వీరాజీయం

‘‘పిల్లలొస్తారు-రాగానే పాఠం మొదలెడదాం’’ అనుకుంటూ-స్టూడెంట్స్ కన్నా ముందుగానే-సైన్స్ అండ్ హిందీపాఠాలు చెప్పే టీచరమ్మ-ఉమామహేశ్వరి క్లాస్‌రూమ్ లోకి ముందుగానే వచ్చి కూర్చొని-చెప్పబోయే పాఠం తిరగేసుకుంటున్నది.
ఎప్పుడొచ్చాడో-ఏమో? తొమ్మిదో తరగతి విద్యార్థి-మహమ్మద్ ఇర్ఫాన్- సుడిగాలిలాగొచ్చి-చేతనున్న కత్తితో-టీచరమ్మను పొడిచి,పొడిచి చంపేసి పారిపోయాడు. మిగతా విద్యార్థులు క్లాసురూమ్‌లోకి ప్రవేశించి-రక్తం ప్రవహించిపోతున్న గాయాలతో కుప్పకూలి పోతున్న టీచర్‌ని చూస్తూనే-ఆర్తనాదాలు చేస్తుండగానే-ఇర్ఫాన్ పారిపోయి, బాత్‌రూమ్‌లో దాక్కున్నాడు. ఉమామహేశ్వరి మెడమీద-ఏడు లోతైన కత్తిపోట్లు- పొట్టలో నెత్తురు చిమ్ముతున్న మరో ఎనిమిది గాయాలు వున్నాయ్!
అంటే-పదిహేను సంవత్సరాల కుర్రవాడు-ఇర్ఫాన్ కసితో-ఉన్మాదావేశంలో-తనకు విద్యాబుద్ధులు గఱపుతున్న పంతులమ్మను ఎట్లా పొడిచాడోమనం ఊహించుకోవచ్చును. ఫిబ్రవరి 9, గురువారం-పదకొండు గంటలవేళ! చెన్నై నగరంలో పారిస్ కార్నర్ జంక్షన్-వూహించలేనంత సందడిగా వుంటుంది. అక్కడికి దగ్గరిలోనే వున్న ఆర్మేనియన్ వీధిలోవున్న డాన్‌బాస్కో వారి సెయింట్ మేరీస్ ఆంగ్లోఇండియన్ హైస్కూల్‌లో-రుూ దారుణం జరిగింది.
స్కూలు ఫాదర్-బాస్కో పెరియనాగమ్-రక్తపుమడుగులో పడి విలవిల్లాడుతున్న ఆ పంతులమ్మను మిగతా టీచర్ల సహాయంతో ఆసుపత్రికి తీసుకుపోయే సరికే-ఉమామహేశ్వరి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆమె యిద్దరు పిల్లలు-ఒకరు శరణూ-11వ తరగతి- కూతురు జనని ఏడో క్లాసూ చదువుతున్న- ఆ యిద్దరూ అనాధలైపోయారు.
‘అత్యంత ప్రతిష్ఠాత్మకం’ అని పేరెంట్స్ అనుకొని-అతికష్టంమీద సీటు ‘కొనుక్కొని’ తమపిల్లల్ని-సెంట్రల్ సిలబస్ కోసం యిక్కడ చేర్పిస్తారు. ‘ఇక స్కూలువాళ్ళదే భారం’-అన్నట్లు నిశ్చింతగా వుంటారు. కానీ, ఆ గురువారం మధ్యాహ్నం పనె్నండు గంటలకే-ఇండ్లకి ఎస్.ఎమ్.ఎస్.లు అందేసరికి కంగారు పడి- స్కూలుకి ఉన్న పళాన పరుగులు తీశారు పేరెంట్స్. కొందరు ఆటోలవాళ్ళకి సెల్‌ఫోన్‌లు కొట్టడం మొదలుపెట్టారు. స్కూల్లోని పిల్లలంతా కకావికలైపోయారు. ఎవడో టెర్రరిస్టుగానీ, ఉన్మాదిగానీ-స్కూల్లో జొరబడ్డాడేమోననుకున్నారు-చాలామంది టీచర్లు.
రోజుకి ఐదారుగంటలు తను కొంగుపట్టుకుని సొంత సంతానం లాగ తిరిగే పిల్లలు-అప్పుడప్పుడు తిరుగుబాటు-అల్లరి చేష్టలు చేయడం తెలియని టీచర్లు రుూ కలియుగంలో వుండడం-ఇంపోజిబుల్. కానీ, కత్తిపట్టుకొని-పదిహేనేళ్ళ కుర్రాడు-రివ్వున క్లాసులోకి దూసుకొచ్చి-అమ్మను బోలిన అమ్మ-అక్షరమ్ముక్కలు నేర్పి తనను ప్రయోజకుడ్ని చేస్తున్న పంతులమ్మని-కిరాతకంగా-రాక్షసంగా-పొడిచేశాడు! ఆ కత్తిని వాడు పదిరూపాయలకు అంతకుముందురోజే కొనుక్కొని-ఉమా టీచర్‌ని పొడిచేయాలని పథకం వేసుకున్నాడు. ఇంతకీ, ఇరవై సంవత్సరాల అనుభవం-నలభై సంవత్సరాల వయసూ వున్న రుూ ఉమాటీచర్ చేసిన నేరం, యింతకీ.. ఏమిటి?
