సంజీవని

తలనొప్పి సాధారణం అనిపించినా దాని వెనుక వున్న కారణాలు అసాధారణంగా వుంటాయి. మనోమయకోశంగా పిలువబడే శిరస్సుకు నొప్పి అనిపించినపుడు దాని కారణాలను తెలుసుకోవాల్సిందే. సామాన్యమయిన జలుబు నుంచి మెనింజైటిస్ వంటి అనేక రకాలయిన వ్యాధి కారణాలు వుంటాయి.
శిరస్సులోని అవయవ విభాగాలను బట్టి, నొప్పి తీవ్రతను బట్టి, నొప్పి కలిగే ప్రదేశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మెదడు నరాల ఉద్రిక్త మొదలయిన పరిస్థితులు తలనొప్పి కారణంగా తెలుసుకోవడానికి దోహదం చేస్తాయి.
శిరశ్శూలు 11 రకాలుగా వుంటాయని సుశ్రుతాదులు వర్గీకరించారు. వాతాది దోషాలతో పాటు సూర్యావర్తము (మైగ్రేన్) అనంత వాతము (సైనసైటిస్) అర్థావభేదకము (ట్రైజిమినల్ న్యూరాల్జియా) శంఖము (ఎన్‌సెఫలైటిస్ మెనింజైటిస్) ప్రధానమైనవి.
తలనొప్పి ఆయా అవయవ లక్షణాలను బట్టి 220 రకాలు అని అంతర్జాతీయ పరిశోధకులు తెలిపారు. టెలివిజన్, కంప్యూటర్ స్క్రీన్‌లు ఎక్కువసేపు చూడటం, స్ట్రెస్, టెన్షన్ వలన మెదడు నరాలపై వత్తిడి, పారిశ్రామిక ప్రాంతాలలో నివసించడం, విషవాయువుల ప్రభావం, ధ్వని కాలుష్యం, అకాలంలో భోజనం, చలిగాలికి సాధారణ తలనొప్పి వస్తుంది.
సాధారణ శ్రేణి నొప్పికి విశ్రాంతి, నొప్పి నివారణ మాత్రల వలన ఉపశమనం లభిస్తుంది. నొప్పి తీవ్రంగా వుంటే వైద్యుని సలహా తప్పనిసరి. రెండవ శ్రేణిలో ముఖ నరాలలో నొప్పి, మెదడులో కణుతులు రక్తస్రావం, రక్తపోటు, మానసిక రోగి వాడే మందులు వాడుతూ వాడుతూ కొన్ని రకాల మందులు మానివేసినపుడు నరాలలో ఉద్రిక్తత ఏర్పడి తలనొప్పి వస్తుంది. ఈ రకమైన అవస్థలో కారణం తెలుసుకొని వ్యాధిని నిర్థారించుకొనవలసి వుంటుంది.
శంఖకము అనే శిరశ్శూలాలు మెదడు పొరల్లో వాపువచ్చి తలనొప్పి మెడ బిగుసుకుపోయి కన్వల్షన్లు (వంకరలు తిరిగిపోవడం)వస్తాయి. అటువంటి సమయంలో వెంటనే స్పందించి మెరుగైన వైద్య సేవ పొందగలగాలి.
మెదడుకు నొప్పి స్పందన వుండదు. ఎందుకంటే ‘నోసిసెప్టార్స్’ అందుబాటులో వుండవు. అయితే దాని పొరలలో వున్న సిరలు ధమనులలో నరాలు వుంటాయి. కనుక నొప్పి తెలుస్తుంది.
ప్రాథమిక తలనొప్పికి, మైగ్రేన్ నొప్పికి జాగ్రత్తలు అవసరం. టెన్షను, స్ట్రెస్, యాంగ్జయిటీ వలన మానసిక ఒత్తిడి వలన కలిగే నొప్పి. స్ర్తిలలోనే ఎక్కువ అందులోనూ యుక్తవయసు వారిలో అధికం. ఎడాపెడా నొప్పి నివారణ మందులు వేసుకోవటం, వేళకు ఆహారం తీసుకోకపోవటంవలన ‘ఎసిడిటీ’ (ఆమ్ల పిత్తం) ఏర్పడుతుంది. ఆమ్లపైత్యం ఎక్కువయి తలనొప్పివస్తుంది. నిద్రలేమి, రక్తపోటు అధికమైనపుడు, అప్పటికప్పుడు మార్పులు కనిపించి మెడ నరాలు గుంజినట్లు తలభారం వుంటుంది.
