Others

సువర్ణ సుందరి -- ఫ్లాష్‌బ్యాక్ @ 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత దర్శకులు ఆదినారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అశ్వనీ పిక్చర్స్ బ్యానర్‌పై మాయలమారి/ మాయాక్కారై -తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తరువాత తమ సతీమణి అంజజీదేవి పేరుమీద అంజలీ పిక్చర్స్ స్థాపించి పరదేశి (1952), అనార్కలి (1955) చిత్రాలు నిర్మించారు. తరువాత 1957లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించిన చిత్రం -సువర్ణసుందరి. ఈ చిత్రానికి కథను సదాశివబ్రహ్మంతో కలిసి ఆదిత్యదాస్ పేరిట ఆదినారాయణరావే రూపొందించారు.

నృత్యం: వెంపటి సత్యం
ఎడిటింగ్: ఎస్‌ఎస్ ప్రకాశం
కళ: వాలి
ఫొటోగ్రఫీ: ఎంఏ రహమాన్
స్టంట్స్: విపి బలరాం అండ్ పార్టీ
మాటలు: మల్లాది రామకృష్ణశాస్ర్తీ
పాటలు:
సముద్రాల సీనియర్, సముద్రాల (జూ), కొసరాజు
సంగీతం: ఆదినారాయణరావు.

మాళవదేశపు మహరాజు చండభానుని కుమారుడు జయంతుడు (అక్కినేని). మిత్రుడు వసంతుడు (పేకేటి). ఇద్దరూ గురుకులంలో విద్యాభ్యాసం ముగిస్తారు. గురుపుత్రిక సరళ (సూర్యకళ) జయంతుని మోహిస్తుంది. అతను తిరస్కరిస్తాడు. దాంతో తనను బలత్కారం చేశాడని తండ్రి (కెవియస్ శర్మ)తో కలిసి మహారాజుకు తెలియచేస్తుంది. మిత్రుని సూచనపై జయంతుడు దేశాంతరం వెళ్తాడు. దారిలో కలిసిన కైలాసం (రేలంగి), ఉల్లాసం (రమణారెడ్డి), చాదస్తం (బాలకృష్ణ)లతో వచ్చిన సవాలు కోసం దగ్గరలోని గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ శాపగ్రస్తుడైన గంధర్వునికి తన ఆత్మార్పణతో విమోచనం కలిగిస్తాడు. దానికి ప్రతిఫలంగా కోరినచోటుకు చేర్చే తివాచీ, ఎవరినైనా లొంగదీసే దండం, కోరినదల్లా ఇచ్చే కమండలం పొందుతాడు. మిత్రత్రయం జయంతుని కొట్టిపడవేసి, వాటిని సంగ్రహిస్తారు. జయంతుడు ఎండిన మడుగులో పడతాడు. ఆనాడు కార్తీకపున్నమి కావటంతో గుహలోని శివాభిషేకానికి, దివి గంగ మడుగు చేరటంతో జయంతునికి స్వస్థత కలుగుతుంది. అర్చనకై అక్కడకు వచ్చిన దేవకన్యల్లో సువర్ణ సుందరిని ప్రేమించి గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాడు. భూలోకానికి జయంతుని కోసం వచ్చి వెళ్తున్న సుందరి గర్భవతి అని తెలిసి, దేవరాజు ఆమెకు దైవత్వం తొలగి, భూలోకం