస సేకరించే ప్రక్రియలో సిద్ధహస్తులయ్యారు. మొత్తం రైతులందరికీ శిక్షణ కల్పించే విధంగా సిద్ధమయ్యారు. తాము నేర్చుకున్న శిక్షణతో ఇప్పటికే కొంత మంది రైతులు కల్పరస సేకరణకు పూనుకున్నారు. శిక్షణ పొందిన రైతు సంఘం కోనసీమలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి కల్పరసను ప్రభుత్వం ఆబ్కారీ చట్టం నుంచి మినహాయించాలని కోరుతూ తీర్మానం ప్రభుత్వానికి పంపించింది. దీంతో ఫిబ్రవరి 20న రాష్ట్ర ప్రభుత్వం కల్పరసను ఆబ్కారీ చట్టం నుంచి మినహాయిస్తూ సూత్రప్రాయంగా ప్రకటించింది. కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అనే పేరుతో ఇక్కడి కోనసీమ కొబ్బరి రైతులు రిజిస్ట్రేషన్ పొందారు. ఇందులో సుమారు 1500మంది రైతులు నమోదయ్యారు. అంబాజీపేట కేంద్రంగా కొబ్బరి కల్పరస ఉత్పత్తిదారుల సంఘం అధికారికంగా బాట్లింగ్ చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మానవ జీవన సారాన్ని పెంపొందించే కల్పరసగా అవతరించిన ఈ సారంలో పిహెచ్ 6.5 శాతం వుంది. ఇది మానవదేహానికి అత్యంత అనుకూలమైన పిహెచ్ అని శాస్తబ్రద్ధంగా నిరూపణ జరిగింది. శరీరంలో ఆమ్లశాతం, క్షారశాతం కూడా పెరగకుండా సమతుల్యత చేకూర్చే సామర్థ్యం ఈ సారంలో వుందని నిర్ధారించారు. సాధారణంగా మనం తాగే కూల్‌డ్రింక్‌లలో పిహెచ్ 2.5 శాతం వుంటుంది. మరుగుదొడ్లు కడిగే యాసిడ్‌లో కూడా 2.5 శాతం పిహెచ్ వుంటుంది.
కల్పరస సేకరించే విధానంలో ఏ మాత్రం పులియదు.. ఎందుకంటే చెట్టు నుంచి చుక్క చుక్కగా ఒడిసిపడుతోన్న కల్పరస పూర్తి శీతలీకరణ విధానంలో ఐస్ బాక్సుల్లోనే సేకరిస్తారు. ఐస్ బాక్సులోనే సేకరించి ఐస్ బాక్సుల్లోనే నిల్వ చేస్తారు. నీరా లేదా కల్లుగా మారే ప్రసక్తే లేదు. జీరో శాతం ఆల్కహాల్‌గా శాస్తబ్రద్ధంగా నిరూపణ అయింది. మానవదేహంలో స్థూల, సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, కేన్సర్ నిరోధక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగిన ఈ కల్పరస మానవ జీవిత ప్రమాణాలను పెంపొందించే సహజసిద్ధ కల్పతరుగా లభిస్తోంది. చెట్టు నుంచి నేరుగా సేకరించిన కల్పరసలో ఏ విధమైన ద్రావణాలు కలిసే అవకాశం లేదు. నేరుగా సహజామృతంగా సేవించడమే. రోజుకు 150 మిల్లీ లీటర్ల కల్పరస తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా అన్ని పోషకాలు సమపాళ్ళలో దేహానికి అందుతాయని పరిశోధనాపరంగా నిరూపణ అయంది. మహాత్మాగాంధీ ఆరోగ్య సూత్రం కూడా కొబ్బరి బెల్లంలోనే వుందని గుర్తించారు. ఔషధ గుణాలు కలిగిన కొబ్బరి బెల్లం తయారికి ఉపయోగించే కల్పరసను ప్రభుత్వం ఇంతకాలం ఆబ్కారీలో ఎందుకు చేర్చిందో అర్థం కావడం లేదని, అలా చేర్చకుండా ఉంటే ఇప్పటికే ఎంతో సామాజిక అభివృద్ధి సాధ్యపడేదని అంటున్నారు. కొబ్బరి కల్పరస నుంచి కొబ్బరి బెల్లం, కొబ్బరి తేనె, కొబ్బరి పంచదార తయారవుతాయి. వీటి నుంచి కొబ్బరి బిస్కట్లు, చాక్లెట్లు తయారు చేస్తారు. పర్యావరణ హితం, ఆరోగ్యదాయని, నిరుద్యోగ సమస్యను నిర్మూలించి, రైతుల ఆదాయాన్ని ఇతోధికంగా పెంపొందించే ఈ కల్పరస సేకరణకు రైతులకు ప్రభుత్వం చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు, అల్యూమినియం నిచ్చెనల పంపిణీ తదితర వౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలని కోరుతున్నారు.
