తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

తీపి గుర్తుల కోసం చేదు వాస్తవాలు కొన్ని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కెర చేదెక్కిన సందర్భంలో మీతో నాలుగు మాటలు.
చెరుగ్గడల్ని పిప్పిచేసిన యంత్రాలలో ఇప్పుడు కార్మికుల బతుకులు మర తిరుగుతున్నాయి. తీపి కోల్పోయి పస్తుల చేదుతో విషమిస్తున్న బతుకులు. న్యాయంకోసం ఏ రోడ్డెక్కాలో తెలియని చౌరస్తాలో దిగబడ్డాయి. ఒక స్వర్గ కుటీరం కళ్ళముందు రోజుకింత కుప్పకూలుతున్నది. చూస్తూ నిమిత్తమాత్రంగా ఉన్న రాజకీయ నాయకులు. డబ్లుటివో ఒప్పందంపై 1990 తరువాత చేసిన ఒక సంతకం వేల కర్మాగారాలను మూసివేతకు గురిచేసిన రాజకీయ నేతల దుర్మార్గానికి దేశం అతలాకుతలం అవుతోంది. ఇంకా... ఇంకా అదే కొనసాగింపు. వైధవ్యం ప్రాప్తించిన భారతమాతలా దేశం వాలకం. పాలిచ్చే తల్లిని కోల్పోయిన బాలునిలా దేశ ప్రజ.
ఎవడు విధించిన శాపం ఇది.
ఎవడు లిఖించిన వర్తమానం ఇది.
దుఃఖాగ్ని గోళాల విషాద రాపిడులు. ఎటుచూసినా మూసివేతలు, దేశం జీడీపీ అంకెల గారడీలో కూరుకుపోయింది. చలనం లేకుండా ముందుకు కదలని పరిస్థితి. కదలికలేని జ్ఞాన క్షేత్రాలు. ముడుచుకుపోతున్న వ్యవస్థలు. దేశాన్ని కొత్త భూతం ఆవహించాలని ఆహ్వానాలు. అవి ఎందుకు కనికరిస్తాయి. ఈ దేశంలోకి దారితీస్తాయి? లాభాలకోసమేకదా. లాభం అంటే రక్తాన్ని, స్వేదాన్ని పీల్చడమే అని చరిత్ర చెబుతున్న వాస్తవం. ప్రాచీన కాలంలో గ్రామీణ భారతం ఎనె్నన్ని ఉత్పత్తులు చేసింది. ఎంతెంత అదనపు వస్తుసామగ్రులను, సంపదలను సృష్టించింది. అష్టైశ్వర్యాలతో ఆనాడు దేశంలోని అన్ని ప్రాంతాలు తులతూగాయ. ఈ సంపద చూసే కదా ఈ దేశంమీద పరాయి రాబందులు దాడులు. అవి బలవంతంగా వాలాయి. ఇప్పుడు అలాంటి భూతాలను, రాబందులను కోరికోరి ఆహ్వానించడం ఎందుకు?
భారతీయ శ్రమ జీవులు నిర్మించిన ప్రతి ఉత్పత్తి కేంద్రాన్ని నష్టాల పేరుతో తెగనమ్మి వ్యక్తిగత లాభాల పంట తీయడానికే విచక్షణా రహితంగా ప్రపంచీకరణ ద్వారాలు తెరిచారు. ద్వారాల వద్ద నమ్మకమైన కాపలాదారులు ఉంటారు. ఆ కాపలాదారు తన ప్రాణాలను త్యజించి కేంద్రాలను కాపాడతాడు. ఇప్పుడు కావలికుక్కలు, నమ్మకమైన కాపలాదారులు లేకుండాపోయారు. బహిరంగ చోరులకు, దళారులకు, చొరబాటుదారులకు స్వర్గసీమ అయ్యింది ఈ దేశం.
