తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

అమర వీరులను స్మరిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక దేశానికి, జాతికి, పోరాటాలకి, విప్లవాలకి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. వీటిలో వీరోచిత ఉదంతాలే ఎక్కువ పాళ్లు. వీరుల త్యాగపోరాటాలు జనుల హృదయాలలో చెక్కుచెదరని జ్ఞాపకాలు. వీర మరణాలు అనేకం. కానీ జ్ఞాపకాలు కొనే్న. వాటికి దృశ్యరూపాలు ఉండవు. గతంలో అసలే లేవు. ఉన్నా వర్తమానంలో అవి అవిస్మృతమే. స్మృతి ఫలకాలై కంటికి కనబడేవి తక్కువే. అమరవీరుల చరిత్రలకు మాత్రం కొదువలేదు, అమరుల స్థూపాలు చాలా తక్కువ. సామూహిక ఉద్యమాలలో లెక్కలేనంత మంది పాల్గొంటారు. అక్కడ శత్రువు మోహరించి ఉంటాడు. అదనపు బలగాలను రావించి ముందస్తు జాగ్రత్త చర్య తీసుకుంటాడు. అందరూ కలిసి ఉద్యమకారులపై విరుచుకుపడతారు. లెక్కలేకుండా కాల్పులు. లెక్కకు మించిన తూటాల విడుదల, నరమేధం. లెక్కతేలని నరమేధాలెన్నో నరుల చరిత్రలో ఎర్రబారాయి.
న్యాయం కోసం పోరాటం. దురన్యాయాన్ని కొనసాగించడానికి మారణకాం డ. పాలకులు, పాలితుల మధ్య పోరాటాలు. ప్రతిపోరాటంలో ప్రజలే సమిధలు. ఈ సమిధల పోరాట చరిత్ర అసంపూర్ణం. దాని కోసం సభ్య సమాజం మేల్కొనవలసిన అవసరం ఉంది. కొందరి ప్రవృత్తివల్ల, వ్యక్తివాద దృక్పథం వల్ల జరిగిన, జరిగే ఉద్యమాలలో పాల్గొన్న కొందరికే న్యాయం జరుగుతుంది. కొందరే అమరవీరులవుతారు. వారికే స్థూపాలు నిర్మించబడతాయి. వారి పేర శి లాఫలకాలు చెక్కబడతాయి. ఆ పేరు కింద మరణించిన అనేకమంది అ మరులు అజ్ఞాతం అవుతారు. వారి ఊసే తరువాత ఎత్తబడదు.
నిజానికి ఉద్యమం సామూహిక శక్తికి నిదర్శనం. త్యాగం, మరణం సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఉంటుంది. ఊరికే శత్రువు తుపాకీ పేలుడువల్ల మరణించినవాడు వీరుడు కాదు. ప్రజల కోసం నిద్ర, ఆహారం, స్నానపానాదులు లేక, ఆయుధాన్ని శరీరంలో భాగం చేసుకుని, పోరాటాన్ని జీవితంలోకి ఆవాహన చేసుకున్నవాడే వీరుడు. వాడు మా మూలు మనిషైనా, నాయకుడైనా ఒక్కటే. ఇద్దరూ సమస్కందులే. వారిలో ఒకరు పెద్ద, ఒ కరు చిన్న అనే తేడాలే దు. ఆయుధానికి వర్ణ వ్య వస్థ అంటి ఉండదు. ఉంటే దానిని పట్టుకున్న ఉన్నత కుల వర్గ నాయకుడికి ఉండవచ్చు. లేదా ఉద్యమాలను మట్టుబెట్టే రాజ్యానికి ఉండవచ్చు. రాజ్యంతో యుద్ధం చేస్తూ, హోంమంత్రితో అంటకాగే ప్రజా నిర్మాణాల నేతలకు ఉండవచ్చు. ఇలాంటి వారి ఆటలు సాగినంత కాలం ప్రజలు మ్రాన్పడిపోక తప్పదు.
ధీరోదాత్తత అడుగంటే సమాజంలో ఉన్నాం. ధీరుల పంట ఎండిపోతున్నది. ఆ పంట పేరు చెప్పి కాయలు అమ్ముకునే నగర భావ విప్లవకారుల పంట పండుతున్న కాలం ఇది. నిజానికి ఏనాడూ లేనంతగా ఈనాడు వీరుల అవసరం ఉంది. కాని ఎందుకో ఆ పంట మీద అంటరానితనపు నీళ్లు చల్లబడుతున్నాయి. మెల్లిమెల్లిగా వీరి వారసత్వం కూడా పై వర్గాల వారిదే అనే సందేశం ఎందుకో నాటుకుపోతున్నది. ఏభై మంది మరణిస్తే ఒకరిద్దరు నాయకులకే కీర్తి. శిలాఫలకంపై స్థానం. అలాంటి చోట వీరుల స్మరణ లేని నేలమీద వీరత్వ భావ బీజాలు మొలకెత్తవు. మరణించిన మామూలు వీరుల గురించిన జ్ఞాపకాలు ఆ సమాజానికి తప్పనిసరి. అలాంటి పరిస్థితి కల్పించలేకపోతే అక్కడ వీరుల పంట పండదు. తాలు గింజలే మొలుస్తాయి. వారే హీరోలవుతారు.