పొమ్మని శపిస్తాడు. అంతేకాదు, ఆమె భర్త ఆమెను మరచిపోతాడని, ఆమె స్పర్శతగిలితే పాషాణం అవుతాడని శాపమిస్తాడు. భూలోకం చేరిన సుందరి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ప్రమాదం కారణంగా నదిలోపడిన సుందరి, బిడ్డను పోగొట్టుకొని మగవేషంతో సంచరిస్తుంటుంది. సుందరి బిడ్డ ఒక గొల్లవానిచే (గుమ్మడి) పెంచబడి, అతను మరణించాక ఒంటరియై, గుహలోని శివపార్వతుల సన్నిధిలో శివ కుమారునిగా పెరుగుతుంటాడు. అడవిలో తిరుగుతున్న జయంతుడు ఒక నాగకన్య శాపం కారణంగా పగలు స్ర్తిగా, రాత్రివేళ పురుషునిగా జీవించాల్సి వస్తుంది. సిఎస్సార్ అవంతీరాజ్యంలో భద్రగజం మాలవేసిన కారణంగా సుందరి ఆ రాజ్యానికి మహామంత్రి అవుతుంది. జయంతిగా అదే రాజ్యంచేరిన జయంతుడు రాకుమారి (గిరిజ)కి నాట్యం నేర్పుతుంటాడు. జయంతుని చూసిన రాకుమారి అతన్ని ప్రేమిస్తుంది. కైలాసం వల్ల చిక్కుల్లో పడిన జయంతి రాక్షసుని వద్దకు చేరి, అమృతధారలో పునీతయై జయంతునిగా మారతాడు. తనకు సాయపడిన సుందరిని తాకటంతో అతనికి గతం గుర్తుకొస్తుంది. పాషాణంగా మారుతున్న జయంతుడు, శివపార్వతుల ఆదేశంతో తమ కుమారుడు ఆకసం నుంచి బంగారు కమలంతెచ్చి తండ్రి శిరస్సున ఉంచటంతో జయంతునికి నిజరూపం రావటం, పరమేశ్వర అనుగ్రహంతో తమ రాజ్యం చేరి, అక్కడ రాకుమారి గిరిజను వివాహం చేసికొని సుఖించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
సుందరి కుమారునిగా మాస్టర్ బాబ్జీ, బొమ్మలమ్ముకునే యువతిగా మోహన నటించారు. చిత్రంలో హీరో జయంతునిగా అక్కినేని తన పాత్ర పరిధిమేరకు ఆకట్టుకునేలా నటించారు. చిత్రం ప్రారంభంలో వచ్చే పోరాటం సన్నివేశంలో కోయవారితో కొండలమీద, గుట్టలమీద దుముకుతూ చేసే యుద్ధంలో, రాక్షసుని అంతం చేసే సన్నివేశంలో చురుకుగా కనిపించారు. కోయవారితో ఫైట్ సందర్భంలో కాలికి గాయమై అక్కినేని కొద్దిరోజులు ఇతర షూటింగ్‌లకు దూరమయ్యారు. (సువర్ణసుందరి హిందీ చిత్రంలోనూ, హీరోగా అక్కినేని నటించటం, వారు నటించిన ఒకే ఒక్క హిందీ చిత్రం సువర్ణసుందరి కావటం విశేషం). తమిళ చిత్రంలో ఈ పాత్రను జెమినీ గణేశన్ పోషించారు. సహజంగా నృత్య కళాకారిణి, ప్రతిభగల నటీమణి అయిన అంజలీదేవి ‘సువర్ణసుందరి’గా నృత్యాలతో, నటనతో అలరించింది. మిగిలిన పాత్రధారులందరూ పాత్రోచితంగా మెప్పించారు.