సాధారణంగా - ‘‘వోటీచరమ్మ తన చేతి గాజులు పగిలిపోతున్నా ‘కేర్’ చేయకుండా బెత్తాంతో కుర్రకుంకని చావబాదేసింది’’,అనో-‘పొయ్యిలోనుంచి మండుతున్న కొరకుంచును అందుకొని- పిల్లల్ని వెంటాడి, వెంటాడి చావచంపిది’- అనో, వింటుంటాం. కానీ, రుూ ఉమామహేశ్వరమ్మ-అటువంటి సోకాల్డ్ స్ట్రిక్ట్ పంతులమ్మ కాదు.‘‘ఇంటి దగ్గరా-స్కూలు లోనూ కూడా- ఆమెకు పాఠాలు చెప్పడం-తిన్నగా లేని తుంటరి వెధవల గురించి, తెలివితేటలులేని మొద్దు వెధవల గురించి ఆవేశపడకుండా గడపడమే తెల్సునామెకు-’’ అని తోటి టీచర్లు, పేరెంట్స్ కూడా అంటున్నారు.
పోలీసులకి ఇర్ఫాన్ అహమ్మద్‌నీ-కుటుంబ సభ్యులకు టీచరమ్మ భౌతిక కాయాన్ని అప్పజెప్పేసిన తర్వాత- స్కూలు యాజమాన్యం- ‘‘నాలుగు రోజులు స్కూలు మూసేస్తున్నాం’’-అని,పిల్లల తల్లిదండ్రులకి-ఎస్.ఎం.ఎస్.లు కొట్టేశారు.
పోలీసులు పిల్లవాణ్ని విచారించారు. టీచరమ్మ వాడు బాగా చదవడంలేదని, తిన్నగా క్లాసులకి రావడంలేదనీ, రిమార్కులు రాసి, యింటికి పంపించింది. ‘‘ఇలాగే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి, సరిగ్గా చదువుకోకపోతే- పరీక్షల్లో గుండుసున్నా పెట్టేస్తా’’ననే అర్థం వచ్చే మాటలతో కూకలు వేసిందిటామె.
‘‘టీచర్ నిజంగా నన్ను ఫెయిల్ చేస్తుందనీ, దాంతో మా బాబు నన్ను చంపేస్తాడనీ, నేను భయపడ్డాను. ‘అగ్నిపథ్’ హిందీ సినిమా చూస్తున్నప్పుడు నాకీ అయిడియా వచ్చింది’’- అని చెప్పాడుట వాడు. సంతులమ్మ వుంటే కదా, వాడిని ఫెయిల్ చేస్తుంది. ఆమెను ‘సఫా’ చేస్తే సరిపోతుంది’- అనుకున్నాడని పోలీసులు అనుకుంటున్నారు.
ఇదే, అసలు మనం ఆలోచించాల్సిన విషయం. ఉదయం ఏడుగంటలకి-మండవల్లి (ప్యారిస్ కార్నర్‌కి చాలా దూరం) లోని శ్రీనివాసా అపార్ట్‌మెంట్స్‌లో-పిల్లలు ఎందరికో ప్రెయివేట్లు చెప్పడంతో మొదలుపెట్టి-రాత్రికి యింటికి చేరుకొనే దాకా-పాఠాలు చెప్పే ఉమామహేశ్వరి-తొమ్మిదో తరగతి పిల్లకాయను-జాగ్రత్తగా చూసుకొమ్మని రిమార్కు రాసిన నేరానికి- ఆ‘కలంపోటు’కు (రిమార్కు) ‘కత్తిపోటు’ శిక్ష అన్నమాట!
దేవాలయం గర్భగుడిలోనే అర్చకుని హత్య-అన్నటుల అయిపోయింది. కేవలం ‘మగాడి’కోసం-సెక్సు ఆరబోసి-పారబోసి-ముద్దులను, సాడిస్టు చేష్టలను భరించడం కోసమే ఆడది వున్నది- అనుకుంటున్న నిర్మాతలు-వాళ్ళకి సెన్సారు బోర్డులు- ఒక ‘ముద్దును’, ఒక ‘రేప్’ను ఒక వికారచేష్టను-పదేపదే-పాడిందేపాటగా-అన్నట్లు-సారీ,! పదే, పదే కాదు-యిష్టమొచ్చినన్నిసార్లు- బుల్లితెరపై చూపించే ఛానల్సు వున్న చోట- ‘టీచర్‌నీ, స్టూడెంట్’నీ కాపాడుకోవడం ఎట్లా?
‘హౌ టు సేవ్ ‘టీచింగ్’ యాజ్ సచ్?’
Add new comment