తెలంగాణ

చెల్లింపుల్లో జాప్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 20: తెలంగాణ జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం, పత్తి దిగుబడుల అమ్మకాల్లో రైతన్నల కష్టాలు కొనసాగుతున్నాయి. కరవుతో దెబ్బతిన్న పంటల నుండి దక్కిన అరకొర దిగుబడులను వ్యయప్రయాసల మధ్య కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తే సకాలంలో డబ్బులు అందక రైతన్నలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ధాన్యం, పత్తి దిగుబడులు అమ్మిన రైతులకు 48గంటల్లోగా చెల్లింపులు చేస్తామంటూ ప్రకటించగా క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధమైన పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో రైతుకు పది రోజులైనా తాము విక్రయించిన ధాన్యం, పత్తి దిగుబడులకు సంబంధించిన డబ్బులు అందడం లేదంటూ వాపోతున్నారు. బ్యాంకు అకౌంట్లు సమర్పించిన ఆన్‌లైన్ చెల్లింపుల్లో జాప్యం ఎందుకంటూ రైతులు వాగ్వివాదాలకు దిగుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 4లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేసి 110ఐకెపి, పిఏసిఎస్ కేంద్రాలు, ఏఎంసిల ద్వారా కొనుగోలు సాగిస్తున్నారు. ఇప్పటిదాకా 1లక్ష 20వేల టన్నుల ధాన్యం ఐకెపి, పిఏసిఎస్‌లు, 1లక్ష టన్నులు ఏఎంసిల ద్వారా కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి 174కోట్లు రైతులకు చెల్లించాల్సి వుండగా ఇప్పటిదాకా 96కోట్లు మాత్రమే చెల్లించడం గమనార్హం. ఇక పత్తి కొనుగోలుకు సంబంధించి ఈ దఫా జిల్లాలో 38లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేయగా సకాలంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు తెరువక ఇప్పటికే జరిగిన దిగుబడిలో అధిక శాతం దళారుల పాలయింది. జిల్లాలో 3లక్షల 80వేల మంది రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేశారు. ఇక ఆలస్యంగా తెరుచుకున్న 11పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటిదాకా 3,384మంది రైతులకు సంబంధించిన 1లక్ష 20వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. రైతులకు సిసిఐ 52కోట్లు చెల్లించాల్సి వుండగా ఇప్పటిదాకా 19కోట్లు మాత్రమే చెల్లించినట్లుగా మార్కెటింగ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. పత్తి రైతులకు సైతం 48గంటల చెల్లింపులు సాగడం లేదు. పక్షం రోజులకు పైగానే రైతులు చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. నానా తిప్పలు పడి పండించిన పంటకు సకాలంలో డబ్బులు సైతం అందని పరిస్థితుల్లో ఖరీఫ్ అప్పులు తీర్చలేక రబీ పంటల సాగుకు కావాల్సిన పెట్టుబడులకై రైతులు తంటాలు పడుతున్నారు.