స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
*
అశ్వినీ దేవతలు పాపాల నుండి విముక్తం చేస్తారు

ఋషిం నరావంహసః పాంచజన్యమృబీ సాదత్రిం ముంచథో గణేన
మినంతా దస్యోరశివస్య మాయా అనుపూర్వం వృషణాచోదయంతా॥
- ॥
భావం:- జీవుల జీవన నాయకులైన అశ్వినీ దేవతలారా! అశుభదాయకమైన అకర్మణ్యతను కపటాన్ని నశింపచేస్తూ పూర్వంవలె సుఖకారకమూ మరియు సత్ప్రేరకమవుతూ జ్ఞానేంద్రియ పంచకానికి మేలును కలిగించే ఆత్మను కుత్సితమూ, అహంకార గుణాల నుండి పరిసంఖ్యాన జ్ఞానం ద్వారా విడుదల చేయండి.
వివరణ:- ఈ మంత్రానికి దేవతలు అశ్వినులు. వీరు ఇద్దరు. వేదాలను పరిశీలన చేస్తే చీకటి-వెలుగు, రాత్రి- పగలు, సూర్యుడు-చంద్రుడు, ద్వావా- పృథువులు, ప్రాణ- అపానాలు మొదలైన ద్వంద్వాలకే ఆశ్వినులన్న పేరున్నట్లు స్పష్టవౌతుంది. ప్రస్తుత మంత్రంలో ఆశ్వినులుగా ప్రాణ- అపానాలు నిర్దేశింపబడుతున్నాయి. సాధారణంగా ఈ ప్రాణ-అపానమనే ప్రాణశక్తులు మానవ శరీరంలో దేనికది స్వతంత్రంగా తమ కార్యాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా శరీరంనుండి విముక్తమైన దశలో కలిగే దుఃఖాన్ని ఆత్మకు సంక్రమించకుండ సంరక్షిస్తూ ఉంటాయి. అంతేగాక చిరకాల ఇంద్రియ సంసర్గంవలన జనించే కుత్సితమైన పాపం నుండి ఆత్మను విముక్తం చేస్తాయి.
ఈ మంత్రంలో ‘ఆత్మ’ ఋషిగా పేర్కొనబడింది. ‘ఋషిర్దర్శనాత్’ దర్శించువాడు దర్శింపచేయువాడు అన్న నిరుక్త వచనానుసారం ఆత్మ మరియు ఐదు జ్ఞానేంద్రియాలు కూడ ఋషులే. ‘సప్త ఋషయః ప్రతిహితాః శరీరే’ (శు.య.వే. 34-55) ‘‘శరీరంలో ఋషులేడుగురు ఉపనిష్ఠులైయున్నారు’’అన్న శుక్లయజుర్వేద వచనానుసారం ఆత్మతోబాటు ఇంద్రియాలు కూడ ఋషులేనని స్పష్టమవుతూంది. ఆ ఏడు ఏవంటే కన్ను, ముక్కు, చెవి, జిహ్వ, చర్మం అనే ఐదు జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు, బుద్ధి అన్నవి. ఆత్మ ఇంద్రియ సప్తకం నిర్వహించే కార్యకలాపాలను దర్శిస్తుంది కాబట్టి ‘ఋషి’. అంతమాత్రమేకాదు ఆత్మ ‘అత్రి’= భోక్త కూడ.
అంటే ఇంద్రియాల నుండి తనకు చేరిన జ్ఞానాన్ని అనుభవించేది ఆత్మే. ఈ విధంగా ఆత్మ ద్రష్ట మరియు భోక్త కావడంవలన దానికి సమస్త కార్యాలకు కర్తృత్వం కూడ సంక్రమిస్తూంది. ఈ కర్తృత్వభావననే పై వేదమంత్రం ‘పాంచజన్యమ్’ జ్ఞానేంద్రియ పంచకానికి (మనస్సు, బుద్ధి ఇంద్రియాలే అయినా జ్ఞానేంద్రియాల వలె బాహ్య జ్ఞానాన్ని సంగ్రహించేవి కావు కాబట్టి ఇక్కడ ఇంద్రియాలలో ఆ రెండు చేర్చబడలేదు) హితకారిగా చెప్పింది. ఈ హితకారి భావనే సందర్భానుసారంగా అధిష్ఠాత మరియు కర్తగా చెప్పబడుతుంది.
సాధకుడైన యోగి గురుముఖంగా ఆత్మస్వరూప జ్ఞానాన్ని తెలుసుకొంటాడు. అప్పుడతడు ప్రాణ-అపానవాయువుల సాధనలో నిమగ్నుడవుతాడు. ఆ సమయంలో ‘అకర్మణ్యత’అనగా కర్మరాహిత్యమనే ‘దస్య’దుర్భావాన్ని అతడు అణచివేయాలి. అంటే సాధకుడు ఆత్మసాక్షాత్కారార్థంగా చేయదగిన సమస్త కర్మలను నిష్ఠతో ఆచరించాలి అని అంతరార్థం. దానివలన క్రమంగా ప్రాణాపానసాధన సిద్ధిస్తూ ఆత్మకుగల తేజస్సును నశింపజేసే అజ్ఞానాది దోషాలు నశింపబడతాయి. ఈ విధంగా ఆత్మసాక్షాత్కారాభిముఖంగా సాగే యోగసాధన మరియు జ్ఞానసముపార్జనల మూలంగా ఆత్మకు పూర్వం నుండి(అనుపూర్వం) సంక్రమించే దుర్వాసనలు నిర్మూలింపబడతాయి. ఫలితంగా ప్రాణా-అపానాలు సాధకుడికి ఆత్మసాక్షాత్కార సౌభాగ్యాన్ని ప్రాప్తింపచేస్తాయి.