ఇప్పుడు ఒకసారి మనం అమరవీరుల స్థూపాల గురించి ఆలోచించాలి. ఆ స్థూపాలిప్పుడు చీకటిమనుషులచే కూల్చివేయబడుతున్నాయి. మెల్లిమెల్లిగా వాటి పునాదుల్లో కలుగులు కనుపిస్తున్నాయి. రంగులు వాడి మెరుపులు తగ్గిపోతున్నాయి. అపరిశుభ్రత మెల్లిమెల్లిగా ఆక్రమిస్తున్నది. ఈ తరుణంలో ఒకసారి వాటిపై విహంగ వీక్షణం సారించవలసి ఉంది. అమరవీరుల స్థూపాల ఏర్పాటు, నిర్వహణ కూడా పోరాటంలో భాగమే. వాటిని నిర్మించిన వారు వాటి ఎత్తు గురించి పడిన ఆరాటమే ఎక్కువ. ఆ స్థూపంపై ఉండాల్సిన అమరుల పేర్లు గు రించి తక్కువగానే శ్రద్ధవహించారా? అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వీరజవానుల కోసం ఇండియా గేట్ వద్ద నిర్మించిన స్మారక స్థూపం మీద 42 మంది పేర్లు పేర్కొన్నారు.
1964లో ఇండో సైనో యుద్ధంలో మరణించిన వారి కోసం కట్టిన స్మారక చిహ్నంలో 32 నల్ల రాతి ఫలకాలపై 2,420 మంది పేర్లు రాసి ఉన్నాయి. మన దేశంలో అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలలో మరణించిన వారికి స్మారక చిహ్నాలు చాలానే ఉన్నాయ. ఈ క్రమమే విప్లవోద్యమాలలో కూడా విస్తరించింది. చాలాచోట్ల మరణించిన అందరి పేర్లు లేవు. కాని ఎన్నడో ఓనాడు పేర్లు లభ్యమైన చోట వాటిని చెక్కించడం అవసరం. ఆమధ్య ఆదిలాబాదు జిల్లాలో నాగోబా జాతరలో గుంజాల గోండిలిపి రెండో వాచకం విడుదల చేయడానికి వెళ్లాం. అప్పుడు మరోసారి ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని చూశాం. కొన్ని ఆలోచనలు ముసురుకున్నాయి. 1981 ఏప్రిల్ 21వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంద్రవెల్లి గోండుల మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అందులో ఆనాడు పత్రికలలో, ఇతర నివేదికలలో పదకొండుమంది పేర్లను, మరో ఇద్దరు పేర్లు తెలియని వారు మరణించారు. వందలాది మంది గాయాల పాలయ్యారు. నిజానికి వారి పేర్లను శిలాఫలకాల మీద చెక్కించడం అమరులకు నివాళి పలకడమే. ఆదివాసీ గోండు వీరుల జ్ఞాపకాలను పటుతరం చేయడమే. అపరిశుభ్రంగా ఉండే స్థూపం పరిసరాలను శుభ్రపరిచి జన పర్యాటక కేంద్రం చేయవలసి ఉంది. ఆయా గోండు అమరవీరుల ఫొటోలు లేని కారణంగా ఆ స్థూపం దగ్గర వారి బంధువులు, వారి సహచరులు అంజలి ఘటించే అవకాశం లభించవలసిందే. అందుకే- ‘ఇంద్రవెల్లి’ అమర వీరుల స్థూపం పరిరక్షణ వేదిక’ నిన్ననే ఏర్పాటు చేశాం. ఈ కోవలో ఇది మొదటిది. ఆ ప్రదేశంలో స్థూపాన్ని ‘స్మృతి వనం’గా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొమురం భీం పోరాట కేంద్రమైన జోడేఘాట్‌లో ఆయనపేర స్మృతి వనం, విగ్రహం తదితరాలు ఏర్పాట్లు చేసినట్టే ఇంద్రవెల్లి వీరుల స్థూపం ప్రాంతాన్ని అభివృద్ధి పరచండని ముఖ్యమంత్రిని కోరుతు న్నాం. ఏటా ఏప్రిల్ 21న అక్కడ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని సంప్రదాయం ఇంకా కొనసాగుతున్నది. ఈసారి అలాంటి పరిస్థితి కల్పించకూడదు. అమరవీరుల పేర్లను రెండు శిలాఫలకాలపై తెలుగులో, గుంజాల గోండీ లిపిలో చెక్కించాలని విజ్ఞప్తి. వీరులు మరణించేప్పుడు తమ స్మారకాల గురించి ఆలోచించరు. తమ పిల్లలు ఎలా బతుకుతారని మాత్రం అనుకుంటారు. సమాజంలో అణచివేతలు ఉండకూడదని మాత్రమే ఆశిస్తారు. అందుకే వారి పేర్లను వారి ఊరిలోని ఒక వీధికి, బావికి, కనీసం బోరింగులకైనా వాళ్ల పేర్లు పెట్టుకుని వారిని స్మరించుకుందాం. అమర వీరుల స్మరణ రేపటి అవసరం. ఈ రోజు తప్పనిసరి. ఆలస్యమైనా ఫరవాలేదు. వారి కుటుంబాలను పరామర్శిద్దాం. వస్తారా..? ఎవరైనా ఉన్నారా..?

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242