రాష్ట్రీయం

శిశువు కోసం తల్లుల తగువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ఇరువర్గాల ఘర్షణ
డిఎన్‌ఎ పరీక్షల తర్వాతే అప్పగించాలని నిర్ణయం

సూర్యాపేట, నవంబర్ 30: ఒకే ఆసుపత్రిలో ఇద్దరు మహిళలు ప్రసవించిన అనంతరం ఒకరికి జన్మించిన మగ శిశువు తమబిడ్డ అంటే తమ బిడ్డే అంటూ తల్లులిద్దరూ తగువుకు దిగిన సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో సోమవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అర్వపల్లి మండలం కోడూరు గ్రామానికి చెందిన గర్భిణి గంట లావణ్య, కేతేపల్లి మండలం గుడివాడ గ్రామానికి గుండగాని పుష్పలత ప్రసవం కోసం సోమవారం ఏరియా ఆసుపత్రిలో చేరారు. వీరిద్దరికీ ఆసుపత్రి ప్రసూతి వైద్యురాలు స్రవంతి శస్తచ్రికిత్స చేసి శిశువులను బయటికి తీసింది. ప్రసవం అనంతరం లావణ్య చేతిపై ఆడ శిశువు పుట్టినట్లుగా ఫిమేల్ అని గుర్తు వేయగా, పుష్పలత చేతికి మగశిశువు జన్మించినట్లు మేల్ అని గుర్తులు వేశారు. జన్మించిన ఇద్దరు శిశువులను ఆసుపత్రి సిబ్బంది శుభ్రం చేసిన అనంతరం ఆపరేషన్ థియేటర్‌లో ఉంచారు. అయితే కొన్ని గంటల తర్వాత లావణ్య చేతిపై ఉన్న గుర్తు ప్రకారం ఆడ శిశువును కాకుండా మగ శిశువును తీసుకొని వెళ్తుండగా తమకు పుట్టిన బాబును మీరెలా తీసుకెళ్తారంటూ పుష్పలత ఆమె భర్త కిష్టయ్య ఎదురుతిరిగి శిశువును లాక్కున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ప్రారంభమై చినికిచినికి గాలివానగా మారింది. తమకే మగ శిశువు జన్మించాడని, ఆసుపత్రి సిబ్బంది తప్పుగా మార్కు వేశారంటూ లావణ్యసుమన్ దంపతులు వాదించారు. ఇద్దరి కుటుంబసభ్యులు, బంధువులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ప్రారంభమైన వాదులాట ఘర్షణకు దారితీసింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను వారించినా శాంతించలేదు. చివరికి వైద్యులే ఎవరి శిశువు ఎవరో నిర్థారించిన తర్వాతే శిశువులను అప్పగిస్తామని చెప్పి శిశువులకు ఆసుపత్రిలోనే వైద్యం అందిస్తున్నారు. ఈ విషయంపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బిఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ శిశువుల విషయంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. వివాదం నెలకొన్నందున ఇద్దరు శిశువులు, వారి తల్లులకు డిఎన్‌ఎ పరీక్షలు జరిపి ఎవరి బిడ్డలో నిర్థారించిన తర్వాతే శిశువులను తల్లులకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.