**
ఉదయాననే ధర్మాది పురుషార్థ చింతన
ఆయమద్య సుకృతం ప్రాతరిచ్ఛన్నిష్టేః పుత్రం వసుమతా రథేన
అంశోః సుతం పాయయ మత్సరస్య క్షయద్వీరం వర్ధయ సూనృతాభిః॥
- ॥
భావం:- నేడు ఉదయమే యజ్ఞకర్మతో సత్కర్మనారంభించి పుష్కలంగా ధనం నిండిన రథంతోబాటు పుత్రుణ్ణి కూడ పొందావు. ఆ పుత్రుడికి ఆనంద దాయకమైన జ్ఞానసారాన్ని త్రాగించు. మధురమైన సత్యవచనాలతో సాహసోపేతమైన ఈ విధిని నీవు నిర్వహించుము.
వివరణ:- ‘ఇష్టి’యన్నది అనేక యజ్ఞాలలో ఒకటి. యజ్ఞ ఆంతర్యం భగవదారాధనమే. అందుకొఱకై ‘ఆయమద్య సుకృతం ప్రాతరిచ్ఛన్నిష్టేః’ ‘‘ప్రాతఃకాలంలోనే ఇష్టి= యజ్ఞరూపమైన సత్కర్మ నాచరించాలని కోరుకొంటున్నాను’’అన్న భావం కలిగియుండాలని వేదం నిర్దేశిస్తూంది. అంటే దీని అర్థం మానవుడు ప్రాతఃకాలంలో లేచి ధర్మార్థకామమోక్ష పురుషార్థాల చింతన చేయాలనియే. ఈ విధినే సంస్కారవిధి అనే గ్రంథం గృహాశ్రమ ప్రకరణంలో ఇలా వివరించింది. ‘‘ఉదయం నాలుగు గంటలకే లేచి ముందుగా భగవచ్చింతన చేయాలి. తదుపరి ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థాలను గురించి ఆలోచన చేయాలి’’. అర్థ సంపాదనా విషయంలో ఏదేని సమస్య తలెత్తినాకూడ దానిని ప్రక్కనపెట్టి ధర్మానుష్ఠానానికే ప్రాధాన్యమీయాలి. దానితోబాటుగా శరీర-ఆత్మల సంరక్షణకొఱకు సాత్వికాహారాన్ని స్వీకరించాలి. రుజాగ్రస్తమైన శరీరారోగ్యార్థం పథ్యాహారాన్ని గ్రహించాలి. ఇలా నిత్యమూ ప్రయత్నిస్తూ వ్యావహారిక- ఆధ్యాత్మిక కర్తవ్యసిద్ధికొరకు ఈశ్వరుని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఉపాసనలను చేస్తూ జీవించాలి. తద్వారా పరమేశ్వరకృపకు పాత్రులై జీవితంలో దుష్కరకార్యాలను సహితం సులభంగా సిద్ధింపచేసుకోవాలి.’’
మనువు కూడ తన మనుస్మృతి గ్రంథంలో ఇదే సందేశాన్ని వినిపించాడు.
బ్రాహ్మే ముహూర్తే బుధ్యేత ధర్మార్థౌ చానుచింతయేత్‌
కాయక్లేశాంశ్చ తన్మూలాన్ వేదతత్త్వార్థమేవ చ॥ (మ.స్మృ 4-92)
బ్రాహ్మా ముహూర్తమున ధర్మాన్ని, అర్థాన్ని చింతిస్తూ నిద్రలేవాలి. ఆ సమయంలో దేహకష్టాలను తలంచి ధర్మార్థచింతన విడిచి వేదతత్త్వాన్ని, వేదార్థాన్ని మాత్రం చింతన చేయక మానరాదు.
ప్రాతఃకాలంలో ఇష్టి= ఈశ్వరారాధన, ధర్మార్థాల అనుశీలన వలన జీవితంలో మనిషికి ధనసమృద్ధి, పుత్రప్రాప్తి, సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. ధర్మానుష్ఠాననిష్ఠ కుటుంబంలో నిరంతరంగా కొనసాగాలి. అందుకొరకే పుత్రులను పొందాలి. వారికి ‘అంశోః సుతం పాయయ మత్సరస్య’ ‘‘్ధర్మాచరణ వలన కలిగే ఆనందానుభవాన్ని పొందే జ్ఞానసారాన్ని త్రాగించు’’అని వేదం మానవ జాతికి హితోపదేశం చేసింది. ఎందుకంటే అజ్ఞానం చేత, లౌకిక ధన సమృద్ధిచేత పుత్రులు మదమత్తులై ప్రవర్తించవచ్చు. అలా సంభవించకుండ ముందుగా స్థిరమైన ఆనందానుభూతిని కలిగించే జ్ఞానసారాన్ని త్రాగించమని వేదం ముందు జాగ్రత్తను తెలిపింది. ఈ విధంగా సుజ్ఞానులై ధర్మానుష్ఠానపరులు కావడం ఆ విధంగా కుటుంబాన్ని తీర్చిదిద్దడం ప్రతి వ్యక్తికి ఒక వీరకృత్యమే.

ఇంకాఉంది