దర్శకులు వేదాంతం రాఘవయ్య సన్నివేశాలను అర్ధవంతంగా రూపొందించారు. దేవకన్య నరుని వరించి భూలోకంలో కష్టాలుపడి సుఖాంతమైన ‘బాలరాజు’, ‘స్వప్నసుందరి’ వంటి చిత్రాల్లో అంశానికి, పలు ఆసక్తికరమైన మలుపులు, మజిలీలతోకూడిన కథను అల్లుకుని సంగీతానికి, నృత్యాలకు ప్రాధాన్యతనిస్తూ చిత్రీకరించారు. కామెడీ హీరోలకి విలనినీ జోడించి కొంత తమాషాను, కొంత సీరియస్‌నెస్‌ను జోడించటం ఆయనకే చెల్లింది. జయంతుని నుండి విచిత్ర వస్తువులు చేపట్టటం, జయంతుడు స్వస్థుడుకావటానికి ఆకాశగంగ భువికి రావటం, శివభక్తురాలైన సుందరి శివసన్నిధిలో గాంధర్వ వివాహం, నీ భర్త నిన్ను మరచిపోతాడని ఇంద్రుడనగానే జయంతుడు మురళీ విసరివేయటం, భూలోకంలో పడిన సుందరి ప్రసవం జరగటానికి ఆకులు పోగుపడటం, అవి తొలగి బిడ్డతో సుందరి కన్పించటం లాంటి సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. పులి బారినుంచి పరిగెత్తటంవల్ల సుందరికి కళ్ళు తిరిగినట్టు చుట్టూ ప్రపంచాన్ని మసకగా చూపటం, ఆమె నదిలో పడటం, దండంతో ఉల్లాసాన్ని శిక్షిస్తూ వెనక్కి తిరిగిన అతన్ని దండం బెదిరించటం, జయంతునికి నాగకన్య శాపాన్ని ఊర్వశి శాపంతో పోల్చిచెప్పటం, మగవేషంలో సుందరి తెలివైన జవాబుల ద్వారా మంత్రిగా సామర్థ్యం నిరూపించుకోవటం లాంటి సన్నివేశాలు సువర్ణ సుందరి చిత్రానికి హైలెట్ అయ్యాయి. చిత్ర గీతాల్లో.. ‘పిలువకురా’ నృత్యంలో మొదట చంద్రవంక పైనుంచి గ్రూప్ డాన్స్, మురళి స్వరం విని కలవరం నృత్యంలో మరో నృత్యగీతం ఒంటరిగా చేయటం, -నీ నీడలోనాలో మురళి స్వరానికి నిలువలేక ఆకసంలో పైకెగిరి తేలుతూ నర్తించటం, తొలుత -జగదీశ్వరి పాహిపరమేశ్వరి గీతంలో మొదట మెల్లగా, ఆపైన ‘ప్రమధులు పాడ ఫణి గణమాడ’లో వేగంగా చిత్రీకరించటం, ఆ పాట అయ్యాక అక్కినేని, అంజలి కలిసే సన్నివేశంలో అనార్కలి గీతం ‘రాగ సుధా భరితము’ ట్యూన్ విన్పించటం, ఈశ్వరుని వేడుకుంటూ సుందరి శంభోనా మొరవినవాలో మొదట వేదనతో మొదలై, చివరకు ‘పాహి మహేశ గిరిశా’లో 4చోట్ల మొదట ఉద్యానవనంలో, మంటపంలో, వర్షంలో పడవపై, ఆపైన వికసించిన కలువలు రెంటిలోను, ఆపైన సుందరి, జయంతులులిరువురూ ఒకే కలువలో చేరటం, కలువ ముకుళించుకోవటం ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.
కళా దర్శకులు వాలి శివపార్వతులుండే గుహ సెట్, జయంతుడు ప్రవేశించిన గుహలో అగ్నిగుండం, మనిషి తలలో పాము, ఇంద్రలోకం సెట్, రాక్షసుని గుహ, అవంతీ రాకుమారి తోటలో ఏకాంత మందిరం, ఉల్లాసం తనని తిరస్కరించిన వారిని బంధించే గుహ ఎంతో వైవిధ్యభరితంగా ఆకట్టుకునేలా రూపొందించారు. సందర్భోచిత సంభాషణలతో మల్లాది రామకృష్ణశాస్ర్తీ మెప్పించారు. (కాలం తప్పివచ్చింది, తప్పించుకు వెక్కిరించవయ్యా)
చిత్ర గీతాలు:
చిత్ర ప్రారంభంలో గురుకులంలో అక్కినేని, కెవియస్ శర్మ, పేకేటి శిష్యులపై చిత్రీకరించిన శ్లోకం -లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం (ఘంటసాల). రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణలపై చిత్రీకరించిన గీతం -ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా (మాధవపెద్ది, పిఠాపురం- కొసరాజు). గిరిజ తన ఉద్యానవనంలో చెలికత్తెలతో పాడే పాట హుషారుగా సాగుతుంది -రారే వసంతుడు ఏతెంచె మళ్ళీ ఈరోజు పూబాల పెళ్ళి (ఎపి కోమల బృందం- సముద్రాల జూనియర్). ఈశ్వరుని ప్రార్థిస్తూ దేవ కన్యలపై చిత్రీకరించిన నృత్య గీతంలో అంజలీదేవి, బాల, చాటునుంచి అక్కినేనిలపై చిత్రీకరణ -జగదీశ్వరా పాహి పరమేశ్వరా (పి.సుశీల బృందం). గురుపుత్రిక సూర్యకళ తన చెలులతో పాడే నృత్యగీతంలో ఘట వాయిద్యం ప్రత్యేకంగా విన్పించారు. దాన్ని ఆడపిల్లలు తమ చేతిలో కుండలపై వాయిస్తూ నర్తించటంగా చిత్రీకరించిన గీతం -బంగారు వనె్నల రంగారు సంజారంగేళి (పి లీల బృందం). దేవసభలో దేవకన్యలు, ఇంద్రుడు, శచీదేవి, అంజలీదేవి, బాల మొదలైన వారిపై చిత్రీకరించిన మ్యూజికల్ హిట్‌గా నిలచి, ఫ్లూట్, వీణ, వయొలెన్ వాయిద్య విశేషాలతో నృత్యంతో, ఛాయాగ్రహణంలో అలరించిన గీతం -పిలువకురా, అలుగకురా (పి.సుశీల బృందం). ఈ పాట తమిళంలో అళైకాదే, హిందీలో ముఝెనాబులాగా.. అంటూ మూడు భాషల్లో అలరించటం విశేషం. అంజలిదేవి, అక్కినేనిలపై చిత్రీకరించిన యుగళగీతం -హాయిహాయిగా ఆమని సాగె.. (ఘంటసాల, జిక్కి) సంగీత, సాహిత్య శోభలతో అలరారింది. ఈ పాట ఒక రాగమాలికగా హంసానంది, బసంత్‌బహార్, దర్బారీ కానడ, కల్యాణి రాగాలతో స్వరపర్చబడి అనేక గాయకుల స్వరాల్లో నేటికీ వినిపిస్తుండటం విశేషం. అంజలిదేవిపై ఇంద్రసభలో చిత్రీకరించిన గీతం -నీ నీడలోనా నిలిచేనురా (పి.సుశీల). అంజలిదేవి, గుమ్మడిపై చిత్రీకరించిన గీతం -నా చిట్టిపాపా, ననుగన్న చిన్నారి’ (సుశీల, ఎంఎస్ రామారావు). బొమ్మలమ్ముతుండగా అంజలిదేవిపై చిత్రీకరించిన గీతం (అంజలిదేవి నటించిన చిత్రాల పేర్లు రావటం విశేషం) -బొమ్మాలమ్మా, బొమ్మలు’ (పి.సుశీల). రాజసులోచన, అంజలిదేవి, మాస్టర్ బాబ్జీలపై చిత్రీకరించిన గీతం -అమ్మాఅమ్మా అని అడిలేవు బాబూ (ఘంటసాల). రాజసులోచన గిరిజకు నృత్యం నేర్పుతూ పాడే నృత్యగీతం -తాతోం తత్తతోం ఈ వసుధలో నీకు సాటి దైవం (ఎపి కోమల). చిత్రం చివర అంజలిదేవి, అక్కినేని, మాస్టర్ బాబ్జి, ఇవి సరోజ, ఈశ్వరునిపై చిత్రీకరించిన గీతం -శంభో నా మొరా వినవా (పి సుశీల బృందం- సముద్రాల జూ).
సముద్రాల సీనియర్, మిగిలిన వారు రాసిన గీతాలకు ఆదినారాయణరావు సంగీతం, వెంపటి సత్యం నృత్యం, రెహమాన్ ఛాయాగ్రహణం, వాలి కళా దర్శకత్వం, మిగిలినవారి కృషికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం, నటీనటుల ప్రతిభతోడై నాటికి నేటికీ అలరించే చిత్రంగా సువర్ణసుందరి నిలుస్తోంది.

- సివిఆర్ మాణిక్యేశ్వరి