స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 125

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

ఉన్నవాడూ లేనివాడూ
దైవం ముందు యాచకులే
అస్య శాసురుభయాసః సచంతే హవిష్మంత ఉశిజో యే చ మర్తాః
దివశ్చిత్ పూర్వో న్యసాది హోతాపృచ్ఛ్యో విశ్పతిర్విక్షు వేధాః॥ ఋ.1-60-2॥
భావం:- లోకంలో జీవన సౌభాగ్యం, ధన సమృద్ధికలవారు మరియు దారిద్య్రం చేత ధనాభిలాషులై యున్న ఈ రెండు విధాలైన జనులున్నారో ఆ యిరువురు కూడ జగత్ప్రభువునే శరణుజొచ్చుచున్నారు. ఆయనే మరీ మరీ అడిగి తెలుసుకోదగిన మహాపురుషుడు సమస్త జీవులకు ప్రభువు. మహాజ్ఞానియైన బ్రహ్మ. ఆయన ఆకాశం కంటె, సూర్యుని కంటె కూడ ముందునుండి సమస్త ప్రాణులలో ఉంటున్నాడు.
వివరణ:- ప్రపంచంలో తృప్తికలిగిన ధనవంతుడు ఎక్కడా ఎప్పుడూ కనబడడు. అపారమైన ధనమున్నా ఇంకా ధనంకావాలనే లాలస ఉండనే ఉంటుంది. తనతో సమానమైన ధనికుడు లోకంలో కనబడకున్నా ఇంకా ధనవంతుణ్ణి కావాలనే వాంఛతో ప్రభువును ఆశ్రయిస్తూ ఉంటాడు. అలా అర్థించేందుకు ఎంత ధనికులైనా సిగ్గుపడరు. ఇక దరిద్రులు సరే. వారెలాగూ ధనికులను యాచిస్తూ ఉంటారు. వాస్తవానికి సంపద ఉండడం, లేకపోవడం, దారిద్య్రం, ధనాఢ్యత కేవలం మనస్సుకు సంబంధించినది. ఎవడి మనస్సులో ధనంమీద ఎంత లోభగుణముంటుందో అతడంత దరిద్రుడు.
‘కో హి దరిద్రో? యస్య తృష్ణా విశాలా’ భర్తృహరి అన్నట్లు ఎవడికెంత పేరాశ ఉంటుందో అతడంత దరిద్రుడు. ఈ విధంగా దారిద్య్రం చేతగాని లోభగుణం చేతగాని మనుష్యులు యాచిస్తూనే ఉంటారు. లోకంలోని ఈ సామాన్య స్థితినే శ్రుతి వర్ణిస్తూ ‘అస్య శాసురుభయాసః సచంతే’ ధనాఢ్యుడైనా, దరిద్రుడైనా, త్యాగియయినా, లోభి అయినా ప్రభువును (విశ్వ విభుడైన భగవంతుని అని అర్థాంతరం) ఆ యిరువురూ ఆశ్రయిస్తారు. ఎందుకంటె లౌకికంగానైనా ఆధ్యాత్మికంగా నైనా ’‘ఈక్షే హి వస్వ ఉభయస్య’ (ఋ.6-19-10). ధనార్థులైన ఇరువురికీ ధనప్రదాత ఆ ప్రభువే కాబట్టి.
ధనవంతుడికి, దరిద్రుడికీ కావలసిన ధనం భగవంతుని వద్దనే ఉంది. త్యాగికి, ధనకాంక్షగల వాడికి కావలసిన ధనం కూడ ఆ దైవంవద్దనే ఉంది. ఏ విధమైన ధనం కావాలనేది సిద్ధ సంకల్పుడైన ఆదిదేవుని వద్దనే ఉంది.
కాబట్టి ఎవరికే ధనం కావలసినా ‘ఆపృచ్ఛ్యః’ అర్థింపదగినవాడా ఆ లోకాధ్యక్షుడు మాత్రమే. అందరూ తప్పక ఆయనను గూర్చి మాత్రమే తెలిసికోవలసి యుంది. ఆ విధంగా తెలిసికొన్నవానికి ‘తం సంప్రశ్నం భువనాయంత్యన్యా’ (ఋ. 10-82-3)
ఆ సంప్రశ్న= ఆపృచ్ఛ్యః= తెలుసుకొన్నవానికే అఖండ భువనజాలమూ ప్రాప్తమవుతూ ఉంది అని ఋగ్వేదం హెచ్చరిస్తూఉంది. ఈ విషయానే్న మరింత విస్తృతంగా వివరిస్తూ తైత్తిరీయోపనిషత్తు భృగువల్లిలో ఇలా చెప్పింది.