దివ్యౌషధం.. కల్పరసం..
భారతదేశంలో కొబ్బరి పంట అత్యంత ప్రాధాన్యత కలిగిన పంట.. ఈ పంట ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో వుంది. లక్షల మంది ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. తీరప్రాంత రాష్ట్రాలైన కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, బెంగాల్‌లో అధికంగా వుంది. కొబ్బరి పంట మీద లక్షల మంది ఆధారపడ్డారు కాబట్టి వివిధ రకాలైన ఆహార పదార్థాలు, విలువ ఆధారిత పదార్థాలను తయారుచేయడం వల్ల అదనపు ఆదాయం పొందే విధంగా పరిశోధనాపరంగా రుజువుచేసి అమలుచేస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది కొబ్బరి కల్పరస.
కొబ్బరి నుంచి లభించే ముఖ్యమైన పదార్ధాల్లో అతి ముఖ్యమైనది కల్పరస. తాజా కల్పరస మంచి వాసన, స్పష్టమైన రంగుతో తియ్యగా వుంటుంది. కొబ్బరి గెలల నుంచి ఊరే రసంలో తాజాగా వున్నపుడు కల్పరస అంటారు. కల్పరసలో చక్కెర శాతం సుమారు 14-17 వరకు వుంటుంది. నీరా జీర్ణశక్తిని పెంచుతుంది. ఉబ్బసం, రక్తహీనత వంటి రోగాలకు టానిక్‌లా పనిచేస్తుంది.

(7వ పేజీ తరువాయ)
క్షయ వంటి రోగాలను పోగొడుతుంది. ఒక చెట్టుకు సుమారు ఒక లీటర్ నుంచి మూడు లీటర్ల వరకు కల్పరస వస్తుంది. ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఆరోగ్యం.. మధురం దీని ప్రత్యేకత. కల్పరస ప్రత్యేక గుణమేమిటంటే.. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ వుండటం. ప్రపంచ వ్యాప్తంగా గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ కలిగిన ఆహారానికి డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ అవసరాన్ని కల్పరస నుంచి వచ్చే చక్కెర తీర్చగలదని శాస్ర్తియంగా నిర్ధారించారు.
కల్పరస తీసే విధానం
కొబ్బరి మొవ్వులోని పరిణతి చెందని, పూర్తిగా విచ్చుకోని కొబ్బరి పొత్తు నుంచి సేకరిస్తారు. ముందుగా మొవ్వు కాడను బాగా శుభ్రం చేసి గీతలు పెడతారు. ప్రతీ రోజూ చివరి భాగాన్ని కోస్తారు. ఈ విధంగా ఐదు నుంచి ఆరు రోజులు చేయడం ద్వారా కోసిన భాగం నుంచి కల్పరస విడుదల మొదలవుతుంది. దీనిని ఐస్ బాక్సుల్లో సేకరిస్తారు. ఇందులో ముఖ్యంగా నైట్రోజన్, మాంసకృత్తులు, చక్కెర, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, విటమిన్, తయమిన్‌లు ఉంటాయి.
