తెలంగాణ

పేరుకే పెద్దపీట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ ఆయా వర్గాల అవసరాలకు ఎంతవరకు సరిపోతుందనేది ప్రశ్నార్థకం. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బిసి సంక్షేమ శాఖకు రూ.2537.51 కోట్లు కేటాయింపును బడ్జెట్‌లో పొందుపరుస్తూ ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టారు. బిసిల సంక్షేమానికి పెద్ద పీట వేసామంటున్న ప్రభుత్వం ఆ స్థాయిలో భారీ కేటాయింపులు జరగలేదని ఆయా వర్గాలు విశే్లషిస్తున్నాయి. బిసి విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం గత ఏడాది ఎంత కేటాయించారో ఈ సంవత్సరం ప్రభుత్వం అంతే కేటాయించింది. గత 2015-16 బడ్జెట్‌లో ఫీజు రియంబర్స్‌మెంట్ కింద బిసి విద్యార్థులకు రూ.753.31 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది కూడా అంతే కేటాయించారు. ఇబిసి విద్యార్థుల కోసం కేటాయించిన బడ్జెట్ కూడా రూ.252 కోట్లు మాత్రమే. ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం కిం గత ఏడాది కేటాయించిన మొత్తంలో 466.05 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగిలిన మొత్తం విడుదల చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మరో వారం రోజుల్లో ముగుస్తున్నందున ఆ మొత్తం కూడా విడుదల చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో ప్రకటన చేస్తూ ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి మొత్తం బకాయిలను మార్చి, ఏప్రిల్ లోపు చెల్లింపులు చేస్తామని, దీనికి సంబంధించి విద్యార్ధులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటన చేశారు. దీంతో బిసి వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఆచరణలో ఏ మేరకు ప్రభుత్వం ఈ హామీని నిలబెట్టుకుంటుందో వేచిచూడాలి.
ఈ పాస్ వెబ్‌సైట్ కింద బిసి విద్యార్థులు ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 7,71,209 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగినా, అవసరాలకు అనుగుణంగా ఖర్చులు పెరిగినా మరింత నిధులు అవసరమవుతాయి. కళ్యాణలక్ష్మి పథకం 2016-17 నుంచి బిసిలకు అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించడం ఆహ్వానించదగిన పరిణామంగా బిసి వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించి, ఆ మొత్తాన్ని 58,820 మంది బిసి, ఇబిసి అమ్మాయిలకు లబ్ది చేకూర్చేవిధంగా బడ్జెట్‌లో పొందుపర్చడం బిసి వర్గాలకు ఆనందాన్ని కలిగించింది. ఒక్కో బిసి అమ్మాయికి రూ.51,000 మొత్తాన్ని ఆర్థిక సహాయం కింద వివాహ సమయంలో ప్రభుత్వం అందిస్తుంది. బిసి కార్పొరేషన్ ద్వారా అమలు చేసే వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్లో పెరుగుదల కనిపించలేదు. బిసి వర్గాల్లో ఉన్న 113 కులాలకు అనుగుణంగా జరగాల్సిన కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవని చెబుతున్నారు. మార్జిన్ మనీ పథకం, అభ్యుదయ యోజన, రజక సహకార సంఘాలు, నాయి బ్రాహ్మణ సంఘాల సమాఖ్య వంటి దాదాపు 12 సంఘాల ప్రయోజనాలకు అవసరమైన నిధులను కేటాయింపులు అంతంత మాత్రంగా జరిగాయి. అయితే వసతి గృహాల్లో సన్నబియ్యం అన్నం పెట్టే పథకం పట్ల అంతా అభినందనలు తెలుపుతున్నారు. కొత్తగా ఈ ఏడాది సంచార జాతుల సమాఖ్య లిమిటెడ్ పేరుతో కొత్త సమాఖ్యను ప్రభుత్వం ఏర్పాటు చేసి వారికి రూ.5 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. బిసి సంక్షేమ శాఖలో ఉన్న కార్పొరేషన్లలో రజక సహకారం సంఘాల సమాఖ్యకు 2014-15లో రూ.10.50 కోట్లు కేటాయిస్తే, అంత మొత్తం ఖర్చు కాగా, 2015-16లో 10.50 కోట్లు కేటాయిస్తే ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఖర్చు కాలేదు. ఈ సమాఖ్యకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సహాయ సబ్సిడీ కింద ఒక్క రూపాయి కేటాయించలేదు. నాయి బ్రాహ్మణ సంఘాల సమాఖ్యకు 2015-16లో ఒక్క రూపాయి కేటాయించలేదు. మరో ముఖ్యమైన విశ్వబ్రాహ్మణ సహకార సంస్థకు రూ.7.45 కోట్లు 2015-16లో కేటాయించారు. గీత కార్మిక సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌కు రూ.4.50 కోట్లు కేటాయిస్తే ఒక్క పైసా ఖర్చు చేయలేదని బిసి సంక్షేమ శాఖ పద్దుల్లో శాసనసభకు వెల్లడించింది. దీంతో బిసి సంక్షేమ శాఖలో అమలు జరగాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఈ బడ్జెట్‌లోనైనా దక్కుతుందో లేదో వేచి చూడాలి.