అన్నిటినీ తెగనమ్మడానికి, సమష్టి సంస్థలను వ్యక్తులకు ధారాదత్తం చేసిన పసుపు పార్టీ అధినేతలు ఇప్పుడు తిరిగి అలాంటి వాటిని కట్టుకోవడానికి పడే తంటాలు చూస్తున్నాం.
నిజామాబాదు జిల్లాలోని బోధన్‌లో తీపిసిరులు పండే నిజాం చక్కెర కర్మాగారాన్ని ఒక కలం పోటుతో ఒక్క వ్యక్తికి అమ్మేసిన పాపం కడవలకొద్ది డెట్టాల్‌తో కడిగినా పోదు. ఆ కొన్నవాడు ఫాక్టరీని నడపడానికి కొనలేదు. దానిని ఖండఖండాలు చేసి అమ్ముకుని లాభాలు తీయడానికి కొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వాధినేతలతో బేరసారాలు కుదుర్చుకున్నాడు. పనిచేసే యం త్రాలను పాత ఇనుప పరికరాలుగా చెప్పి వందల కోట్లకు అమ్ముకున్నాడు. మీరు నమ్మగలరా?
కొనడం అమ్ముకోవడానికే. అమ్మకం లాభాల కోసమే. ఇప్పుడు దేశంలో ప్రజలు సరుకులు కొనడం తగ్గింది. ప్రజల జీవన స్థితి కృశించింది. ప్రజల ఆస్తుల అమ్మకం పెరిగింది. ఇప్పుడంతా అమ్మకాల సంస్కృతి. అమ్మ గర్భాన్ని కూడా విదేశీయులు వచ్చి అద్దె పేరుతో నవమాసాలు అభివృద్ధిచేసి తొమ్మిది నెలలుకాగానే కొనుక్కుపోతున్నారు. భరతమాత తన పేరు లేని శిశువులకు ధరకట్టి ఇస్తుంది. కొన్న డాలర్ ఆ శిశువుని ఏం చేస్తుందో మనకు తెలియదు. వాళ్లు చెప్పరు. లాభం లేకుండా ఎందుకు కొంటుంది విదేశీ కరెన్సీ. ఆ శిశువుని రేపొక అంగడి బొమ్మను చేస్తుంది. ఆట వస్తువుగానో, సేవకా యంత్రంగానో మారుస్తుంది. దానిని, తనదైన పేరు పెట్టి పది మందిలో చూపి ఇది ఇండియన్ బ్రాండ్2అని దానికి పేరుపెట్టి అవహేళన చేస్తుంది. అవును. ఇప్పుడు మన సంతతి, మన కంటి వెలుగులు ఉద్యోగాల పేరుతో అమెరికాలో చేస్తున్నది ఏమిటి?
ఒక దేశాన్ని నిర్వీర్యం చేయాలంటే, ఆ దేశం యువతని పక్కబాట పట్టించాలి. ఇతర దేశాలకు పంపాలి. మీరు పుట్టిన దేశం మీకు ఉద్యోగం ఇవ్వలేదని నిరూపించాలి. మీ దేశ భక్తి ఇప్పుడు అమెరికా జాతి భక్తిగా మారాలి. తప్పేమిటి? వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికే తమ రాజభక్తిని చూపడం సహజం. విదేశీ పౌరసత్వం ముందు భారతీయ వారసత్వం ఏపాటిదవుతుంది. ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పులేదు. కాని ఏకపక్షంగా పుచ్చుకోవడం దోపిడికి గురికావడమే.
