AADIVAVRAM - Others

ఈ-28 ( సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఇంటి నుంచి తార్నాకకి వెళ్లాలంటే ఉస్మానియా యూనివర్సిటీ దాటి వెళ్లాలి. యూనివర్సిటీలోకి వెళ్తున్నప్పుడు ఎడమవైపు ‘లా’ కాలేజి కన్పిస్తుంది. కుడివైపు ‘లా’ కాలేజి హాస్టల్ కన్పిస్తుంది. ఆ హాస్టలు ఇంకా అలాగే ఉంది. అదే పాత హాస్టల్. అది ఓ పెద్ద భవనం కాదు. ముందు ఓ ఇరవై గదులు. ఆ తరువాత స్నానపు గదులు. మళ్లీ మొదటి వరుసలాగే గదులు దాటి వెనుక మళ్లీ గదులు. ప్రతి గది ముందు చిన్న వరండా కూడా ఉండేది. దాన్ని ‘ఈ’ హాస్టలని అప్పుడు అనేవాళ్లు. నా రూం నెం.ఈ-28.
యూనివర్సిటీ నుండి వెళ్తున్నప్పుడల్లా మనస్సు ఎక్కడికో పోయేది. గతమంతా స్మృతిపథంలో కదలాడేది. ఒక్కసారి మా గది వైపు వెళ్లాలని కోరిక కలిగేది. చాలాసార్లు నా కారు మా గది వైపు నుంచి వెళ్లింది. గదిని చూస్తూ, ఆ పరిసరాలని చూస్తూ వెళ్లేవాడిని.
ముప్పై సంవత్సరాల తరువాత పిహెచ్‌డి చేద్దామని కోరిక కలిగి అడ్మిషన్ తీసుకున్నాను. దాని మూలంగా రెండు మూడుసార్లు యూనివర్సిటీ ‘లా’ కాలేజీలో ఆగాల్సి వచ్చింది. వచ్చిన ప్రతిసారి నా రూంకి వెళ్లాలని కోరిక కలిగేది. గతంలో కూడా చాలాసార్లు కారులో తిరుగుతూ యూనివర్సిటీ వైపు వెళ్లాను. నా గది వైపు కూడా చాలాసార్లు వెళ్లాను. కానీ నా రూంలోకి వెళ్లలేదు. ఈసారి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకని కొన్ని పండ్లు, స్వీట్ బాక్స్, కొంత కారా తీసుకొని వెళ్లాను.
నేనున్న గది వద్దకు వెళ్లాను. గది తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. తలుపు తట్టాను. ఓ కుర్రవాడు వచ్చి తలుపు తీసి ప్రశ్నార్థకంగా నా వైపు చూశాడు.
‘లోపలికి రావచ్చా?’ అంటూనే లోపలికి వెళ్లాను.
తలుపు తీసిన వ్యక్తి అతని మిత్రుడు ఇద్దరూ నా వైపు ఆశ్చర్యంగా చూశారు.
‘ముప్పై సంవత్సరాల క్రితం నేను ఈ గదిలో చదువుకున్నాను. ఒక్కసారి ఈ రూం చూద్దామని వచ్చాను’ చెప్పాను వాళ్లకి. నా ప్రవర్తన వాళ్లకి వింతగా అన్పించింది. గదినంతా నిశితంగా పరిశీలించాను. నేను పడుకున్న స్థలాన్ని, గోడలని తడిమి చూశాను.
ఇంతకి ఏం చూద్దామని వచ్చారు సార్! అన్నాడు ఆ ఇద్దరిలో ఒకడు.
అతని ప్రశ్నకి జవాబు ఇలా చెప్పాను.
‘ఇక్కడ నా యవ్వనపు తొలి రోజులు ఉన్నాయి. నా స్నేహితులతో సరదాగా గడిపిన రోజులు ఉన్నాయి. కాపిటేషన్ ఫీజుకి వ్యతిరేకంగా పోరాడిన మా ఆవేశాలు ఉన్నాయి. మా యూనివర్సిటీ లెక్చరర్ల మీద, ప్రొఫెసర్ల మీద మేం వేసిన జోకులు ఉన్నాయి. ఎవిడెన్స్ చట్టమూ ఉంది. రాజ్యాంగమూ ఉంది. మేం చదివిన చదువూ ఉంది. కలిసి చదువుకున్న అనుభవం ఉంది. శ్రీశ్రీ ఉన్నాడు. దాశరథి ఉన్నాడు. మా గొడవా వుంది. ‘నా గొడువా’ ఉంది. వీటన్నింటిలో వున్న నా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిలో బరువెక్కిన నా మనస్సూ ఉంది. ఈరోజు ఈ స్థితిలో వుండటానికి నా జీవితంలో పడిన పునాదీ ఉంది’ ఇలా చెబుతున్నప్పుడు నా గొంతు గద్గదమయ్యింది.
ఆ ఇద్దరూ నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుని కాసింత ప్రేమను కురిపించారు. నా హృదయాన్ని అర్థం చేసుకున్నారని నాకన్పించింది. ఆ గది విలువ కూడా అర్థమై వాళ్ల జీవితాలకి తగిన పునాది వేసుకుంటారని అర్థమైంది.