తెలంగాణ

మేడారం జాతరకు 3,600 బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 9: ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 3,600 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండి జివి రమణారావు వెల్లడించారు. శనివారం ఖమ్మంలో నూతన బస్టాండ్ ఏర్పాటు కోసం ఎనె్నస్పీ స్థలాన్ని పరిశీలించిన అనంతరం తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం మేడారం జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ జాతరకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఏపి నుండి 1800 బస్సులను తీసుకొచ్చి మేడారం జాతరకు తిప్పేవారమని, ఇప్పుడు 3,600 బస్సులను తెలంగాణ జిల్లాల్లోని డిపోల నుంచే తిప్పాల్సి ఉంటుందన్నారు. ఖమ్మంలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్ వచ్చిపోయే బస్సులకు, ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదని, దీంతో నిర్మాణం తలపెట్టిన కొత్త బస్టాండ్‌ను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్నారు. ఇందుకు రెవెన్యూ శాఖ స్థలాన్ని కూడా చూపించిందన్నారు. ఆర్టీసీ నష్టాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఎండి రమణారావు వివరించారు.

అర్ధరాత్రి ఆలయం కూల్చారు

ౄ కలెక్టరేట్ హెలిపాడ్‌లో నవగ్రహాల తొలగింపు
ౄ అధికారులను అడ్డుకున్న స్థానికులు
ౄ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు
ౄ భారీగా మోహరించిన పోలీసులు
ౄ తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలంటూ బిజెపి ఆందోళన

కరీంనగర్ టౌన్, జనవరి 9: నిత్యం ప్రశాంతంగా ఉండే కలెక్టరేట్ హెలిపాడ్ పరిసరాలు శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా దద్దరిల్లాయి. ఓవైపు ప్రొక్లెయిన్‌తో అధికారుల కూల్చివేతలు, మరోవైపు పరిసరవాసుల యంత్రాల అడ్డగింపులు, ఆందోళనలు.. భారీగా పోలీసుల మోహరింపులు... కలెక్టరేట్ పరిసరాల దిగ్బంధం....వెరసి శనివారం మధ్యాహ్నం వరకు నగరంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ హెలిపాడ్ ఆవరణను ఆనుకుని ఉన్న హన్‌మాన్ దేవాలయంలో భగత్‌నగర్ కాలనీవాసులు కలిసి నిర్మిస్తున్న నవగ్రహాల మండపాన్ని శుక్రవారం అర్ధరాత్రి మున్సిపల్ ప్రొక్లెయిన్‌తో తహసీల్దార్ కూల్చివేయించడం వివాదాస్పదమై, చిలికి చిలికి గాలివానలా మారి, అర్ధరాత్రి పూట నగరం అట్టుడికింది. ఎలాంటి సమాచారం లేకుండా అధికారి వచ్చి మంటపాన్ని కూల్చివేస్తుండగా, కాలనీవాసులు మూకుమ్మడిగా తరలివచ్చి కూల్చివేతను అడ్డుకున్నారు. దీంతో అధికార యంత్రాంగం పోలీసులకు సమాచారమివ్వడంతో తమ బలగాలతో పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగగా, విష యం తెలుసుకున్న బిజెపి నేత, కార్పొరేటర్ బండి సంజయ్‌కుమార్ అక్కడికి చేరుకోవడంతో హన్‌మాన్ భక్తుల్లో మరింత ఊపు వచ్చింది. సిబ్బందిని చుట్టుముట్టేయత్నం చే స్తుండగా, కూల్చివేత నిలిపివేసి అక్కడినుంచి పరుగులంకించుకున్నారు. కూల్చివేత విషయం నగరంలో దావానంలా వ్యాపించడంతో ఒక్కసారిగా వేడెక్కింది. 30మందికి పైగా అధికార, విపక్షపార్టీలకు చెందిన కార్పొరేటర్లు సంఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. బిజెపి నేత బండి సంజయ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని హన్‌మాన్ భక్తులు కూడా వందల సంఖ్యలో జమకాగా, శనివారం వేకువజాము వరకు ఆందోళన కొనసాగుతూనే ఉంది. తహసీల్దార్‌ను సస్పెండ్ చేసి, తక్షణమే పునరుద్ధరణ పనులు కొనసాగిస్తేనే ఆందోళన విరమిస్తామంటూ పేర్కొనగా, పరిస్థితులు విషమిస్తున్నాయని గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల పోలీసు అధికారులను నగరానికి రప్పించారు. కలెక్టరేట్ పరిసరాలతో పాటు, నగరంలోని ప్రార్ధనా స్థలాల వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. కాగా, కూల్చివేత విషయం తెలుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌తో పాటు పలువురు టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు శనివారం ఉదయం సంఘటనాస్థలికి చేరుకుని అధికారులపై తీవ్రంగా మం డిపడ్డారు. ఈసందర్భంగా కాలనీవాసులను ఎమ్మెల్యే సముదాయించారు. జరిగిన సంఘటన బాధాకరమని, అయినా అధికారుల తీరుపై తాను అసంతృప్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి నవగ్రహాల మంటపం పునర్మించడంతో పాటు, ఆలయానికి మరింత స్థలం కేటాయించేందుకు కృషిచేస్తానన్నారు. అనంతరం ఆలయ ప్రహరీ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. అయితే, టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు మాత్రం దీనిని స్టంట్‌గా కొట్టిపారేశారు.
నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఓవైపు అక్కడ యాగాలు చేస్తుంటే, ఇక్కడ గుళ్ళు కూల్చివేయిస్తూ కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ఇంకోవైపు నగర బిజెపి నాయకులు ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద ఆందోళనకు దిగారు. వీరిని ఓఎస్డీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పోలీస్ లాంఛనాలతో
ఎస్‌ఐ అంత్యక్రియలు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 9: పెద్దపల్లిలో సర్వీస్ రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ జగన్మోహన్ అంత్యక్రియలు శనివారం జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో పూర్తయ్యాయి. విద్యానగర్‌లోని ఎస్‌ఐ ఇంటి నుంచి ఎంఎండి చివరన గల శ్మశానవాటిక వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి, అనంతరం పోలీసు లాంఛనాల మధ్య జగన్మోహన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సంతాప సూచకంగా పోలీసులు రెండు రౌండ్లు పైకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిఐజి మల్లారెడ్డి, ఎస్పీ జోయల్ డేవిస్, ఓఎస్డీ సుబ్బారాయుడు, కరీంనగర్, పెద్దపల్లి డిఎస్పీలు రామారావు, మల్లారెడ్డిలతోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొని జగన్మోహన్‌కు ఘనంగా నివాళులర్పించారు. అలాగే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బ్యాచ్‌మేట్స్, పలు పార్టీల రాజకీయ నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు.
సంతాప సూచకంగా
పైకి కాల్పులు జరుపుతున్న పోలీసులు