ఈ మర్మం తెలియని పాలకులు రండోరండని ఆహ్వానాలు పలుకుతున్నారు. నిజాం చెక్కెర కర్మాగారాన్ని కూడా ఏకపక్షంగా, రోజుకు పదివేల టన్నుల చెక్కర ఉత్పత్తిచేసే సుమారు ఐదువందల కోట్లు విలువచేసే కర్మాగారాన్ని 51 శాతం ప్రైవేటీకరణ కింద ఆనాటి ముఖ్యమంత్రి 67 కోట్లకు అప్పనంగా కట్టబెట్టాడు. అలా గోకరాజు గంగరాజుగారికి అగ్రీమెంట్ చేస్తే ఏమైంది? ఆయన కేవలం ఎనిమిది కోట్లు మాత్రమే లెక్కకి చెల్లించాడు. మిగతాది పద్దుల కింద జమకట్టాడు. బోధన్‌లోని ఒక చెక్కెర యూనిట్‌ని తుక్కు కింద అమ్మి వంద కోట్లు చేసుకున్నాడు. ఈ ఫాక్టరీ పరికరాలను డెబ్బై ఏళ్ళ కింద నిజాం నవాబు ఇంగ్లండ్ నుండి తెప్పించి దేశంలోనే కాదు, దక్షిణాసియాలో ఎక్కడా లేని విధంగా చెక్కెర కర్మాగారాన్ని మహోన్నతంగా నెలకొల్పాడు. చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలయినట్లు, ప్రజల సొమ్ముతో నెలకొల్పిన కర్మాగారాలు తిమింగలాల వంటి వ్యక్తుల పాలుకావడం చరిత్ర చేసుకున్న పాపం. తెలుగుదేశం ఒప్పందాన్ని వ్యతిరేకించిన వైఎస్ ప్రభుత్వం మిగతా 49 శాతం ప్రభుత్వ వాటాను గంగరాజుగారికి ధారాదత్తం చేయడానికి 32 లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే తంతు తెరాసా ప్రభుత్వం గద్దెనెక్కాక కూడా కొనసాగుతుండడాన్ని దేశ ప్రజలు గమనించాలి.
ఈ మధ్యకాలంలో కర్మాగారాన్ని, దానికింద ఉన్న వందలాది ఎకరాలను, అనేక యూనిట్లను తెగనమ్ముకోవడానికి అవరోధంగా, ఉన్న కార్మికులను తెగటార్చకపోతే కష్టం. తమ ఆటలు ఆలస్యమవుతాయి. అందుకే స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో, లేఆఫ్‌ల పేరుతో సుమారు మూడువేల మంది ఉన్న కార్మికులను మూడొందలకు కుదించారు. సీయం కేసీఆర్ తన ఫాంహౌజ్ దగ్గర అయుత చండీయాగం ప్రారంభించిన రాత్రే యాజమాన్యం లేఆఫ్ ప్రకటించడం యాదృచ్ఛికం కాదనిపించే వాస్తవం. ఇవ్వాళ ఆ కార్మికులు ప్రతిరోజు కర్మాగారం గేటు దగ్గర ధర్నా చేస్తున్నారు. బోధన్ పట్టణం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం కూడలిలో పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రాంతీయ, స్థానిక రాజకీయ నాయకులు ఎవరూ మాట్లాడ్డం లేదు. తలాపాపం తిలా పిడికెడు అన్న చందాన వాళ్ళున్నారు. సీమాంధ్రులైన చంద్రబాబు, గోకరాజుల ఒప్పందం తెలంగాణా ప్రజల దృష్టిలో, తెలంగాణా ఉద్యమకాలంలో వారికి తెలంగాణా వ్యతిరేకులుగా ముద్రపడింది. అందులో వాస్తవం లేకపోలేదు. కాని ఇప్పుడూ అదే 3తంతు, అదే కర్మాగార హననక్రియ ఇంకా కొనసాగడం గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమ పార్టీ ప్రభుత్వం గద్దెనెక్కాక దానిని ఎట్లాగైనా తెరిపిస్తామని చేసిన వాగ్దానానికి తామే 3్భంగం2 కలిగిస్తున్నామని నాయకులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు.
ఇవ్వాళ కొత్త రాజధానిలో చంద్రబాబు కష్టించి దాని చుట్టూ, ఆంధ్రప్రదేశ్ నలుమూలలా నెలకొల్పే సంస్థలను రేపు ఇదే విధంగా ఆ తరువాత వచ్చినవారు అమ్మకానికి పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.