ఆల్కహాలిక్ కాని పోషకాహారమైన ఈ ద్రవపదార్ధం అపరిమితమైన మార్కెట్ శక్తిని కలిగి వుంది. కల్పరస నుంచి కల్పరస సిరప్, కల్పరస బెల్లం, కల్పరస చక్కెర రానున్న కాలంలో మార్కెట్‌లో శక్తివంతంగా ఎగుమతులు జరిగే అవకాశాలు వున్నాయని అంచనా వేశారు. అమెరికా, కెనడా, నార్వే, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఆసియాలోని కొంత భాగం, జపాన్, మధ్యతూర్పు దేశాలకు కల్పరస ఎగుమతి జరుగుతోంది. కల్పరసతో తేనె కూడా తయారు చేస్తారు. సంప్రదాయ, సంప్రదాయేతర ఆహార పదార్ధాల తయారీలో చెరకు నుంచి వచ్చే పంచదారకు, బెల్లానికి బదులుగా దీనిని చక్కెర వనరుగా ఉపయోగిస్తారు. కల్పరస, ఉప ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ వుంది. ఈ నేపథ్యంలో కల్పరస నిజంగా కొబ్బరి రైతులకు అత్యంత లాభాన్నిచ్చే పంటగా పరిణమించింది.
కల్పరస చక్కెర
కల్పరస చక్కెర సహజంగా తయారవుతుంది. దీని తయారీలో ఎటువంటి రసాయన పద్ధతి ఇమిడి లేదు. ఇది యూరోపియన్ మార్కెట్‌లో చాలా ఆకర్షణీయంగా మారింది. కల్పరస చక్కెర శుద్ధి చేయబడని చక్కెర కావడంతో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా కలిగి వుంటుంది. కల్పరస చక్కెర వినియోగం వల్ల బరువు తగ్గడమే కాక, మధుమేహం అదుపులో వుంటుంది. సీరమ్ కొలస్ట్రాల్ తక్కువగా వుండేందుకు ఇది సహాయపడుతుంది. తద్వారా హృదయ రక్తనాళాల వ్యాధులు, గుండెపోటు వంటి హృదయ సంబంధ వ్యాధులు రాకుండా ఆపుతుంది.
కల్పరస బెల్లం
కల్పరస నుంచి బెల్లం తయారు చేస్తారు. పిహెచ్ విలువ 6.5 నుంచి 7.0 వరకు ఉన్నటువంటి కొబ్బరి మొవ్వు రసం యొక్క రసం ఉప ఉత్పాదనే కొబ్బరి రసపు బెల్లం. తాజా రసాన్ని నెమ్మదిగా ఉడికించి, ఆవిరి చెందిస్తే చిన్న చిన్న ముక్కలుగా మారుతుంది. నీటి ఆవిరి యంత్రాలు వినియోగించకుండానే ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. దీని కోసం ఎటువంటి ఎంజైమ్‌లు గానీ, ఇతర పదార్ధాలు గానీ అవసరం లేదు. కల్పరస రసాన్ని 103 డిగ్రీల నుంచి 105 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఉడికించి పిహెచ్ విలువ 7 కంటే ఎక్కువగా ఉండేలాగా ఘనీభవింపజేసి 85 డిగ్రీల బ్రిక్స్ లెవల్ వరకు నిరంతరాయంగా కదుపుతూ చిట్ట చివరి స్థానం వద్ద మనకు కావాల్సిన పరిమాణం, ఆకారంలో ఘన పదార్ధంగా మార్చటం ద్వారా కల్పరస బెల్లం తయారవుతుంది.
నీరా తేనె
గాఢత కలిగిన కల్పరసను 70 డిగ్రీల బ్రిక్స్ లెవెల్ ఘనపదార్థ స్థాయి వరకు వేడి చేయడం ద్వారా రుచికరమైన తేనె తయారవుతుంది. ఐస్‌క్రీమ్స్ వంటి వాటి తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు.
బేకరీ పదార్థాలు
కల్పరసకున్న ఆరోగ్యకరమైన లాభాల వల్ల శక్తివంతమైన విలువైన పదార్థంగా ఉపయోగపడుతుంది. తీపి పదార్ధాలు, బేకరీ పదార్ధాలను సహజ పంచదార, బెల్లంనకు ప్రత్యామ్నాయంగా కల్పరస చక్కెర, కల్పరస బెల్లం, కల్పరస సిరప్, కల్పరస తేనెలతో తయారు చేస్తారు. కల్పరసతో సుగంధ ద్రవ్యాల బెల్లం, కల్పరస బిస్కట్లు, కల్పరస చాకొలెట్లు, కల్పరస కేక్‌లు, కల్పరస జామ్, కల్పరస పానీయం, కల్పరస ఐస్‌క్రీమ్, కల్పరస హల్వా తదితరాలన్నీ కల్పరస ఉప ఉత్పత్తులుగా వున్నాయి.
