తెలంగాణ

వెన్నుపోటే కారణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 27: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమేమిటి..? సొంత పార్టీ మనుషులే తమ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచారా...? అనేక ఆటుపోట్లు ఎదురైనా సందర్భాల్లోనూ తట్టుకొని నిలబడిన కాంగ్రెస్‌కు ఇంతటి అపజయం ఎదురుకావడం వెనక తమ పార్టీ మనుషుల హస్తమే ఉన్నట్లు అధిష్ఠాన వర్గం అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అధికార పార్టీ జోరు..! మరోవైపు తమ అభ్యర్థి ఆకస్మిక మార్పుతో కుదేలైన కాంగ్రెస్‌కు చెందిన కొందరు స్థానిక నేతలే నమ్మకద్రోహం చేయడం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డటైంది. గత 17నెలల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని చెప్పుకుంటూ వరంగల్ ఉపఎన్నికలో ఏ విధంగానైనా గెలవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ అధిష్ఠానం పకడ్బందీ ప్రణాళికతో ఉపఎన్నిక ప్రచారాన్ని చేపట్టింది. ప్రచారంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమారి, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, మాజీ కేంద్రమంత్రులు సచిన్‌ఫైలెట్, గులాంనబీ ఆజాద్‌లాంటి జాతీయ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యనేతలంతా ప్రచారంలో పాల్గొన్నా అతిరథుల పరువు గంగలో కలిసేలా ఫలితాలు వెలువడ్డాయ. కాంగ్రెస్ అధిష్ఠానం ఉపఎన్నికల ఫలితాలపై ఆరాతీస్తే దిమ్మతిరిగే సమాచారం అందినట్లు తెలిసింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలోని ముఖ్యనేతలే అధికార పార్టీకి అమ్ముడుపోయినట్లు అధిష్ఠానం సేకరించిన సమాచారంలో తేలింది. మరొక నియోజకవర్గంలో ఇద్దరు నాయకుల వర్గపోరుతో కనీస ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి వచ్చింది. ఒక రెండు నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీ డబ్బులు పంపిణీ చేయడం వల్లే ఆ నియోజకవర్గాల్లో ఓట్లశాతం తగ్గిందని అధిష్ఠాన విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీ ముందు జాతీయ పార్టీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు కావడంతో కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందిగా తయారైంది. ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీని రైతులు, యువకులు, ఎమ్మార్పీఎస్ నేతలు నిలదీసినప్పటికీ ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో ఊహించని మెజార్టీ రావడం వెనక బలమైన కారణాలు ఉన్నట్లు అధిష్ఠానం అనుమానిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే కేంద్ర కమిటీలో చర్చకు రానున్నట్లు తెలిసింది. త్వరలో జరుగనున్న గ్రేటర్, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై దీని ప్రభావం కాంగ్రెస్‌కు మరింత నష్టం చేకూర్చే విధంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా స్వంత పార్టీ మనుషులే కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని కొందరు నాయకులు అంగీకరిస్తున్నారు.