వ్యక్తులు, ప్రభుత్వాలు ముఖ్యం కాదు. ప్రజలు, వ్యవస్థలు, జీవితాలు ముఖ్యం. చరిత్ర చాలా కరుడుగట్టిన ఆయుధం. అది అవసరాలకు అనుగుణంగా తన లోలోపల దాచిన, దాగిన ఘటనలను ఒక్కొక్కటే బయటపెడుతుంది.
ఆజంజాషి మిల్లు, డిబిఆర్ మిల్స్, వందేళ్ళ కిందటి సింగరేణి వంటి ఎన్నో పరిశ్రమలు స్థాపించబడినాయ. లాభాలతో నడిపిన చరిత్ర ఉంది. ఒక్క ప్రజా పోరాటం అన్నిటిని చెరిపేసి నిజాం బతుకుని, కీర్తిని మూసీపాలు చేసింది. 1969లో చెన్నారెడ్డి చేసిన ద్రోహం తెలంగాణను అవమానించింది. ఆయన కుటుంబంలో ప్రజా జీవితంలోకి ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేకపో వడం గమనించాలి.
ఇప్పుడు ఉద్యమ పార్టీ తన రాజకీయ గెలుపోటముల కోసమే కాకుండా తెలంగాణా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పథక రచనచేయాలి. ఆసియాకే తలమానికంగా వెలిగిన కర్మాగారంలోంచి ప్రపంచానికి తిరిగి తీపి పంచగలగాలి. అక్కడ రైతాంగం వదనాలపై చెరకు పంటల కాంతి కురవాలి. వేల వాహనాలలో తరలింపబడే కోసిన చెరకుగడల సువాసనలు తిరిగి అక్కడ చిగురించాలి. అది కానిపక్షంలో వలస తెలంగాణే మిగులుతుంది. పైపైన మాసికలను కప్పడంవల్ల అసలు సమస్య తీరదు. కావాలనుకున్న తెలంగాణ కానరాదు. అప్పుడు కొత్త మలుపు తిరగక తప్పదు.
ఇలాంటి కొన్ని విషయాలను ప్రజలు, కార్మికులతో పంచుకోవడం కోసం పోయిన ఆదివారం తెలంగాణా రచయితల వేదిక బోధన్ దీక్షాశిబిరం చేరుకుని తమ కలాలను, గళాలను వినిపించింది. ముప్పైమంది కవితలలో కార్మిక సంఘీభావం ఆలపించింది. రైతు ఆత్మహత్యల నివారణలో భాగంగా భరోసా గీతం పాడిన తెరవే అక్కడనుండి 3‘‘అధినేతకు అక్షరాల విజ్ఞప్తి’’2 చేశారు.
కొత్తవి నిర్మించడంలో 3లాభాల వాటా2 ఉంటుంది. పాత వాటిని తెగనమ్మడంలోనూ అదే వరస. కాని దేశానికి ఖ్యాతి తెచ్చి కార్మిక కర్షక జీవన హర్షాలకు నెలవైన కర్మాగారాలను, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం అంటే అక్కడి ప్రజలను, ఆ ప్రాంతాన్ని అవమానపరచడమే.
ఈ దేశం పరువు బజారులో నిలపడమే. అమ్మకాలు కాదు. కొనుగోలు దారులు కాదు. ప్రభుత్వమే ఇలాంటి వాటిని కొని ప్రజలను యజమానులుగా చేసే దిశగా ఆలోచించాలి.
బోధన్ చక్కెర కర్మాగారపు కార్మికుల చెంతకుపోయిన కవులు, రచయితలు చాలా నేర్చుకున్నారు.
కదలక కలం, జనవాణిని వినిపించని గళం మొద్దుబారిపోతాయి.

jayadhirtr@gmail.com సెల్ : 9951942242