ఖర్చు - ఆదాయం
కల్పరస గీత, సేకరణకు రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12,000. ప్రొసెసింగ్‌కు రోజుకు రూ.250. నిల్వ, ఇతర ఖర్చులు నెలకు రూ.1000. ప్యాకింగ్, బాట్లింగ్‌కు రూ.4500, మొత్తం ఖర్చు రూ.24,000. రోజుకు 12 చెట్లకు గీతలు గీయవచ్చనేది అంచనా. ఈ విధంగా రోజుకు వచ్చే కల్పరస 18 లీటర్లు. నెలకు వచ్చే కల్పరస 540 లీటర్లు. దీని నుంచి వచ్చే ఆదాయం రూ.40,000. మొత్తం ఖర్చు రూ.24,000. నికర ఆదాయం నెలకు రూ.16,000. ఒక చెట్టు నుంచి ఆదాయం నెలకు రూ.1334. కేరళలో అయితే కల్పరస ఉత్పత్తి కోసం వేసిన కమిటీ ప్రకారం కొబ్బరి ఉత్పత్తి సంఘాల ద్వారా కల్పరసను సేకరించి, పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో శుద్ధి చేసి ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతోంది.
పొట్టి రకాల కొబ్బరి విస్తరణ చేయాలి
కోనసీమలో చాలా వరకు పొడవైన కొబ్బరి రకాలు వున్నాయని, వీటిని ఎక్కేందుకు వ్యయ ప్రయాస అని, పరిశోధనల ఫలితంగా ఆవిష్కృతమైన పొట్టి రకాల కొబ్బరిని కల్పరస నేపథ్యంలో విస్తరించేలా చర్యలు చేపట్టాలని కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ప్రతినిధి అడ్డాల గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. డ్వార్ఫ్ అనే పొట్టి రకాలను పంపిణీ చేయాలని కోరారు. కల్పరస సేకరణ ప్రక్రియ పరిశ్రమలో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, అవసరమైన శిక్షణకు సిపిసిఐఆర్ కృషి చేస్తుందని తెలిపారు. రైతుల ఆదాయం ఇతోధికంగా పెరగనుందని తెలిపారు. ఐస్‌బాక్సులు, నిల్వ చేసేందుకు అవసరమైన చిల్లింగ్ స్టేషన్లను, అల్యూమినియం నిచ్చెనలను వంటి చిన్న చిన్న వౌలిక సదుపాయాలు ప్రభుత్వం నుంచి కల్పిస్తే చాలన్నారు. కడియం మండలం మాధవరాయుడు పాలెం వద్ద ప్రభుత్వం కేటాయించిన 30 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే ఎనిమిదవ సంస్థగా పిసిపిఐఆర్ కేంద్రం ఏర్పాటవుతోందని, ఇది కల్పరస కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ చౌడప్ప రైతులకు ఉచిత శిక్షణ ఇస్తారని తెలిపారు. రైతులకు ఒక కొబ్బరిచెట్టు నుంచి ఆరు నెలల కాలంలో రూ. 6వందల ఆదాయం వస్తే కల్పరసతో ఈ ఆరు నెలల కాలంలోనే రూ.60వేల ఆదాయం లభిస్తుందని అడ్డాల గోపాలకృష్ణ వివరించారు.
మానవ దైనందిన జీవితంలో కొబ్బరి చెట్టు ప్రాధాన్యత ఎనలేనిది. సంస్కృతిపరంగా, ఉపాధి మార్గంగా కొబ్బరి చెట్టు తన ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసుకుంటోంది. నిలువెత్తు ఔషధ గుణాలున్న ఈ చెట్టు ప్రతి ఇంటా కొలువు దీరిందనడంలో అతిశయోక్తి లేదు. కొబ్బరి చెట్టులో పనికిరాని పదార్థమేదీ లేదు. ఎన్నో రకాలుగా దాని ఉత్పత్తులు ప్రజలకు ఉపయోగపడుతూనే ఉన్నాయ. అలాంటి చెట్టు నుంచి మరో అద్భుత ద్రావకం వెలువడటం ప్రకృతి ప్రసాదితమే.