టెక్స్‌టైల్ పార్క్‌కు
ఆదిలోనే అడ్డంకులు!
సర్వేను అడ్డుకున్న రైతులు ౄ వెనుతిరిగిన అధికారులు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 9: రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో భారీ టెక్స్‌టైల్‌పార్క్ ఏర్పాటు చేయాలని ముందుకువెళ్తున్న తరుణంలో స్థల సేకరణకు రైతులు అంగీకరించడం లేదు. జిల్లాలోని ధర్మసాగర్ మండలం ముప్పారం - దేవునూరు గ్రామాల మధ్య టెక్స్‌టైల్ పార్క్‌కు అనువైన స్థలమని ఇటీవలే అధికారులు పలు దఫాలు సర్వే చేసి సిఎం దృష్టికి తీసుకురావడంతో సిఎం కెసిఆర్ అందుకు అంగీకరించడమే కాకుండా స్థల సేకరణకు వంద కోట్ల రూపాయలు కేటాయిస్తూ వరంగల్ పర్యటన సందర్భంగా సిఎం వెల్లడించారు. టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణానికి అవసరమైన పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే అధికారులు స్థల సేకరణ కోసం రంగంలోకి దిగారు. అందులో భాగంగానే శనివారం వరంగల్ ఆర్డీఓ వెంకటమాధవరావు, ధర్మసాగర్ తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సర్వేయర్ల టీం అంతా ముప్పారం - దేవునూరు గ్రామాలకు చేరుకుని సర్వే చేసేందుకు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న రైతులు అక్కడకు చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. తమకు భూసేకరణపై ముందుగా ధర నిర్ణయించాకే సర్వే చేయాలని, అప్పటివరకు సర్వే చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులంతా ఒక్కతాటిపై నిలబడి అధికారులను నిలదీయడంతో చేసేదేమీ లేక వెనుతిరిగారు. కాగా ఈ విషయంపై నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్యతో అధికారులు మాట్లాడారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉండే విధంగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు ధర్మసాగర్ మండలమే అనువైన ప్రాంతంగా గుర్తించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ దగ్గరలోనే ఉండడం, కాజీపేట రైల్వేస్టేషన్ కూడా సమీపంలోనే ఉండడం టెక్స్‌టైల్‌పార్క్‌కు అనువైన స్థలంగా గుర్తించారు. అయితే అధికారులు కూడా త్వరలోనే భూసేకరణ చేపట్టి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

ఉద్యానవన పంటల అభివృద్ధికి
కేంద్రం ప్రత్యేక నిధులు

ౄ పాలీహౌస్ నిర్మాణానికి 75 శాతం సబ్సిడీ
ౄ సబ్సిడీ పథకాలపై రైతుల్లో అవగాహన పెంచాలి
ౄ కేంద్ర హార్టికల్చర్ అసిస్టెంట్ కమిషనర్ సురేందర్‌కౌల్

