తకిట తకిట

జైళ్ళకి మళ్ళీ పాత కళ వచ్చేసింది. ఎందులో చూసినా పెద్దలే. కాకపోతే ఒక్కటే తేడా. పూర్వం, జైలుకి వెళ్ళాక పెద్దవాళ్ళయ్యేవారు. ఇప్పుడేమో, పెద్దవాళ్ళయ్యాక జైలుకు వెళ్తున్నారు.
అప్పట్లో సామాన్యుడికి కూడా జైళ్ళు అందుబాటులో వుండేవి. ఇప్పట్లాగా జైలుకి వెళ్ళాలంటే విధిగా విఐపి అయి వుండాలనే ఆచారం వుండేది కాదు. జాతీయోద్యమ కాలంలో అతి చిన్నచిన్న సాహసాల్ని కూడా తెల్లవాడు గుర్తించేవాడు. వాడి జెండా పీకి మువ్వనె్న పతాకాన్ని పాతటం, సముద్రపు వొడ్డున వెళ్తూ, వెళ్తూ కాసిన్ని ఉప్పు కణికెలు (నిప్పు కణికెలు కాదు) చేత్తో పట్టుకోవటం, పాత దుస్తులు (మనం కట్టుకునే మిల్లు దుస్తులే) తీసి రోడ్డుమీద తగలేయటం- ఇలాంటివి చేస్తే చాలు, బ్రిటిష్‌వారు గుర్తించేసి, విశాలమైన జైళ్ళకూ, ఒక్కొక్కసారి అండమాన్ లాంటి త్రీస్టార్ జైళ్ళకూ ఉదారంగా పంపించేసేవారు. అలా ఒక్కసారి వెళ్ళొస్తే చాలు- ఎంతటి చిన్నవారయినా పెద్దవారయిపోయేవారు.
ఇప్పటి జైళ్ళకు స్టార్‌లు పెరిగిపోయాయి. దాదాపు అన్నీ ఫైవ్ స్టార్ జైళ్ళే. అన్నీ దొరుకుతాయి. కొన్ని పరిశ్రమలవల్ల మన విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందని విన్నాం. కానీ మన దేశంలోని కొన్ని జైళ్ళవల్ల, ఏకంగా విదేశీ ‘మాదక’ ద్రవ్యం పెరిగిపోతుంది. కొన్ని మత్తు పదార్థాలకు జైళ్ళ బయిట నిషేధం కానీ, జైళ్ళలో ఎందుకు వుంటుంది? అత్యంత అధునాతనమయిన మొబయిల్ ఫోన్లకు అసలు సిసలయిన బ్రాండ్ అంబాసడర్లు జైళ్ళలోనే వుంటారు. ఫోనే్లం ఖర్మ! టూజీలూ, త్రీజీల నెట్‌వర్కులు జైళ్ళ ప్రాంగణాలలోనే అత్యద్భుతంగా పనిచేస్తాయి. ఆ మాటకొస్తే, టూజీలూ, త్రీజీలను మించినది ‘మాజీ’ నెట్‌వర్క్. మాజీ శాసనసభ్యులూ, మంత్రివర్యులూ, ఐయ్యేఎస్‌లూ, ఐపీఎస్‌లూ, మాజీ పాత్రికేయులూ, మాజీ న్యాయవాదులూ వీరందరితో వుండే నెట్‌వర్క్ సామాన్యమైనది కాదు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రమే కాదు, దేశంలో వున్న జైళ్ళ వ్యవస్థే (శాసన నిర్మాణ, కార్య నిర్వాహక, న్యాయ, పత్రికా శాఖలు అనే) నాలుగు స్థంభాల మీదకు వచ్చేసింది. నాలుగున్నాయి కాబట్టి జైళ్ళలో వున్నదానిని ‘్ఫర్‌జీ’(జి- అంటే జనరేషన్ మాత్రమే కాదు, గ్రూపు కూడా కావచ్చు.) అని కూడా పిలుచుకోవచ్చు. అందువల్ల జైళ్ళకు నేడు పెరిగిన పరపతి అంతా ఇంతా కాదు.
కాబట్టే ప్రవేశం కూడా కష్టమయిపోయింది. ఉదాహరణకి చంచల్‌గూడా జైలు లాంటి ఫైవ్ స్టార్ జైలులో సీటు కావాలంటే మాటలా? ఎన్ని ఫీట్లు చెయ్యాలి. జాతీయోద్యమ కాలంలోలాగ సత్యాగ్రహాలూ, పన్ను ఎగవేతలూ చేస్తే సరిపోదు. ఇప్పుడు జైలుకు వెళ్ళాలంటే, కొండల్ని పిండి చెయ్యాలి. గనులను తొలిచెయ్యాలి. భూమిని చాపలాచుట్టి అమ్మెయ్యాలి. జీవోల్లో పెద్ద పెద్ద క్లాజుల్ని తొలగించి సంతకాలు చెయ్యాలి. ఎదుటివాడికి కళ్ళకు కంతలుకట్టి ‘కఠిన’మైన నిర్ణయాలు తీసుకోవాలి. విఠలాచార్య సినిమాల్లో మనుషుల్ని జంతువులుగానూ, జంతువుల్ని మనుషులుగానూ మాంత్రికులు మార్చేసినట్లు, ‘నలుపు’ని ‘తెలుపు’ చెయ్యాలి (డబ్బునే లెండి). ‘ఓం క్రీం ఫట్ ఫట్’ అంటే, లేని ‘కంపెనీలు’ పుట్టుకురావాలి. ఉన్న కంపెనీలు మూతపడాలి. ‘కఠోర దీక్షతో ఇన్ని విద్యలు, అభ్యసించి ప్రదర్శిస్తేనే కానీ జైళ్ళలో అడుగుపెట్టలేరు. సారం ఒక్కటే.. కేవలం పెద్దవాళ్ళయిపోయినంత మాత్రాన సరిపోదు. పెద్ద పనులు కూడా చెయ్యగలగాలి. అప్పుడే స్టార్ జైల్లో సీటు రిజర్వ్ అవుతుంది.
అయితే కూటికి గతిలేని వాడికి కూడా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో కోటి రూపాయిలు తగిలినట్లు అప్పుడప్పుడూ, చైన్ స్నాచర్ (గొలుసులు లాగే దొంగ)కి కూడా స్టార్ జైలు ప్రవేశం లభిస్తుంది. అప్పుడు వాడు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. చెత్త ఏరుకుని జీవించే కుర్రాడు (రాగ్ పికర్) ఐమాక్స్ థియేటర్‌కొచ్చినప్పుడు పొందే ఆనందం కూడా, ఆ చిల్లర దొంగ జైలు ఆవరణలో పొందే సంతోషం దిగదుడుపే. ఆభరణాల షాపులో నెక్లెస్ కొట్టేసిన ఆడదొంగ కూడా తనని చూడటానికి వచ్చిన బంధువుల ముందు ఇలాంటి మురిపెమే ప్రదర్శిస్తుంది: ‘(మాజీ) కలకటేరమ్మదీ, నాదీ ఒకటే గది. తెలుసా?’ అంటూ పులకించిపోతుంది. ఇంతకన్నా ‘సోషలిజం’ ఎక్కడ వుంటుంది. బహుశా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, మన రాజ్యాంగ నిర్మాతలు కూడా కలలు కని వుండరు. ‘మా దేశంలో మంత్రీ, కార్మికుడూ ఒకే బస్సులో పక్క పక్కనే కూర్చుని ప్రయాణిస్తారు’అని కొన్ని ప్రజాస్వామ్య దేశాలవారు తమ నిరాడంబరత గురించి విర్రవీగిపోతుంటారు. ఆ లెక్కన మనమెంత విర్రవీగాలి? ఐయ్యేఎస్ అధికారీ, హైవే దొంగా, జైల్లో ఒక బారక్ పంచుకుంటారు, ఒకే బాత్‌రూమ్ వాడుతుంటారు. ఇది నిరాడంబరత కాదా! అది చూసి పొంగిపోకుండా, రాష్ట్రంలో ఐయ్యేస్‌లు బాధపడిపోతున్నారు. ఒకప్పుడు ‘నేరం నాది కాదు.. ఆకలిది’ అనే సినిమా వచ్చింది. ‘సంతకం నాది కాదు.. పెత్తనానిది’ అనే సిద్ధాంతాన్ని వారిలో కొందరు తీస్తున్నారు. అధికారులు మన్నిస్తే, వారు చేసేది సంతకమే కానీ వేలి ముద్రకాదు- నొక్కమన్న చోట, నొక్కాల్సినంత నొక్కెయ్యటానికి!
ఇదంతా చదివేశాక కుర్రవాళ్ళకెవరికయినా ‘నేను సైతం జైలుకు వెళ్ళాలి’ అనే ముచ్చట కలగవచ్చు. అందుకు ఏం చదవాలి? ఐయ్యేఎస్, ఐపిఎస్‌లు తప్పనిసరా? ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందాలా? ఏ రంగం ఎంచుకున్నా, దూరదృష్టి వుండాలే కానీ, ‘జైలుకు వెళ్ళటం’మరీ అంత అసాధ్యమయినది కాదు. జైలుకు వెళ్ళినా, వెళ్ళాల్సివచ్చినా, వెళ్ళటానికి సిద్ధమయినా, జనాదరణ విస్తారంగా వుంటుంది. ‘తిని జీర్ణం చేసుకోవటాన్ని’ ఆరోగ్యం భావించి, తినే వాళ్ళను ఆరాధించే జనం మనకి కోకొల్లలు. అందుకే ‘ప్రజాస్వామ్యం’ నేడు జైలులో వుంది.
Add new comment