యతో వా ఇమాని భూతాని జాయనే్త యేన జాతాని జీవన్తి
యత్ప్రయన్త్యభిసంవిశన్తి తద్విజిజ్ఞాసస్య తద్ బ్రహ్మ॥
భావం:- ఎవనినుండి సృష్టిజాలమంతా జనిస్తున్నదో, జనించినదంతా ఎవని వలన జీవిస్తున్నదో, మరణించి మరల ఎవనియందు జనిస్తున్నదో ఆ మహద్భూతాన్ని (దైవాన్ని) అడిగి తెలుసుకో. అతడే పరబ్రహ్మం. ఉపనిషత్తు చెప్పిన ఈ విషయం ఋగ్వేదం చెప్పిన ‘సంప్రశ్నమ్, అపృచ్ఛ్యః’అన్న మాటలకు వ్యాఖ్యానమే. ఈ పరబ్రహ్మం ధనార్తులకు ఆశ్రయుడైన లౌకిక రాజువలె ప్రజలలో కలిసిగాని తరువాత గాని పుట్టినవాడుకాడు. ఆతడు ‘దివశ్చిత్ పూర్వో న్యసాది విక్షు’ ‘‘సూర్యుని కంటె ముందే సమస్త ప్రాణులలో లీనమైయున్నాడు’’అని శ్రుతి అనాదిత్వాన్ని ప్రకటించింది. అంటే సృష్ట్యాదిలో సూర్యుడు జనించాడు. ఆ సూర్యునికంటె ముందే పరబ్రహ్మముంది. అది సకల సృష్టి జాతంలో, జీవులలో, పరమాణువులలో అంతటా అభివ్యాప్తమైయుంది. ఈ విషయానే్న ఋగ్వేదం మరొక సందర్భంలో పునరుక్తిగా-
‘పురఃస్థాతా’ (ఋ.8-46-13) అందరికంటె ప్రథముడు అని ఘోషించింది.
కాబట్టి సకల ప్రాణులు ఆ దేవాధిదేవుణ్ణి మాత్రమే మోక్షార్థులు మోక్షధనం కావాలన్నా, ధనార్థులు ధనం కావాలన్నా వాచ్యంగా కోరనవసరం లేదు. కాని కేవలమీవిధంగా ప్రార్థించండి అంటూ ఋగ్వేద మీ విధంగా హితవుపలికింది. ఓ ప్రభూ! సర్వాంతర్యామివైయున్న నిన్ను అందరూ అర్థిస్తున్నారు. మేమూ అర్థిస్తున్నాం. మా అభ్యర్థన విను.
యన్మన్యసే వరేణ్యమింద్ర ద్యుక్షం తదా భర (ఋ.5-39-2)
‘‘ఏ ధనం మాకు సర్వశ్రేష్ఠమూ, శ్రేయోదాయకమూ అని నీవు భావిస్తావో దానినిమాత్రమే మాకు ప్రసాదించు.’’
కోరికలు విన్నవించినవాని కంటె ఈ వేదోక్త ప్రార్థన చేసినవానికి సమస్తమైన అభీష్టాలు సిద్ధిస్తాయి.
***
జితేంద్రియుడైన గృహస్థుడే
ధనపతులలో ధనపతి
ఉశిక్పావకో వసుర్మానుషేషు వరేణ్యో హోతాధాయి విక్షు
దమూనా గృహపతిర్దమ ఆ అగ్నిర్భువద్రయిపతీ రరుూణామ్‌॥ ఋ.1-60-4॥
భావం:- కోరికలు కలవాడు, ప్రేమ పూర్వకమైన ఆశ్రయమిచ్చేవాడు, మానవులలో శ్రేష్ఠుడును, దాతయు, ప్రజలలో శ్రేష్ఠునిగా పరిగణింపబడుతున్నాడు. అటువంటి దాంతుడయిన గృహస్థుడు జితేంద్రియ శీలంచేత సమసె్తైశ్వర్యాలకు అధిపతి మరియు శ్రేష్ఠుడు కాగలడు.
వివరణ:- ఈ మంత్రంలో గృహస్థాశ్రమ స్వీకారాధికారం కేవలం ఉత్తముడైన వానికే కలదని ప్రతిపాదింపబడింది. దానితోబాటు జితేంద్రియుడైన గృహస్థుని ఘనత కూడ వివరింపబడింది. గృహస్థాశ్రమ గ్రహణాధికారి ఉశిక్= కోరికలు కలవాడు మాత్రమేనని మొదటి లక్షణాన్ని మంత్రం పేర్కొంది. ఎందుకంటే కోరికలే లేనివాని వలన ఏ పని నిర్వహింపబడదు.

--ఇంకావుంది