తెలంగాణ

‘గంగి’ గోవు... వారి ఆధరవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 13: ‘కుల విద్య మానకురా గువ్వల చెన్నా’ అన్న నీతి వాక్యాన్ని వారు అక్షరాలా పాటిస్తున్నారు. వృత్తినే నమ్ముకుని కుల సంప్రదాయాన్ని ఆచరిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్నారు. కులాల కట్టుబాట్లకు తూట్లు పడి అనేక వృత్తులు చిన్నాభిన్నమైనా గంగిరెద్దుల కుటుంబాలు మాత్రం తమ కుల సంప్రదాయాన్ని యధావిధిగా కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. మండలానికో గ్రామంలో ఈ కుటుంబాలు తరుచుగా కనిపిస్తుంటాయి. కొన్ని మండలాల్లో ఈ జాతి వారు అసలే కనిపించరు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్‌లో ఉన్న నాలుగు కుటుంబాలు ఇప్పుడు 40కి చేరుకున్నాయి. వంద మంది జనాభాతో చాలీచాలని ఆదాయంతో కాలాన్ని ముందుకు వెళ్లదీస్తున్నారు. జీవన భృతికి ఎన్ని కష్టాలు పడుతున్నా, వారి ఆచార నడవడిని పరిశీలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కుల వృత్తిగా మార్చుకున్న యాచకత్వానికి పశువుల పోషణ అదనం. పశు పోషణ సైతం భిన్నంగా ఉందంటే నమ్మశక్యం కాని విషయమే. గ్రామాల్లో కుటుంబ పెద్దలు చనిపోతే గంగిరెద్దుల వాళ్లతో ఆటలాడించి గోదానం చేయడం పరిపాటి. ఇలా గోదానంగా వచ్చిన పశువులను ఈ కులం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరు. దానం కింద వచ్చిన పశువును చనిపోయే వరకు పోషించడం వీరి ఆచారం. అనారోగ్యంతోనో, వయసు మీదపడో మృతి చెందే కామధేనువు మృతదేహాలను ఆరుబయట పడవేయకుండా వారి సంప్రదాయం ప్రకారం ఖననం చేస్తారంటే గోపాలకులు వృత్తికి ఇచ్చే గౌరవానికి నిదర్శనమని చెప్పవచ్చు. దానంగా వచ్చిన గోవుకు పుట్టిన కోడె దూడలను పెంచి పెద్ద చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటారే కానీ దానంగా వచ్చిన ఆవును ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరు. ప్రస్తుతం గోదానంగా వచ్చిన పశువుల సంఖ్య ఏకంగా నాలుగు నుంచి ఐదు వందల వరకు పెరిగింది. కుటుంబ అవసరాలకు పోను మిగిలిన ఆవుపాలను దూడలు తాగడానికే వదిలి వేస్తారు. గంగిరెద్దుల వారు మాత్రం గేదెల జోలికి వెళ్లకుండా కేవలం దేశీయ ఆవులకే ప్రాధాన్యతనిస్తున్నారు. సాగు భూములు అంతంతమాత్రంగానే ఉండటంతో పశువులకు మేతను కొనుగోలు చేస్తుంటారు. పశువుల పేడను విక్రయించగా వచ్చే ఆదాయంతో గడ్డిని సమకూర్చుకోవడం వీరి లక్ష్యం. రెండేళ్లుగా తీవ్రమైన కరవు నెలకొన్నా గోపన్నలకు మాత్రం పశువు బరువు కాలేదు. ఆవులను కబేళాలకు తరలిస్తున్న నేటి సమాజంలో గోమాతను కన్నతల్లిగా కడదాకా పోషిస్తూ గంగిరెదు దల కుటుంబీకులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎంతటి దట్టమైన అడవికైనా వాటిని తీసుకువెళ్లి కడుపునింపుకుని వస్తారే కానీ మూగజీవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి కడుపు మార్చరు.

ఆవును అమ్మలా ప్రేమిస్తాం
పట్టెడన్నం పెడుతున్న ఆవును అమ్మలా ప్రేమిస్తాం. అవసరమైతే మేము ఓ పూట కడుపు మాడ్చుకున్నా పశువుకు మేత కొరతను రానివ్వం. ఎంతటి కష్టానికైనా ఓర్చుకుని మూగ జీవాలను బ్రతికించుకుంటాం. పాలను అమ్మితే డబ్బు రావచ్చు కానీ, లేగదూడల కడుపు మాడుతుంది. అందుకే పాలను వాటికే వదులుతాం.

కబేళా గురించి తెలీదు
ఇప్పటి వరకు ఒక్క పశువును కూడా కబేళాకు కానీ సంతకు కానీ తరలించలేదు. కబేళా ఎలావుంటుందో కసాయి ఎవరో తామెరుగం. ఆవు మరణిస్తే ఆచారం ప్రకారం ఖననం చేస్తాం కానీ ఆరుబయట పడవేయం. దానంగా యేటా నాలుగైదు పశువులు వస్తుంటాయి. అటవి ప్రాంతంలో జంతువులతో ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండి కుక్కల సహాయంతో సురక్షితంగా పశువులను ఇంటికి తీసుకువస్తాం. ఆవుల పోషణతో ఆదాయం అంతంతగానే ఉన్నా వృత్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానుకోము.
నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామంలో గంగిరెద్దుల వాళ్ల ఇళ్ల చుట్టూ కట్టేసిన కామధేనువులు