షాద్‌నగర్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని కేంద్ర హార్టికల్చర్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ సురేందర్‌కౌల్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల, రాయికల్, దూసకల్ గ్రామాలలో హార్టికల్చర్ ద్వారా పాలీహౌస్‌లలో సాగుచేసిన పూలు (జర్బరాస్), జామ, ధనిమ్మ, మామిడి పంటలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటితో ఎక్కువ పంటలను సాగు చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగుకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. పాలీహౌస్‌ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం సబ్సిడీ ఇస్తుందని, మొత్తం 75 శాతం సబ్సిడీతో రైతులకు ఫాలీహౌస్‌ల నిర్మాణాలు చేపడతామని ఆయన వివరించారు. ఈ పాలీహౌస్‌లలో రైతులు పూలసాగుతో పాటు కూరగాయల పంటలను సైతం సాగు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. పాలీహౌస్‌లలో పంటలను సాగు చేసుకున్న రైతులు ఇప్పటివరకు లాభాలు పొందారే తప్పా నష్టాలు పొందలేదని పేర్కొన్నారు. ఉద్యానవన శాఖ ఇస్తున్న సబ్సిడీ పథకాల గురించి రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అధికారులకు సూచించారు. పది ఎకరాల వరకు ఫాలీహౌస్ నిర్మాణానికి ఉద్యానవన శాఖ అనుమతి ఇస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండేళ్లల్లో ఫౌలీహౌస్‌ల నిర్మాణాలను మరింత పెంచనున్నట్లు తెలిపారు. మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు సాంకేతిక పద్ధతిలో పంటలను సాగుచేసి లాభాలు పొందాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లో పెద్దఎత్తున శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. రైతులతో పాటు నిరుద్యోగ యువకులు ముందుకు వచ్చి ఫాలీహౌస్ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్‌రాంరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారులు మధుసూదన్, సువర్ణ, సోమిరెడ్డి, ఉషారాణి, శేషగిరిచారి, విశ్వనాథ్‌రెడ్డి, రుక్మిణితో పాటు రైతులు సత్యనారాయణగౌడ్, యాదయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.

డెడ్‌స్టోరేజీకి జూరాల ప్రాజెక్టు

ఆయకట్టుకు సాగునీరు నిలిపివేత ౄ ఆందోళనలో రైతాంగం

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 9: మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం పడిపోయింది. ప్రస్తుతం డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరుకోవడంతో శనివారం పాజెక్టు అధికారులు ఆయకట్టుకు సాగునీటిని నిలిపివేశారు. కుడి ఎడమ కాలువలకు సంబంధించిన నీటిని నిలిపివేసి ఆయకట్టుకు ఇక సాగునీరు ఇవ్వడానికి వీలుకాదని తేల్చి చెప్పారు. గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకే జూరాల ఆయకట్టు రైతాంగానికి సాగునీరును ఇవ్వడానికి ఇదివరకే నిర్ణయం తీసుకున్నప్పటికీ రైతుల అవసరాల నిమిత్తం జనవరి 7వ తేదీ వరకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో తప్పని పరిస్థితుల్లో సాగునీటిని నిలిపివేశారు. అయితే జూరాల ఆయకట్టు కింద ప్రస్తుతం దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలు ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు సాగునీరు విడుదల చేస్తే పంటలు చేతికి వచ్చే అవకాశం ఉన్నాయని ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తే పూర్తిస్థాయిలో పం టలు చేతికి వస్తాయని, లేనిపక్షంలో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటుందని ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో అధికారికంగా 5 టిఎంసిల నీరు ఉన్నప్పటికీ ప్రాజెక్టులో ఒండ్రుమట్టి పూడుకపోవడంతో కేవలం 3 టిఎంసిల నీరు మాత్రమే ఉంటుందని అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. మరో ఆరు నెలలపాటు తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రస్తుత జలాలను వినియోగించుకోవడానికే వీలుపడే విధంగా అధికారులు రూపకల్పన చేసుకున్నారు. అయితే ఆయకట్టులో దాదాపు 50 వేల ఎకరాల పంటలు ఉండడంతో వీటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు కృష్ణా రివర్ బోర్డుకు 5 టిఎంసిల నీరు కావాలని ఎగువ ప్రాంతం నుండి విడుదల చేయాలని లేఖలు రాశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కోయిల్‌సాగర్, రామన్‌పాడు, జమ్ములమ్మ రిజర్వాయర్ల ద్వారానే తాగునీటిని జిల్లా ప్రజలకు అందిస్తున్నారు. ఈ తాగునీటి ప్రాజెక్టులకు జూరాల ప్రాజెక్టు నుండే నీరు రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ జూరాల ప్రాజెక్టు నీటిమట్టం పడిపోయి డెడ్‌స్టోరేజీకి చేరడంతో ఎండాకాలం రాకముందే ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాగునీటి అవసరాలతోనే
ఆయకట్టుకు నిలిపివేత
జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోయిందని డెడ్‌స్టోరేజీకి పడిపోవడంతో ఆయకట్టు రైతాంగానికి నీటిని నిలిపివేయడం జరిగిందని, ముఖ్యంగా జిల్లా ప్రజలకు రాబోయే ఆరు మాసాల మేరకు తాగునీరు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని జూరాల ప్రాజెక్టు ఎస్‌ఇ రఘునాథరావు తెలిపారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి నీటిని నిలిపివేయడంపై ఆంధ్రభూమి ప్రతినిధి ప్రాజెక్టు ఎస్‌ఇని ఫోన్ ద్వారా వివరణ కోరగా సాగునీరు ఇచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ 31 వరకే సాగునీరు ఇవ్వాలని జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకున్నామని, అయనా వారం రోజులపాటు అధికంగా సాగునీటిని విడుదల చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 5 టిఎంసిల నీరు మాత్రమే ఉందని, రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ వరకు తాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టులో ఉన్న నీటిని వాడుకోవడం జరుగుతుందని తెలిపారు. మరో 5 టిఎంసిల నీరు అవసరం ఉందని ఉన్నతాధికారులకు లేఖలు రాశామని ఎస్‌ఇ వెల్లడించారు.