కంటి నరాలలో ఇబ్బంది ఏర్పడినప్పుడు, చెవి, ముక్కు, దంత సంబంధిత వ్యాధులలో బాధపడుతున్నపుడు తలనొప్పి అధికంగా వుంటుంది.
నోటితో శ్వాస తీసుకొనేవారిలో తలనొప్పి సమస్య తరచుగా వుంటుంది.
మైగ్రేన్ తలనొప్పి జీవన విధానాన్ని కలతబెట్టే అసౌకర్యంగానీ ప్రాణాపాయం కాని కలుగజేయదు. వాంతి వచ్చినట్లు వుండటం, వెలుతురును సహించలేకపోవడం దీని లక్షణాలు. దీనిని జన్యుపరమైన రుగ్మతగా గుర్తించడం జరిగింది.
సాధారణంగా ఎప్పుడూ తలనొప్పితో బాధపడేవారి శరీరంలో ఎండోఫిన్స్ లెవల్ తక్కువస్థాయిలో వుంటుందని, సాధారణ స్థాయిలోవుండేవారికి తలనొప్పి వుండదని పరిశోధకులు తేల్చారు.
కాబట్టి నొప్పి చిన్నగా వున్నా తీవ్రంగా వున్నా గాని జాగ్రత్తలు పాటించడం అవసరం.
చికిత్స
సాధారణ తలనొప్పికి విశ్రాంతి అవసరం. ప్రాణాయామం, ధ్యానం (మెడిటేషన్) చాలా ఉపయోగం. టెన్షను, స్ట్రెస్ నివారణను బాగా ఉపకరిస్తుంది.
తలనొప్పి వచ్చే ప్రదేశాన్ని బట్టి (నుదురు, కణతులు, మాడు, మెడ, చెవి, కళ్ళక్రింద, ముక్కు) ఎంత సమయం నెప్పి వుంటుంది అనే విషయాలను పరిశీలించాల్సి వుంటుంది.
-శిరస్సు వేడిగాలులతో ఆవిరిగా వున్నట్లయితే బియ్యం కడిగిన నీటిలో పటిక బెల్లం (మిశ్రీ) కలిపి తీసుకొనడం.
-జలుబుతోకూడి వున్నట్లయితే శొంఠి కొమ్ము గంధ లేపనాన్ని నుదుట, ముక్కులమీద రాయాలి.
-శిరస్సు వేడిగా వుంటే ‘చందనాది తైలము’ తలమీద పొయ్యాలి.
-గోదంబి భస్మ, స్ఫటిక భస్మ సమపాళ్లలో గోరువెచ్చని నీటితో తీసుకొనవలెను.
-శిరశ్శూల వజ్రరస మాత్రలు పూటకు రెండు చొప్పున పధ్యాది కషాయంతో తీసుకోవాలి.
-మైగ్రేన్ తలనొప్పికి, సిఫాగ్రైన్, మైగ్రాసార్ బిళ్లలు పూటకు రెండు మాత్రల చొప్పున 40 రోజులపాటు వాడవలెను.
-జీర్ణప్రక్రియలో లోపం ఏర్పడి నొప్పి వస్తున్నప్పుడు శూతశేఖర రసం, సూర్యావర్తరసం, కాశీస భస్మం సమపాళ్ళలో సేకరించి ఆ మిశ్రమంలో వేడి చేసి చల్లార్చిన అల్లం రసం, తేనె కలిపి తీసుకొనవలెను.
-శిరోధార అనే పంచకర్మ ప్రక్రియ అత్యుత్తమం. డిప్రెషన్, స్ట్రెస్, మానసిక ఆందోళన వున్నవారికి చాలా ఉపయోగం. ఇదికాక శిరోవస్తి అనే మరొక ప్రక్రియ దీర్ఘకాలంగా బాధపడేవారికి ఉపయోగం.
మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది ‘నిదాన పరివర్జనం’రోగ కారణాలను గమనించి వాటికి దూరంగా వుండటం.
డాక్టర్ డి. శ్రీరామమూర్తి
04023741020, 9885297983
రాఘవేంద్ర నర్సింగ్ హోం
Add new comment