కల్పరసలో
పోషకాహార ధర్మాలు
కొబ్బరి కల్పరసలో పోషక విలువలు అధికం. చక్కెర 18-20 శాతం, విటమిన్ సి వంద గ్రాముల్లో 1.3 మి.గ్రా. ఖనిజ లవణాలు కూడా అధికంగానే వుంటాయి. పొటాషియం 90.5 పిపిఎం, కాల్షియం 60.0 పిపిఎం, ఫాస్పరస్ 15.0 పిపిఎం, ఇనుము 45.0 పిపిఎం, సోడియం 9.5 పిపిఎం వుంటుంది.
వంద మిల్లీ లీటర్ల కల్పరసలో మొత్తం ఘన పదార్ధాలు 15.2 - 19.7 గ్రాములు. ఇందులో సుక్రోజ్ 12.3- 17.4 గ్రాములు. మొత్తం యాష్ 0.11-0.41 గ్రాములు. ఆస్కార్భిక్ యాసిడ్ 16.0-30.0 గ్రాములు. ప్రొటీన్ 0.23- 0.32 గ్రాములు.
కొబ్బరి బెల్లం: 100 గ్రాముల బెల్లంలో థయామిన్ 21.00 మిల్లీ గ్రాములు. రైబో ఫ్లెవిన్ 21.00.మి.గ్రా. నికోటోనిక్ యాసిడ్ 5.24 మి.గ్రా., ఆస్కార్బిక్ యాసిడ్ 11.00 మి.గ్రా.
కొబ్బరి పంచదార: 100 గ్రాముల కొబ్బరి పంచదారలో తేమ 0.06 శాతం, ప్రొటీన్ 432 మి.గ్రా. ఖనిజ లవణాలు 5.24 మి.గ్రా. కార్బొహైడ్రేట్లు 11.0 మి.గ్రా. కాల్షియం 18.9 మి.గ్రా. ఫాస్పరస్ 1.9 మి.గ్రా. ఐరన్ 5.3 మి.గ్రా. వుంటుంది.

ఆరోగ్యప్రదాయని
- పిసి వెంగయ్య, శాస్తవ్రేత్త,
వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం
ఆధునిక విధానంలో కల్పరసను తీసే ప్రక్రియను అభివృద్ధి పరుస్తున్నామని, ఇది ఒక మధురమైన ఆరోగ్యకరమైన ద్రవపదార్థమని శాస్తవ్రేత్త పిసి వెంగయ్య పేర్కొన్నారు. శాస్తవ్రేత్త వెంగయ్య డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్నారు. కొబ్బరి, తాటి, ఈత, కర్జూరం చెట్లపై పరిశోధన ఫలితాలను అందిస్తున్నారు. కల్పరస కేవలం తియ్యని, మధురమైన పదార్థమే కాకుండా దీనిలో సుక్రోజ్ అనేది ముఖ్యమైన భాగంగా వుండి కార్బొహైడ్రేట్లు, పోషక పదార్థాలు అమితంగా వుంటాయని తెలిపారు. కల్పరసలో తీపిని కలిగించే పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు వుంటాయని చెప్పారు. జీర్ణశక్తికిది మంచి ఆహారం. సులభంగా మూత్ర విసర్జన అవటం ద్వారా కామెర్లు రాకుండా నివారిస్తుంది. పోషక పదార్థాలు ఎక్కువగా వున్న ఈ ద్రవపదార్థం చాలా తక్కువ గ్లిసమిక్ ఇండెక్స్‌ను కలిగి వుండటం వల్ల చాలా తక్కువ మొత్తంలో చక్కెర రక్తంలో కలుస్తుందన్నారు. తటస్థ పిహెచ్ విలువను కలిగి ఉండి ఖనిజ లవణాలు, 17 అమినోయాసిడ్స్, విటమిన్ సి, విటమిన్ బిల సమూహాన్ని కలిగివుంటుందన్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో గర్భిణులకు, ఆరోగ్యం క్షీణించిన పిల్లలకు కల్పరస చాలా ఉపయోగకరంగా వుంటుంది. గర్భిణి వారానికి మూడు, నాలుగు రోజుల పాటు కల్పరసను ఆహారంతో పాటుగా తీసుకున్నట్టయితే పుట్టబోయే బిడ్డకు మంచి రంగును కలిగిస్తుందని భావిస్తున్నామన్నారు.

- టి. శ్రీనివాస్