నాగోబా జాతరలో సకల సౌకర్యాలు

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎంపి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి

ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 9: ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల ఆరాధ్యదైవమైన కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎంపి గెడం నగేశ్ తెలిపారు. ఆలయ ఆవరణలో శనివారం జాతర ఏర్పాట్లపై ఎంపి నగేశ్, కలెక్టర్ జగన్మోహన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రభుత్వం రాష్టప్రండగగా గుర్తించి కెస్లాపూర్ జాతరలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించడమే గాక చివరి రోజు దర్బార్ నిర్వహణ, జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ముత్నూరు నుండి సిరికొండ వరకు బిటి రోడ్డు పనులు పూర్తి చేయాలని పిఆర్ ఎస్‌ఇని, వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. అదేవిధంగా జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కోసం ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సౌకర్యం కల్పించాలని, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇని ఆదేశించారు. జాతరలో మద్యం అమ్మకాలు నిర్వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు, అబ్కారీ శాఖ అధికారులను ఆదేశించగా, అవసరమైనంత విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, జనరేటర్ సౌకర్యం కల్పించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఇకి సూచించారు. అధికారులకు, పోలీసు సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని గిరిజన శాఖ డిడిని, నాగోబా దేవత ప్రాశస్త్యం గురించి తెలిపే విధంగా కరపత్రాలు, గోడప్రతులు ముద్రించి ప్రచారం చేయడంతో పాటు దేవాలయం అలంకరణ పనులు పూర్తిచేయాలని దేవాదాయ శాఖ ఎసిని అదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా ఇతర ప్రాంతాల నుండి కెస్లాపూర్ వరకు, అదే విధంగా ముత్నూరు నుండి కెస్లాపూర్ వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జాతర జరిగే అన్ని రోజులలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని, నూతన దర్బార్ హాల్ నిర్మాణం కోసం తగు చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. మెస్రం వంశస్తులు తెలిపిన సమస్యలు పరిష్కరించడానికి జిల్లా యం త్రాంగం సిద్ధంగా ఉందని, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా జాతరను విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు నగేశ్ మాట్లాడుతూ నాగోబా దేవాలయ అభివృద్ధి కోసం రూ.3 కోట్ల 40 లక్షల రూపాయల మంజూరు కోసం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని, ఈ నిధులు త్వరలో మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆధికారులకు సూచించారు. సర్పంచ్ మెస్రం నాగనాథ్ మాట్లాడుతూ మెస్రం వంశస్తులకు ప్రత్యేక షెడ్ నిర్మించాలని, మర్రిచెట్టు వద్ద ప్రహారీ, స్నానపు గదులు, మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు దేవస్థానం వద్ద భక్తులు, అధికారులకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఖానాపూర్ శాసన సభ్యులు ఆజ్మీరా రేఖానాయక్, ఐటిడిఎ పివో ఆర్‌వి కర్ణన్, జడ్పీటిసి దేవ్‌పూజ సంగీత, ఎంపిపి జాదవ్ మీరాబాయి, డిఎస్పీ మల్లారెడ్డి, ఆలయ చైర్మన్ మెస్రం తుకారాం, ఆయా శాఖల అధికారులతో పాటు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.