కళ

అటు నటన.. ఇటు దర్శకత్వం -- నల్లమిల్లి సూర్రెడ్డి

  • --అత్తలూరి విజయలక్ష్మి
  • 23/02/2012

ఏ వ్యక్తికైనా కళల పట్ల అభిరుచి ఉండడంతో ఆ కళలో నైపుణ్యం సంపాదించడానికి దోహదం చేస్తుంది. ఆ కళ సంగీతమో, నాట్యమో, నాటకమో, చిత్రలేఖనమో ఏదన్నా కావచ్చు. వారి అభిరుచిని అనుసరించి ప్రవేశాన్ని, నైపుణ్యాన్ని పొందడం జరుగుతుంది. అలాగే నల్లమిల్లి సూర్రెడ్డిగారు కూడా వృత్తి రీత్యా పెద్దలు ఇచ్చిన వ్యవసాయం చేసుకుంటున్నా నాటకాలపట్ల ఆసక్తి ఉండడంతో రంగస్థలంవైపు వారి ప్రస్థానం సాగించారు. తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామంలో అక్టోబర్ 17, 1942 సంవత్సరం నల్లమిల్లి వెంకన్న, శ్రీమతి చెల్లాయమ్మలకు జన్మించిన నల్లమిల్లి సూర్రెడ్డి 1955లో రంగస్థల కళల పట్ల ఆకర్షితులైనారు. 1959లో హైస్కూలు రోజుల్లో కావ్యశ్రీ రాసిన మానవుడు నాటికలో శివయ్య పాత్రతో రంగస్థలంపైన అడుగుపెట్టారు. ఎస్.ఎస్.ఎల్.సితో విద్యాభ్యాసం ఆపేసినా రంగస్థలం మాత్రం వదలలేదు. వంశపరంపర్యంగా వస్తున్న వ్యవసాయం చేస్తూనే కళామతల్లికి సేవలు చేయడానికి నడుం బిగించారు.
ఆ పరంపరలోనే పగ, ఆరని కన్నీరు, దోపిడీ, మద్యంలో మానవుడు, అల్లూరి సీతారామరాజు మొదలైన నాటకాలలో వివిధ పాత్రలు పోషించి రంగస్థలంపైన తనకంటూ పటిష్టమైన స్థానం సంపాదించుకున్నారు. 1965లో పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశభక్తి ప్రేరిత నాటికలు, అజ్ఞాతవీరులు, దేశంకోసం, రక్తతర్పణం ప్రదర్శించి ఒక సంచలనం సృష్టించారు.
వీరు కేవలం పాత్ర పోషణే కాక అనేక నాటకాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం విశేషం. వీరు దర్శకత్వం వహించిన నాటకాలు అల్లూరి సీతారామరాజు, పేద రైతు, రక్తాంజలి, కెరటాలు, కీర్తిశేషులు, భలే పెళ్లి, చిల్లరకొట్టు చిట్టెమ్మ, పుటుక్కు జర జర డబుక్కుమే, ఆత్మ సౌందర్యం, ఆన్సర్, కట్నమా కాపురాలను కూల్చకు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎనె్నన్నో వీరి దర్శకత్వ ప్రతిభకు తార్కాణాలు.
అటు నటనలో, ఇటు దర్శకత్వంలో విజయకేతనం ఎగురవేసిన సూర్రెడ్డిగారు ఆంధ్రదేశంలో జరిగే అనేక పరిషత్తులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరింపకపోతే కళామతల్లికి పూర్తి న్యాయం చేసినట్టు కాదు. అందుకే అనేక పరిషత్తు నాటకాలకు న్యాయనిర్ణేతగా, సలహాదారుగా వ్యవహరించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. నంది నాటకాలకు, డా. టి.వి.నారాయణ రామవరం ద్వారా ప్రతిభా పురస్కారాల సలహాదారుడుగా అనేక బాధ్యతలు చేపట్టడం కాక గ్రామీణ యువతకు నాటక రంగంపైన ఆసక్తి కలిగించేందుకు వారితో వివిధ నాటికలను, నాటకాలను ప్రదర్శింపజేయడం వీరి ప్రత్యేకత. అంతేకాక నటన పట్ల ఆసక్తి ఉన్న ఎవరినైనా ఆదరించి ప్రోత్సహించడం వీరి సంస్కారం. ఇంత విశేష కృషి చేసిన వ్యక్తికి పురస్కారాలు, బహుమతులు లభించకపోతే నాటక రంగాన్ని అవమానించడమే. 2006లో నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్, రామవరం వారి చేత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఘనసన్మానం, 2007లో జీవనసాఫల్య పురస్కారం, 2008లో రసమయి రంగస్థల పురస్కారం, 2012లో అభినయ ఆర్ట్స్, తిరుపతి వారిచే నిర్వహించిన ప్రతిష్టాత్మక విశిష్ట కళాసేవా పురస్కారం, రాజమండ్రి కళాస్రవంతి వారి ఉత్తమ నటుడు పురస్కారం- ఇలా అనేక పురస్కారాలు పొందిన నల్లమిల్లి సూర్రెడ్డిగారు 70 ఏళ్ళ ప్రాయంలో కూడా ఇంకా ఎంతో ఉత్సాహంగా నాటక రంగానికి సేవ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇంకా చేయాలని మనసారా కోరుకుందాం.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading