తెలంగాణ

మూసీ ఆయకట్టులో రబీకి ‘హాలిడే’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 27: నల్లగొండ జిల్లా అంతటా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ మూసీ నది చలవతో చెరువులు నిండుగా ఉండటంతో ఆయకట్టులో రబీ వరి పంటలు పండించాలనుకున్న రైతుల ఆశలకు బ్రేక్ పడింది. మిషన్ కాకతీయ రెండో విడత చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఈ దఫా మూసీ నది భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కాలువల కింది చెరువుల పునరుద్ధరణ చేయాలని నిర్ణయించి ఈ చెరువుల కింద రబీ వరినాట్లు వేయరాదంటు క్రాప్ హాలిడే ప్రకటిస్తు కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆదేశాలివ్వడం రైతులకు షాక్‌లా తగిలింది. ఇప్పటికే కొంత మంది రైతులు రబీ వరి పంటల సాగు కోసం నారుమడులు సైతం పోసుకున్న నేపధ్యంలో తాజాగా కలెక్టర్ జారీ చేసిన ప్రకటన ఆయకట్టు రైతులను ఆందోళనలో పడేసింది. దాదాపు 20వేల ఎకరాలకు మేరకు ఆయకట్టులో రబీ వరినాట్లు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. చెరువుల్లో నీరు ఉండటంతో రబీ వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. గత ఏడాది సైతం చెరువుల్లో నిండుగా నీరు ఉండటంతో మిషన్ కాకతీయ పనులు వాయిదా పడ్డాయి. తొలి ఏడాది 952చెరువుల పునరుద్ధరణ చేపట్టి 80శాతం పనులు పూర్తి చేశారు. ఈ ఏడాది రెండో విడత కింద మరో 20శాతం మేరకు 952చెరువుల పునరుద్ధరణ తలపెట్టారు. ఇందులో భాగంగా వలిగొండ మండలంలోని మూసీ నది భీమలింగం కత్వతో పాటు కాలువ కింద ఉన్న 18చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నందునా వాటి ఆయకట్టులో రైతులు రబీ వరి నాట్లు వేయరాదని కలెక్టర్ రైతులను కోరారు. కాలువ పరిధిలోని పొద్దుటూరు నల్ల చెరువు, రాయికుంట, లింగరాజుపల్లి గ్రామం పాపినేని చెరువు, నాతాళ్లగూడెంలోని ఊసలోనికుంట, వలిగొండ పెద్దచెరువు, మల్లేపల్లి ఊరచెరువు, వెలువర్తి బ్రహ్మణ చెరువు, పెద్ద చెరువు, లోతుకుంట ఊర చెరువు, గురునాథపల్లి చౌటబావి చెక్‌డ్యాం, చెరువు, అర్రూర్ గ్రామం మొద్దులగండి చెరువు, యాపల చెరువు, ఊర చెరువు, వెంకటాపురం గ్రామం పెద్దబావికుంట, ముద్దాపురం జంగం బావికుంట, ముత్యాలమ్మకుంట, వేములకొండ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు రెండో విడత మిషన్ కాకతీయ కింద చేపట్టనున్నారు. చెరువుల పునరుద్ధరణ పనులు చేయనున్నందునా రబీ వరి సాగు చేయరాదంటు కలెక్టర్ రైతులను కోరారు. అటు ధర్మారెడ్డి పల్లి కాలువ మరమ్మతులను కూడా చేపడుతున్నందునా కాలువ పరిధిలో రబీ పంట కాలానికి క్రాప్ హాలిడే ప్రకటించారు. ధర్మారెడ్డి కాలువ పరిధిలోని వలిగొండ, రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల పరిధిలోని 20చెరువుల కింద రైతులు రబీ వరి నాట్లు వేయరాదని కలెక్టర్ కోరారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు రైతులు వరి వేయరాదంటు సూచించారు. మూసీ భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కాలువల పరిధిలో రబీ పంటల క్రాప్ హాలిడే ప్రకటించిన విషయాన్ని ఆయా గ్రామాల రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో డప్పు చాటింపుతో పాటు ఇతరత్రా విస్తృత ప్రచారం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో భువనగిరి ఆర్డీవో, మండలాల తహశీల్ధార్లు, వ్యవసాయ అధికారులు రైతులకు క్రాప్ హాలిడే పట్ల అవగాహాన కల్పిస్తున్నారు. అయితే ఇప్పటికే వరినార్లు పోసుకున్న రైతులు క్రాప్ హాలిడే పై తమకు మరింత ముందుగా సమాచారం ఇచ్చివుంటే సాగు పెట్టుబడులు నష్టపోకుండా ఉండేవారిమని వాపోతున్నారు.