తెలంగాణ

పత్తిపై మోదీని కలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 29: తెలంగాణలో పత్తి రైతు బాధలు ప్రభుత్వానికి తెలుసని, సమస్య పరిష్కారం కోసం త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పత్తి రైతుల సమస్య పరిష్కారం కోసం సిఎం కెసిఆర్ తనతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీల బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లమని ఆదేశించారని, ఈమేరకు డిసెంబర్ 2న తమ బృందం ఢిల్లీకెళ్లి ప్రధాని మోదీని కలిసి పత్తికి మద్దతు ధర కోసం ఒత్తిడి తెస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందునే అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం చేశామన్నారు. ఈ సమస్యనూ ప్రధానికి వివరించి పార్లమెంట్‌లలో బిల్లు పవేశపెట్టేలా ప్రయత్నం చేస్తామన్నారు. అంతేకాకుండా కరవు మండలాలకు త్వరలోనే నిధులు మంజూరయ్యేలా కేంద్రంపై ఒత్తిడితెచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. వరంగల్ ప్రజలు పార్లమెంటు ఉప ఎన్నికలో తెరాసకు అఖండ విజయాన్ని అందించారని, ఈ విషయంలో సిఎం కెసిఆర్ వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. త్వరలోనే ఔటర్ రింగ్ రోడ్ పనులు ప్రారంభమయ్యేలా అధికారులకు సిఎం ఆదేశాలిచ్చారన్నారు. కళ్యాణలక్ష్మి పథకం కేవలం ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాలకూ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వచ్చే ఏడాది నుంచి వరంగల్‌లో సైనిక్ స్కూల్‌తో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలనూ నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వ పనితీరును విపక్షాలు జీర్ణించుకోలేకే విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఉప ఎన్నిక ఫలితాలను దృష్టిలో పెట్టుకుని విపక్షాలు బుద్ధిగా మసలుకుంటూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని, అభివృద్ధి కూడా ఆయనతోనే సాధ్యమని ప్రజలు ఉప ఎన్నికలో తెరాసకు పట్టంగట్టారన్నారు. మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ఎంపి దయాకర్