స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-212

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విధంగా ఆ పరమాత్మ గురువులకే గురువు= పరమగురువు. రాజు శాసనం కేవలం శరీరంవరకు మాత్రమే పరిమితం. కాని గురువు శాసనం మాత్రం హృదయం. బుద్ధి ఇలా అన్నింటికీ పర్యాప్తమై ఉంటుంది. పరమ గురురూపమైన పరమాత్మ మహత్త్వానికిగల అనేక కారణాలలో ఇది ఒకటి. ఈ సమష్టి అర్థాన్నంత గర్భీకరింపచేసి వేదం-
శాస ఇత్థామహాన్ ఆసి ‘‘ఓ దేవా! నీవు అనుశాసకుడవు. అందుకే నీవు మహత్తువి’’అని వర్ణించింది. ఈ సందర్భంలో అనుశాసకుడన్న పదానికర్థం కేవలం అధికారబలంతో శిక్షించేవాడని మాత్రంకాదు. బుద్ధికి హితకరంగా అనుకూలంగా ప్రబోధించేవాడని అర్థం. మహేశ్వరుడు సృష్ట్యారంభంలో మానవులకు వేదాలను మాత్రమనుగ్రహించి తృప్తిపడలేదు.
ఆనాటినుండి సదాచరణను ప్రబోధిస్తూనే ఉన్నాడు. చెడుపని చేయాలని తలచేవాని మదిలో నిలిచి హితాన్ని ప్రబోధిస్తున్నాడు. సాధారణంగా మానవుడు ఆ దైవం వినిపించే సదుపదేశాన్ని పెడచెవిని పెడుతూనే ఉంటాడు. అయినా సర్వాంతర్యామి మాత్రం చెడుత్రోవపట్టకుండ సదా సావధానపరుస్తూనే ఉంటాడు.
భగవత్కృపాపాత్రుల శత్రువులు తమకుతామే నశించిపోతారు. వారి నావిధంగా భగవానుడే నాశనం చేస్తాడేమో. అందుకే దైవం శత్రుసంహారకుడుగా ఖ్యాతిపొందాడు. దీనినిబట్టి సర్వేశ్వరుడు భక్తుల వెంటవచ్చి వారి శత్రువులతో సాక్షాత్తుగా యుద్ధంచేసి వధిస్తాడని భావించరాదు.
భగవద్భక్తుల ప్రాభవాన్ని చూచినవారి శత్రువులలో ప్రతిదినమూ ఏదో తెలియని న్యూనతాభావం కల్గించి దానిద్వారా వారిని నశింపచేస్తాడు. అలా శత్రువుల హృదయాలను క్రుంగదీసి ఆశ్చర్యకర శక్తికలవాడు కావడంవలన వేదం భగవంతుణ్ణి ‘అమిత్రఖాదో అద్భుతః’ ‘‘అద్భుత శత్రుసంహారకుడు’’అని స్తుతించింది.
భగవంతుని అద్భుతశక్తిని ప్రకటిస్తూ వేద మంత్రం ‘న యస్య హన్యతే సఖా న జీయతే కదాచన’ ఎవనికి దైవం మిత్రుడో అతడు ఎన్నటికి చంపబడడు, హానిని కూడ పొందడు’’అని వర్ణించింది.
భగవంతుడు సమస్త జీవులకు మిత్రుడే. అయినా ‘్భవంతి భవ్యేషు హి పక్షపాతాః’ ‘‘దివ్యగుణ సంపన్నుల ఎడల దైవం విశేషమైన రీతిగా సుముఖమై యుంటుంది’’అన్న వచనానుసారం భగవద్భక్తుల ఎడల ఆ పరాశక్తి విశేష కృపాసహితమై యుంటుంది. ఈ మాట వేదప్రామాణికమైనదే. ఎందుకంటే ఋగ్వేదమే ‘ఇంద్రో మునీనాం సఖా’ (ఋ.8-17-14) ‘‘దైవం మునులకు- భగవద్భక్తులకు ప్రియసఖుడు’’అని కంఠోక్తంగా ధ్రువీకరించింది. మిత్రుడు తన మిత్రుణ్ణి ఆపదలనుండి రక్షిస్తాడు. ‘సఖా సఖాయమతరద్విషూచోః’ (ఋ.7-18-6) అని ఋగ్వేద వచనమే ఉంది కదా!
మరణం మరియు పరాజయం ఈ రెండూ భరింపజాలని గొప్ప ఆపదలు. పరాజయమంటే యుద్ధంలోని అపజయమొక్కటే కాదు. జీవితంలో ధన, జన, బల, శరీర, మనోసంబంధియైన హానులన్నీ పరాజయాలే. ఇవి జీవన సమరాంగణంలో ఆత్మన్యూనతారూపంగా కలిగించే పరాజయమే. భగవంతుని మిత్రులు ఈ రెండువిధాల ఆపదలలో చిక్కుకోరు.
‘న యస్య హన్యతే సఖా న జీయతే కదాచన’ ‘‘దైవమెవనికి మిత్రుడో అతడు చంపబడడు, హానిని పొందడు’’అంటూ ప్రస్తుత వేదమంత్రం దైవభక్త రక్షణ పరాయణత్వాన్ని స్పష్టపరచింది. ‘దైవకృపాపాత్రుడు మరణింపడు’అన్న మాటను చూచి అమరుడని భావించరాదు.
అట్టివానికి శరీరమే నశిస్తుందిగాని దానిని ఉపాధిగా చేసుకొన్న ఆత్మ మాత్రం అవినాశి అనే జ్ఞానం ధ్రువపడటం ద్వారా అతడికి మృత్యుభీతి ఉండదని భావం. అంతేకాక నశ్వరమైన శరీరానికి సంభవించే హాని వృద్ధులను చూచి ఎన్నడు పొంగక, క్రుంగక ఆత్మగా తాను వాని కతీతమైన శాశ్వతునిగా కలిగిన భావంచేత ‘న జీయతే కదాచన’ హానియే ఎరుగనివాని వలె ఆనందమయుడై యుంటాడు.
జీవులకు భగవానుడు స్వాభావిక మిత్రుడు. జీవులు తమ అజ్ఞానవశం చేత ఉపేక్షాభావం చేత దైవానికి దూరంకావచ్చు. కాని పరమాత్మ ఎన్నటికిని మిత్రుడుగా జీవులకు దూరంకాడు. లౌకిక మిత్రుడు కారణాంతరాలచేత కోపగించవచ్చు. దూరంకావచ్చు. కాని మిత్రుడుగా దైవం జీవులయెడల కోపగించడు. మిత్రత్వాన్ని కూడ ఎన్నటికి విడువడు. కాబట్టి మానవుడు తనకు నిజమైన మిత్రుడగు సర్వేశ్వరుని దూరం చేసుకోరాదు.
**
బాగా దంచి తీయబడని సోమరసం ఆనందప్రదం కాదు
న సోమ ఇంద్రమసుతో మమాద నా బ్రహ్మాణో మఘవానం సుతాసః
తస్మా ఉక్థం జనయే యజ్ఞుజోషన్నృవన్నవీయః శ్రుణవద్యథా నః॥

భావం:- బాగుగా దంచి పిండి తీయబడనిది- జ్ఞానహీనమూ మరియు దైవస్తుతి రహితమూ అయిన సోమరసం ఇంద్రుడికి సంతృప్తి కలిగించదు. మా నమస్కార సహితమైన స్తోత్రాలను వినే ఇంద్రుని సంతోషానికై సామాన్య మానవునివలె స్తోత్రపాఠాలను చేస్తున్నాం.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు